రక్తాశ్రువులతో తడిసిన రణస్థలి

ఎ . కె . ప్రభాకర్

( మాతృక లో ప్రతినెలా బమ్మిడి జగదీశ్వర రావు రాసిన కతలు వెతలు ‘రణస్థలి’  సంపుటికి ముందుమాట )

కవులేం చేస్తారు ? …  రచయితలారా మీరెటువైపు ? …

ప్రశ్నలు పాతవే . కానీ కాలం పురుటి నొప్పులు పడ్డ ప్రతి రక్తసిక్త చారిత్రిక సందర్భంలోనూ మట్టి పొరల్ని చీల్చుకొని యీ ప్రశ్నలు మొలుస్తూనే వున్నాయి. ఇటీవల యివి మనల్నిమరి మరీ తొలుస్తున్నాయ్. అఖ్లాక్ హననోదంతం  కావొచ్చు కల్బుర్గి హత్య కావొచ్చు  పెరుమాళ్ మురుగన్ పై అమలైన ప్రకటిత అప్రకటిత ఆంక్షలు కావొచ్చు సోనీ సోరీ పై అత్యాచారం కావొచ్చు రోహిత్ వేముల  మరణం కావొచ్చు ఆ యా సంఘటనలు జరిగిన తర్వాత పాత ప్రశ్నలే మన లోలోపల సుళ్ళు తిరిగాయి. మరోసారి వాటికి పదును పెట్టాల్సిన అవసరం యేర్పడింది. మనమేం చెయ్యాలో యెటువైపు నిలవాలో సంఘటనల గీటురాయి మీద పరీక్షించుకోవాల్సిన సందర్భం వచ్చింది. సాహిత్య లోకాన్నే కాదు మొత్తం సమాజాన్నే  బలంగా కుదిపిన  రోహిత్ ని ఆవాహన చేసుకొని  తక్షణ స్పందనగా తీక్షణంగా  కవిత్వం వెల్లువెత్తింది. ఆ వేడి చల్లారక ముందే కథలూ వచ్చాయి. అయితే సమాజంలో చోటుచేసుకునే యిటువంటి సంఘటనల్ని ఆధారం చేసుకుని వెనువెంటనే వెలువడే సాహిత్యంలోని  మంచి చెడ్డల గురించి రచయితల సామాజిక బాధ్యత గురించి పాఠకుల చైతన్యం గురించి కళాత్మక విలువల గురించి నూత్నవస్తు స్వీకృతి గురించి విశిష్ట శిల్పనిర్మితి గురించి అదే సందర్భంలో వాదోపవాదాలు జరిగాయి.  

జరిగిన సంఘటనపై కయిగట్టేసి కత అల్లేసి సామాజిక – సాహిత్య బాధ్యత తీరిపోయిందని రచయితలు భావిస్తున్నారని కొందరు యెత్తిపొడిచారు. సాహిత్యం వల్ల యెంత మందిలో మార్పు వస్తుంది – అది యే మేరకు సామాజిక ఆచరణ వైపు దారి తీస్తుంది అని మరి కొందరు నిలదీశారు. సాహిత్య ప్రయోజనం గురించి అది అందించే చైతన్యం గురించి చెవులు కొరుక్కున్నారు. క్రియాశీల ప్రయోజనం సాధించని యిటువంటి రాతలు యెందుకని యింకొందరు బయటికే గొణిగారు. సామాజిక సమస్యల గురించి  వాటి పరిష్కారాల గురించి  ఆలోచించే పని కవులది రచయితలది కాదని నిర్ధారించారు.  రచయితల నిబద్ధత కళాత్మక వ్యక్తీకరణ స్వేచ్చకి ఆటంకంగా పరిణమిస్తుందని పాత వాదాన్నే కొత్తగా వినిపించారు. సాహిత్యం రాజకీయాలకు అతీతంగా వుండాలని గుండెలు బాదుకున్నారు. వుద్యమ భావజాలాన్ని ప్రచారం చేయడానికే సాహిత్యం పరిమితమైపోతుందనీ అటువంటి సాహిత్యమే వుత్తమమైందిగా గుర్తింపు పొంది జీవితం లోని యితరేతర పార్శ్వాలకీ  వుద్వేగాలకీ  చోటు లభించకుండా పోతుందనీ వాపోయారు. వుద్యమాల బయటి జీవితం సాహిత్యంలో వస్తువు కావడం లేదని అందువల్ల యెంతో కోల్పోతున్నామని విచారించారు. వైవిధ్యం లేని  మూస శిల్ప రీతుల నుంచి బయట పడలేమా అని  ప్రశ్నించారు.  అంతిమంగా కళ కళ కోసమేనని మరోసారి తీర్మానించారు.

సరిగ్గా యీ తరహా వాదనలకు సమాధానం వెతుకుతోన్న రోజుల్లోనే మాతృకలో బమ్మిడి జగదీశ్వర రావు (బజరా)  చెప్పిన ‘కతలు వెతలు’ వొక దారిని చూపాయి. మన చుట్టూ జరుగుతోన్న సంఘటనలపై అల్లిన పీరియాడికల్ స్టోరీస్ ని ఆల్ టైమర్ కథలుగా మలచడంలో అతను నిర్మించుకొన్న సహజ సిద్ధమైన శిల్పం శుద్ధకళావాదులకు కనువిప్పు. నిర్దిష్ట స్థలకాలాదుల్ని అధిగమించి కథని తాత్విక స్థాయికి తీసుకెళ్ళి సార్వత్రికం చేసిన అతని నేర్పు కాకర్లపూడి నారసింహ యోగ పతంజలిని గుర్తుచేసింది. వివిధ సామాజిక సందర్భాల్లోని సంక్లిష్టతని పాఠకులకి అందించడంలో రచయిత పాటించవలసిన నిమగ్నతని నిబద్ధతని ఆ కథలు తెలియజేశాయి.

