పుస్తకం
All about booksపుస్తకలోకం

November 30, 2015

విశ్వనాథలోని ‘నేను’ – రెండవభాగం

రచయిత: పేరాల భరతశర్మ
టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి

మొదటి భాగం ఇక్కడ.
(తొలి ముద్రణ విశ్వనాథ శారద(ప్రథమ భాగము) అనే సంకలనంలో సెప్టెంబరు 1982న జరిగింది. ఇందులో ప్రస్తావించిన అన్ని విషయాలు వాటికవే అక్కడే తెలుసుకోదగినవి కానీ చివరి భాగంలో వచ్చే పావని గురించి సరైన వివరణ లేదు. పావని అంటే శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ద్వితీయ కుమారులు, వారి సమగ్ర సాహిత్యానికి సంపాదకత్వం వహించి, తానూ స్వయంగా నవలలు మొదలైనవి రచించినవారూ అయిన శ్రీ విశ్వనాథ పావనిశాస్త్రి. –సూరంపూడి పవన్ సంతోష్)
(ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పుస్తకం.నెట్.)

********************

ఆయనకు తన గొప్పదనాన్ని గురించిగానీ, భాగ్యాన్ని గురించి గానీ ఏమాత్రం గర్వంలేదు. ఆయనకు జ్ఞానపీఠం బహుమానం వచ్చింది. రేడియోస్టేషనుకి కార్లోపోతున్నాము. అప్పుడు మాస్టారు –‘‘ఈ శరీరమే చిత్రమైనది. ఎన్ని బాధలు పడిందో అన్ని సుఖాలూ పడింది. ఈ శరీరంలో ఉన్న సత్యనారాయణ నాటికీ నేటికీ ఒక్కడే. కాని వీడిచుట్టూవున్న సంసారం మారిపోయింది. అప్పుడు నాతో బ్రతికిన భార్య యిప్పుడు లేదు. ఇప్పుడు నా యింట్లో ఎన్ని కూరలున్నా చుట్టం వస్తే మళ్ళా ఏ బంగాళాదుంపలో ఏవో తెప్పిస్తేగాని తృప్తిగావుండదు. అప్పట్లో నా కొంపకు చుట్టంవస్తే వానికి ఏమిమర్యాద చేయగలమా అని నాకు కొంచెం కష్టంగా వుండేది. భోజనం వేళ ఆగదుగదా ! ఆ వేళకు మాఆవిడ వచ్చిన చుట్టానికి, నాకు తిండి సృష్టించేది. ఇంట్లో ఆ పదార్థాలు ఎలా ఎక్కడనుండి ఊడిపడినాయో నాకు తెలియదు. షడ్రసోపేతంగా అమ్రుతాయమానమైన తిండి సృష్టించేది. సృష్టించడమే సుమా! కూర, పప్పు, పులుసు, పచ్చడి ఏమి కావాలో అన్నీ, ఎలా వచ్చినాయి యివన్నీ! నా బీదకాపురానికి అటువంటి సృష్టిచేయడానికి, ఆ మర్యాద దక్కించడానికి ఆ మహాయిల్లాలు పడిన శ్రమ తలచుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అదంతా ఎందుకండి! నేను 1956తో మేడ కట్టాను. అప్పటివరకూ పాకలో వున్నాను. అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే. కాని అప్పటి మా ఆవిడ పడినకష్టం వానకురిస్తే ఇంట్లో మోకాటిలోతు నీళ్ళు ఆ నీళ్ళు తోడేసి రాళ్ళు పేర్చి వాటిమీద యింత ఉడకేసి పెట్టాల్సివచ్చేది. అప్పటి విశ్వనాథ సత్యనారాయణకి యిప్పటి విశ్వనాథ సత్యనారాయణకి తేడా ఏమిటి? అదే శరీరం కారులో పోతుంది. రైలులో పోతుంది. కొన్ని యేండ్లుగా యిలా సుఖపడుతున్నది. లోపల ఉన్న జీవుడు ముందు స్థితి మరచిపోలేదు. మా తండ్రిగారుండగా నేను యువరాజును. పుట్టుభోగిని. తర్వాత కష్టదశ. ఈ కనపడే భోగం, మేడ అంతా ఆ జీవుడినంటుకోవడం లేదు. అందువల్ల వాడికి దుఃఖమేమిటో కష్టమేమిటో తెలిసినంత సుఖం గూర్చి తెలీదు. వానికి గర్వం ఎలావుంటుంది? (అంత కష్టదశలో ఆయన చేసిన గుప్తదానాలు అనేకములు. ఆయన సంపాదన అప్పుడు తక్కువకాదు. దాతృత్వం ఆపుకోలేని చేయి తన యిబ్బంది తాను పడుతూనేవుంది. ఆ దానాలతో సుఖపడినవారు చాలామంది వున్నారు) బ్రతికి వున్నాను కనుక యివన్నీ అనుభవిస్తున్నాను. ఆ భార్యలేదు. ఆమెకీ అనుభవంలేదు. ఇప్పుడింత మహాకవిని, అప్పుడూ మహాకవినే నన్ను మహాకవిని చేసినది ఆమె’’ ఈ మాటలాయన కళ్ళల్లో చెమ్మతో అన్న మాటలు. వరలక్ష్మీ త్రిశతిలో అన్నారు కదా!

