అలుకు మొలకలు పుస్తక సమీక్ష
వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి
*******************
ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ నుండి ఎందరో కవులు-కళాకారులు కలంతో,గళంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. అదేకోవలో రామునిపట్ల గ్రామానికి చెందిన కవి భైతి దుర్గయ్యగారు వచన కవిత్వంలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. దుర్గయ్యగారు డిసెంబరులో
“ప్రపంచ తెలుగు మహాసభలు” లో తన కవితాసంకలనం 41 కవితలతో “అలుకు మొలకలు” ఆవిష్కరించుకున్నారు. వాడుక భాషకు పెద్ద పీట వేసి స్థానీయమైన అనేక అంశాలను కవితలుగా మలచిన విధానం ఆకట్టుకుంటుంది. కవి అనుభవింటం ద్వారా, స్వయంగా వీక్షించటం వలన పురుడోసుకున్న ఆలోచనలకు దర్పణం ఈ “అలుకు మొలకలు” కవితాసంపుటి.
దుర్గయ్యగారు స్వయంగా రైతు నేపథ్యంనుంచి వచ్చారు కాబట్టి “తెల్లబోయిన బంగారం,” “రైతన్నా ఒక్క క్షణం”, “బతుకు బొమ్మను చేసిన బోరుబావులాట” వంటి కవితలల్లో అన్నదాత సమస్యలను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. “మరువలేని మమకారం”లో అమ్మ గూర్చి, “ఇల్లాలికి ప్రేమతో”లో ఆలి గూర్చి, ” నాన్న ఒక జన్మనివ్వు”లో కూతురు గూర్చి, “వనితా ఆలోచించు” లో మహిళల గూర్చి వెలువర్చిన అభిప్రాయం మహిళలపై తనకున్న ఆదరాభిమానాలకు అద్దంపడుతున్నాయి. అలాగే బతుకమ్మ, నీరు, చెట్లపెంపకం, రక్తదానం, పాత్రికేయులు, ఓటు విలువ,బాల్యం, సైనికుడు, తెలుగుభాష, మొదలగు విభిన్న వస్తువులను ఎంచుకుని దుర్గయ్యగారు వ్రాసిన కవితలు పాఠకులను విశేషంగా ఆకర్షిస్తాయి. యదార్థ సంఘటన “మంట గలిసిన మానవత్వం” లో భార్య శవాన్ని మోసుకెళ్ళిన ఆదివాసి దీనగాథ కన్నీరు పెట్టిస్తుంది. ఇంకా భక్తి, పండుగలు, స్నేహం, ఉద్యమం, గురువు, పల్లె, హాస్యం వంటి వస్తువులు కవితలుగా మలిచారు. ఇందులో కొన్ని బహుమతి పొందిన కవితలు, వివిధ వేదికలపై గానంచేసి పెద్దల మన్ననలు పొందినవి ఉన్నాయి.
బాగా ఆకట్టుకున్న వాటిల్లో మచ్చుకు…
నీ ఇంటిపేరు మార్చుకున్నావు
ఈఇంటి రూపమే మార్చావు
తీర్చలేని రుణం నీది
విడదీయలేని బంధం నీది.
–ఇల్లాలికి ప్రేమతో.
ఆలు పిల్లలు అనుబంధాలముందు
అప్పులు లెక్కకాదు
నేడు మనది కాకున్నా
రెక్కల కష్టాన్ని నమ్మి కృషిచేస్తే
రేపన్నది మనదేగా…
–రైతన్నా ఒక్కక్షణం.
వర్తమాన సమస్యల సమాహారం ఈకవితాసంపుటి. వస్తు వైవిధ్యంతో సృజనాత్మక రీతిలో సాగుతూ భైతి దుర్గయ్యగారి “అలుకు మొలకలు” కవితాసంపుటి వచన కవితాచాతుర్యానికి చిహ్నం.
పేజీలు:70
వెల : రు.100
ప్రతులకు: భైతి దుర్గయ్య
గ్రా. రామునిపట్ల
మం. చిన్నకోడూరు
జిల్లా: సిద్ధిపేట
తెలంగాణ
PH:9959007914.
Leave a Reply