పుస్తకం.నెట్ పదో వార్షికోత్సవం

పుస్తకం.నెట్ మొదలుపెట్టి ఇవ్వాలిటికి అక్షరాలా పదేళ్లు!
ఏదో మాటల మధ్య పుట్టుకొచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చటమే కాకుండా, ఇన్నేళ్ళూ ఇందరి ప్రోత్సాహంతో నిరాటంకంగా సాగడం అనేది మామూలు విషయం కాదు. అందులోనూ ఆ ఆలోచన, ఆ ప్రయత్నం పుస్తకాలకి సంబంధించినది అయినప్పుడు. సమాచారం, విజ్ఞానం, వినోదం అన్నీ ఇంతకు ముందెప్పుడూ మానవజాతి ఎరుగునంత సులువుగా దొరుకుతున్న కాలంలో, పుస్తకాలను పట్టుకొని పట్టుమని పది నిముషాలైనా చదివే అలవాటు లేకపోవటం సహజమైన సమయంలో, అలాంటి సమయాల్లో, పుస్తకం.నెట్ అనే ప్రయత్నం విజయవంతం అవటం గొప్ప విషయమే!
అసలు, పుస్తకం.నెట్ మొదలెట్టినప్పటి నుండి బాలారిష్టాలు(?) లేకుండా కొనసాగింది. నెలకి రెండు వ్యాసాలు వస్తే చాలనుకుంటే, సగటున నెలకి ఇరవై వ్యాసాలు వచ్చాయి మొదటి ఏడాదిలో. గత రెండు మూడేళ్ళల్లో కొంచెం మందకోడిగా అయిందనిపించినా, ఇప్పటికీ పుస్తకంలో వ్యాసాలు వస్తూనే ఉన్నాయి. వస్తూనే ఉంటాయి. ఆ నమ్మకం కలిగించిన ప్రతి ఒక్కరికి – వారు వ్యాసమే పంపారో, కామెంటో చేశారో, లింకే ఇచ్చారో, కేవలం చదివి ఊరుకున్నారో – ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పుస్తకం.నెట్ కొనసాగడానికి దోహదపడిన ప్రతి ఒక్కరికి, పేరుపేరునా, మా ధన్యవాదాలు.
ఇప్పటికి అడపాదడపా “పుస్తకం.నెట్ సౌమ్య, పూర్ణిమలది!” అని వినిపిస్తూ ఉంటుంది. అది నిజం కాదు. మేము మా రోజూవారి జీవితంలో కొంత సమయాన్ని వెచ్చించి దీని వెనుక ఉంటున్నామంతే! పుస్తకం.నెట్ తెలుగు అంతర్జాల పాఠకులది. ఒక్కొక్కరు ఒక్కో రోజు నీరు పోసి ఈ మొక్కను పెంచారు. ఇది ఎవరి ఆవరణలో ఉంది, ఎవరికి ఎంత క్రెడిట్ ఇవ్వవచ్చు అన్నవి అర్థంలేని ప్రశ్నలు. ఒక భాష మాట్లాడే / చదివే / రాయగలిగినవారిగా మనంతా పుస్తకాల మీద మన ప్రేమను ఎలా చూపించుకున్నామన్నదే పుస్తకం.నెట్ విజయానికి నిజమైన కొలమానం.
పుస్తకం.నెట్ ప్రయాణం కొన్ని అంకెల్లో:
వ్యాసాలు: 2059
కామెంట్లు: 9703
హిట్లు: 1,760,396
వివిధ భాషలు: 30+
వ్యాసకర్తలు: దాదాపుగా 400
పదేళ్ళంటే మాటలు కాదు! బోలెడంత మారిపోయింది.
బ్లాగులు మూసేస్తుంటే వాళ్ళు రాసిన పుస్తక పరిచయాలు మాయమైపోతున్నాయన్న ఇబ్బందితో మొదలైంది పుస్తకం.నెట్. ఇప్పుడు బ్లాగుల్లో రాసేవాళ్ళే తక్కువైపోయారు. ఫేస్‌బుక్‌లోనే అన్నీ ఇప్పుడు. వాట్సాప్ వాడని మనిషి మహా అరుదు. జియో పుణ్యమా ఇప్పుడు ఇంటర్నెట్టూ సర్వసాధరణం అయిపోయింది. అమెజాన్ కిండిల్‌లో భారతీయా భాషల పుస్తకాలూ వస్తున్నాయి. గూగుల్ ఎట్టకేలకు తెలుగు కంటెంటుకి ఆడ్స్ ప్రవేశపెట్టింది.
ఇన్ని పెనుమార్పులతో పోల్చుకుంటే పుస్తకం.నెట్ కొంత పాతగా ఉన్నట్టూ, వెనుకబడినట్టూ కొందరికి అనిపించవచ్చు. కొత్త అవకాశాలు ఎన్ని పుట్టుకొచ్చినా పాత పద్ధతులను పట్టుకొని వేలాడే చాదస్తపు మనుషులుగా కనిపించవచ్చు.
కానీ, పుస్తకం.నెట్ మొదలుపెట్టడం వెనుక మాకు ఎప్పుడూ ఎలాంటి వ్యక్తిగత ధ్యేయాలు లేవు. దీని నుండి డబ్బు, ప్రతిష్ట, పేరు వగైరాలు మేము ఎప్పుడూ ఆశించలేదు. ఆశించబోము. ఇదేదో ఘనకార్యం, చరిత్రలో నిలిచిపోవు ఘట్టం టైపు అపోహలు లేవు.