 

‘‘వట్టి నీరసబుద్ధి నట్టినన్ను రసోత్థపథముల సత్కవీశ్వరుని జేసి

…….ఇతరు లెవ్వరు నెరుగని యీ రహస్య ఫణితి నను

నేలుకొనిన నా పట్టమహిషి’’

‘‘నా యఖిల ప్రశస్త కవనమ్మున కాయమ పట్టభద్రురా

లాయమ లేక యాధునికమైన మదున్నత చిత్తవృత్తి లేదు’’

అని చెప్పారు. శ్రీరామచంద్రమూర్తికి ముప్పై ఆరుఏండ్ల వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది. తనకుకూడా సరిగా అదే వయస్సులో ఆ భార్యావియోగమహాదు:ఖం సంప్రాప్తించింది. ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను రామకథను రసవంతం చేయలేడని భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడని వాపోయినాడాయన.

 

 

‘‘నీవఖిలోహమార్గముల నిండిన జానకివై రఘూద్వహుం

గా వెలయించి నావునను, గట్టిగ ముప్పదియాఱు వత్సరా

లీవల భూమి గర్భమున నెప్పుడు చొచ్చితివో మఱప్పుడే

నా వెలయింపు లూర్మిపృతనా రభసాతిక్రమణంబు లన్ జెడెన్’’

అన్నారు వరలక్ష్మీ త్రిశతిలో.

 

తనను భారతప్రభుత్వం ‘‘పద్మభూషణ’’ అన్న రోజున ఆయన ఏదో యాదృచ్ఛితంగా మా యింటికివచ్చి నాతో కూర్చున్నారు. ‘‘ఇదేమిటి! మాష్టారూ! జనమంతా మిమ్మల్ని అభినందించడానికి మీ యింటికి వస్తుంటే మీరిక్కడికి వచ్చి కూర్చున్నారేమిటి?’’ అన్నాను. ‘‘ఏమిటి నాయనా! నాలో మార్పు? నిన్నటికంటె యివ్వాళ నాలో పెరిగిన గొప్పయేమిటి?’’ అని ఆయన అంటుండగానే రేడియోవారి కారు ఆయన కోసం మా యింటి దగ్గరకు వచ్చింది. అప్పుడాయన యింటికిపోయి రేడియోవారికి, పత్రికలవారికి సందేశాలిచ్చారు. ఎందుకు చెప్తానంటే ఆయనకు మనుష్యులపై ప్రేమ, ఆదరము, ఆర్ద్రత యివి పట్టినంతగా యీ గొప్పతనాలపైన తన అంతస్థును అధికంగా భావించుకునే తత్వమే లేదు.

