ఇస్మాయిల్ కవిత్వం, కాసిన్ని జ్ఞాపకాలు, కొన్ని ఫొటోలు

రాసి పంపిన వారు: బొల్లోజు బాబా
*********************************’

అప్పుడు నేను పి.జి. విద్యార్ధిని. కవిత్వం అంటే తిలక్, ఇస్మాయిల్, శిఖామణి, చలం అని అనుకొనే రోజులవి. అప్పటికి అచ్చయిన నా కొన్ని కవితలను ఇస్మాయిల్ గారికి చూపించాలని నా తాపత్రయం. మిత్రుని ద్వారా ఓ రోజు ఆయనకు పరిచయం చేయించుకొన్నాను. పసుపచ్చని దేహచ్ఛాయ, ఎత్తైన విగ్రహం, సన్నని స్వరం, రంగులు చిమ్మే సాదా దుస్తులతో ఆయనను చూడగానే కవిత్వంతో నిండిన గౌరవం కలిగింది. కుశలప్రశ్నలయ్యాకా నా కవితల గురించి ఆయనన్న మాటలు ఇప్పటికీ నాకు గుర్తే. “నీ కవిత్వంలో స్పార్క్ ఉంది. ఆవేశాన్ని పదాలలోకి ఒంపేప్పుడు తేలికైన పదాల్ని ఎంచుకోవాలి. భావాన్ని మరింత క్లుప్తంగా చెప్పగలగాలి” అన్నారు. ఇది జరిగి సుమారు పదిహేను సంవత్సరాలు అయ్యింది. ఇప్పటిదాకా వ్రాసిన నా కవితలను తరచి చూసుకొంటే క్లుప్తత, పదాల ఎంపిక విషయంలో ఆయన పరిశీలన ఎంతటి సూక్ష్మమో తెలుస్తూంటుంది.

చాలా కాలం కవిత్వానికి దూరంగా ఉండటం వలన, ఆయనను కలుసుకోవటం అదే మొదలు మరియు చివరు అయ్యింది నాకు. ఇదిగో ఇప్పటికి మరలా ఇలా……..

ఇస్మాయిల్

ismailఇస్మాయిల్ గారు 26 మే, 1928 న జన్మించారు. వీరు కాకినాడ పి.ఆర్. కళాశాలలో ఫిలాసఫీ లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా పని చేసారు. 25 నవంబర్, 2003 న ఆయన అనంత నిశ్శబ్దం లోకి జారిపోయారు. కవిగా, విమర్శకునిగా ఇస్మాయిల్ గారు పోషించిన పాత్ర తెలుగు సాహితీవనంలో నిలువెత్తు పొగడచెట్టై పరిమళాలు చిందిస్తూనే ఉంటుంది. ఆయన రచించినవి పదిపుస్తకాలే కావొచ్చు, అన్నీ కలిపి ఓ మూడు, నాలుగొందల పేజీల సారస్వతమే అవ్వొచ్చు, కానీ వాటి ముద్ర మాత్రం తెలుగు సాహిత్యంపై ఏ నాటికీ చెరగనిది.

ఇస్మాయిల్ కవిత్వం

ఇస్మాయిల్ గారనగానే రెండు విషయాలు చాలామంది స్మరణకు వస్తాయి. మొదటిది “’చెట్టు నా ఆదర్శం” అన్న ఇస్మాయిల్, రెండవది ఆయన ఆంధ్రదేశానికి పరిచయం చేసిన హైకూ. ఇస్మాయిల్ కవిత్వ భాష విశిష్టమైనది. క్లిష్టపదాలు, పొడుగు వాక్యాలు ఉండవు. ఛందస్సులు, లయ శయ్యల వంటివి కనపడవు. అయినప్పటికి ఈయన కవిత్వం ఒక అనుభూతిని పదచిత్రాల ద్వారా పఠితకు ప్రసారం చేసి అతనూ అనుభూతి చెందేలా చేస్తుంది, అదీ ఎంతో నిశ్శబ్దం గా.

