విశ్వనాథలోని ‘నేను’ – మూడవభాగం
రచయిత: పేరాల భరతశర్మ
టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి
మొదటి భాగం ఇక్కడ. రెండవ భాగం ఇక్కడ.
(తొలి ముద్రణ విశ్వనాథ శారద(ప్రథమ భాగము) అనే సంకలనంలో సెప్టెంబరు 1982న జరిగింది. ఇందులో ప్రస్తావించిన అన్ని విషయాలు వాటికవే అక్కడే తెలుసుకోదగినవి కానీ చివరి భాగంలో వచ్చే పావని గురించి సరైన వివరణ లేదు. పావని అంటే శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ద్వితీయ కుమారులు, వారి సమగ్ర సాహిత్యానికి సంపాదకత్వం వహించి, తానూ స్వయంగా నవలలు మొదలైనవి రచించినవారూ అయిన శ్రీ విశ్వనాథ పావనిశాస్త్రి. –సూరంపూడి పవన్ సంతోష్)
(ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పుస్తకం.నెట్.)
********************
‘‘ఆయన సామాన్య మానవుణ్ణి పట్టించుకోలేదు. పేదబ్రతుకులను గూర్చి వారి జీవితాన్ని గూర్చి వారి కష్టసుఖాలను గూర్చి వ్రాయడు ఏవో పుక్కిటి పురాణ గాధలను, మతవిషయాలను నవలలుగా అల్లుతాడు’’ అని ఏవేవో కులవిమర్శలు కువిమర్శలు చేసేవాళ్ళున్నారు. ఆయనకు జీవితముపైన ఎంత సమగ్ర దృష్టివున్నదో ఆ విమర్శకులకు తెలియదు. ఆయన వేయిపడగలు సరిగా చదివితే ఆయన జీవితం, జీవితంపైన ఆయన దృష్టి, ఆయన ఆశయాలు, ఆయన వ్యక్తిత్వం సంపూర్ణంగా తెలుస్తుంది. ‘‘మత మెప్పుడను వ్యక్తివిషయము. సంఘవిషయము కాదు. దుర్జనులు సంఘవిషయమని భ్రమింపజేసి స్వలాభపరాయణులగుచున్నారు’’ (వేయిపడగలు–చూ)
‘‘పేదవారి నెత్తురు త్రావి ధనవంతుడు ధనవంతుడు కావలె. ఎవని నెత్తురు త్రావి తాను బలిసెనో ఆ పేదవాని శిరసునే యెక్కి తాను సవారి చేయవలె మఱల, ఇదే చిత్రము’’ (వే ప చూ) ఇటువంటి భావాలను ప్రవచించిన మహానుభావుడు వ్రాసినది సామాన్యుని కథ కాదా!
ఆయన కృతజ్ఞతాలక్షణం గాఢమైనది. ఆయన గుంటూరులో ఉన్నప్పుడు తన అర్ధాంగి మరణించిన తరవాత తనపిల్లలను ముద్దుచేసిన వారికి తాను యావజ్జీవితమూ సాయంచేస్తూనే వున్నారు. ఒకనాడు ఒక బీదబ్రాహ్మణుడు ఆయనను చూడడానికి వచ్చాడు ‘‘సత్యనారాయణా! కులాసాగా వున్నావా?’’ అంటూ కుశలప్రశ్నలు ప్రారంభించాడు. ‘‘సరిగా గుర్తురావడంలేదు ఏమనుకోకండి’’ అన్నారు మాస్టారు. ఆయన తమ ఊరూపేరూ చెప్పారు. ‘‘ఓయ్! నీవటోయి! లక్ష్మీనారాయణ! అబ్బో ఎన్నాళ్ళనాటి మాట! 40, 50 ఏళ్ళయిందా మనం కలుసుకొని’’ అన్నారు. ‘‘ఇంకాపైనే’’ అన్నాడాయన ప్రేమగా చూస్తూ. ఇద్దరూ కాసేపు తమ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకున్నారు. ఆయన బావమరిది యింట్లో పెళ్ళికి వచ్చానని చెప్పి వెళ్ళివస్తానన్నాడు. ‘‘వెళ్ళీ వస్తావా….. ఉండు’’ అని మాస్టారు లోపలికి వెళ్ళి ఐదు నిమిషాలైన తర్వాత బయటకువచ్చారు. ‘‘లక్ష్మీనారాయణా! ఏమీ అనుకోకు, నీచేయి పట్టు ఇదిగో’’ అని చేతిలో నలభయ్యో ఏభయ్యో రూపాయలు పెట్టారు. ఈ బట్టలు తీసుకో అని రెండు దోవతుల చాపులు పెట్టారు. ‘‘నాకెందుకు సత్యనారాయణా! యివన్నీ’’ అన్నాడాయన. ‘‘నాకోసం’’ అన్నారీయన. ఆయన వెళ్ళిపోయిన తరువాత ‘‘ఏనాటి మిత్రుడు! ఎటువంటి కుటుంబం! ఇప్పుడు ఆ సంసారం బాగా చితికిపోయినట్లున్నది. అడగడు. ఇస్తే పుచ్చుకోనంటాడు. కాని అతనికి ఎంతో అవసరంలో వున్నాడు’’ అన్నారు. నాకాశ్చర్యమైంది.