 

అంతటి మహాకవే కదా! ఎంతటి అల్పకవి అయినా సరే తనదగ్గరకు వినయంగా వస్తే ఎంతో ఆదరించేవారు. ఎందరో ఆయన దగ్గరకు వచ్చేవారు. వారు తనంత మేధావులు కారు. ప్రసిద్ధులు కారు. కవితారసికులు కూడా కాకపోవచ్చు. అతిసామాన్యులు కావచ్చు. వారిని చులకనచేసే వారు కాదు. కొందరు అంతంతమాత్రపు కవిత్వం వ్రాసేవారే పట్టరానంత గర్వంతో ఎదరవాడు తన కవిత్వాన్ని ఆస్వాదించగల సమర్థుడు కాడన్నట్లుగా ప్రవర్తిస్తారు.

 

వారికి అష్టావధానాల మీద అంత యిష్టంలేదు. నేను అష్టావధానం రాజమండ్రిలో 1961లో మొదలు పెట్టాను. 1965 వరకూ చాలాచోట్ల చేశాను. గురువుగారు ఆ వార్తలు వింటున్నారు, ఏమీ అనలేదు. విజయవాడలో ఒకనాడు వివేకానంద శతజయంతి మహోత్సవాలలో వివేకానంద విజ్ఞానమందిరం భవనంపైన అవధానం ఏర్పాటయింది. గురువుగారే అధ్యక్షులు వారి సమక్షంలో అవధానం చేయడం అదే మొదటిసారి. తనకు గిట్టకపోతే ఆయన శిష్యుడి అవధానాన్నైనా మెచ్చుకోరు. ఉపేక్షించి వూరుకోను గూడా వూరుకోరు. ‘‘ఎందుకొచ్చిన అవధానాలు’’ అని ఏవేవో అనేస్తారు. ఆ భయం నాకు బాగాపట్టుకుంది. గురువుగారు అధ్యక్ష స్థానమలంకరించారు. నిర్వాహకులు ఇంకా పృచ్ఛకులను వేదికపైకి పిలవాలి. ఈ లోపుగానే గురువుగారు సభనంతా కలయజూచి, ఏడెనిమిది మంది పండితులను పిలిచి, మీరు సమస్య యివ్వండి, మీరు దత్తపది, మీరు నిషేధాక్షరి…. ఇలా తలా ఒకటి ఒప్పచెప్పారు. ఈ నిర్వాహకులు పిలిచినవారూ కొందరందులో వున్నారు. కాని చాలామంది అక్కడికక్కడ గురువుగారి ఆదేశాన వచ్చిన వారే. నిర్వాహకులు తమ యిబ్బంది చెప్పారు. మేము పృచ్ఛకులను ఏర్పాటు చేశామండి, వారేమన్నా అనుకుంటారన్నారు. అలా ముందుగా ఏర్పాటు అనవసరం అలా చేయగూడదు వీరిని నేను పిలిచాను వీరేవుంటారన్నారు, ఆయన సమ్రాట్ సమ్రాట్టే నేను అవధానం ప్రారంభించాను. రెండువేలమంది జనం రోడ్డు మీద ఫుట్ పాత్ మీదకూడా కిటకిటలాడుతున్నారు. భగవంతుని దయవల్ల అవధానం చక్కగా సాగింది. మధ్యలో ఎన్నో చమత్కారాలు!

