అంటరాని వసంతం
వ్యాసకర్త: ప్రసాద్ చరసాల
***************
అదొక వీరగాథ. అదొక విషాద గీతం. అదొక దళితపురాణం. అది ఎవరికీ పట్టని మట్టి చరిత్ర. ఎన్నెన్ని పాత్రలు! ఎన్నెన్ని కథలు! ఎన్నెన్ని ప్రేమలు! ఎంత పోరాటం! ఇదీ నేను ప్రతి పుస్తకంలో గాలించే కథ. ఇదీ నేను ప్రతి చరిత్ర పుటలో చూడాలనుకునే జీవితం. ఏడు తరాల కథలా ఇదీ ఆరేడుతరాల కథ. ఎన్నెలదీవి మాలా-మాదిగ పల్లె కథ. అందులో ప్రవహించిన జీవితాల కథ. పద్దెనిమిదో శతాబ్దములో మొదలై 20శతాబ్దపు చివరినాళ్ళ దాకా జరుగిన దళిత చరిత్ర. సరళమైన పదాలతో, సరళమైన వాక్యాలు. చదవడం మొదలుపెట్టడమే మన వంతు.. ముగింపు వరకూ అదే మనల్ని అలవోకగా నడిపిస్తుంది. ఆ నడకలో ఓ మూడొందల ఏళ్ళ కాలం మన కళ్ళ ముందు అలా నడచివెళ్ళిపోతుంది. అందులో ఎన్నెలదీవి కనిపిస్తుంది. మాలాడిదిబ్బ కనిపిస్తుంది. ఎల్లన్నను ప్రాణంతో సమానంగా చూసుకుంటూ మేనత్త బూదేవి “దైవరాయ- దైవారాయా” అంటూ పాడుతూ కనిపిస్తుంది. తాటిమట్టతో బాదుతూ వెంటపడితే గోచీ కుడా వూడిపోయి దిసమొలతో పరుగెడుతున్న ఎల్లన్న కనిపిస్తాడు. “హరోం హర హర ” అంటూ భీకర విన్యాసం చేస్తున్న నాగన్న కనిపిస్తాడు. పనివాడు అదమరిచితే మంటల్లో వెంటనే కరిగిపోయే అతి సన్నని బంగారు తీగ సుబద్ర పార ఎత్తి అపర కాళిలా చూస్తూ కనపడుతుంది. ఒకటా.. రెండా.. ఎన్నెన్ని దృశ్యాలు.. రీళ్ళులా ఒకదానివెంట మరోటి మూడొందల ఏళ్ళు అలా కదలిపోతాయి.
మహాభారతంలో 18 పర్వాలు. ఈ దళిత మహా భారతంలోనూ 18 పర్వాలు. భారతంలో ప్రధాన కథను అల్లుకొని ఎన్నెన్నో కథలున్నట్లే ఇందులోనూ ఎన్నెన్నో కథలు. అందులో కురుక్షేత్రం ఒకటే యుద్దం. ఇందులో ప్రతిదినమూ యుద్దమే.
ఆటెల్లన్న, పాటెల్లన్న, మాల బైరాగి అని పిలవబడిన ఎల్లన్న ఎన్నెలదిన్నె మాలపల్లిలో పుట్టిపెరిగిన మాలవాడు. అతని తండ్రి ఎర్రెంకడు, తల్లి లింగాలు. ఎల్లన్న బార్య సుబద్ర. ఎల్లన్న-సుబద్రల కొడుకు శివయ్య. ఈ శివయ్యే క్రైస్తవం తీసుకొని సీమోనుగా మారతాడు. ఈ సీమోను కొడుకు రూబేను. రూబేను బార్య రూతు. రూతు కథలు రాస్తుంది. రూబేను కూడా చనిపోయాక, అతని చెప్పిన కథల ద్వారా అతని పుర్వీకుల గాథను గుర్తు చేసుకుంటూ..తన భర్త, కొడుకు, మనవళ్ళ జీవితాన్ని గుర్తు చేసుకోవడమే ఈ కావ్యం. దళితులకు నిషేదింపబడిన చోటుకు తెలియకుండా వెళ్ళిన పసివాడు ఎల్లన్నను అగ్రకులాల వాళ్ళు తాటిమట్టతో బాదితే.. ఎందుకు బాదుతున్నారో తెలియని అవస్థలో వూరునుండి దూరంగా పారిపోతాడు. అలా పారిపోయినప్పుడు మరో వూరిలో ఉరుముల నాగన్నతో పరిచయం అవుతుంది. ఆ ఉరుముల నాగన్న తండ్రిదీ పూర్వం ఎన్నెల దిన్నే. ఆ నాగన్న ద్వారా మనకు ఎల్లన్న ముందు తరాల కథ తెలుస్తుంది. ఆ నాగన్న ద్వారా ఎల్లన్న నాటకాలలో ప్రావీణ్యం తెచ్చుకుంటాడు. సహజంగా పాటలు అల్లగల నేర్పు వుంటుంది. అగ్రకులాల వల్ల ఎదురయ్యే ఇబ్బందులతో వూరొదలి పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయి మాలబైరాగిగా మారతాడు. ఆతని పాటలన్నింటిలో పల్లవిగా అతని బార్య పేరు సుబద్ర వుంటుంది. సుబద్ర చక్కదనం గురించి మనకు ఎల్లన్న ద్వారా చాలా చోట్ల తెలుస్తుంది.