జ్ఞానపీఠం బహుమానం వచ్చిన తరువాత ఆయన ఒకనాడు తమ తమ్ముళ్ళను వెంకటేశ్వర్లు గారినీ, రామమూర్తిగారినీ, నన్నూ ఇంకా ఒకరిద్దరుమిత్రులను వెంటబెట్టుకొని గుడివాడ తాలూక కపిలేశ్వరపురంకు టాక్సీలో తీసికొనివెళ్ళారు. అక్కడ ఆనాడు ఆయన దాదాపు ఆరువేల రూపాయలు ఇద్దరు ముగ్గురికిచ్చారు. వారు చిన్ననాడు తనను ఆదుకొన్న ఉదారులు. వారి పిల్లలకు బహుమానంగా ఆ పైకం యిస్తున్నామన్నారు.
నేను ఒకనాడు ధైర్యంచేసి ‘‘మాష్టారూ వేయిపడగలలో ధర్మారావు మీరేనంటారు. అది సత్యమేనా’’ అన్నాను. ఆయన నవ్వి ‘‘ధర్మారావు ఎవరోగాని కిరీటి ఫలానా, సూర్యపతి ఫలానా, కుమారస్వామి ఫలానా, రాఘవరావు ఫలానా అని అందరికీ తెలుసు వారికి కూడా తెలుసు’’ అన్నారు. (ధర్మారావు తండ్రి) రామేశ్వరశాస్త్రి గారికి కట్టుకొనుటకు ధోవతి యొక్కటియే యుండెను పైనుత్తరీయము కూడాలేదు. అంగవస్త్రము కలదు. అవి రెండే యాయనకుగల సర్వవస్త్రములు……శాస్త్రి పై యంగవస్త్రము ధరించి ధోవతి వానికిచ్చి యింటికి వచ్చెను’’ వేయిపడగలలోని ఈ శాస్త్రిగారు ‘‘దూసిన స్వర్ద్రువై మిగులు ధోవతినొక్కడు దాల్చిన’’ శోభనాద్రిగారే ధర్మారావు ఎవరని వేరే అడగాలా?’’ అని నేనన్నాను. మాష్టారు నవ్వి వూరుకున్నారు. తాను చిన్నప్పుడు చాలా చాయగా ఉండేవారని దబ్బపండువలె ఉండేవారని చెప్పారు. క్రమంగా ఆ చాయ అంతా మారింది. నా దస్తూరి ముత్యాల కోవలాగా ఉండేది, అది కూడా పెద్దయిన తర్వాత చెడిపోయింది అన్నారొకసారి. ‘‘సామాన్యముగా జీవితము మొదలిదినములలో కష్టపడినను జివరినాళ్ళలో భాగ్యమనుభవవించిన వారిదే మంచి జాతకము’’ అన్న లక్ష్యాన్ని ఆయన సాధించారు. ప్రాత దినములు పోవుచు క్రొత్త దినములు వచ్చుచున్న సంధివేళ పుట్టిపెరిగిన వాడాయన. ఆయన ‘‘ప్రతి దినము రాత్రులందు భోజనముచేసి తలవైపున బ్రక్కవద్ద దీపము పెట్టి చదవుట కారంభించును ఆ చదువుట చదువుట తెల్లవాఱి కోడికూయువరకట్లే చదువును ఈ రీతిగా (ఆయన) ఇంగ్లీషు నవలలు, (కావ్యములు) చదివెను. తెలుగు వానికన్న నవి చాల బాగున్నవని యూహించెను’’