 

ఆయన ఏ గ్రంథం వ్రాసినా ఆశువుగా చెప్పగా మాబోటివారము వ్రాసిపెట్టేము. ఎన్ని గ్రంథాలు వ్రాసినా ఆయన నాలుగుతలుపులూ బిడాయించుకుని ఏ మారుమూలగదిలోనో తననెవరూ పలకరించకుండా ఉండే చోట కూర్చొని వ్రాసినవికావు. పంచలో కూర్చుండేవారు. వ్రాయడానికి నేనో ఇంకెవరో ఉంటాము. కూరలమ్మేవాళ్ళువస్తారు. పనివాళ్ళువస్తారు. ప్రెస్సునుండి ప్రూఫులువస్తుంటాయి. ఎవరో పండితులో కవులో చూచిపోడానికి వస్తూనేవుంటారు. ఎవరెవరో ఎందరెందరో. ఆయన ఏదో గ్రంథం వ్రాసుకుంటున్నారు మనం పలకరించడ మెందుకని వారనుకోరు. వారనుకున్నా యీయన వూరుకొనేవారు కాదు. కూరలమ్మేవాణ్ణి కూడా చమత్కారంగా పలకరిస్తూ కూరలు కొంటారు. చెప్పుకు పోతున్న నవలో, నాటకమో, వ్యాసమో ఆ క్షణాల్లో ఆపుతారు. మళ్ళావచ్చి వెనక ఏమిచెప్పిందీ చదవమనకుండా క్రొత్త వాక్యం మొదలుపెడతారు. అక్కడ సందర్భానికి సరిగా అదే వాక్యం చెప్పాలి. అలాగే చెప్తారు. విషయసూత్రం తెగదు. ఎన్నిసార్లు ఆపినా సరే ఆయన వ్యగ్రతకు భంగం రాలేదు. ఆనాడు చెప్పదలచిన భాగమంతా చెప్పేసేవారు.

 

ఈ బాహ్య విషయాలమీద ఆయన ఎంతో ఆసక్తితో కన్పించేవారు. లోపల గ్రంథం గూర్చిన ఆలోచన అది అలాగేవుండేది కాబోలు! గ్రంథం దగ్గరకు వస్తే ఆ ధారణ చూచి ఆశ్చర్యపోయేవాణ్ణి. ఆయన శరీరం నేలమీద ఒక మోటారు. ఆయన మనస్సు ఆకాశంలోని ఒక విమానం.

 

 

‘‘ ఈ జనసమూహమునయందు నేశరీర

మాత్రముగ పోవుచుంటి నామానసంబు

నమిత తృష్టాతలనం బంతకంత భూమి

మీదినుండి స్వర్గానికి మెట్లుకట్టు’’

అని ఆయన గిరికుమారుని ప్రేమగీతాల్లో అన్నారు.

‘‘ఏదొ నన్ను వెంటాడెడు నెందుకొఱకొ

అగునొ జన్మాంతరమ్ములయందు జేసి

నట్టి సంస్కారలేశము ప్రాణములకు

వేచుకొని యున్న యాశయేమో చివరకు’’ అని కూడా అనుకొన్నారు.

 

