కన్నుల పండుగగా, కడుపు నిండుగా, పుస్తకాల పండుగ

స్వంత దేశానికి దూరంగా వేరే దేశంలో ఉండే నాబోటి ప్రవాసులకు ఎప్పుడు పడితే అప్పుడు ఇండియా రావటం అంత సులభం కాదు. బంధు మిత్రుల ఇళ్ళళ్ళో శుభకార్యమో, లేదా మరో ప్రత్యేక సందర్భమో కలిసి వచ్చేలా చూసుకొని ప్రయాణం పెట్టుకోవటం మామూలు. దాదాపు పదిహేనేళ్ళుగా ఇండియా రావటానికి నేను చూసుకునే ప్రత్యేక సందర్భం విజయవాడ పుస్తక ప్రదర్శన. ఇతర కారణాలవల్ల కొద్దిగా ముందో వెనకో ఇండియా వచ్చినా, కనీసం ఒక్క రోజన్నా బుక్ ఫెస్టివల్‌లో గడపడానికి వీలయ్యేలా శాయశక్తులా ప్రయత్నిస్తుంటాను. ఈ పుస్తక ప్రదర్శన అంటే నాకంత ఆకర్షణ.

2003లో మొదటిసారి నేను ఈ పుస్తకోత్సవ ప్రాంగణంలో అడుగు పెట్టినప్పుడు నా కళ్ళు ఆనందంతో విప్పారాయి. ఈ పుస్తకాల పురుగుకు పొట్ట పట్టనంత మేత. కొత్తవీ, పాతవీ, చదివినవీ, చదవనివీ, చదవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నవీ – రకరకాల పుస్తకాలు నన్ను ఆకర్షించాయి. ఆత్రంగా, ఆబగా అన్ని పుస్తకాల షాపులు తిరిగాను. అప్పటినుంచి ఆ ఆకర్షణ అలాగే కొనసాగుతుంది.

పుస్తక ప్రదర్శన ప్రాంగణమంతా సాహితీ సౌరభాన్ని నింపుకొని ఉంటుంది. వేలాది ప్రజలు పుస్తకాలు చూస్తూ, చదువుతూ, కొంటూ వాటిని గురించి మాట్లాడుకొంటూ ఉంటారు. చిన్న పిల్లల చేతిలో తెలుగు పుస్తకాలు కనిపిస్తుంటే ముచ్చట వేస్తుంది. సభావేదిక నుంచి అభిమాన విషయాలపై ప్రముఖుల ప్రసంగాలు వీనులవిందుగా ఉంటాయి. తెలుగు బతికే ఉందని, బతికే ఉంటుందని ఒక భరోసా గుండెల్ని నింపుతుంది.

పుస్తకాలతో పాటు నాకు ఇంకో ముఖ్య ఆకర్షణ ఈ ప్రాంగణంలో అనేకమంది సాహిత్యకారులని చూడటం, వినటం, కలవటం, పరిచయం చేసుకోవడం, మాట్లాడటం. చాలామంది సాహితీమిత్రుల్ని కలవడానికి నాకు ఇక్కడే వీలవుతుంది. చిరకాల మిత్రులు నవోదయా రామ్మోహనరావు గారిని కలిసి, వారి స్టాలు ముందు వేసిన కుర్చీల్లో కూర్చుని టీ తాగుతూ, జర్మనీ నుంచి అదే సమయానికి వచ్చే మిత్రుడు పరుచూరి శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి వచ్చే శ్రీరమణ గారు, అటూ ఇటూ వెళ్తున్న శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు గారు, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారు వంటి మిత్రులు, మరింత మంది రచయితలు, ప్రచురణకర్తలు ఆగి కబుర్లు చెబుతుంటే ఆనందించడం నాకు చాలా ఇష్టంగా ఉండేది. చిరకాలంగా ఈ పుస్తకప్రదర్శనలో భాగమైన నవోదయా పబ్లిషర్స్ స్టాలు ఇప్పుడు లేకపోవడం నాకు వెలితిగానే అనిపిస్తుంది.