‘‘వేయి పడగలతోనేల దాల్చిన వాడు రెండు పడగలతో దంపతుల పాలించువాడు. ఒక్కపడగ విప్పి పైరు పచ్చకు గొడుగుపట్టినవాడు. త్రిమూర్త్యాకృతి, శూలము నాలుకయందు, శంఖ చక్రములు ఫణాగ్రముల యందు దాల్చిన దేవుడు, ధర్మమయ తనువు, కరుణాతరంగితాంతరంగుడై తన్ను గూడ తన పితరులవలెనే సంప్రదాయమునకు దూరము గాకుండ కాపాడువాడు నాకు ప్రసన్నుడగునుగాక! నన్ను సర్వదా రక్షించుగాక!’’ ఈ ప్రార్థనకు లక్ష్యభూతుడైన సర్పాకృతియైన స్వామి ఆయనకు పిలిచిన పలికిన దైవమనుటలో నాకేమీ సందేహంలేదు. ఒకనాడు మధ్యాహ్నం ఒంటిగంట వేళ నేను వారియింటి వరండాలో కూర్చొని వుండగా కొబ్బరిచెట్టువైపుగా ఒక పెద్ద గోధుమవన్నె పాము బంగారపు తళతళతో బైట కనిపించింది. పావనీ పావనీ అని నేను భయపడుతూ పిలిచాను. అప్పుడు మాష్టారు నిద్రపోయేవేళ పావనికి నా మాట వినిపించలేదు. పాము మళ్ళా కనిపించలేదు. ఇలా అని చెప్తే మాష్టారు ‘‘అది మనలనేమీ చేయదు’’ అన్నారు నమస్కారముద్రతో, పావని ‘‘అదా అప్పుడప్పుడూ కనిపిస్తూనే వుంటుందిలే అన్నయ్యా’’ అన్నాడు.
ఆయన తన చిన్ననాటి కవితా వ్యవసాయాన్ని గూర్చి చెప్తూ ఒకసారి యిలా అన్నారు. ‘‘భరతశర్మా! నేను చిన్నప్పుడు పద్యాలు వ్రాసేవాణ్ణి. ఎన్నాళ్ళైనా వాటికి ఒకపాటు కుదరలేదు. మా నాయనగారికే నచ్చేవికాదు. పింగళి బాగా వ్రాసేవాడని మా నాయనగారు మెచ్చుకొనే వారు. నాకూ అవి బాగానే వుండేవి. నేను పట్టుబట్టి అభ్యాసం గాఢంగా చేశాను. ఒక్కొక్క దశలో నా కవితలో ఒక్కొక్కవైచిత్రి బైటపడుతూ వచ్చింది. అసలు నేనూ పింగళీ జంటకవులం కావలసింది. ఇద్దరం బందరులో రాత్రి ప్రొద్దుపోయే దాకా గుళ్ళచుట్టూ గుళ్ళల్లో కలిసితిరిగే వాళ్లం. ఒక కంచములో తిని ఒక మంచంలో పండుకొని పెరిగిన వాళ్ళం. అతనిలాగా మెత్తగా వ్రాసే పద్ధతి నాకు అలవడలేదు. అది నాకు కొఱతగానే వుండేది రాను, రాను నా కవితలో ఒక్కొక్క మెట్టులో ఒక్కొక్క విలక్షణత కనిపిస్తూవచ్చింది. నా గుండెలోనుండి వస్తున్న మాటల్లో ఒకకూర్పు వినూత్నంగా నాకు తోచింది. అప్పుడు నాకు తెలిసింది నా శైలి ఒకటివున్నది; అది సకల పూర్వాంధ్రకవుల కోవలోనిదే కాని వానికంటె యిది చాలా విలక్షణమైనది. ఇది యింకొక శైలితో లగించదు. కొన్నివేల పద్యాలు వ్రాసి, నాకు నచ్చక చింపిపారవేశాను. బహుశా అచ్చులో పడినన్ని చింపివేశానేమో. నాకొక పరినిష్ఠితమైన శైలి ఏర్పడిన తరవాత నాకు అంతంత మాత్రపు కవితలపై మోజుపోయింది. ఒక మహాకావ్యము వ్రాయాలి. అది నా జీవితానికి చరితార్థత. ఆ ప్రతిజ్ఞ భగవంతుడు చెల్లించినాడు’’ అని.
