విశ్వనాథ చిన్న కథలు
విశ్వనాథ గారివి ఇదివరలో నవలలు కొన్ని, ఆత్మకథాత్మక వ్యాసాలు/ఇంటర్వ్యూలు చదివాను కానీ, కథలెప్పుడూ చదవలేదు – “జీవుని ఇష్టం”, “ఉరి” తప్ప. అనుకోకుండా ఈమధ్యనే చదివాను. వాటిని గురించి నాకు తోచిన నోట్సు ఇక్కడ రాసుకుంటున్నాను. అభిమానులకి, అనభిమానులకి: ఇది సమీక్షో, భావజాలం తాలూకా పరామర్శో కాదు.
ఈ పుస్తకంలో విశ్వనాథ 1923 నుండి 1960 మధ్య కాలంలో రాసిన 31 కథలు ఉన్నాయి. ప్రతి కథకీ వీలైనంత వరకూ ఎప్పుడు, ఎక్కడ ప్రచురణ అయిందో వివరాలు ఇచ్చారు. ఇదివరలో నవలలు, నవలికలూ చదివి విశ్వనాథ గురించి నేను ఏర్పరుచుకున్న అభిప్రాయం:
అ) కథాంశాలు చాలా విభిన్నంగా ఉంటాయి
ఆ) విపరీతంగా వర్ణనలు, కథ నుండి పక్కకెళ్ళి ఏవేవో చెప్పుకు రావడం ఉంటుంది
నేను ప్రధానంగా ఆ మొదటి అంశానికి ఇష్టపడ్డాను నేను చదివిన వాటిలో కొన్నింటిని. సాధారణంగా ఆయన అభిమానులకి తెగ నచ్చే ఆ రెండో అంశం నాకంతగా ఎక్కదు. ఐడియాలజీని వెదుక్కుంటూ కాక ఊరికే కాలక్షేపానికీ, అదీ కథలోని క్రియేటివిటీ కోసం ప్రధానంగా వాటిని చదవడం వల్ల కావొచ్చు (అలా చదవకూడదు, ఇలా చదవాలి అని చెప్పే హక్కు, అధికారం ఎవ్వరికీ లేదండి, మీరేమనుకున్నా కూడా. నేనేం క్లాసులో కూర్చుని లిటరరీ క్రిటిసిజం నేర్చుకోవడం లేదు). ఆ రెండో అంశం ని బట్టి నేను ఊహించుకున్నది ఈయన కథలు కూడా నవలల్లా ఉంటాయేమో అని. మొదటి అభిప్రాయం ఈ పుస్తకం చదివాక కూడా మారలేదు కానీ, కథల గురించి నా ఊహ తప్పు అనిపించింది.
కథలు నాకు వస్తు పరంగా, కథనం పరంగా కూడా వైవిధ్యంగా అనిపించాయి. “భావనా సిద్ధి” మొదటి కథ – భార్యా భర్తల మధ్య ఒక విషయం గురించిన కాంపిటీషన్ గురించి. మొదటిసారి చదివినప్పుడు ఏదో పర్వాలేదనిపించింది కానీ, రెండోసారి చదివినప్పుడు నచ్చింది. నా అనుభవంలో నేనెప్పుడూ ఇంత వెరైటీ కథ చదవలేదు. “తిరోధానము” కథ అయితే బెంగాలీ వాళ్ళు విశ్వనాథ ని పూని తెలుగులో రాయించినట్లు ఉంది. బహుశా ఆయన ఉద్దేశ్యం అదేనేమో. అయినా నచ్చింది నాకు.
“నీ రుణం తీర్చుకున్నా” కరుణ రసం ప్రధానంగా గుండెలు పిండే పద్ధతిలో సాగింది. సాధారణంగా ఇంత డ్రామా నేను చదవడం కష్టం కానీ, కథనం చదివించేలా ఉంది. “పరిపూర్తి”, “పుణ్య ప్రేమము” – భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాల నేఫథ్యంలో సాగిన కథలు.
“రాజు”, “పరిశోధకులు” కథల్లో చక్కటి హాస్యం, వ్యంగ్యం ఉన్నాయి. రెండూ నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా పరిశోధకులు కథ. “దొరగారూ-దివాన్జీ” కథ చివర్లోని “ట్విస్టు” నేను ఊహించలేదు కనుక నాకు చివరికి వచ్చేసరికి నవ్వొచ్చింది. “జూ” కథ కూడా వ్యంగ్యంతో సాగింది. కొంత అర్థమయ్యింది, కొంత కాలేదు. “తెలుగు సాహితీ సేవకులు” అని అనుకునేవాళ్ళు తప్పకుండా చదవాలి.
“యో ఁర్హిషీఖేయ్” ఒక ఆఫ్రికన్ కవి గురించి అద్భుత రసం తరహాలో సాగిన కథ. డయాన్థస్” గ్రీకు మైథాలజీ కథల తరహాలో సాగింది. నిజంగా అలా ఓ పాత్ర ఉందో లేదో నాకు తెలీదు కానీ, కథ మట్టుకు ఆసక్తికరంగా ఉంది.
