Kargil – General V.P. Malik
కార్గిల్ – 1999వ సంవత్సరానికి ముందు ఈ పేరు తెల్సిన వాళ్ళు ఎంత తక్కువ మంది ఉండుంటారో, ఆ తర్వాత ఈ పేరు తెలీని వాళ్ళు అంత తక్కువగా ఉంటారు. అనంతనాగ్, ద్రాస్, పూన్చ్ లాంటి మరెన్నో ఊర్ల పేర్లు, జమ్మూ-కాశ్మీర్ లో విరివిగా ఉగ్రవాద చర్యలకు గురవుతున్న ప్రాంతాలుగా అప్పటికే వార్తల్లో ప్రతీ పూటా వినిపించటంతో, కార్గిల్ లో కూడా ప్రవేశించింది ఉగ్రవాదులే అనుకున్న భారతం, పాకిస్థాన్ అల్లిన మాయావలయం ఛేదించుకొని, నిజానిజాలు గ్రహించి, అందుకనుగుణంగా చర్యలు చేపట్టి అత్యంత ధైర్యసాహసాలతో తమ భూభాగాన్ని ఆక్రమించుకొన్న వెన్నుపోటుదారుడి వెన్ను చీల్చి తరిమి కొట్టిన విధానం – పదేళ్ళ క్రిత్రం దేశరాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోగలిగున్న వారికెవ్వరికైనా కార్గిల్ తమ జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిల్చిపోతుంది. అలాంటి కార్గిల్ మీద పుస్తకం అనేసరికి ఆసక్తిగా చేతిలోకి తీసుకున్నా, రచయిత కార్గిల్ యుద్ధ సమయంలో ఆర్మీ చీఫ్ జెనరల్ వి.పి. మల్లిక్ రాసారని గ్రహించగానే ఇదేదో నాకు మించిన వ్యవహారంలా అనిపించి తిరిగి అరలో పెట్టేయబోయాను. అసలేమి రాసుంటారో అన్న ఉత్సుకత కొద్దీ చదవటం మొదలెడితే, రెండున్నర గంటల పాటు చదువుతూనే ఉండిపోయాను.
(కొన్ని పుస్తకాలని కేవలం పుస్తకాలుగా మాత్రమే చూడ్డం చాలా కష్టం. రచానా విషయాన్ని, శైలినీ పుస్తకప్రియులుగా తూకం వేసి చూడ్డం చాలా కష్టం. కొన్ని వాక్యాలూ, కొన్ని సంఘటనలూ చదువుతుంటే మానిన పుండు కొత్తగా రేగుతుంటే, భావోద్వేగాలను అనుచుకొని, కేవలం ఒక పుస్తకం మీద వ్యాఖ్యాన్నించటం మనసుకి విలువిచ్చే మనిషి కష్టసాధ్యం. అందుకే ఈ పుస్తకం పై నా వ్యాఖ్యానం పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం. ఇందులో నాకు నచ్చిన, నచ్చని చాలా విషయాలు, కార్గిల్ యుద్ధం పై నా ఆలోచనలూ, అనుభవం, అవగాహన వల్ల ప్రభావితం అయ్యాయి అని ఒప్పుకోటానికి నేను సంకోచించబోను.)
చరిత్రంటే “A record or narrative description of past events” అని అనుకుంటే, గతంలో జరిగిన సంఘటనలో మార్పు ఉండదు. కార్గిల్ యుద్ధం అనేది జరిగిందనీ, అందులో పాకిస్థాన్ ఆర్మీ ముజాహుద్దీన్ (ఉగ్రవాద సంస్థ) ముసుగేసుకొని భారత భూభాగాన్ని ఆక్రమించటం, అప్పటికి భారత-పాక్ ల మధ్య లాహోర్ డిక్లరేషన్ జరిగి ఉండటం, భారత్ తన భూభాగం కోసం శత్రువుని అత్యున్నత శిఖరాల మీద ఓడించడం, ఇరుపక్షాల సైనికులూ భీకర యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకోవడం, యుద్ధాన్ని ఇండియన్ టెలివిజన్లు లైవ్ ప్రసారం చేయడం, భావోద్వేగాలకు లోనై యావత్తు దేశం యుద్ధసమయంలో ఏకమైవ్వడం – ఈ ఘటనలన్నీ ఎప్పటికీ అలానే ఉండిపోతాయి. వాటిని మార్చతరం ఎవరి వల్లా కాదు. కాకపోతే, “narrative description of past events” వచ్చేసరికి, ఎవరి కథనాలు వారికి ఉంటాయి. కార్గిల్ యుద్ధం ఒక్కటే! కానీ ఏది ఎందుకు, ఎలా జరిగిందీ అన్న దాని మీద ఒక్కోరిది ఒక్కో కథనం. యుద్ధ సమయంలో భారత ఆర్మీ చీఫ్ జెనరల్ వి.