కానీ ; కళ్ళముందు జరిగే సామాజిక దుర్నయాలకి వ్యతిరేకంగా కదలబారే ప్రజల సామూహిక  స్వరాల్ని సొంతం చేసుకొని మానవీయంగా స్పందించే కవుల్ని రచయితల్ని కళాకారుల్ని  సున్నితత్వాలకి దూరం చేసే రహస్య అజెండాలు యివ్వాళ  తయారవుతున్నాయి. కవుల రచయితల భావ వ్యక్తీకరణ  స్వేచ్చ మీద కనిపించని ఆంక్షలు అమలౌతున్నాయి. మొత్తం పౌర సమాజానికే రాజ్యాంగ బద్ధమైన హక్కులేవీ లేకుండా చేసే వికృత రాజకీయం జడలు విప్పుకొని వీధుల్లో తైతెక్కలాడుతోంది. తినే తిండి పై నిఘా. కట్టే బట్టపై ఆంక్ష. పాడే పాట మీద నిషేధం. ఆడే ఆటమీద వుక్కు పాదం. చదివే చదువులపై నిర్బంధం. ఆలోచనలపై అదుపు. సాంస్కృతిక వైవిధ్యం పట్ల అసహనం.  భిన్న  రాజకీయ భావజాలం కలిగి వుండడటమే నేరం.  ప్రజాస్వామిక భావనకి చోటులేదు. న్యాయ సమ్మతంగా నిరసన తెలిపే దారి లేదు. చట్టబద్ధ ధర్నాలకీ ర్యాలీలకీ స్థలాల్లేవు. అనుమతుల్లేవు.

ప్రశ్నించడానికి  వీల్లేని పోలీసు రాజ్యమే యివ్వాళ  నడుస్తోంది. అధికార – అనధికార సైన్యం కర్కశంగా కవాతు చేస్తుంది. జల్ జమీన్ జంగిల్ కోసం సంఘర్షించే ఆదివాసికి జీవించే హక్కుని యివ్వమని అడిగితే పోలిస్ స్టేషన్ లోనే అత్యాచారాలు. ఇంకా లొంగకుంటే యాసిడ్ దాడులు. జ‌ర్న‌లిస్టుల , న్యాయ‌వాదుల కదలికలపై ఆంక్షలు. పరిశోధకుల ప్రజాస్వామ్య వాదుల యిళ్ళ మీద పడి బెదిరింపులు. నిజ నిర్ధారణ కోసం పరిస్థితుల్ని అంచనా వేయడానికి వెళ్ళిన ప్రజా సంఘాల ప్రతినిధులకు  జైళ్ళు. అభివృద్ధి పేర్న విధ్వంసం జరుగుతోంది. ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ పేర్న రియల్ ఎస్టేట్ దందా నడుస్తోంది. ఖనిజాల తవ్వకం కోసమో విశ్వనగరాల నిర్మాణం కోసమో అవినీతి ప్రాజెక్టుల కోసమో   కాళ్ళకింద భూమిని గుంజుకొనే నల్ల చట్టాలు రోజుకొకటి తయారవుతున్నాయి.

మతం రాజకీయం అవిభాజ్యంగా కలిసిపోయి  దేశభక్తి ముసుగులో గుండాగిరికి పాల్పడుతున్నప్పుడు  వ్యాపారం రాజ్యం వియ్యమంది వుభయ ప్రయోజనాల కోసం సామాన్య పౌరులపై హింసకి తెగబడినప్పుడు ఫాసిస్టు శక్తులు సామ్రాజ్య వాదులతో మిలాఖత్ అయి నిత్య నిర్బంధాలతో  ప్రజాస్వామిక స్వరాల్ని కర్కశంగా అణచివేస్తున్నప్పుడు వీటన్నిటికీ ధర్మ బద్ధత సాధించడానికి రాజ గురువులు మత ప్రవచనాలు బోధిస్తున్నప్పుడు బమ్మిడి   రచయితలేం  చేయాలో చేసి చూపిస్తున్నాడు , యెటు నిలవాలో తన రచనల  ద్వారా తెలియజేస్తున్నాడు. సాహిత్య సృజనని సామాజిక  ఆచరణగా నిరూపిస్తున్నాడు. బాధితుల గుండెను తన గొంతులోకి తెచ్చుకొని వినిపిస్తున్నాడు.

‘నా వూపిరి మీద నిఘా పెట్టినంత కాలం… నా కాలి కింద మట్టిని తీసి పరిశోధనలకి పంపినంత కాలం … నేను యెలా ఆలోచించాలో నువ్వు నేర్పినంత కాలం… నేను యేమి తినాలో తాగాలో నువ్వే మెనూ యిచ్చినంత కాలం … నేను యే పలుకు పలకాలో నువ్వే చిలకవై చెప్పినంత కాలం … నా అస్తిత్వం నువ్వైనంత కాలం … నన్ను కొట్టి తన్ని కాల్చి చంపినంత కాలం … నీ మతం నీదై నా అభిమతం పట్టనంత కాలం …. నా వునికి నాకు చిక్కనంత కాలం …

అదెంత కాలమైనా నా పాట నేను పాడుతూనే వుంటాను! నా ఆట నేను ఆడుతూనే వుంటాను! నా మాట నేను పలుకుతూనే వుంటాను!

