వెలుగు దారులలో… నంబూరి పరిపూర్ణ
వ్యాసకర్త – అక్కిరాజు భట్టిప్రోలు
“యశోధరా ఈ వగపెందుకే!
వారు బౌద్ధులు తాపసులు
చింతలంటవు వారిని
జరా మృత్యు భయాలుండవు
సరిగ్గా బోధివృక్షం కిందే జ్ఞానోదయం అవుతుందని
వారికి ముందే తెలుసు!”
ఓ పదేళ్ళక్రితం చదివిన జయప్రభ కవిత ఇది. ఈ కవిత మీద చాలా చర్చేజరిగిందప్పట్లో. ఇంకా ఆ కవితమీద ఏవన్నా సందేహాలుంటే పరిపూర్ణ గారి స్వీయ కథ “వెలుగుదారుల్లో” చదవాలి. అయితే, ఆ కవిత బోధపడుతుంది కానీ, సమాధానం దొరకని మరెన్నో ప్రశ్నల్ని కూడా మిగులుస్తుంది.
“నువ్వింక త్యాగాలు చేయకే!” అంటూ ఆ కవిత ముగుస్తుంది. అలాగే ఆ త్యాగాలని కట్టిపెట్టి తన జీవనాన్ని తన మార్గంలో నడిపించుకున్న ధీశాలిగా మనకి పరిపూర్ణగారు కనపడాతారు పైకి.
కానీ తనకి తాను “జరామృత్యు భయాలంటని బౌద్ధురాలో, తాపసో” కాదగికూడా కాలేకపోవడం ఏ త్యాగానికి తీసిపోతుంది?
అయినా అన్ని సందేహాలకీ సమాధానాలు ఇందులో ఉంటాయని భ్రమ పడడానికి ఇదేమీ అమాయకమైన కల్పిత కథో, సామాజిక సైధ్ధాంతిక గ్రంథమో కాదు కదా… జీవితం.
“కమ్యూనిష్టు గానీ, బ్రాహ్మడు గానీ, మరొకడు గానీ ఆడ వాళ్ళ విషయంలో పెద్ద తేడా లేదమ్మాయ్ ఆ రోజుల్లో.” ఈ వాక్యం నేను రాసిన “జంధ్యం” కథలోనిది. కమ్యూనిష్టుగా 80 ఏళ్లు బతికి, ఎంతో మంది గౌరవానికి పాత్రుడయిన మా నాన్న గురించి రాసిన కథ అది. నేటి నా ఆలోచనా ధోరణి ఈ దారిలో పడడానికి మొదటి కారణమయిన మా నాన్న గురించి, ఆయనకే అంకితమిచ్చిన కథలో నేనాయన మీద వేసిన విసురు అది.
నియోగి బ్రాహ్మణ కుటుంంబంలో, స్వతంత్ర్యం రావడానికి ముందు పుట్టి, కమ్యూనిష్టు భావాలకి దగ్గరయిన కృష్నా జిల్లా యువకుడు మానాన్న, భట్టిప్రోలు వెంకట సుబ్బారావు. కుటుంబ బాధ్యతలతో రాజకీయాలకి దూరమయి బడిపంతులుగా ఖమ్మం జిల్లాలో పనిచేసి, మొదట తన తమ్ముళ్ళనీ, తర్వాత మమ్మల్నీ పెంచి పెద్ద చేసి వెళ్ళిపోయాడు. ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా జరిగినా, ఉపాధ్యాయ ఉద్యమాలలో గానీ, తన స్థిర ప్రవృత్తిలో గానీ రాజీ పడని వ్యక్తిత్వం.
పరిపూర్ణగారి కథ చదువుతుంటే మా నాన్న కథకి సరిగ్గా ప్రతిబింబం లా అనిపించింది, కొద్దిగా కుడి ఎడమలు తారుమారుగా. జెండర్, కులం రెండింట్లో ఇద్దరూ చెరో వైపు. కానీ ఇద్దరూ ఎర్ర జెండా ని మనసంతా నింపుకున్న వాళ్ళు. ఇద్దరూ కుటుంబాల కోసం రాజీ పడి నెట్టుకొచ్చిన వాళ్ళే
ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ పోయిన మా నాన్న మాట్లాడుతున్నట్టే ఉంది. అవే సంఘటనలు… పార్టీ నిషేధించబడిన సందర్భం… స్వతంత్ర దేశంలో జైళ్ళలో మగ్గిన యువకులూ, వాళ్ళ నమ్మకాలూ, వెర్రీ, నిరాశలూ, కఠిన నిర్ణయాలూ. ఏది తప్పో ఏది కాదో తెలీని సంశయాలూ…
మా నాన్న లాంటి మధ్యతరగతి యువకులు, మగవాళ్ళు ఆప్రాంతం నించి కమ్యూనిష్టులుగా చాలా మందే వచ్చారనీ, కొందరు రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులయారని కూడా మనకి చరిత్ర తెలుస్తుంది. కానీ పరిపూర్ణగారిలా ఎంత మంది అమ్మాయిలు వచ్చారో నాకు తెలీదు.
మనకి తెలిసే విషయం ఎంటంటే, అప్పటి చదువుకున్న యువత కూడా మథన పడ్డది, ఏదారిలో వెళ్ళాలా అని. కానీ వాళ్ళ ముందున్న దార్లు ఎంతవరకూ కుటుంబం వైపు, ఎంత వరకూ సామాజిక బాధ్యత అని. కుటుంబం కోసం నమ్మిన దారిని వదులుకోవటం తప్పుగా (guilty) ఆలోచించిన తరం అది. తనని దాటి అలోచించలేని ఇప్పటి తరం ఆలోచనలతో ఆ తరం సందిగ్ధాలని అర్థం చేసుకోవటం కష్టం. వాళ్ళంతా పిచ్చివాళ్ళలా కనపడతారు.