పి. మల్లిక్ వ్యాఖ్యానం కూడా ఎంత కాదుకున్నా ఒక వ్యక్తి ( పోనీ, అత్యున్నత పదవిని నిర్వర్తిస్తున్న) అభిప్రాయాలూ, ఆలోచనలూ మాత్రమే! ఇందులోని ప్రతీది నిజానిజాల బేరీజీ వేసి చూడ్డానికి వీలు పడదు. ఒక వ్యక్తి ఉటకించే సంఘటనలు నిజమా, కాదా చెప్పగలం కానీ, ఆలోచనల్లో, అభిప్రాయాల్లో నిజానిజాలు ఉండవు కదా, వాటితో అంగీకరించడమో, విభేదించడమో తప్ప! (ఈ పుస్తకం గురించి అవుట్‍లుక్ లో రివ్యూ )
ఈ పుస్తకంలో ఏముందంటే:
౧. అటల్ బిహారీ వాజ్‍పేయ్ – నవాజ్ షరీఫ్ ల మధ్య జరిగిన లాహోర్ ఒప్పందం నుండి, కార్గిల్ యుద్ధం ముగిసిన ఐదారేళ్ళ వరకూ జరిగిన అనేక ఘటనలనూ, విషయాలనూ కూలంకషంగా చర్చించారు.
౨. కేవలం యుద్ధ ఘటనలూ, ఆర్మీ పని చేసే తీరూ గురించే కాక, అర్మీ-నేవీ-ఏర్ ఫోర్స్ సంబంధాలు, యుద్ధ సమయంలో త్రిదళాల అనుసంధానం, ప్రభుత్వం-ఆర్మీ-ఇంటలిజెన్స్ మధ్య సంబంధాలు, యుద్ధ సమయంలో మీడియా పాత్ర, ఆర్మీ కుటుంబాల సహాయార్థం ఏర్పాటు చేయబడ్డ Army Wives’ Welfare Association గురించీ తెలుస్తాయి.
౩. భారత నిఘా వర్గం సంపాదించిన కొన్ని కీలక సమాచారం ( intercept of telephonic conversations), పాకిస్థాన్ సైనికుల డైరీలూ, ఐడీ కార్డుల ఫొటోలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఇవే కాక, కొందరి కీలక వ్యక్తుల మధ్య జరిగిన ఉత్తర పత్యుత్తరాలూ ఉన్నాయి.
ఆసక్తికరమైన అంశాలు:
౧. యుద్ధ ఘటనలు వివరిస్తూండగా, ఘటనల క్రమం, మన సైనికుల వీరపోరాటం (కెప్టెన్ విక్రమ బత్రా, మేజర్ పద్మపానీ ఆచార్య, మరికొందరి గురించి రాసిన) విషయాల గురించి రాసిన తీరును బట్టి, “ఆర్మీ చీఫ్ కదా, అందుకే ఎలాంటి భావోద్వేగాలకీ లోను కాకుండా జరిగింది జరిగినట్టు చెప్పుకొస్తున్నారు.” అనుకున్నాను. కొన్ని పేజీల తర్వాత, ఒక్కప్పటి తన సెక్యూరిటీ ఆఫీసర్, మంచి మిత్రుడైన మేజర్ సుధీర్ కుమార్ గురించి రాసేటప్పుడు మాత్రం ఆయనతో ఉన్న వ్యక్తిగత అనుభవాల్ని నెమరువేసుకున్నారు. అప్పుడనిపించింది, “హత్యను పదిహేనో అంతస్థు నుండి చూసిన సాక్షి కథనంలో, అత్యంత చేరువులో చూసిన సాక్షి కథనాల్లో ఉండే తేడాలానే, హత్యకు గురైనవాడు మనకెంత సన్నిహితుడన్న దాని బట్టి కూడా కథనాల్లో మార్పు ఉంటుంది.”
౨. “We must remember that the military is an organismic being; it is not a switch-on-switch-off robot.” ఈ మాటల్లో ఆర్మీ బాగోగులపై ప్రభుత్వాలు చూపించే శ్రద్ధ ఏ పాటిదో అర్థం అవుతోంది. యుద్ధం ముగిసిన కొన్నాళ్ళకే మరుగుపడి తెరమరుగయ్యిపోతుంది ఆర్మీ. ఈ పుస్తకం చదివాక, మన ఆర్మీకున్న అరకొర సదుపాయాలతో మున్ముందు ఎలా నెగ్గుకొస్తామన్న అనుమానం మొదలయ్యింది. ఇప్పటికే గత పదేళ్ళుగా ఉగ్రవాదపోరును ఎదుర్కొంటూనే ఉన్నాం.