నేనొక నిరసననవుతాను.’

జరుగుతోన్న సంఘటనల పట్ల రచయితగా బజరా స్పందనే యిది. తాను స్పందించడమే కాదు ఆ స్పందనతో అనివార్యంగా మనల్ని ప్రతిస్పందించేలా  చేస్తాడు. చేయిబట్టి సంఘటనా స్థలికి తీసుకుపోతాడు. మన చూపుకు తన చూపు జత చేస్తాడు. కనిపించని దృశ్యాల్ని సూక్ష్మదర్శిని ద్వారా చూపుతాడు. అక్కడి ఆవేదనలోనో  ఆవేశంలోనో ఆగ్రహంలోనో ప్రతిఘటనలోనో భాగం చేస్తాడు.  

***

సంస్కృతంలో ఆదికావ్యానికి  బీజమని భావించే మానిషాద శ్లోకం వాల్మీకి శోకం నుంచి పుట్టిందని చెబుతారు(ఆదికవే: శోక: శ్లోకత్వమాగత:) . మగపక్షి మరణం కన్నా ఆడపక్షి దు:ఖమే వాల్మీకి మనస్సుని కలచివేసింది. కానీ అతని శోకం శ్లోకంగా మారే క్రమంలో అది వ్యక్తీకరణ రూపం తీసుకునే సరికి అలవికాని క్రోధంగా పరిణమించింది. ఆడపక్షి దు:ఖానికి కారణం వేటగాడి చేతిలో మగపక్షి మరణించడం కాబట్టి వేటగాణ్ని శపించడంగా అది బహిర్గతమైంది. బజరా కథలు కూడా వాల్మీకి శ్లోకం లాంటివే. కోప ప్రకటనలే. అది కవిత్వం కాదంటే యివి కథలు కావు.

నిజమే యివి కథలు కావు. కతలు వెతలు . ఆధిపత్యాల  వాడి పంజాల  కింద నలిగే అభాగ్యుల  దు:ఖాక్రందనలు. విధ్వంసమౌతోన్న జీవితాల గురించి ఆర్తితో చెప్పిన విహ్వల కథనాలు. ప్రజాస్వామిక విలువల్ని కాలరాస్తున్న పాలకుల క్రూర స్వభావంపై నిరసన తెలిపే క్రోధాఖ్యానాలు. మనిషి మార్కెట్ వస్తువవుతోన్న సామాజిక బీభత్సంపై విషాద వ్యాఖ్యానాలు. అభివృద్ధి  పిడుగుపాటుకు పచ్చని బతుకు చెట్లు భగ్గున మాడి బూడిదైనప్పుడు వినిపించిన ఆర్తరావాలు.  మానవత్వం అసహనపు మంటల్లో కాలుతోన్న మల్లెల తోటయినప్పుడు పగిలిన గుండె ప్రతిధ్వనులు..

‘అన్యాయం జరిగితే , వివక్ష యెదురైతే , ఉనికే ఆవిరైపోతే , పోరాడితే తప్ప పరిష్కారం లేకపోతే , ఆడా మగా సమాన పౌరులు కాకపొతే … యీ వ్యవస్థ మారితే బావున్ను’ అనిపించిన స్త్రీల వొంటరి గొంతులు అనివార్యంగా సామూహికం అవుతాయి అనే అవగాహనతో – మనశ్శరీరాలపై స్వీయ అధికారం లేని యెందరో  స్త్రీల హృదయ విదారక జీవితాల్ని ఆర్ద్రంగానూ  , స్త్రీత్వాన్ని దేహంలోకి   దేహాన్ని అవయవాల్లోకి అవయవాల్ని కొలతల్లోకి చివరికి వొకే వొక అంగంలోకి  కుదించిన పురుషస్వామ్య రాజకీయాలని ఆగ్రహంతోనూ ఆవిష్కరించిన యీ కథలు రచయిత తనలోంచి మనలోకి ప్రవహింపజేసిన గడ్డకట్టని రక్తాశ్రువులు. చదువుతున్నప్పుడూ ఆ తర్వాతా గుండె ద్రవిస్తూనే వుంటుంది. కన్ను స్రవిస్తూనే వుంటుంది. గాయం సలుపుతూనే వుంటుంది. మనసు మండుతూనే వుంటుంది. పిడికిలి బిగుస్తూనే వుంటుంది. కానీ అదే సమయంలో అంతర్నేత్రం విచ్చుకుంటుంది.

