శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి
(ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకునేందుకు అనుమతించిన రచయిత్రికి ధన్యవాదాలు)
******************
శప్త భూమి!

పడిపోయాను ప్రేమలో.. పూర్తిగా మునిగిపోయాను రాయలసీమ కథాంశంతో తానా బహుమతి పొందిన చారిత్రాత్మక నవల శప్తభూమితో!
మామూలుగా అయితే పనుల మధ్యలో వీలు చూసుకుని పుస్తకాలు చదివే అలవాటు వుండేది, ఈ నవలేమో పనులన్నీ పక్కన పెట్టేసేటట్లు చేసేసింది.. అంటే ప్రేమలో పడ్డట్లే కదా!

కథా విషయానికి వస్తే రాయలసీమ నేపధ్యంలో జరిగిన కొన్ని వాస్తవాలకు, కొంత మంది చారిత్రక వ్యక్తులు, కొన్ని కల్పిత పాత్రలు జోడిస్తూ రాసిన అద్భుతమయిన నవల. రచయిత అన్నట్లు ఇది చారిత్రక కథ గా మొదలయి, తర్వాత నవలగా, ఆ తర్వాత దళిత బహుజన చారిత్రక నవలగా పరిణమించింది.

ఇందులో కొన్ని పాత్రలను రచయిత అద్భుతంగా మలచిన తీరు గొప్ప అనుభూతిని కలుగజేస్తుంది. అందులో బాగా నచ్చిన కొన్ని పాత్రలు:

ఎల్లప్పజెట్టి: ఒక కురుమకులంలో పుట్టి గొర్రెలు కాసుకునే అతి మామూలు మనిషి. అనంతపుర సంస్థానానికి సంబంధించిన చెరువుకట్టని తెగ్గోట్టాలని వచ్చిన తాడిమర్రి దుండగులను ఒక్కడే ఎదుర్కుని వాళ్ళని దళవాయి సుబ్బారాయుడుకి అప్పజెప్పడం, ఇతనిలోని వీరత్వాన్ని, ధైర్య పరాక్రమాలను గమనించిన సుబ్బరాయడు ఆసంస్థానాన్ని పరిపాలిస్తున్న హండే వంశస్త రాజు సిద్దరామప్ప నాయుడు దగ్గరికి తీసుకుపోవడం.. జెట్టిగా గుర్రం ఎక్కమనడం, వెంటనే అమరనాయకుడవడం..ఇవన్నీ అతను ఊహించని పరిణామాలు. ఇతని వివాహం కొన్ని విచిత్ర పరిస్థితుల్లో తను ఎంతో ఇష్టపడిన మరదలు ఇమ్మడమ్మతో జరగడం..అప్పటికే ఆమె తనకి ఇంకొకవైపు నుండి బావ అయిన కోడెనాగప్ప ప్రేమలో వుండడం..

ఇందులో కొన్ని అనాగరికమయిన అలవాట్లు, ఆచారాలు ఎన్నో ఉన్నప్పటికీ, భార్యకి ఇష్టం లేదని తెలుసుకున్న ఎల్లప్పజెట్టి కొన్ని సంవత్సరాలు ఆమెకి దూరంగా వుండి.. కోడెనాగప్ప మీదున్న కోపాన్ని ఒక సంఘటనలో అదుపుతప్పి ఆమె అనుమతి లేకుండా, భర్తగా ప్రవర్తించడం.. దానికి వెంటనే పశ్చ్ట్టాత్తాపపడడం.. ఆ శిక్ష కొన్ని సంవత్సరాలు అనుభవించడం.. తనలో తనే కుమిలిపోవడం.. చివరికి వీరమంటపం అనే భయంకరమయిన ఆచారాన్ని (ఒక్కో అవయవాన్ని శివుడి సమక్షంలో నరుక్కొని ప్రాణాలు అర్పించడం) పాటిస్తాడు.. తను నమ్మిన ప్రభువు కోసం, రాజ్యం కోసం, ముఖ్యంగా రాజ్య క్షేమం కోసం, వర్షాలు కురుస్తాయనే గుడ్డి నమ్మకం కోసం.

ఇమ్మడమ్మ: ఇద్దరు వరసయిన బావల ప్రేమలో, ఆకర్షణలో మునిగిపోయి ఎటూ తేల్చుకోలేక, అయిష్టంగానే ఎల్లప్పజేట్టిని పెళ్లి చేసుకున్నా, భర్తగా తన మీద చూపిన అధికారాన్ని ఎదిరించి, అతనికి దూరంగా వెళ్ళిపోయిన ఆత్మాభిమానంగల పిల్ల. వీరమంటపం ఎక్కుతున్నాడని తెలిసి, అతని ఉత్కృష్ట స్వభావానికి తన మనసుని అర్పించుకోవడానికి వస్తుంది. కానీ ఇప్పుడు ఎటువంటి ఆకర్షణ లేదు.