౩. అరకొర సదుపాయలతోటే అయినా, అసలు ఎదుర్కొంటున్న శత్రువు ఎవరో తెలీకుండా ఉన్నా, భారత ఆర్మీ చూపిన సాహసోపేత కృత్యాలు చెప్పనలవి కావు. హిమాలయపు శిఖరాలను అధిరోహించటమే రికార్డుగా పరిగణమించే క్లిష్టమైన ఎత్తులకి చేరుకోవడమే కాక, అక్కడ శత్రువు పోరాటం జరిపి కొన ఊపిరితో ఉన్న క్షణాల్లో కూడా వీలైనంత మందిని చంపే ప్రయత్నమే చేసిన మన వీరులు చిరస్మరణీయులు.
౪. “co-operate but not at the risk of your own security” అనేది భారత్ కు ఎప్పుడు అర్థమవుతుందో!
౫. నేను ఇదివరకెప్పుడూ మిలిటరీకి సంబంధించిన పుస్తకాలు చదవలేదు. ఈ పుస్తకం మొదట్లో కూడా “చదవగలనా?” అని అనుమానం వచ్చింది. చదవటం మొదలెట్టాక మాత్రం, చాలా సరళంగా, సులువుగా అర్థమయ్యింది. కాకపోతే, చాలా చోట్ల గూగుల్ అవసరం పడింది.
నాకు నిరాశ కలిగించిన అంశాలు:
౧. మాప్స్ క్లియర్‍గా లేవు. కార్గిల్ నేపధ్యం తెలీకపోతే, మొదటి యాభై-అరవై పేజీలూ చాలా గందరగోళంగా అనిపించవచ్చు. అప్పటికే అనేకానేక ప్రదేశాల పేర్లను వాడుంటారు, కానీ వాటి geographical location తెలీక తికమకపడాల్సి ఉంటుంది. ఇలాంటి రచనల్లో, మొదట్లోనే మాప్స్ ఇస్తే ఒక అవగాహన ఏర్పరుచుకోవడానికి వీలుగా ఉంటుంది.
౨. యుద్ధంలో వీరమరణం పొందిన మన సైనికుల గురించి చాలా తక్కువగా రాయటం నాకు చాలా నిరాశ కలిగించింది. కార్గిల్ అమరవీరుల ఫోటోలు ఇచ్చుంటారు అనుకొన్నాను.
౩. పాకిస్థాన్ సైనికులకి భారత భూభాగంలో గౌరవప్రదంగా జరిపిన అంత్యక్రియలను పదే పదే ప్రస్తావించినా, పాట్రోలింగ్ చేస్తుండగా అపహరింపబడి, ఆ పై చిత్రహింసలకు గురై ప్రాణాలు పోగొట్టుకున్న మన వారి గురించి ( ముఖ్యంగా సౌరభ్ కాలియా ప్రస్తావన కోసం మూడొంతుల పుస్తకం చదవాల్సి వచ్చింది.) పెద్దగా చెప్పకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.
“When You Go Home, Tell Them Of Us And Say,
For Their Tomorrow, We Gave Our Today”
పుస్తకం వెనుక అట్ట మీదున్న అక్షరాలను చూస్తుంటే కళ్ళల్లో నీటిపొర అడ్డుస్తొంది. అక్షరాలపైనే తన భర్త భౌతికకాయానికి సెల్యూట్ చేస్తున్న ఆఫీసర్ ఫోటో చూస్తుంటే రక్తం నూతనుత్తేజంతో పరుగు తీస్తుంది. ఈ పుస్తకం ఆద్యంతం అనేక భావోద్వేగాల మధ్య చదువుకోవాల్సి వస్తుంది. కార్గిల్ పై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవటం ఈ తరానికి (సామాన్య ప్రజానీకానికి) చాలా ముఖ్యం. మున్ముందు తరాల వారికి, చిత్తగొట్టే సచిన్ టెండుల్కర్, చించేసే చిరంజీవిలతో పాటు, మరికొందరి (నిజజీవితపు) హీరోలను పరిచయం చేసే బాధ్యత మన మీదే కదా ఉంది!
*****************************************************************************
Kargil: From Surprise to Victory (Hardbound)
Author: General V.P Malik
Pages: 436
Price: Rs. 595 /-
Raghava
Cant wait ..
Need to read this book in detail .
Thanks for letting us know about the book .
Raghava
Independent
As soon as I read the last word, I clicked on the link to purchase. Too sad..doesn’t look like they ship to US.