స్త్రీలపై క్రూరంగా అమలవుతున్న సామాజిక హింస రాజ్యహింస గృహ హింసలు స్వరూపంలోనే వేరు కానీ స్వభావంలో వొక్కటే అని యీ కథలు చదువుతుంటే బలంగా  అనిపిస్తుంది. యింటా బయటా రుద్దే ద్వంద్వ నైతిక సూత్రాలూ  విధించే ఆంక్షలూ నిషేధాలూ  అమలుచేసే నిర్బంధాలూ శాసనాలూ నిర్మించే కట్టుబాట్లు వాటి  వెనక వుండే స్థిరీకృత విలువలన్నీ వొక్కటే. ఆధిపత్య సంస్కృతి నుంచి రూపొందిన  భావజాలమే  వాటిని  శాసిస్తుంది. దాని మూలాల్ని అన్వేషించి ఖండించే పనిలో బమ్మిడి యెక్కడా తడబడలేదు ; యేమరుపాటుకి గురికాలేదు. మూడింటినీ అణచివేతలో భాగంగానే చూశాడు. మానవ హక్కుల వుల్లంఘనగానే గ్రహించాడు.  ఈ గ్రహింపు రెక్కలగూడు ,  హింసపాదు కథా రచన నాటికే యేర్పడింది. దానికి విస్తృతమైన  కొనసాగింపునే యీ సంపుటిలో చూస్తాం. శృతి తప్పని కథలో  ‘ఆడాళ్ళని అణచివేయడమంటే అత్యాచారాలు చేయడమేనా నాన్నా ..’  అని శృతి అడిగిన  ప్రశ్న ద్వారా , పూ శిల లో ‘ఆడ పుట్టుక పుట్టిన అందరూ లంజలే’ అన్న వరలక్ష్మి ఆత్మఘోష ద్వారా , నేల నొప్పులు లో ‘రాజధానికి పునాదిల రాళ్ళూ యిసకా  వున్నా వుండకపోయినా ఆడోల నెత్తురూ కన్నీళ్ళూ వుండక మానవు’ అన్న గౌరి నిర్ధారణ ద్వారా , నాలో నేను లో ‘స్త్రీకి పగలూ రాత్రి రెండూ సమానం కాదా’ అని ఆకాశంలో సగం వెలిబుచ్చిన సందేహం ద్వారా  , పాటల పదమవుదమా ?! లో‘ రాజ్యాంగం ప్రకారం నడవడం నడవాలనుకోవడం ఈ దేశంలో ఆయుధం పట్టుకోవడం లాంటిదేనని’ గ్రహించిన  బేలా సోమారి అవగాహన ద్వారా సంఘటనల్ని సాహిత్యంగా మలిచి చేతులు దులుపుకొనే రచయితగా గాక వొక సామాజిక శాస్త్రవేత్తలా  బజరా హింసకున్న అనేక కోణాల్ని తాత్త్వికంగా విశ్లేషిస్తున్నాడు. కథకి కొత్త అర్థాల్ని నిర్వచిస్తున్నాడు. రూపాల్ని నిర్మిస్తున్నాడు. ప్రయోజనోద్దిష్టమైన శిల్ప రీతుల్ని రూపొందిస్తున్నాడు. కథలకి అవసరమైన ప్రత్యేక కంఠస్వరాల్ని యెన్నుకొన్నాడు.  

ఆ క్రమంలో  నాగపూర్ అండాసెల్ లో చేయని నేరానికి అమానుషమైన  శిక్ష అనుభవించే ప్రొ. సాయిబాబా జీవితం గురించి  అతని చక్రాల కుర్చీ మాట్టాడుతుంది.  అతనిపై  అమలయ్యే క్రూర నిర్బంధం వెనక వున్న పాలక వర్గ ప్రయోజనాల్ని  రాజ్య స్వభావాన్ని తమ అనుభవాల నుంచి ప్రత్యక్షంగా అర్థం చేసుకొన్న అతని తల్లి భార్య బిడ్డల   సాక్షి కథనాల  ద్వారా చక్రాల కుర్చీనే  ‘వాంగ్మూలం’ యిస్తుంది.  కొన్ని చోట్ల శవాలు మాట్లాడతాయి. మరికొన్ని చోట్ల ఆధునిక నగరాల కింద నేల పొరలు నెత్తుటి గీతాలు వినిపిస్తాయి. కొబ్బరి బొండాలు నరికే కత్తి జొన్నపొత్తులు కాల్చే నిప్పు కణిక తెగిన కాలి చెప్పు అణచివేత కతలు ఆకలి వెతలు  చెబుతాయి. రాజ్య హింసని నిరసిస్తూ ప్రజాస్వామ్య హక్కులకోసం పిట్టలు పాటలు పాడతాయి. పాత్రలు కొత్త రూపాల్ని స్వరాల్ని సమకూర్చుకుంటాయి. సన్నివేశాలు రాజకీయ ప్రకటనలవుతాయి. కథనం భిన్న వ్యక్తీకరణల్తో బహుముఖీనమౌతుంది. రాజ్యంపై అలుపెరుగని పోరు చేసే వొక యోధురాలితో యింటర్వ్యూ అవుతుంది. అసమ అవినీతి సమాజంలో వొక తల్లి అనుభవించే హింసాత్మకమైన పురిటి నొప్పుల  జీవన్మరణ సంఘర్షణని ఆమె కడుపులో పెరిగే బిడ్డ వర్ణించే మూగ వేదన అవుతుంది. బాధితులు తమతో తాము తమలో తాము కుమిలిపోయే యెలవని వాన లెక్క యేడ్చే మౌన పోరాటపు మోనోలాగ్ అవుతుంది. దు:ఖితులు రచయిత ముఖత: పాఠకులతో చేసే వొక  ఆగ్రహ సంభాషణ  అవుతుంది. వ్యవస్థపై జుగుప్స కల్గించే బీభత్స దృశ్యాలు , కఠోర జీవన వాస్తవాలు నివురు కప్పిన వ్యంగ్య మాధ్యమాన్ని ఆశ్రయిస్తాయి. చర్మం కింది కండరాల పొరల్ని చీల్చుకు వెళ్లి  యెముకల్లోని మూలగను తాకుతాయి. పదాల మధ్య బాధితుల  పెనుకేకలు పోటెత్తుతాయి. మాటలు ట్రిగ్గర్ నుంచి దూసుకెళ్ళే  తుపాకి తూటాలవుతాయి. వాక్యాల మాటునుంచి ధిక్కార స్వరాలు గుసగుసలాడుతూ రహస్యోద్యమాలు నిర్మిస్తాయి. అక్షరాలు అలుపెరుగని పోరాటాల ప్రతిధ్వనులు వినిపిస్తాయి.  ఇప్పుడిహ వీటిని కథలని పిలవక యేమనాలో సహృదయ కళా ప్రేమికులే చెప్పాలి.