సౌందర్యారాధన, మానవత్వంపై విశ్వాసం, స్వేచ్ఛాశీలత, ప్రకృతి ఉపాసన ఆయన కవిత్వానికి కాన్వాసు. మన దైనందిక విషయాలను, చిన్న చిన్న అనుభవాల్నీ, అపుడపుడూ ప్రకృతి కరుణించే సుందర దృశ్యాలకు, కరుణ తాత్వికలను అద్ది కవిత్వంగా మలచి మనకందించారు. ఇస్మాయిల్ కవిత్వంలో ఇజాలు, వాదనల వంటి శృంఖలాలు కనిపించవు. కేవలం కవిత్వం మాత్రమే వినిపిస్తూంటుంది. జీవితోత్సవాన్ని ఎన్నికోణాల్లో ఆనందించవచ్చో అన్ని కోణాల్నీ ఆయన తన కవిత్వంలో ఆవిష్కరించారు. అందుకనే ఇస్మాయిల్ గారి పుస్తకాలను వరుసగా చదువుతున్నపుడు ఇతివృత్త సంబంధమైన మొనాటనీ కనిపించదు.

ఆయన కవిత్వంలో పదచిత్రాల సౌందర్యం పరిమళిస్తూంటుంది. పదచిత్రాల్ని ఎవరైనా కల్పన చేయగలరు. కానీ ఒక దృశ్యాన్ని నలుగురూ చూసే దృష్టితో కాక కొత్తగా దర్శించి దాన్ని పదచిత్రంగా మలచటం ఇస్మాయిల్ గారికే చెల్లింది. ఒక్కోసారి ఈయన “ఇలా ఎలా” చూడగలిగారబ్బా అని విస్మయంతో ఆశ్చర్యపడక తప్పదు. ఈ క్రింది ఉదాహరణలను చూస్తే అర్ధం అవుతుంది ఆయన విలక్షణ వీక్షణం.

“ఎక్కడెక్కణ్ణించో ఎగిరి వచ్చిన కాకులు చింతచెట్టులో నల్లగా అస్తమిస్తాయి / “
“ప్రణయక్రీడలో మన అంగాల పాచికల్ని మహోద్రేకంతో విసిరి నక్షత్రాల పావుల్ని రాత్రల్లా నడిపించాం గుర్తుందా!” /
కిటికీలోంచి చూస్తే వెలుతురునిండిన బెజ్జాలతో పిల్లం గోవిలా ఊళవేసుకుంటూ దూసుకుపోతోంది రైలు /
తొలిసంజె నారింజని ఎవరు ఒలిచేరు, తెలిఎండ తొనలను ఎవరు పంచారు /
ఊగుతోంది వేయి పిర్రల సముద్రం /
మూగిన బంధుమిత్రులు మోసుకుపోయి అతణ్ణి విత్తనంలా పాతారు /
భూమి బుగ్గపై చల్లటి నవ్వు సొట్టలా బావి /
ఉదయాలు అనాది నుంచీ సూర్య శిశువును ఎన్నివిధాలుగా ఎగరేసి పట్టుకొన్నాయో/
నీడల విసనకర్రను విప్పి ఎండలో సేదదీరుస్తుంది చెట్టు

—– ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కవితలనన్నీ టైప్ చెయ్యవలసి ఉంటుంది. ఎన్ని పదచిత్రాలు, ఎన్నెన్ని సునిశిత దృశ్యాలు.


బుద్దిగా ప్రేమించుకోక
యుద్దమెందుకు చేస్తారో
నాకర్ధం కాదు.

-పై వాక్యాల సారాంసమే ఇస్మాయిల్ కవిత్వమూ, జీవితమూను. జీవితానందాల్ని గానం చేసే కవికి, వానిని పాడుచేసే మనుష్యులను చూస్తే ఇలాకాక వేరెలా అనిపిస్తుందీ!