తాను ఒక మహాకవి అవుతానన్న గాఢమైన నిశ్చయం ఆయనకు ఆ శైలి ఏర్పడినపుడే కలిగింది. గిరి కుమారుని ప్రేమ గీతాలలో––
‘‘ఇది ప్రతిన బూనితిన ప్రవహింపజేతు
నీయడుగుదమ్ములందు ననేక నాక
వాహినులు వాని నీరముల్ ప్రాశనమ్ము
గాగ భావ్యాంధ్రదేశ సత్కవులకెల్ల
మధురహైమచ్ఛదాభిరామయును
మదవతీ రణన్నూపురం క్రేకృతి ప్రశస్తి
కూజితయునైన హంసిపై గూరుచుండి
భావి శారదామూర్తిని ప్రజ్జ్వలింతు
ఆ సరస్వతి నిన్ను జిహ్వాగ్రసీమఁ
దాండవించినట్టి విధాతృమూర్తి
నన్ను నా సృష్టినేమి యనంగగలరొ
మన శిశువులైన భావి సంపన్నకవులు,’’
ఎన్నడో 1920 ప్రాంతమున వ్రాసిన ఈ కావ్యఖండిక ఆయన సాహితీజీవితములో ఆయన నిర్వహించిన పాత్రకు అక్షరమైన సాక్ష్యంగా ఉన్నది.
ఆయన జపతపోనుష్ఠానాదులు ఆడంబరం లేనివి రోజుకు కనీసం ఒక్కొక్క మంత్రము మూడు వేలు చొప్పున మూడు మంత్రాలు జపించేవారు. ఆయన జపం పగలు తక్కువచేసేవారు. రాత్రి 8గం. మొదలు పూర్తిగా ఆ జపాలు పూర్తిచేసి వార్ధక్యంలో పడుకొనేవారు. చిన్నప్పుడు గ్రంధపఠనం చేసేవారు. రాత్రి ఏ రెండు గంటలకో పడుకోవడం, ప్రొద్దున కొంచెం ఆలస్యంగా నిద్రలేవటం. తరవాత వ్యాయామం. ఆసనాలు, శీర్షాసనం, ‘‘పొట్ట అక్కళించటం ఆడించడం’’ ఇవి రోజూ తప్పనిసరిగాచేసే వారు. మయూరాసనం, హలాసనం, సర్వాంగాసనం– ఇవి కూడ 75 ఏండ్ల వయసులో కూడా వేసేవారు. ప్రాణాయామంలో ఆయనదొక ప్రత్యేక ప్రక్రియ ఉండేది. ఆయన ఆచారం ఎక్కువ ఛాదస్తంగా పాటించేవారు కారు. కాని మనసంతా జపమయమే తపోనిష్ఠమే అందులోనాకు సందేహం లేదు. ఆయన చాలా లౌకికమైన వ్యావృత్తులలో జంజాటంలోపడి కొట్టుకులాడుతున్నట్లు కనిపించేవారు. కుమారుడు బజారునుండి ఆలస్యంగా వస్తుంటే పదిసార్లు గేటుదాకాపోయి తొంగిచూస్తూ నిలబడేవారు. నేను తమయింటికి వస్తానన్న వేళకు రాకపోతే అమాంతం పైన తువ్వాలు వేసికొని మాయింటి వైపు వస్తూండేవారు.
బజారుకు కలసివెళ్ళేవాళ్ళం. శుక్రవారం నాడు ఎప్పుడైనా ఏ కొట్లోనన్నా టెంకాయముక్క ప్రసాదం పెట్తే ఆయన ఆ కొబ్బరిముక్క వెంటనే నోట్లో వేసుకునేవారు కాదు. ఆ కొట్లోనో పక్క కొట్లోనో అంత ఉప్పుగల్లు తీసుకొనేవారు. కూరలమార్కెట్టుకు పోయేదాకా ఆ కొబ్బరి ముక్క ఉప్పుగల్లు చేతులోనే వుండేవి. పచ్చిమిరపకాయలు కనపడగానే ఈ కొబ్బరిముక్కకు ఉప్పుగల్లుకూ ఆయన రుచులు కల్పించేవారు. నోట్లో ఇంత లౌకికమైన రుచులు మరిగిన లక్షణం వారిలో కనిపిస్తూనే వుండేది. అదే క్షణాలలో ఆయన భగవద్విసయికమైన భావనతో ఒక యిరవైముప్ఫై పద్యాలు మనసులో వ్రాసేవారు. ఇంటికి రాగానే వాటిని కాగితంమీద పెట్టేవారు. ఆయన శరీరంతో లోపలవున్న జీవుడు అంటీ ముట్టకుండా వున్నాడా? అన్నదానికి సమాధానం ఆయన కల్పవృక్షము నిండా ఖండాంతములందున్నవి.