“మాక్లీ దుర్గంలో కుక్క” కొంచెం సిద్ధాంతాలూ అవీ నేరుగా కథాంశంలో భాగంగా చర్చించిన కథ. ఆసక్తికరంగా ఉంది. మళ్ళీ మళ్ళీ చదువుకునే తరహా కథ. కొన్ని కథలు పొరలు పొరలుగా విప్పుకుని ప్రతీసారి ఒక different perspective చూపుతున్నట్లు అనిపించాయి నాకు. “మాక్లీ దుర్గంలో కుక్క”, “సప్తాశ్వము”, “అల్లా కే ఫకీర్”, “జీవుని ఇష్టము” అలాంటి కథలు.
“ఇంకొక విధము” కథ నాకంతగా నచ్చలేదు కానీ, ఆకాలంలోనే ఇద్దరు పురుషుల మధ్య ప్రేమాభిమానాలను వర్ణించిన కథలు బహుశా అరుదేమో. కనుక అందువల్ల ఈ కథా వస్తువు ఆసక్తికరమే.
మొత్తం కథల్లో నన్ను బాగా ఆకట్టుకున్నది “ముగ్గురు బిచ్చగాళ్ళు” కథ. అన్నింటిలోకి పెద్ద కథే కానీ, చివరిదాకా అదొక రకమైన ఉత్కంఠను నిలిపించి ఈ కథ నాలో. “ఉరి” కథ ఇదివరలో కూడా నాకు నచ్చింది – ఇప్పుడూ మారలేదు.. ఇన్ని కథల మధ్య కూడా అది నాకు నచ్చింది.
ఆట్టే అర్థం కాని కథలూ ఉన్నాయి నాకు. అసలేంటి ఈయన పాయింటు? అనుకున్న కథలు “జమీందారుని కొడుకు”, “విస్మృతి”, “రోథము”, “ఏమి సంబంధము”, “వెలుగు మెట్లు” వంటివి. వీటిలో చివరి రెండూ వీలైతే మళ్ళీ చదవాలి అనిపించింది.
ఇంకా కొన్ని ఇతర కథలు నాకు ఆసక్తికరంగా అనిపించినవి – “గోలీ మహల్”, “కపర్థి”, “శకుంతల నిధికి ఎవరు కర్తలు” – ప్రతికథ గురించి వివరంగా ఏమి రాస్తామని ఊరుకుంటున్నాను. మొత్తానికి కథలలో అయితే నవరసాలు పలికాయి. నిడివిలో చిన్నవే. ఒక్క పేజి కథలు కూడా ఉన్నాయి. నేను ప్రస్తుతానికి వస్తు వైవిధ్యాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నాను కనుక నాకు ఈ కథలు నచ్చాయి. సాధారణంగా కథలమీద ఆసక్తి ఉన్న తెలుగు చదువరులకి ఇవి చదవమనే చెబుతాను. ఇదివరలో ఈయన భాష కష్టం అనుకునేదాన్ని కానీ, ఈమధ్య ఆదిభట్ల వారి “నా ఎఱుక” చదివాక ఈయన భాష చాలా సులభంగా ఉన్నట్లు తోస్తోంది 🙂
కొన్ని లంకెలు:
- జీవుని ఇష్టం కథకు నిడదవోలు మాలతి గారి ఆంగ్లానువాదం తూలిక.నెట్ వెబ్సైటులో ఇక్కడ.
- విశ్వనాథ వారి కథల గురించిన వివరాలు, కొన్ని కథల పీడీఎఫ్ లు కథానిలయం వెబ్సైటులో ఇక్కడ.
- ఈ పుస్తకంపై నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.
- “ఉరి” కథలు గురించి వైదేహి శశిధర్ గారి వ్యాసం ఈమాటలో ఇక్కడ. “ఉరి” కథ విశ్వనాథ పావనిశాస్త్రి గారి గళంలో ఉన్న ఆడియో సాహిత్య అభిమాని బ్లాగులో చూడవచ్చు.
డా. వై. కామేశ్వరి
ఎందుకో కొంత మొహమాటంగా వ్రాసినట్లుగా ఉంది విశ్లేషణ . మనసువిప్పి వ్రాయలేదని అనిపిస్తోంది.
సౌమ్య
కామేశ్వరి గారూ, వ్యాఖ్య కి ధన్యవాదాలు. ఈ వ్యాసం రాసినది నేనే. మొహమాటం, మనసు విప్పి రాయడం – నేను అంత లోతుగా ఆలోచించి రాయనండి ఇలాంటి వ్యాసాలు. ఆ పుస్తకం చదివాక ఏమనిపిస్తుందో అది రాస్తాను అంతే. విస్తారంగా, విశ్లేషణలతో లేకపోవడం వల్ల అలా అనిపించింది ఏమో మీకు.
లక్ష్మీదేవి
ఆసక్తికరంగా ఉంది.