చింతలవలస కథలు

చాలా యేళ్ళకు మునుపు. కాలేజి రోజులు. విశాఖ నుండి అరకు వెళ్ళే కిరండోల్ ఎక్స్ ప్రెస్ దారిలో శివలింగాపురంలో ఆగింది. కిటికీ బయట బుట్టలో ఒకావిడ, బహుశా అక్కడి గ్రామీణయువతి పనసతొనలు అమ్ముతోంది.

“అమ్మీ, పనసతొనలు రూపాయికివ్వు”. రూపాయ రూక ఇచ్చి అడిగాను. (ఒకట్రెండు తొనలు రావచ్చును. మహా అయితే మూడు.)

ఆవిడ రెండు దోసిళ్ళకు సరిపడా పనసతొనలు తెచ్చిపోసింది. ఇంకా ఇవ్వబోతూ ఉంది ఆమె.

ఔచిత్యమో కాదో తెలియదు కానీ, చింతలవలస కథల్లో రెండు కథలు చదివిన తర్వాత నాకు ఆ ఘటన గుర్తొచ్చింది. ఈ పుస్తకమూ అలాంటిదే. కథకుడు నాణ్యమైన కథలను ఏరి ఈ పుస్తకంలో రాశిపోశాడు.
*****
విజయనగరం జిల్లాలో సాలూరు మండలంలోని ఓ కుగ్రామం చింతలవలస. ఆ గ్రామం చుట్టూ అల్లుకున్న కథల సంకలనం ఈ పుస్తకం. పేరు అలా ఉన్నా, అన్ని కథలు ఆ ఊరివే కావు. “చింతలవలస” – ఇది ఓ గ్రామం అని కూడా అర్థం. దరిమిలా, ఈ సంకలనంలో కొన్ని కథలు రాయలసీమ గ్రామీణ నేపథ్యంలోనివి కూడా చోటుచేసుకున్నాయి.

వృత్తిరీత్యా కథకుడు గ్రామీణప్రాంతాలలో తిరుగాడటం వల్ల, గ్రామప్రజల అమాయకత్వం, జానపదుల నీతినిజాయితీ, అక్కడక్కడా మొరటుతనం, కానీ సరిగ్గా వివరించినప్పుడు అర్థం చేసుకునే తత్వం – ఇవన్నీ కథలలో అందంగా ప్రోదిచేసుకున్నాయి.

ఓ యువకుడు కింగ్ కోబ్రాలపై పరిశోధించడానికి విజయనగరం మారు మూల అడవులలోని గదబవలస అన్న గ్రామానికి కెళతాడు. అక్కడ ఓ అడవి దొర అతనికి సహకరిస్తాడు. మనుషులను తినే “ఓఫియో ఫెరస్” (కింగ్ కోబ్రా) వచ్చే దారిలో ఆ మూలికను పెడితే ఆ వాసనకు అది మైకంలో ఉండిపోతుంది. “మరి వాటిని చంపరా?” అంటే, “సంపనని పెమాణం చేసినాకనే ఈ మూలిక గురించి చెప్పారు మా పెద్దలు” అని ఆ దొర జవాబు.

బలిపశువు అన్న కథలో ఓ చిన్న మాట అది. దొర ప్రాణాలు పణం పెట్టినా చివరకు ఆతనికి దొరికేదేమీ ఉండదు.ఇంకొకరెవరో ఆతని శ్రమ మీద బాగుపడతారు. కథలో భాగంగా అడవిపందులను వేటాడే ప్రక్రియ, కింగ్ కోబ్రాల గురించిన సమాచారం లోతుగా చెప్పడం కథకుడి లోతైన పరిశీలనకు అద్దం పడుతుంది.

చింతలవలస కథల్లో ఉన్న గమ్మత్తైన అంశమేమిటంటే, కథకుడు – పాఠకుడికి తెలియకుండానే కథ తాలూకు వాతావరణానికి అలవోకగా తీసుకు వెళతాడు. ఇది మొదటి కథ “బడిశాల” లోనే కనిపిస్తుంది.

చింతలవలస – ఓ మారు మూల పల్లె. అక్కడ ఓ ఉపాధ్యాయుడు. ఓ పాక. అయ్యవారు కూర్చోటానికి ఓ రుబ్బురోలు. స్కూలు సమయం దాటిన తర్వాత ఆ రుబ్బురోలు ను పల్లెలో గృహిణులు వాడుకుంటుంటారు. అందులో మిరపకారం దంపుకోరాదని మాస్టారికి, అమ్మలక్కలకు ఒప్పందం. ఇలా ఏవేవో అవస్థలు పడి స్కూలు నెగ్గుకొస్తుంటాడు మాస్టారు. ఓ రోజు ఆ ఊరికి జాయింట్ కలెక్టర్ గారిస్తారు. తర్వాత ఏమయ్యిందో కథ? – బడిశాల అన్న కథ యిది.