తనని బాధిస్తున్న ప్రపంచపు ముల్లుని
పీకి పారేసి
ఈ పిల్ల చకచక ఎటో నడిచిపోయింది (ఆత్మహత్య)

-ఆత్మహత్యకు ఎంత అద్బుత నిర్వచనం. ఈ గుప్పెడు వాక్యాలలో, ఒక అమ్మాయి జీవితంలో ఓడి పోవటం, తద్వారా ఎదుర్కోవలసి వచ్చిన సామాజిక వివక్ష, నిత్యం ముల్లై బాధించిన ఈ ప్రపంచాన్ని ఇక ఏమాత్రమూ తప్పించుకోలేని దోషిగా నిలబెట్ట టమూ – ఎంతగొప్పగా ఇమిడి పోయాయి.

సెలయేరా సెలయేరా
గలగలమంటో నిత్యం
ఎలా పాడ గలుగుతున్నావు?
చూడు, నా బతుకునిండా రాళ్లు
పాడకుంటే ఎలా?

– జీవితంలోని కష్టాలను కప్పిపుచ్చు కొని ఆనందంగా ఉండక తప్పదు అని ప్రవచించే ఈ కవితే ఇస్మాయిల్ గారి జీవితాదర్శం. ఆయనకు ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా చిరు నవ్వు ను, సంతృప్తిని వీడ లేదంటారు సన్నిహితులు. అందుకేనేమో ఓ కవితలో ఇలా అన్నారు.

నేను డబ్బు సంపాదించలేదని
మా ఆవిడ సణుగుతుంది.
డబ్బెందుకు?
కిటికీ లోంచి వాలి టేబుల్ పై పుస్తకాన్ని, పెన్నుని
ఇంకు స్టాండుని మంత్రించే సూర్యకిరణం ఖరీదెంత!
ఎంత డబ్బు పెడితే దొరుకుతుంది.

సూర్యకిరణాలు, చంద మామలు, సాయింత్రపు కలువలూ, పక్షుల కిలకిలలు, నదిలోనీడలు, గదిలో కాంతులు, ఆకాశపు దీపాలు, ఇవీ ఇస్మాయిల్ కవితాలోకపు డబ్బులు. వారి సతీమణిని మరో కవితలో వర్ణించిన తీరు చాలా హృద్యంగా ఉంటుంది.

మా ఆవిడ ఒక చేత్తో ఆకాశాన్ని ఎత్తిపట్టుకొంటుంది
ఒక చేత్తో భూమిని బుజ్జగిస్తుంది.
ఒక పిట్టచేత్తో కన్నీటి బీజాల్ని ఏరుకుంటుంది.
ఒక సెలయేటి చేత్తో బండల్ని నిమిరి ఓదారుస్తుంది……

ismailwfe నా ఇల్లు, నా సంసారం అనుకుంటూ నిత్యం శ్రమించే ఇల్లాలిని ఇంతకన్నా గొప్పగా వర్ణించే వాక్యాలు తెలుగు సాహిత్యంలో లేవు అంటే అతిశయోక్తి కాదు.

ఇస్మాయిల్ గారు తన పద్యాల్ని తెరుచుకొన్న పద్యాలు అన్నపుడు, మిగిలిన వారివి మూసుకొన్న పద్యాలా అంటూ తెలుగు సాహిత్యవిమర్శనా లోకంలో కొంత అలజడి రేగింది. అలా అన్నప్పుడు ఇస్మాయిల్ గారి ఉద్దేశ్యం ఒక కవిత చదవగానే పాఠకుడు ఆ పద్యానికి కంటిన్యూ అవుతారనీ, అంటే అతను కవితను తనంతట తానుగా కొనసాగించుకొనే అవకాశం ఉంటుందని. అలాంటి “ఓపెన్ నెస్” ఈయన కవితలలో ఉండి పాఠకుల కల్పనా శక్తికి పని కల్పించటం ద్వారా అవి మరింతగా వారి హృదయంలోకి ఇంకటం జరుగుతుంది.