ఈ ప్రదర్శన నిర్వాహకులు నా పట్ల చూపించిన ఆదరణ మరచిపోలేనిది. వారు నాకు ఎన్నో మంచి అవకాశాలను కల్పించారు. బాపు, రమణలకు ఈ పుస్తక మహోత్సవంలో సన్మానం జరిగినప్పుడు శ్రీరమణగారితో కలసి సంధాతగా వ్యవహరించడం ఎప్పటికీ ఉండే జ్ఞాపకం. తానా ప్రచురణల పుస్తకాలు విశ్వగుణాదర్శం, కథ-నేపథ్యం, దిద్దుబాటలు పుస్తకాలను ఈ వేదిక మీదే ఆవిష్కరించాము. బాపు గారి సంస్మరణ సభలో పాల్గొనే అవకాశమూ నాకు దొరికింది.

మొదటిసారి ఈ ప్రదర్శనకు వచ్చినప్పుడు (2003లో) పిల్లలకోసం చాలా తక్కువ తెలుగు పుస్తకాలు ఉండటం చాలా బాధ కలిగించింది. ఆ సంవత్సరం వికాస విద్యావనం వారు తెలుగులో ఉన్న పిల్లల పుస్తకాలను ప్రదర్శనగా పెట్టారు. కొన్ని సంవత్సరాలుగా, మంచిపుస్తకం, కొత్తపల్లి ప్రచురణల స్టాళ్ళలో విరివిగా విభిన్నమైన తెలుగు పుస్తకాలు పిల్లలకు అందుబాటులో ఉండటం నాకు చాలా సంతోషాన్నిస్తూంది. పిల్లలలో తెలుగు చదవటం పట్ల ఆసక్తిని పెంచే కృషిలో భాగంగా తానా సంస్థ తరపున పోటీలు నిర్వహించి చాలా పుస్తకాలు ప్రచురిస్తున్నాము. ఆ పుస్తకాలపై క్రిందటి సంవత్సరం పిల్లలతో పుస్తక సమీక్షను నిర్వహించినందుకు ఈ ప్రదర్శన నిర్వాహకులకు కృతజ్ఞతలు, అభినందనలు.

ఈ విజయవాడ పుస్తక మహోత్సవం భవిష్యత్తులో కూడా ఇలాగే మరెన్నో దశాబ్దాలపాటు విజయవంతంగా జరుగుతూ ఉండాలని, ఈ ప్రాంత ప్రజలందరిలో, ముఖ్యంగా పిల్లలలో, తెలుగు పుస్తకాలు చదవటం పట్ల ఆసక్తిని పెంచాలని, పుస్తక ప్రచురణకర్తలు, విక్రేతలు, పాఠకులు, రచయితలు అందరికీ లాభప్రదంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.

-డా. జంపాల చౌదరి
మండలైన్, యు.ఎస్.ఏ.
22 డిశంబరు 2018

You Might Also Like

2 Comments

  1. Anil అట్లూరి

    తానా ప్రచురణ ‘కధ – నేపధ్యం’ ౧, విజయవాడ పుస్తకాల పండుగ ‘(౨౦౧౩) వేదిక మీద మీతోపాటు ఇతర సాహితీవేత్తలతో కలిసి ఆవిష్కరించుకోవడం ఒక మరపురాని జ్ఞాపకం.

    దాదాపు రెండు దశాబ్దాలు మద్రాసులోని బుక్ ఫెయిర్ లో పాల్గొనడం కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలని మిగిల్చింది నాకు. అక్కడ కూడా తెలుగు పుస్తకాలు ఆవిష్కరించుకున్న సందర్బాలున్నవి. మీరన్నట్టు, “స్వంత దేశానికి దూరంగా వేరే దేశంలో ఉండే నాబోటి ప్రవాసులకు ఎప్పుడు పడితే అప్పుడు ఇండియా రావటం అంత సులభం కాదు.” లాగానే అప్పట్లో ‘ఆంధ్రప్రదేశ్’కి దూరంగా ఉన్న ఇతర దక్షిణాది
    రాష్ట్రాలవారు, ఉత్తరాదిలో ఉన్న కొంత మంది తెలుగు వారు కూడా ఆ బుక్ ఫెయిర్‌కి క్రమం తప్పకుండా వఛ్హేవారు. ఆ పదిరోజులు పండగే!

  2. leol

    చౌదరి గారు,

    మీ దృష్టికి వచ్చిన కొత్త తెలుగు పుస్తకాలు తెలిపితే ఈ పుస్తకాల పండుగలో తెప్పించుకుంటాను. అలాగే ౨౦౧౮ లో మీరు చదివిన చిట్టా కూడా. ధన్యవాదాలు!

Leave a Reply