ఓ పల్లెను అక్కడి వాతావరణాన్ని, వారి అవసరాలను ఆధునికులు అర్థం చేసుకునే తీరే వేరు.

పై కథకు విరుద్ధంగా ఓ కథ. పాలసేకరణ వృత్తిలో భాగంగా ఓ ఆఫీసర్ ఓ గ్రామపు కుల తగాదాలో ఇరుక్కుంటాడు.,అతని తప్పేమీ లేకపోయినా. ఆ తగాదా తీర్చి తేలవలసిన పరిస్థితి. సూటిగా స్పష్టంగా అతడు గ్రామీణులను ఎలా ఎద్యుకేట్ చెయ్యగలిగాడో మరొక కథ. కథ పేరు – కులంపాలు.
*****
నాకు (ఈ వ్యాసకర్తకు) నిజానికి కథాసాహిత్యం మీద పెద్ద అవగాహన లేదు. ఓ కథ కు కావలసిన ముఖ్యలక్షణం – “కథలా అనిపించక పోవడమే” అని వ్యక్తిగతంగా నా అనుకోలు. ఆ లక్షణం ఈ కథలకు పుష్కలంగా ఉంది.

ఆంధ్రదేశంలో ఉత్తరకోస్తా ప్రాంతం రావిశాస్త్రి, కాళోజి, త్రిపుర, ద్విభాష్యం రాజేశ్వరరావు, అవసరాల రామకృష్ణారావు వంటి అపురూపమైన కథకులను ఆంధ్రులకు ఇచ్చింది. ఈ కథకుడు నిస్సందేహంగా వారి వారసత్వం లోని యువకుడే. ఇది నేనన్న మాట కాదు. ఈ పుస్తకం చివర యండమూరి గారు అన్న మాట.

18 కథలు ఉన్నాయి ఈ సంకలనంలో. అందులో రచయిత ఉద్యోగరీత్యా ప్రోది చేసుకున్న అనుభవాల పరంపర కు సంబంధించినవి ఓ నాలుగు కథలు. జీవితపు అనుభవాలను, ప్రాంతీయసౌరభాలను, సామాజిక అంశాలను కలిపి అనాయాసంగా కథగా చెప్పటం అంత సులువు కాదు. ఆ అంశాలు ముప్పేటలుగా అల్లుకున్నవి ఈ కథల్లో. సాధారణంగా గ్రామీణకథలు అనగానే రైతులకడగండ్ల కథలే ఎక్కువగా మనకు కనిపిస్తాయి. ఈ సంకలనంలో అందుకు విభిన్నమైన పార్శ్వాన్ని చూపించాడు రచయిత.

సినిమాలపై చక్కని సెటైర్ ఓ కథ. (ఈ కాలపు సెటైర్. నిర్మొహమాటంగా ఉంటుంది :)). సరదాగా సాగే రెండు కథలు. ప్రభుత్వ లైబ్రరీలో ఉద్యోగుల అలసత్వం గురించిన కథ “చక్రం”.

70, 80 దశకం మొదట్లో బాల్యం ఎలా ఉండేదో వివరించే ఓ చిన్ని కథ “ది సీక్రెట్ ఆఫ్ జాయ్”. ఓ పల్లెటూరి పిలగాడు. వాడికి పలకాబలపమే తప్ప పుస్తకాలు, పెన్సిళ్ళు తెలీవు. వాడు వేసుకున్న నిక్కరు వెనకాల స్కూల్లో గచ్చు ఎంత గరుకుగా ఉందో తెలిపే రెండు కన్నాలు. ఏమీ లేకున్నా మరి వాడికెందుకు అంత ఆనందం? (ఈ కథ కొద్దో గొప్పో 70 దశకంలో ప్రాథమిక విద్య చదివిన చాలామందికి వర్తిస్తుంది. ఈ వ్యాసకర్తకు కూడా. 🙂 ) ఈ చిన్ని కథానిక – నామిని సినబ్బను, వాడి సిల్వరు క్యారీరును గుర్తు తెప్పిస్తుంది.