స్త్రీవాద కవిత్వాన్ని ఇస్మాయిల్ గారు అహ్వానించలేదన్న అపవాదు వారిపై ఉంది. కానీ నిజానికి ఆయన ఉద్దేశ్యం కవిత్వం ప్రకృతిని ప్రతిబింబిస్తుందనీ, స్త్రీ ప్రకృతికి దగ్గర కనుక వారికి కవిత్వం వ్రాసే అవసరం రాకపోవచ్చుననీ మాత్రమే అన్నారు. ఆ తరువాత వచ్చిన స్త్రీవాద కవిత్వాన్ని చూసిన ఆయన, కవిత్వం అనేది అంతర్గతకల్లోలాల వల్ల జనిస్తుంది, ఈనాడు స్త్రీలకు కూడా ఈ మానసిక అశాంతి తప్పటం లేదన్న మాట అని అభిప్రాయ పడ్డారు.

You Might Also Like

8 Comments

  1. Lalithanand

    Good article.Nice photos.

  2. పుస్తకం » Blog Archive » 2010లో చదివిన తెలుగు పుస్తకాలు

    […] ఇస్మాయిల్ హైకూలు: బ్లాగుల వల్లే నాకు ఈయన గురించి తెల్సింది. ఈమాటలో వారి / వారిని గురించిన ఉన్న రచనలన్నీ నచ్చాయి. పుస్తకాలు దొరకలేదు. ఈ మధ్య కాలంలో దొరికాయి. మళ్ళీ చదువుకున్నాను. […]

  3. parvin

    ismail gaaru vaari manasu laage chllani aayanaillu tammudi pillalamiena maa meeda aayana chupinche prema memandaram bhojanaalu chesina taruvaata aayana andarini line gaa nilchopetti fish oil taaginche vaaru vaari inti lo aayana pillalaage onde vaallm mammlini dhaala prema gaa chuse vaaru haal la sry devulapalli krishna sastri gaari photo paata kaalapu gramphone andu lo vachhe paatalu ivnni elaa maravaglamu aa inti lo memu putti nanduku garvapadutunaamu

  4. సంజీవ్

    ఇస్మాయిల్ గారి గురించి మంచి విశేషాలలతో కూడుకొన్న సమగ్రమైన వ్యాసం. అరుదైన ఫొటోలు బాగున్నాయి. ఇదివరకు ఎక్కడా చూడలేదు.
    మంచి ప్రయత్నం

  5. బొల్లోజు బాబా

    థాంక్యూ బుడుగోయ్ గారు

    ఆ లింకు పక్కన ఒక వ్యాసం మాత్రమే అని ఉండాల్సింది కదూ

    మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదములు

    బొల్లోజు బాబా

  6. budugoy

    వ్యాసం బాగుందండీ. ఇందులో దొరలిన ఒక చిన్న పొరపాటు.

    ఆయన సాహిత్యం అంటూ ఇచ్చిన తొమ్మిదో నంబరు లింకు – కవిత్వంలో నిశ్శబ్దం ఒక వ్యాసం మాత్రమే కాదు. “కరుణ ముఖ్యం”లా అదొక వ్యాసాల సంకలనం. కవిత్వంలో నిశ్శబ్దం అని మీరిచ్చిన లింకు కేవలం ఒక వ్యాసాన్ని మాత్రమే సూచిస్తుంది.

    అలాగే “పల్లెలో మా పాత ఇల్లు”, “కవిత్వంలో నిశ్శబ్దం” పుస్తకాలు కావలనుకొన్న వారు thammineni13 at gmail dot com కు మెయిల్ చేసి తెప్పించుకోగలరు.

  7. vsrsr

    అయితే మనమందరమూ కవులమే(రచయ త/త్రి లమే)

Leave a Reply