బస్సులో కూర్చోడానికి సొంత ‘చోటు’ ( =ఉనికి) కోసం లోకల్ రైల్లో చట్టం రూపొందించిన రక్షణ వ్యవస్థల నుంచే కనీస భద్రత కరువైనప్పుడు సమూహంలో లభించే అభయం కోసం యింట్లో స్వచ్ఛమైన ప్రేమ కోసం యిష్టమైన చదువు కోసం జీవిక కోసం పని స్థలాల్లో డిగ్నిటీ కోసం బజార్లో నిర్భయంగా తల యెత్తుకొని నడిచే స్వాతంత్ర్యం కోసం సమాజంలో ఆత్మ గౌరవంతో బతకడం కోసం  తనదైన అస్తిత్వం కోసం  సమ న్యాయం కోసం అనుక్షణం సంఘర్షించే స్త్రీల గుండె చప్పుళ్ళే బజరా కలం నుంచి అక్షరాలై పదాలై వాక్యాలై మనల్ని వెంటాడుతోన్నాయి. ప్రతినెలా మాతృకలో వచ్చినప్పుడు క్రమం తప్పకుండా వీటిని చదివి నప్పటికీ యిప్పుడు పుస్తకంగా వొకచోట  చూస్తున్నప్పుడు  బజరా కలం బలం మరోసారి తెలిసొచ్చింది.  ఇవి కేవలం వాస్తవ కథనాలు కాదనీ సంఘటనల్ని నెపం చేసుకొని రాసిన  అచ్చమైన రాజకీయ కథలనీ అర్థమైంది. రచయిత రాజకీయ దృక్పథమే యీ కథలకు బలం. అది యెంతో స్పష్టంగా వుంటుంది. నిక్కచ్చిగా ముక్కుసూటిగా వుంటుంది. ప్రతీకల వెనకో అలంకారాల వెనకో దాగుడు మూతలాడదు. చెప్పదల్చుకొన్న సారాన్ని పాఠకులకి చేర్చడంలో యెటువంటి వూగిసలాటా కనిపించదు. అప్పుడు మన దృష్టి రచయిత యెలా చెబుతున్నాడు మీద కన్నా యేది యెందుకు చెబుతున్నాడు మీదకే ప్రసరిస్తుంది.

***

‘రణస్థలి’ రచయితగా బమ్మిడి స్థిరీ కృతమైన పితృస్వామ్య విలువల్లో స్వీయ అస్తిత్వం కోసం పెనుగులాడే స్త్రీల గొంతుక అయ్యాడు. అంతర్జాతీయ స్థాయి రాజధానుల కోసమో   ధన జల యజ్ఞాలుగా పవిత్రత నాపాదించుకున్న  భారీ నీటి ప్రాజెక్టుల కోసమో  అభివృద్ధి పేర్న విస్తరింపజేస్తున్న సీపోర్ట్  ఎయిర్ పోర్ట్ కోస్టల్ కారిడార్ల కోసమో  విచక్షణా రహితంగా నిర్మిస్తోన్న సెజ్ ల కోసమో అమలౌతోన్న అసంబద్ధ భూసమీకరణ సేకరణల   కారణంగా సర్వస్వం కోల్పోతూ తమ నేలమీద నిలబడే  చోటుకోసం సంఘర్షిస్తున్న నిర్వాసితులతో భుజం కలిపి నడుస్తున్నాడు. చేతిలో భగవద్గీత బొడ్లో బాకులతో బంతి భోజనాలకి సిద్ధమై  కాళ్ళ కింద నేల, నెత్తి పైన నీడ, వొంటి లోని నెత్తురు , కంచంలో కూర మాయం చేస్తున్న మతవాద పాలనలో అనుక్షణం అభద్రతకి లోనయ్యే దళిత బహుజన మైనార్టీలకు అండగా నిలబడి లౌకిక ప్రజాస్వామ్య విలువల్ని ప్రచారం చేస్తున్నాడు. నేలకింది ఖనిజాన్ని దేశ విదేశాల బడా కంపెనీలు తవ్వుకుపోడానికి  అనుకూలంగా అడవిని యుద్ధక్షేత్రంగా మార్చి  పాలక వర్గ మానవ మృగాలు అనుసరిస్తున్న  దమన నీతి వల్ల అడవికి దూరమవుతున్న ఆదివాసీల చేతికి  పోరు జెండా అందిస్తున్నాడు.