అందుకే తండ్రి పట్టించుకోని పిల్లల్ని పెంచడంలో పడ్డ కష్టాలని చెప్తూనే, ఆ పిల్లల సాధించిన విజయాల పట్ల కించిత్ గర్వాన్ని తెలుపుతూనే, ఓ అంతస్వరం మనకి వినిపిస్తుంది పరిపూర్ణగారి మాటల్లో. పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేయలేకపోయాను అనేది ఈవిణ్ణి ఎక్కడో తొలుస్తూనే ఉంది అని అర్థ మవుతుంది, ఈవిడ వాచ్యంగా ఆ మాట చెప్పకపోయినా. (అదిగో, అదికూడా మా నాన్న సెంటిమెంటే.)
అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం, ఈవిడకి ఇప్పటికీ తొణకని నమ్మకం, కమ్యూనిష్ట్ సిద్ధాంతం మీదా, పార్టీమీద. ఆ పార్టీకారణంగానే ఈవిడ భర్త కుటుంబానికి దూరమయ్యాడు. కొన్ని చోట్ల పరిపూర్ణగారు సూటిగానే రాశారు. పార్టీ నెత్తికించుకుంటున్న నాయకుడి జీవితంలో ఉన్న చీకటికోణం వాళ్ళకి కనపడటం లేదా అని. అయినా కూడా, ఆ వైయక్తిమైన (personal) కష్టాలకీ, కొందరు వ్యక్తుల ప్రవర్తనకీ అతీతంగా ఆవిడ సైద్ధాంతిక నిబద్ధతని చాటుకున్నారు. అంత జరిగినా, పుస్తకావిష్కరణ సభలో తన విజయానికీ, పిల్లల్ని సంస్కారవంతులుగా తయారు చేయగలగడానికీ తనకున్న ఆ సైద్ధాంతిక నిబద్ధతే కారణమని చెప్పారావిడ. వ్యక్తులకోసం, వ్యక్తుల చుట్టూ నడుస్తున్న నేటి పార్టీలూ, రాజకీయాలు ఒకసారి ఆగి ఈవిడ మానసిక స్థితిని ఒక శాతమైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బావుణ్ణు.
నేడు దేశంలో ప్రబలు తున్న తిరోగమన వాదాలూ, వాటికి మద్దతు పలుకుతున్న చదువుకున్న యువతరాన్ని ఒకవైపు, ఎనభై ఏళ్ల పెద్దావిడ పరిచిన విశాల హృదయం ఒక వైపు చూస్తుంటే చెప్పలేని బాధ కలుగుతోంది. 1950ల్లోనే అంత దూరం ప్రయాణం చేసిన మన సామాజిక సంస్కారం ఎలా వెనక్కి తిరిగి ఇప్పుడింత వేగంగా పరిగెడుతోంది అనేది అర్థం కాని సంగతి.
పుస్తకంగా చూసినప్పుడు మరికొంత ఎడిటింగ్ అవసరమనిపిస్తుంది. కొంచెం ముందుకీ వెనక్కీ వెళుతూ ఉండింది. కొత్త తరం విషయాలు వచ్చాక డైరీలా అయినట్టుంది. బహుశా వాళ్ళంతా నాకు తెలియటం వల్ల అయ్యుండొచ్చు. ఇంకొన్నేళ్ళ తర్వాత, కొత్త వాళ్ళకి అవికూడా పుస్తకంలో ఇమిడిపోయినట్టు ఉండొచ్చు.
ఇప్పటికే ఇది చక్కటి చారిత్రక పుస్తకం. ఇంకొంచెం ఎడిటింగ్ తో ఇది మరో స్థాయికి వెళ్ళిఉండేంత విషయం ఈ పుస్తకంలో ఉంది.
నామటుకు నాకు చలసానిగారి “ఇలా మిగిలేం” తర్వాత తెలుగు వామపక్ష గమనాన్ని సాధికారికంగా వివరించిన పుస్తకం ఇదే.
వెలుగు దారులలో…
నంబూరి పరిపూర్ణ
Velugu Darulalo
Author: Namburi Paripurna
Publisher: Alambana Prachuranalu
Pages: 248
కె.కె. రామయ్య
కమ్యూనిష్ట్ సిద్ధాంతం మీదా ఇప్పటికీ తొణకని నమ్మకం ఉన్న నంబూరి పరిపూర్ణ గారి
‘ వెలుగు దారులలో’ పుస్తకం పరిచయం చేసిన అక్కిరాజు భట్టిప్రోలు గారికి కృతజ్ఞతలు.
పరిపూర్ణ వాళ్ళబ్బాయి దాసరి అమరేంద్ర మంచి రచయిత అని, ప్రముఖ రచయిత కొ.కు. నాయన అంటే అభిమానమని తలచుకుంటున్నా.
కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ ‘నిర్జన వారధి’ ని ( కినిగె కిరణ్ చావాని ) అడిగి మరీ తెప్పించుకుని చదివిన త్రిపుర గారికి ‘వెలుగు దారులలో’ పుస్తకం కూడా సమర్పించాలని అనిపిస్తోది అనిల్ గారు.
Anil అట్లూరి
అక్కి,
నీ “జంధ్యం” ఎప్పుడో చదివాను.
తనని దాటి అలోచించలేని ఇప్పటి తరం ఆలోచనలతో ఆ తరం సందిగ్ధాలని అర్థం చేసుకోవటం కష్టం. వాళ్ళంతా పిచ్చివాళ్ళలా కనపడతారు. నిజం.
నీ ఈ సమీక్ష మరో పార్శ్వాన్ని చూపింది.
‘నిర్జన వారధి’ చదివావా?