ఇష్టమైన పనిని చేసుకునే వీలు ఉండడం మహా అదృష్టం. ఈ సైటు నిర్వహణా బాధ్యతలు లేకపోయినా మేమిద్దరం పుస్తకాలు చదివేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం, వాటి గురించి రాసే వాళ్ళం. ఈ సైటు నిర్వహిస్తుండడం వల్ల అనేకానేక పుస్తకప్రియులు పుస్తకాలపై తమ ఇష్టాన్ని ఎలా వ్యక్తీకరిస్తారన్నది దగ్గరగా చూసే వీలు కలిగింది. అదే మహద్భాగ్యం!
ఏ భాషా సాహిత్యమైనా చదువుకున్నాక దాని గురించి ఆలోచనలు పంచుకోవాలంటే, అదీ మన తెలుగులో, అందుకు ఒక వేదిక – పుస్తకం.నెట్.
పదేళ్ళ క్రితమూ అదే మాట! ఇప్పుడూ అదే మాట!
ఆ మాటను అర్థంచేసుకొని వెన్నంటి నిలిచిన అందరూ, ఇక ముందు ప్రయాణంలో కూడా తోడు ఉంటారనీ, కొత్తవాళ్ళు వచ్చి చేరాతారనీ ఆశిస్తూ
2018లో మీరు చదివిన పుస్తకాల గురించిన వ్యాసాలు పంపించండి. పుస్తకాల చిట్టా అయినా సరే, లేదా ఈ ఏడాది మీకు ప్రత్యేకమనిపించిన రచయితల గురించి గానీ, పుస్తకాలు చదవటంలో వచ్చిన మార్పుల గురించి గానీ ఏదైనా రాసి పంపవచ్చు.
మీ ఆదరాభిమానాలకి నమస్కరిస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు!
మీ,
పుస్తకం.నెట్
ఎ కె ప్రభాకర్
పూర్ణిమా సౌమ్యాలకు అభినందనలు.
ప్రతివాక్యంలోనూ మీ మోడస్టీ కనిపిస్తుంది. మీరు చేస్తున్న కృషి అనితరం.
మీతో కలిసి ప్రయాణం చేస్తున్నందుకు సంతోషంగా వుంది.
మరిన్ని దశాబ్దాల పాటు ఇలాగే నడవాలని కోరుకుంటూ ….
సౌమ్య
Thank you for your continued support, Prabhakar garu!
ఏల్చూరి మురళీధరరావు
ఎన్నో మంచి పుస్తకాలను పాఠకులకు పరిచయం చేసిన పుస్తకం.నెట్ దశమ వార్షికోత్సవ వేళ సహృదయినీ సంపాదికలు సౌమ్య, పూర్ణిమ గారలకు సాభినందన సర్వ శుభాకాంక్షలు!
Mani vadlamani
Congrats Purnima and sowmya , ee pryanam. Chala సుదీర్ఘంమ్. Nenu maatram. Chala telusukunnanu. Ee site dwara . Nijaniki naaku idi oka reference book lantindi. Yento mandibrachyatal gurunchi. Telusukovadam jarigindi.
.
ప్రసాద్
అభినందనలు!
కేవలం పుస్తకం.నెట్ వ్యాసం చదివే పుస్తకం చదివిన అనుభవాలు నాకు చాలా వున్నాయి.
Anil అట్లూరి
అప్పుడే పది నిండాయా!
అభినందనలు, శుభాకాంక్షలు.
leol
పుస్తకం నిర్వాహకులకు అభినందనలు!
swarna par saram
ఇలాటి ఆసక్తికరమైన ప్రజోప కరమైన సైట్ నూరేళ్లు వర్ధిల్లాలని సాహిత్యాభిమానిగా కోరుకుంటున్నాను .నాకు నచ్చిన చదివిన పుస్తకం గురించి ఈ సైట్ లో నేను నా మనోభావాలు రాయవచ్చా
పుస్తకం.నెట్
తప్పకుండా. మీరు రాసిన వ్యాసాలను యునికోడ్ లో మాకు ఈమెయిల్ పంపండి. చిరునామా: editor@pustakam.net
మల్లీశ్వరి
పెద్ద ప్రయాణమే చేశారు. ఒక పని మీద పదేళ్లు నిలబడటం అన్నది మామూలు విషయం కాదు. దాని ప్రభావం మొత్తం సమాజపు పరిణామంలో ఒక చిన్న కదలికను కలిగించే ఉంటుంది. అది ఎప్పుడో ఒకప్పుడు మనకే తెలిసి రావచ్చు లేదా భవిష్యత్తులో తెలియవచ్చు లేదా ఎప్పటికీ మనం గుర్తించలేకపోవచ్చు. కానీ ఈ ప్రయాణ గమనం మీకు, మాకు సంతోషం కలిగించిన విషయం. ఈ బాధ్యత వెనక ఉన్నవారందరికీ అభినందనలు.
Jampala Chowdary
Hearty Congratulations to Purnima, Sowmya, Contirbutors and Readers of Pustakam. I hope that this site will continue to fluorish and be a book lover’s delight and treasure trove. _- Chowdary Jampala