కవి అన్నట్టు గతమే కాదు వర్తమానమంతా నెత్తుటితోనూ కన్నీళ్ళతోనూ తడిసింది. కాకుంటే ఆ నెత్తురూ కన్నీళ్ళూ ఆడవాళ్ళవేనని గుండె గొంతుకతో,  పాటల పదమవుదుమా?!, శృతి తప్పని కథ , దెయ్యాలూ… కొన్ని వేదాలూ! మొ. కథల ద్వారా మరోసారి బజరా మనకు గుర్తుచేస్తున్నాడు.

పోలీసులు అంటే ప్రభుత్వ ప్రవేటు సైన్యం కదా..? అని ప్రశ్నించిన సోనీ సోరీ ముఖత: ఆమె ఆమెలాంటి ఆదివాసీలు అనుభవిస్తున్న వ్యవస్థీకృత హింసను వింటే మనం సభ్య ప్రజాస్వామ్య సమాజంలోనే జీవిస్తున్నామా అని సందేహం కల్గుతుంది. పౌర హక్కుల కోసం ప్రశ్నించిన బేలా సోమారీకి బస్తర్ లో నిలవ నీడ లేకుండా చేసిన పోలీసు అధికారి  ‘తన అంగం చాలు రాజ్యాంగం యెందుక’ న్నట్టు ప్రవర్తిస్తాడు.  వాడ్రేవు చినవీరభద్రుడి ప్రశ్నభూమి కథలో ఎమ్మార్వో కూడా తాను ‘ఒక మహా కాయుడైన రాజ్యపురుషుడి తొడల మధ్య వేలాడే మేఢ్రమ’ని చెప్పుకుంటాడు. అతని ఉద్యోగం అతణ్ణి మనిషిగా పూర్తిగా నశింపజేసి వొక మగవాడిగా వొక లైంగికావయంగా మార్చినందువల్ల జీపు మీద మండల పరిధిలో తిరుగుతున్నప్పుడు ప్రజాదేహంతో పెనిట్రేషన్ ఆనందం అనుభవించినట్టు భావిస్తాడు. రెండు చోట్లా కనిపించేది పాలకుల భాషే కానీ స్త్రీల అణచివేతకు మగవాడి అంగం కూడా ‘ఆధికారిక’ ఆయుధమవుతుందన్న కొత్త అవగాహనని  బజరా అందిస్తున్నాడు.  అందరూ చదువుకుని అమెరికా వెళుతుంటే తను అడవికి వెళ్లి యెన్ కౌంటర్ హత్యకి గురైన శృతి తన తండ్రిని అడిగిన ప్రతి ప్రశ్నా రాజ్య పురుష వికృత నగ్న  స్వరూపాన్ని బహిర్గతం చేస్తూ వ్యవస్థపై యెక్కుపెట్టిందే. ‘సహనాసహనం’లో పాలితులు పాలకుల మధ్య సంబంధాన్ని ప్రతీకాత్మకంగా భార్యా భర్తల కోణంలోంచి విశ్లేషించడం గమనించాలి. అందుకే రాజ్యం స్త్రీల మీద లైంగిక దాడులకు పాల్పడడానికి కారణాన్ని తాత్త్వికంగా ఆలోచించిన కథలివి అని వొకటికి రెండుసార్లు చెప్పడం.

నేల నొప్పులు,  గయిర్నమెంటున్నాది జాకర్త! , అమరావతి అశ్రువొక్కటి , తెల్లారక ముందే …  కథలు చట్టబద్ధమైన భూ కబ్జాల గుట్టును రట్టు చేస్తాయి. చేను మేసే కంచెల్లా పాలకులే చట్ట బద్ధంగా  దోపిడీ దొంగలై రాత్రికి రాత్రి భూముల్ని కాజేస్తే  తెల్లారే సరికి బతుకులు తెల్లారి పోతున్న  వైనాన్ని కళ్ళ ముందు నిలిపి ‘పుట్టమట్టి చల్లినోడికి’ పుట్టగతులుండవని శాపిస్తాయి.

‘మై బాడీ మై ఛాయిస్’ నినాదంలోని బోలుతనాన్నియెత్తిచూపే ‘నో ఛాయిస్’ కథ స్త్రీ స్వేచ్చని పక్కదారి పట్టించే పేజ్ త్రీ ఫెమినిష్టులకు చెంపపెట్టు. ఫెమినిజం స్త్రీల శరీరం చుట్టూ అల్లిన మిత్ ని బద్దలుకొట్టిన మాట నిజమే కానీ ‘మల్టీ నేషనల్ కార్పోరేట్ డెవిల్’ ఆ స్త్రీ శరీరాన్ని అంగడి సరుకుగా మార్చిన వ్యాపార రాజకీయాన్ని బజరా యీ కథలో గొప్పగా ఆవిష్కరించాడు. ‘అందమైన అంగడి కొలతల జాకెట్టును బట్టి నా రొమ్ములనెవరో కత్తిరించి కుట్టేస్తున్నారు’  అన్న వొక్క వాక్యంలో స్త్రీలకు తమ  శరీరాలపై అధికారం లేదని మరోమాటకి తావు లేకుండా నిర్ద్వంద్వంగా నిర్ధారించి చెప్పాడు. కాలిగోలు నుండి తలమీది జుట్టు వరకు … వాళ్ళెవరో చెప్పిన రుచులకు …అభిరుచులకు అనుగుణంగా వంచి వంచించి తీర్చిదిద్దుకొనేటప్పుడు  ‘సాధికారిత’ తో పాటు  స్త్రీల సర్వస్వం వేరెవరి చెప్పు చేతల్లోనో వున్నప్పుడు నో చాయిస్సే గానీ సొంత చాయిస్సెక్కడ అని ప్రశ్నిస్తాడు. శరీరాన్నే కాదు ఆలోచనల్ని సైతం శాసించే శక్తుల పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తాడు.  పోరాడడమే స్వాతంత్ర్యం అనీ అది వొకరిస్తే పుచ్చుకోనేది కాదనీ  ‘పట్టపగలు స్వాతంత్ర్యం’  లో సూటిగా స్పష్టం చేస్తే  ,  ‘గంటి చాగంటి’ లో  దాన్నే వ్యంగ్యంగా హాస్యం జోడించి ఆవిష్కరించాడు. ‘కొన్ని ప్రేమ కథలు’ అసంఖ్యాకంగా పరువు హత్యలై ప్రతి రోజూ పలకరిస్తుంటే శవజాగారం చేస్తున్నాడు. నిలవ సామాజిక విలువల్లోంచి  స్త్రీల నైతికతని నిర్ధారించడాన్ని (పూ శిల , న్యాయం అన్యాయమే) తిరస్కరిస్తున్నాడు.              