హరియక్క: ఈమెని చూస్తే రుద్రమదేవి గుర్తొస్తుంది. కొడుకులాగా పెంచిన తండ్రి చిత్రలింగ నాయకుడిని దొంగ దెబ్బ తీసి హత్య చేసిన పెన్నసాని తిమ్మప్పనాయుడిని మల్ల యుద్దంలో ఓడించి రణంకుడుపు (ఓడిన వాళ్ళ రక్తాన్ని ఎసరుగా చేసి అన్నం వండి కుల దైవానికి సమర్పించుకోవడం) జరిపిన వీరవనిత! ఈమె కోడె నీలడిని వివాహం చేసుకుంటుంది.

పద్మసాని: హండే సిద్దరామప్పనాయుడి ఆస్థాన దేవదాసి. విశాల భావాలు కలిగి, కొడుకు మతాంతర వివాహాన్ని సంతోషంగా ఆహ్వానించిన మనసున్న దేవదాసి. తన పుట్టింటి వూరి ప్రజల కోసం తల్లి పేరు మీదుగా చెరువు త్రవ్వించింది. ఆపదలో వున్న ఎంతో మంది అభాగ్యులను ఆదుకున్న మంచి మనిషి.

ఎన్నో దురాచారాలు. ముఖ్యంగా ‘సతి’ ఎంత వేదనాభరితంగా వుంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించారు. కొత్తగా పెళ్ళయిన మాదిగ కులం జంటలు ప్రతీ ఏడూ జరిగే పరసలో గుండు కొట్టించుకుని సున్నం బొట్లు పెట్టించుకోవడం. మనసుని కదిలివేసే ఇలాంటి సంఘటనలెన్నో! సంతానం కలగడంలేదని దేవుడికి మొరపెట్టుకోవడానికి వెళ్ళిన స్త్రీలపై లైంగిక దాడులు జరిపిన పూజారులు (ఫలానా పూజ చేసి, వాళ్ళు చెప్పిన ఆచారాన్ని పాటిస్తే సంతానం కలుగుతుందని చెప్పడంతో, అమాయకంగా నమ్మి వెళ్ళిన వాళ్ళు), అస్పృస్యత, అంటరానితనం, వెలి వాడలు.. వాళ్ళ గాథలు గుండెల్ని మెలిపెట్టేస్తాయి.

సైనికుల వీరమరణానికి గుర్తుగా వేయించిన విరాగల్లు ప్రస్తావన కూడా ఇందులో వుంటుంది. రాయలసీమ వీరుల పరాక్రమానికి ఇవి చారిత్రక దాఖలాలు.
రకరకాల పన్నుల వ్యవస్థ చాలా చక్కగా వివరించారు. పుల్లరి, ఇల్లరి, గణాచారి, అడ్డపట్టు సుంకం, వివాహ పన్ను, మొదలయినవి.

థగ్గులు అనే దోపిడీ దొంగల గురించి. తర్వాతి కాలంలో వీరిని అణచి వేసింది అల్లావుద్దీన్ ఖిల్జీ.

ఇలా రాసుకుంటే పోతే ఇంకో పుస్తకం అయ్యేంత కథనం వుంది ఇందులో. ఇలా జరిగితే బాగుండు అనుకునేలోపు, మనం అనుకోనిది ఇంకేదో జరిగిపోతుంది. మనం అనుకున్న కథనో, సినిమానో కాదుగా అని స్పృహలోకి రావాలి. కొన్ని వాస్తవ సంఘటనలు, నిజంగా జీవించిన కొందరు వ్యక్తులకు, మరికొన్ని కాల్పనిక పాత్రధారులతో, వాస్తవికతను జోడించి రచయిత చేసిన ప్రయత్నం అమోఘమయినది.

ఇంతకంటే క్లుప్తంగా రాయలేకపోయాను 🙂

రాయలసీమ కరవు కాటకాలకీ, వర్షాభావ పరిస్థితులకూ చారిత్రక దాఖలా అయిన ఒక సమాధి ఆధారంగా ఇంత మంచి నవలను పరిచయం చేసిన రచయిత బండి నారాయణస్వామి గారికి కృతఙ్ఞతలు ఎంత చెప్పినా తక్కువే.

You Might Also Like

2 Comments

  1. sreeram velamuri

    నేనూ చదివాను , గొప్ప నవల .. వీరశిరోమండపాన్ని మొన్న శ్రీశైలం లో చూసినప్పుడు ఒళ్ళు జలదరించింది .. పాత్రల సంఖ్యా ఎక్కువైనట్టు అనిపించింది ,,

  2. Rao

    is there a digital copy

Leave a Reply