“మిన్నూ పానుపు మీద
దూదీ దుప్పటి పైన
సుక్కాల పూలగుత్తి సూబద్రా
నువ్వు పచ్చి పగడానివే సూబద్రా”
అంటాడు ఎల్లన్న.
దూము తగిలి ఎంతో మంది ఎంతోమంది చనిపోతారు. 1876లో వచ్చిన పెద్ద కరవులో చాలా మంది చచ్చిపోతారు. అందరినీ పోగొట్టుకున్న ఎల్లన్న కొడుకు శివయ్య, తన బార్య శశికళతో వూరొదలి బకింగ్‌హాం కాలువ తవ్వకం పనులకు వెళతాడు. అక్కడ పరిచయమయిన క్రైస్తవ ఫాదరీ వల్ల వుపాధి పొంది సీమోను అవుతాడు.
సీమోను కొడుకు రూబేను, రూబేను కొడుకు ఇమ్మానియేలు. ఇమ్మానియేలు కొడుకు జెస్సీ. ఇమ్మానియేలు, జెస్సీల కథ 20 శతాబ్దపు రెండోభాగం కథ.
ఈ కథ పొడవునా ముఖ్యపాత్రధారులతో ఎంతోమంది పక్క పాత్రధారులు కనిపిస్తారు. ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. ఒక్కో పోరాటం. స్వాతంత్య్రానికి పూర్వం, తరువాత వచ్చిన మార్పేంటో మనకు కనపడుతూ వుంటుంది. ఈ రోజుకీ మనం రోజూ వార్తల్లో చూసే సంఘటనలు ఈ “అంటరానివసంతానికి” పొడిగింపే కదా అనిపిస్తాయి.
“కాటికి కాళ్ళు చాపిన ముసలాడు ‘కాపొచ్చేడు నన్ను లేపరా’ అని మనవణ్ణి కేకలేస్తున్నాడు. నిలబడలేడు. నిలబెట్టి పట్టుకోవాలి.” – ఇలాంటి అతి చిన్న వాక్యాలతోనే ఆ ఎన్నెదిన్నె మీది అంటరానితనాన్ని ఆవిష్కరిస్తాడు.
ఎల్లన్న ముందు తరంలో వరదల నుండి తప్పించుకోడానికే అయినా అగ్రకులాల పైబాగాన వున్న మెట్టమీద నిలబడిన కారణానికి నారిగాడు చంపబడ్డాడు.
ఎల్లన్న తనకు ప్రవేశం నిరాకరించిన చోట తెలియక నిలుచున్నందుకే తాటిమట్టతో బాద బడ్డాడు.
ఎల్లన్న కొడుకు శివయ్య మాల అయినందుకే బకింగ్‌హాం కాలువ పనుల దగ్గర రాళ్ళతో కొట్టి తరమబడ్డాడు.
సీమోనుగా మారిన శివయ్య కొడుకు రూబేను మతంలోకీ అగ్రకులాలు ప్రవేశించి అక్కడా తమ దోపిడీని కొనసాగించారు.
రూబేను కొడుకు యిమ్మానియేలు స్వాతంత్య్రానంతర రాజ్యంలోనే పోలిసులతో చంపబడ్డాడు.
ఇమ్మానియేలు కొడుకు జెస్సీ కూడా పోరాటబాట పట్టక తప్పని పరిస్థితులు..
ఏమి మారింది ఎల్లన్న ముత్తాత సినసుబ్బడి నుండీ ఎల్లన్న ముని ముని మనవడు జెస్సీ దాకా?
ఇంకా మురికి గుంటలో మునకలేస్తున్న ఎల్లన్నలూ వున్నారు. అంగచ్చేదన చేయబడ్డ జెస్సీలున్నారు. అంటరాని వసంతానికి ముగింపు లేదు. నేనూహించినట్లుగానే రచయిత చివరి మాటలో “జీవితాన్ని ఎన్ని పేజీల్లోనయినా రాయొచ్చు. ‘అంటరాని వసంతం’ ఈ కొద్ది పేజీలలో పూర్తయ్యే జీవితం కాదు. నిజానికి పూర్తి కాలేదు కూడా” అంటాడు.
అంతే కదా?
******
(ఈ పుస్తకం పై గతంలో ఏప్రిల్ 2009లో పుస్తకం.నెట్లో వచ్చిన మరో వ్యాసం ఇక్కడ).
Leave a Reply