ఒక విధంగా యథార్థ ఘటనల్ని కథలుగా కూర్చి మెప్పించడం కష్టమైన విద్యే. సంఘటనని వుద్వేగంగా చూసి కూడా తాటస్థ్యాన్ని పాటించడం , సంఘటన నుంచి విడదీసి  చూసినపుడు కూడా ప్రాసంగికత కోల్పోకుండా వుండేలా జాగ్రత్త వహించడం , సంఘటనకి కారణమైన భౌతిక – సామాజిక పరిస్థితుల వర్ణనకి పరిమితం కాకుండా రాజకీయ వ్యాఖ్యానం చేస్తూ కూడా లోతైన జీవన తాత్వికతని జోడించడం , ఒక నిర్దిష్ట సందర్భం నుంచి స్థలకాలాల్ని మాయం చేయడం అందుకు అవసరమైన ప్రాపంచిక దృక్పథం కలిగి వుండడం , దాన్ని ఆవిష్కరించడానికి అవసరమైన కళాత్మక విలువలు జోడించడం , సమకాలీనత నుంచి సార్వకాలీనతని వైయక్తికత నుంచి సార్వజనీనత సాధించడం , సంఘటనలకి కారణమయ్యే రాజకీయ ఆర్ధిక సామాజిక సాంస్కృతికాంశాలను విడివిడిగా గాక గతి తార్కికంగా పరస్పరం సంబంధంగలవాటిగా చూడాలని పాఠకుల్లో ఆలోచనలు పురిగొల్పి వారిని ఆచరణ వైపు నడిపించడం , అంతిమంగా రచయిత ఆశించిన  సాహిత్య  ప్రయోజనం  సాధించడం … రచయితకి నిప్పులమీద నడకే. అయితే దీన్నంతటినీ  వొక ప్రయత్నపూర్వకమైన క్రాఫ్ట్ లా కాకుండా అతి సహజంగా రూపొందించడంలోనే బమ్మిడి ప్రతిభ వ్యక్తమౌతుంది.    

ఈ ‘రణస్థలి’లో చోటుచేసుకొన్న  సంఘటనల్నే కాదు యే సంఘటననైనా నిర్దిష్ట  సామాజిక సందర్భం నుంచి వేరుచేసి చూడలేం. అవి  సమాజంలో చోటుచేసుకుంటున్న ఆలోచనా  వైఖరులకీ  మానసిక ధోరణులకీ నడవడికల పోకడలకీ ప్రతిఫలనాలు. శరీరంలో రోగగ్రస్తమైన భాగంలో వొక శకలాన్ని బయాప్సీ చేసి డాక్టర్ రోగ నిర్ధారణకు వచ్చినట్టు వొక  సంఘటనని సామాజిక సందర్భంలో భాగంగా అర్థం చేసుకోడానికి రచయితకి సరైన చూపు కావాలి. వాస్తవ ఘటనకి సాహిత్య రూపం యివ్వడానికి కళా నైపుణ్యం కావాలి. కారణం : కథ మెడికల్ రిపోర్ట్ కాదు. కేవలం సమాచారాన్ని అందించే వార్తా కథనం కాదు.  వొకానొక  భావజాలాన్ని అంటిపెట్టుకుని చేసే రాజకీయ వ్యాఖ్యానం కాదు. మనం జీవించే మొత్తం సమాజాన్ని అతి సూక్ష్మంగా చూయించే మంత్ర దర్పణం. ఆ దర్పణాన్ని అరచేత ధరించి లోకాన్ని చుట్టి వస్తున్నాడు  బమ్మిడి  జగదీశ్వర రావు.

