ప్రేమికుని ప్రవచనాలు – రొలా బార్త్
వ్యాసకర్త: రోహిత్
ఇప్పటికే పూర్ణిమ గారు ఈ పుస్తక పరిచయం చేశారు గనుక, నేను పునఃపరిచయం కాకుండా- ఈ రచన ద్వారా రచయిత-పాఠకుడి సంబంధాన్ని అన్వేషించటానికి ప్రయత్నిస్తాను
1
ఈ పుస్తకం ఎందరో రాసినప్పటికీ రోలాబార్త్ మాత్రమే రాశాడు.
అదెలాగంటే- బార్త్ వేరు వేరు సంధర్భాల్లో రాసి ఉంటాడు గనుక, ఒక్కొక్క సారీ ఒక్కొక్క ప్రేమికుని ఆత్మ చేత ఆవహింపబడి రాసి ఉంటాడు అనుకుంటాం- కాని ప్రతొక్క సారి రొలా బార్త్ అనే మౌలికమైన పదార్థం ఉండనే ఉంటుంది. మరి ఈ పుస్తకాన్ని రాస్తున్నంతసేపు మాత్రమే బార్త్ ప్రేమికుని వేదన పడుతుంటాడా? అప్పటికే బార్త్ సైతం ప్రేమలో ఉండి, తన ప్రేమను నిష్పాక్షికంగా పరిశీలిస్తున్నాడ? ప్రేమలో మునిగిన తన స్నేహితుణ్ణి చూసి వ్రాసివుంటాడా? ఇలాంటి ఒక్కొక్క ప్రశ్న తరుపునా ఒక్కొక్క ప్రేమికుడు రొలా బార్త్ రూపం లో అవతారమెత్తి – పుస్తకాన్ని లిఖించారు. అందుకే ఈ పుస్తకం రాసింది ఒక్క రచయితే అయినా- ఆ ఒక్క రచయితనే బహువచనం లో స్వీకరించాలి.
2
ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు పాఠకునికి ఒక ప్రశ్న రావాలి. ఈ పుస్తకం లో మాట్లాడుతున్నది ఎవరు అని. సామాన్యంగా రొలా బార్త్ మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు- కాని చదివే కొద్ది ఓ విషయం స్ఫష్టంగా తెలుస్తుంది- పాఠకునికి తనలో తాను మాట్లాడుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఈ పుస్తకం ఎలా రాయబడిందో దాని పరిమానం గురించి చెప్తూ- ‘(ఈ పుస్తకం చదవటం అనేది) మరొక ప్రేమికునికి
ఎదురుగా నిల్చుని ఒక ప్రేమికుడు తన ప్రణయం గురించి తనతో తాను సంభాషించినట్టు” (the site of someone speaking within himself, amorously, confronting the other (the loved object) , who does not speak) చదవాలి అని అంటాడు. ఇక్కడా పాఠకునికి రెండు అవకాశాలు ఉన్నయ్- ఒకటి: మొదటి ప్రేమికునిలా నిశ్శబ్ధంగా మొత్తం సంభాషన ను వినొచ్చు. రెండు: రెండవ ప్రేమికునిలా మొదటి నిశ్శబ్ధ ప్రేమికునితో సంభాషించవచ్చు. ఈ రకంగా ఈ పుస్తకం పాఠకునికి రెండు రకాల అనుభూతులను ప్రసాదిస్తుంది- ఆత్మానుభూతి మరియూ బాహ్యానుభూతి.
౩
ఈ పుస్తకం చదువుతున్నంత కాలం పాఠకుడు మూడు దశలు దాటవలసి ఉంటుంది.ఉదాహరణకి రోజంతా కాలేజీలో నలిగిపొయే ఓ కుర్రాడిని తీసుకుందాం. ఈ పుస్తకాన్ని మొదట కనుగున్నప్పుడు ఎంతో ఉత్సాహంతో చదవటం మొదలుపెడ్తాడు. తన ప్రేయసితో తనకున్న భంధాన్ని ఒకొక్క పొరగా ఒలుచుకుంటూ లోపలికి ప్రవేశిస్తున్న అనుభూతి పొందుతాడు. ఈ దశలో తనకు ఎన్నో జవాబులు దొరికినట్టు అనిపిస్తుంది. పుస్తకం సగము చదివే సమయానికి కొత్త ప్రశ్నలు రాజుకుంటాయి. ఈ స్థితిలో ఆ కుర్రాడు తన చిన్నప్పుడు తనలో దాగిపోయిన అమాయకత్వాన్ని కనుగొంటాడు. ఆ కుర్రతనపు ఆనందపు గర్భంలో నిగూఢంగా ఉన్న బాధని స్పృశించగలుగుతాడు. మూడవ ఆఖరి దశలో పుస్తకాన్నంతా చదివేసి- తనకుమాత్రమే తెలిసిన ఓ ఇంద్రియానుభూతిలో ఆవిరవుతుంటాడు. తన కోరికల నిర్మానాన్ని, తన ప్రేమ పరిణామాన్ని తడుముకుంటూ మదనపడుతుంటాడు. ప్రాణం చేసే సూక్ష్మాతిసూక్ష్మమైన చలనాల చేత భగ్నమవుతుంటాడు. ఎన్నో అనంత సంధ్యాసమయాలను దిగమింగి- కరుడుకట్టుకుపోయిన ప్రేమ అనే కోటలో ఒంటరిగా మిగిలిపోతాడు.
Leave a Reply