ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల
వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం
(ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకునేందుకు అనుమతించిన రచయిత్రికి ధన్యవాదాలు)
****************
ప్రకృతి ఒడిలో మనం జీవించాలంటే దాన్నించి మనం పొందటమే కాదు.మన నుంచి దానికోసం కొంత కోల్పోవడం కూడా. మరే! ఎన్నో వనరులను ఉయోగించుకుని జీవనపోరాటాన్ని సులభతరం చేసుకున్నాం. అంత పొందినప్పుడు కాస్తయినా వాటిని కాపాడితేనే కదా మనముందు తరాలకు అందించగలం? ఇక్కడ కోల్పోవడం అంటే ఏదో పోగొట్టుకోవడం కాదు, నాకు అర్థమయినంతవరకూ మనలో కొంతభాగమయినా ప్రకృతితో నింపుకోవడం.
జుంటి తేనె తుట్టెను పిండుకుని ఆరారగా తాగినట్టు, శెనగుండను కసుక్కున నమిలినట్టు, కమరుకట్టెను బుగ్గనపెట్టుకుని చప్పరించినట్టు.. ఎంత మధురంగా ఉందో కొన్ని వాక్యాలు చదువుతుంటే. రచయిత రైతు అయితే తప్ప ఇలా రైతు తత్వాన్ని రాయలేరు. చక్కని శైలితో, తాను మలచిన పాత్రల ద్వారా ప్రకృతితో మాట్లాడుతూ, మనల్నీ ఆ మాధుర్యంలో భాగస్వాములను చేసేస్తాడు. ఎదురుచూసిన చక్కని ముగింపు మొలకతో మనలోనూ ఇంకా తడి ఆరలేదని నిరూపిస్తాడు. పల్లెల్లోని కళలను, సహజసిద్ధంగా దొరికే అనేకానేక పళ్ళను, ఆకుకూరలనూ గుర్తుచేసి, తేనెతుట్టలా ఉన్న జ్ఞాపకాల్ని అలా తట్టి లేపేస్తారు.
ఎప్పుడో చిన్నప్పుడు తిరుగాడిన గేనాలవెంటా, చెట్లు, వంకలు , చేన్ల వెంటా తిప్పి తీసుకొచ్చేస్తారు.
ఈ నవల లోని నర్సయ్య కూనిరాగాలు చూస్తుంటే, అక్కడే పెరుగుతూ ప్రకృతిలో మమేకమయ్యి, సొంతం చేసుకుని పాడగలుగుతున్నాడనిపించింది. నాగరికం పేరిట ప్రకృతి ఒడిలోంచి దూరమయ్యి గొంతువిప్పి పాడుకోవాలనుకున్నా పరాయి. నర్సయ్య సంతోషాన్ని, దుఃఖాన్ని పంచుకోవడానికి ప్రకృతిలోకి వెళ్ళిరావడం. అవి రెండూ అరిగించుకోలేకనే కదా ఒంటికి ఇన్ని రోగాలు. అతనంటాడు.. నిజమే. డబ్బుతో డబ్బు పండుతుందేమోకానీ పంటలు పండవులే. నిజమేకదా. ప్రకృతి కనికరించాలి కదా. ఇంకో సందర్భంలో ప్రకృతిని నిలదీస్తాడు హక్కుగా. గొర్రెల మంద పైరుని మెసేసినప్పుడు..కరువు మెసేసింది సర్ అంటాడు. ఏమి తత్వం?
మనుషుల్లో తోడేళ్ళు మొదలయ్యాక తోడేళ్ల జాతే అంతరించిందేమో. మనుషులను తోడేళ్లతో పోల్చినందుకు సిగ్గుపడ్డాయేమో వాటి జాతే అంతరించి పోతోంది.
నాగరికుడు, ప్రకృతి ఒడిలో రైతు సమాంతర జీవితాన్వయము. సమూహంలో ఒంటరొకరు. ప్రకృతినే సమూహంగా మార్చుకున్నారొకరు.
డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవన పోరాటాన్ని సాగించి ఒంటినిండా రోగాలతో అంతరించి పోతున్న అరికె ధాన్యాన్ని వెదుక్కుంటూ తన స్వలాభంకోసం వచ్చి , నర్సయ్య ద్వారా ప్రకృతిని అర్థం చేసుకుని, దానిలో భాగమయ్యి మారినవారొకరు. గుండె నిండా తడి నింపుకుని, అంతరించిపోతున్న ఒక పంట జాతిని నిలబెట్టాలనే తపన మరొకరిది.
రాములమ్మ పాత్రని మలచిన తీరు అద్భుతం. దూడను పట్టుకెళితే ఆవు వెంబడించి వచ్చేస్తుందన్నట్టు కూతుర్ని తన నుంచి వేరు చేసినా, లోకాన్ని ఎదుర్కొని జీవితాన్ని సాగిస్తున్న రాములమ్మ కు వందనం.
ఈ రచయిత కలంలోంచి జాలువారిన అక్షర మధువులో కొన్ని చుక్కలు..
గోడకానుకుని కూర్చుని చెదలుపట్టదా శరీరం అంటాడు నర్సయ్య. (మనిషి పక్క మనిషి ని చూసి స్పందించే మనిషి తత్వాన్ని కోల్పోయి కదలిక లేకుండా కొయ్యబొమ్మలా కూర్చుంటే రోగాల చెదలు పట్టకుండా ఉంటుందా శరీరానికి?) కొమ్మలు ఆడించకుండా చెట్టు బిగదీసుకుని ఉండగలదా? రెండు హృదయాలు సమాంతర స్థాయిలో ప్రతిస్పందిస్తున్నప్పుడు ఖేదమయినా, మోదమయినా కట్టలు తెంచుకుని ప్రవహించకుండా ఎలా ఉంటుంది.
పొద్దు పొడవడం, ఆకులు పాడటం, పక్షులు, జంతువులు, శ్రమైక జీవన సౌందర్యాన్ని ఇష్టపడేవాళ్ళు తప్పక చదవండి. కూతవేటు దూరంలో నాగరికత మోజులో కల్మషమైన ఊరున్నా, ఆ మాలిన్యం అంటకుండా స్వచ్ఛంగా ప్రకృతిలో భాగమైన నర్సయ్యలా ఓ ఆర్నెల్లు ప్రకృతి తో సావాసం చెయ్యాలంటే ఈ నవలని చదవాలి. అర్థమయ్యే ఉంటుందీపాటికి నవల సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి గారి “ఒంటరి” అని. చూడముచ్చటగా ఉన్న కవర్ పేజీతో ఆకట్టుకుంది. తానా బహుమతికి రావడం విషయం లో రచయితకి అభినందనలు. ఎక్కడ పడితే అక్కడ చెట్లు నరికేసి, కొండలు చదునుచేసేసి ప్రకృతికి హాని కలిగిస్తున్న తరుణంలో ఇలాంటి నవలల ఆవశ్యకత ఎంతో ఉంది.
Varaprasad.k
కమరు కట్టె అంటే ఏమిటి.
sreeram velamuri
శ్రీలత శ్రీరామ్ గారూ, చక్కటి సమీక్ష రాశారు. నాకు మంచిపుస్తకం చదివిన వెంటనే రచయిత ను అభినందిచటం అలవాటు,
తీరా చూస్తే ,ఈ నవల పాత్రలు ,ప్రదేశాలు,అన్నీ నాకు 30 km దూరం లోనే , రచయిత కూడా ఉండేది నరసాపురం అనే ఊళ్ళో ,
నాకు చాలా దగ్గర , త్వరలోనే వెళ్లి స్వయం గా కలసివద్దామని అనుకుంటున్నా .. మీ సమీక్ష కు అభినందనli
suryaa telugu news
డియర్ సర్ వెరీ గుడ్ బ్లాగ్ అండ్ తెలుగు content