ఆయన ఎన్నో కష్ట సమయాలను, ఆపద్దశలను పోతనగారి భాగవతంలోని షష్ఠ స్కంధంలోని నారాయణకవచ పారాయణంతో పోగొట్టుకున్నామని చెప్పారు. నన్ను కూడా ఒకసారి చేసిచూడుమన్నారు. నా కుమారుడికి 108 డిగ్రీల జ్వరంలో ఆయన చెప్పిన ప్రకారంగా గురితో చేశాను. జ్వరం తగ్గింది. వాడికి ఎన్ని మందులిప్పించినా తగ్గని అనారోగ్యం ఆ ప్రక్రియతో పదిరోజుల్లో తగ్గింది. ఈ కాలంలో ఇది చెప్పడం చాలా అనాగరికంగా వుంటుంది. కాని జరిగింది చెప్పకుండా ఎలావుండను?
ఆయన మంచం చుట్టూ ఒక పరివేషం వున్నట్లువారికి చాలసార్లు కనిపించిందట. ఒకసారి ఆయనకు చాల భయం కలిగింది. ఆ భయం మంత్రప్రయోగాన్ని గూర్చి. అప్పుడాయన తన దగ్గర వున్న ఒక్క మంత్రాన్ని జపించారు. ఆయన మంచం కుడిప్రక్క ఎడమ ప్రక్కల వైపు కాళ్ళు తనాయించి ఒక మహాకాయుడు నిలిచి తన మంచం చుట్టూ తోకచుట్టుగా చుట్టి వున్నట్లు కనుగొన్నారుట.
ఎన్ని మంత్రాలున్నా, ఎన్ని మందులున్నా, జీవునకు కాలంచెల్లినప్పుడు వాని బహిరుపాధిని విడిచిపెట్టక తప్పదు. పూర్వపూర్వ కర్మానుబంధం చేత అన్ని వ్యాధులు అప్పుడే ముంచుకువస్తాయి. ఏమి వ్యాధి లేకుండా పోవచ్చు. వ్యాధినిమిత్తంగా పోవచ్చు.
ఒక మహాకవి జీవితమే ఒక మహాకావ్యము. ఆయనను తమ జీవితచరిత్ర వ్రాయుమని చాలమంది కోరారు. చాలకాలం ఆయన వ్రాయలేదు. చివరకు 1971లో కాబోలు మొదలుపెట్టి తమ బాల్యం అంతా చెప్పారు. అది 200 పేజీల చిన్నసైజు వ్రాతప్రతి అయింది. తరువాత ఆయన దాని ఊసుఎత్తుకోలేదు. ఒకనాడు నేను వారితో అన్నాను ‘‘మాస్టారూ మీ జీవితచరిత్ర ప్రారంభించారు. పూర్తిగా చెప్పండి వ్రాస్తాను’’ అన్నాను.
‘‘భలేవాడివి! నీకు కూడా ఈ పిచ్చి పట్టిందా? నా గ్రంథాలన్నీ చదివినవాడికి నా జీవితమంతా తెలుస్తుంది. ఇక నా పుట్టినతేదీ, చచ్చినతేదీ –మధ్యతేదీలలో నేను బ్రతకలేక చచ్చినవీ, చావలేక బ్రతికినవీ అయిన ఘట్టాలే కదా. చరిత్రగా వ్రాయాలంటే అలాంటి చరిత్ర వ్రాయమంటే నాకు తలకాయనొప్పి. ఆ పనీ నాచేత కొంత చేయించారు కదా!’’
‘‘నేను అనే వాణ్ణి ఈ శరీరం కాదు గదా! ఆ నమ్మకం నాకు గట్టిగా వుంది. నీకుందో లేదో నాకు తెలియదు. ఆ ‘‘నేను’’ అనేవాణ్ణి నా పుస్తకాల నిండానింపాను. నా శరీరం తీసికెళ్ళి తగలేస్తారు. నా పుస్తకాలను తగలేస్తే ఆ ‘‘నేను’’ అనేవాణ్ణి కూడా తగలేసినట్లుందని ఎవడైనా తృప్తి పడిత అది వాని కర్మ. నేను తగలేస్తే తగలబడేవాణ్ణి కాను. పాతిపెడితే పాతిపెట్టబడేవాణ్ణికాదు’’
ఆయన భారతదేశము యొక్క ఆత్మ, ఆయన త్రయీవిద్య కొక వ్యాఖ్యానము.
(సమాప్తం)
రావూరి ప్రసాద్
సర్,ఈ రచనలు పుస్తకరూపంలో ఇప్పుడు దొరుకుతాయా,దొరుకుతున్నట్లయితే ఎక్కడ లభ్యమవుతాయో తెలుపగలరు.