చివరగా చెప్పాల్సిన అతి ముఖ్య విషయం –  యెన్ని వెతలు అనుభవించినా నిక్కపు కతలలోని ఆడవాళ్ళు యెవ్వరూ రాజీ పడలేదు. ‘ఊపిరి మీద యెక్కుపెట్టిన వుక్కు నిర్బంధం’లో సైతం బేలతనం చూపలేదు. కిందబడిన ప్రతిసారీ కొత్త శక్తితో పైకి లేచారు. అననుకూల పరిస్థితుల్ని యెదిరించి గుండె దిటవుతో నిలబడ్డారు. తరాలుగా ప్రచారమౌతోన్న తప్పుడు ఆలోచనల్లోని ప్రతి అంశాన్నీ ప్రశ్నించారు. సర్వత్రా – యింటా బయటా – నిత్యం నిరంతరం కొనసాగుతోన్న కనిపించీ కనిపించని హింసని స్వయంగా అనుభవించడం వల్ల దానిలోని క్రౌర్యాన్ని గ్రహించి వుక్కిరిబిక్కిరై ఆ వూపిరాడనితనం నుంచి బయట పడటానికి యేదో వొక రూపంలో తిరగబడ్డారు. మెడచుట్టూ గుదిబండల్లా తయారైన  పురుషాధిపత్య విలువల్లోని ద్వంద్వ వైఖరిని యెండగట్టారు. తమ గమనానికి ప్రతిబంధంగా వున్న భావజాల శృంఖలాల్ని తెంచుకున్నారు. అవమానాలు తట్టుకొని  ఆత్మ గౌరవంతో తల యెత్తి నిలిచారు. బొంద తవ్వి పూడ్చినా మట్టిపొరల్ని చీల్చుకొని నిజాల్ని నిర్భయంగా వెల్లడించారు. రాజ్య హింస రాకాసి కోరల నుంచి రక్షించుకోవడానికి అందుబాటులో వున్న  ప్రతి న్యాయబద్ధ మార్గాన్నీ ఆశ్రయించారు ; పోరాడడానికి అవసరమైన ఆయుధాల్ని సమకూర్చుకున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాల్ని నేర్చుకున్నారు. ‘యోనిలో గుదంలో రాళ్ళు దూర్చినా … ముఖం కాల్చేసినా … కనుగుడ్లు పీకేసినా … తమ ఆనవాళ్ళు చెరిపేసినా చరిత్ర చెక్కిలి మీద మరకగా మిగిలి వుండడానికి సిద్ధపడ్డారు.  పాశవికమైన అణచివేతల్ని అధిగమించి ఆత్మ స్థైర్యాన్ని ప్రదర్శించారు. సామాజికోద్యమాల్లో ముఖ్యంగా మహిళోద్యమాల్లో పనిచేసే వారందరికీ ముందువరసలో నిలబడి గొప్ప  స్ఫూర్తినిస్తున్నారు.

***

‘పాటల పదమవుదుమా?!’ కథలో వేటగాడు యెన్ని విధాలుగా హింసించినా పాట పాడే పిట్ట గొంతు విప్పుకొని పాడే హక్కు కోసం రాజ్యాంగాన్ని ముక్కుతో పొడుస్తూనే వుంటుంది. కానీ వేటగాడు రాజ్యాంగాన్ని ముడ్డి కింద వేసుక్కూర్చున్నాడు. పిట్ట యిప్పుడు పొడవాల్సింది వాడి ముడ్డినే.

‘రణస్థలి’ కతలు వెతలు  రూపంలో నాకీ యెరుకని  కలగజేసినందుకు ఆకాశమంత యెత్తు యెదిగిన నా మహా గట్టి మిత్రుడు బమ్మిడికి అభినందనలు చెప్పి భుజం తట్టే సాహసం చేయలేను కానీ ఈ నాలుగు మాటలు రాయడానికి అవకాశమిచ్చిన మాతృక సంపాదక వర్గానికి మరీ ముఖ్యంగా  సోదరి రమాసుందరికి మాత్రం నెనర్లు – మప్పిదాలు.

 

హైదరాబాద్ ,

మే 2017, రంజాన్ నెల తొలి రోజు.  ఎ . కె . ప్రభాకర్[pullquote_right][/pullquote_right]

You Might Also Like

3 Comments

  1. సత్యవతి కొండవీటి

    ప్రభాకర్ గారు
    పుస్తకం నెట్
    నమస్కారం….
    ఈ వ్యాసం భూమిక లో ప్రచురించవచ్చా?

    సత్యవతి కొండవీటి

  2. మల్లీశ్వరి

    రణస్థలిని అనేక కోణాలలో అర్థం చేసుకోవడానికి దోహద పడే విశ్లేషణ.

  3. Kalyani SJ

    సంఘటనని వుద్వేగంగా చూసి కూడా తాటస్థ్యాన్ని పాటించడం , సంఘటన నుంచి విడదీసి చూసినపుడు కూడా ప్రాసంగికత కోల్పోకుండా వుండేలా జాగ్రత్త వహించడం , సంఘటనకి కారణమైన భౌతిక – సామాజిక పరిస్థితుల వర్ణనకి పరిమితం కాకుండా రాజకీయ వ్యాఖ్యానం చేస్తూ కూడా లోతైన జీవన తాత్వికతని జోడించడం , ఒక నిర్దిష్ట సందర్భం నుంచి స్థలకాలాల్ని మాయం చేయడం అందుకు అవసరమైన ప్రాపంచిక దృక్పథం కలిగి వుండడం , దాన్ని ఆవిష్కరించడానికి అవసరమైన కళాత్మక విలువలు జోడించడం , సమకాలీనత నుంచి సార్వకాలీనతని వైయక్తికత నుంచి సార్వజనీనత సాధించడం ,….
    చాలా బాగా రాసేరు ప్రభాకర్ గారూ, బజారా గారి విశిష్టత ఏమిటో, ఆయన్ని అర్ధం చేసుకోడం ఎలాగో తెలియజేసేరు … తాంక్ యూ వెరీ మచ్ …

Leave a Reply