ఈ పుస్తకంలో ఒకటి రెండు దిష్టిచుక్కలూ పెట్టాలి. (నిజానికి అవసరం లేదు కానీ, అలవాట్లో భాగంగా.) బడిశాల కథ ముగింపులో కాస్త డ్రామా, ఇంకాస్త కరుణా కలిసి ఉంటే, రబీంద్రుడి “పోస్ట్ మాన్” కథకు సాటి వచ్చి ఉండేదేమో! రాబీంద్రనాథ్ టాగూర్ పోస్ట్ మాన్ కథ ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో కదిలించింది. పోర్చుగీసు దేశంలో ఈ చిన్నికథను వీథినాటకంగా కూడా ప్రదర్శించే వారట. ఇలా అని ఈ కథలో తక్కువైనదేదీ లేదనే నా మనవి.

కొన్ని కథల్లో సబ్జెక్ట్ కాస్త కఠినంగా ఉంది. (ఆ సబ్జెక్ట్ తెలియని వారికి. రైల్వేపాకు, దీనాతి దీనార్)

మనకు 80, 90 దశకాలలో లాగా పుస్తకాలు, అందులో కథలూ చదివే సంస్కృతి మెల్లమెల్లగా తప్పుకుంటూ ఉంది. పైగా విదేశీ కథలు, ఆ యిజమూ, ఈ ఇజమూ, వ్యక్తివాదమూ – ఇటువంటి ధోరణులు ప్రబలిన కాలం యిది. ఈ నేపథ్యాన చింతలవలస కథలు Refreshing గా అనిపిస్తాయి.

ఓ కథలో ఓ చోట తెలుగు సినిమాలు తెలుగునాట ఓ సాధారణ గృహిణిపై ఎంత నీచమైన ప్రభావం చూపిస్తాయో, ఎంత విషం నూరిపోస్తాయో ఛాయామాత్రంగా చెప్పాడు రచయిత. అతి సెన్సేషనల్ రచయితలే ఇలా మభ్యపడుతుంటే, ఈ రచయిత ఆ విషప్రభావాన్ని ఎత్తిచూపించటం ముదావహమైన విషయం. ఆ పేరాగ్రాఫ్ యిది.

“కోనసీమలో పుట్టి, పెళ్ళివరకూ మరో జిల్లా మొఖం చూడని మా ఆవిడ, తెలుగు సినిమాల ద్వారా మాత్రమే మిగిలిన జిల్లాలను తెలుసుకోవటం వల్ల, రాయలసీమ కోపాలను వేటకొడవళ్ళతోనూ, పల్నాడులో నాటుబాంబులతోనూ వ్యక్తపరుస్తారనీ, తెలంగాణా మనుషులంతా మొరటు అనీ, నమ్మకపోతేనే వింత. మా సంస్థ చేసిన బదిలీల పుణ్యాన నాలుగేళ్ళుగా భారత్ దర్శన్ చేసేసి, ఏడాదిగా రాయలసీమలో ఉండటం వల్ల, ’గోదావరి జిల్లాల బయట కూడా బతకొచ్చు’ అని తెలుసుకుంది.”
*****
ఈ కథల రచయిత – డా. మూలా రవికుమార్ గారు.

పుస్తకంలో అక్కడక్కడా పేజీలు రిపీట్ అయినాయి. వచ్చే ముద్రణలో సరిచూసుకుంటే బావుణ్ణు. అక్కడక్కడా సబ్జెక్ట్ ఎక్కువై, ఆ సబ్జెక్ట్ తెలియని వారికి కాస్త బరువైన ఒకట్రెండు సందర్భాలు ఉన్నాయి. (నాకే ఇలా అనిపించి ఉండవచ్చు కూడానూ).

2000 తర్వాత, 2010 మధ్యన వివిధపత్రికల్లో వచ్చిన కథలివి. కాపీలకై ఈ క్రింది అడ్రసున సంప్రదించవచ్చు. ఈ సంకలనం రెండు ముద్రణలు పొందినది.

Kamadhenu Foundation,
Somanivari Tota, Bommuru Village,
Rajhmundry, East Godavari Dt,
kamadhenufoundation.kakinada@gmail.com

You Might Also Like

2 Comments

  1. Varaprasad

    మీరు అడ్రస్ తో పాటు ఫోన్ నో కూడా ఇస్తే బావుంటుంది. సమీక్ష అద్భుతంగా వుంది.

  2. Mula Ravi Kumar

    This is Mula Ravi Kumar, the writer of above book. The Email mentioned above is outdated. Please contact me at mula.ravi@gmail.com

Leave a Reply