కిన్నెరసాని వాగును భద్రాచలం అడవులలో చూచినప్పుడు ఆయన మనస్సు ఆ వాగుతో సంవదించింది. చుట్టూపులులూ పుట్రలూ ఏమీ పట్టలా, పాములు ప్రక్కగా పోయినాయి ఆయనకు పట్టలేదు. ఆ వాగు వలెనే తన భావప్రవాహం సాగిపోయింది. కులపాలికా ప్రణయపూతమైన తన హృదయంలో పడిన ఆ వాగు పవిత్రచారిత్రయైంది. ‘‘కిన్నెరసాని’’ అందమైన పేరు. కాని ఒక దొరసాని గారికి ఆ పేరు చాలా వికటంగా తోచిందట. గురువు గారే చెప్పారు ఈ విషయం ‘‘నేను కిన్నెరసాని పాటలు వ్రాసేనాటికే గొప్పకవినని అభిమానించిన శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారు నాకు సహాయం చేయించాలని కొందరు సంస్థానాధీశుల వద్దకు తీసుకొనిపోయారు. ఆ రోజుల్లో నైజాం యిలాకా జమీందారులకు సివిల్ క్రిమినల్ అధికారాలుండేవి. సరే! అందరిసంగతీ అలావుంచుదాం ఒక సంస్థానాధీశుని యింటికి తీసుకువెళ్ళారు. ఆ జమిందారు చనిపోయి కొద్దికాలమైంది. ఆయనగారి రాణివుంది. పరదా చాటున ఆమె ఇవతలనేను. నన్ను ఆమెకు పరిచయం చేశారు. ఆమె విజ్ఞురాలని నాకు చెప్పారు. ఆమె పరదా చాటునుండి ‘‘కవిగారూ! మీరు సంప్రదాయబద్ధంగా వ్రాస్తారన్నారు. కాని సానిపాటలు వ్రాశారేమిటి?’’ అన్నది. నేను ఎంత పొగరుబోతునైనా వినయం తక్కువైనవాణ్ణి కాదుగదా! ‘‘అమ్మా! ‘కిన్నెరసాని’ అన్నది ఒక వాగు పేరు కదా! దానిపేరుతో దాని గురించి వ్రాయడంలో తప్పేమిటి’’ అన్నాను. ఆమె ఊరుకోవచ్చు! ‘‘అబ్బే! ఏమైనా సానిసానే’’ అన్నది. పరదాలోపల పెదవి విరుచుకొని వుంటుంది. నేను వెంటనే ‘‘అలాగా అమ్మా! ఇందాకటి నుండి తమను తమ పరిచారకులు దొరసానిగారు దొరసానిగారు అంటే ఏమో అనుకున్నాను. ఇక సెలవు. వస్తాను’’ అని చరచరా బైటికి వచ్చేశాను. అక్కడనేవున్న శ్రీ రెడ్డిగారు, మరొక దేశ్ ముఖ్ గడగడలాడి పోతూ ఆమెకేమో చెప్పుకొని బయటకు వచ్చారు. ‘‘ఇవ్వాళ ఎంతపని చేశావయ్యా! ఆమె నిన్ను అరెస్టు చేయవచ్చు. ఏమైనా చేయవచ్చు. నీపని ఏమయ్యేది! మా పని ఏమయ్యేది’’ అన్నారుట. ‘‘ఏమయ్యేది! చంపుతుందా! అదేనయం. యథార్థం చెప్పడానికి భయపడడం కన్నా అది నయం కదూ! శబ్దానికి అర్థం తెలియని ప్రతివాడూ విమర్థకుడైతే చచ్చిన చావుకదండీ! తమ బ్రతుకే తమకు తెలియనివాళ్ళు కవుల తప్పులెన్నే వాళ్ళా? ఆమె మహాపతివ్రత. కాని తెలుగు పలుకులలో ఆమె దొరసాని. సందర్భం నుండి పదాలను విడగొట్టి కవుల తప్పులెన్నే వాళ్ళనిచూస్తే నాకు ఒళ్ళుమంట’’ అన్నాను. అప్పుడు రెడ్డిగారు నవ్వుతూ కారులో కూర్చొని అన్నారు ‘‘ఏమైతే ఏం ఇవాళ నూటపదహార్లు పోగొట్టుకున్నారు’’ అని. నా అభిమానం పోగొట్టుకోలేదు. అదే నాకు పదివేలు అన్నానునేను. అప్పుడు నాకుద్యోగం లేదు. ఇల్లు గడవడం చాలా కటకటగావుంది. నా అభిమానం నన్ను ఎవరికీ తలవంచనీయదు. నన్ను పొగరుబోతు అంటారు గిట్టనివాళ్ళు. అననీయవోయ్ నా జన్మే అంత.

 

 

‘‘నేనచ్చముగా పాఱుడ

గాను సుమీ! క్షత్రరక్త కాండమ్ములు నా

మైనరములఁ బ్రవహించున్

శ్రీనిభృతమనోజ్ఞహాస చిత్రితవదనా!’’

నా రామాయణంలో ఆ మాటలు పరశురాముడు శ్రీరామునితో అన్నట్లు వ్రాశాను. నేనే ఆ ప్రభువుకు అలా మొరపెట్టుకున్నాను. ఆయన నవ్వాడు. నా తీవ్రతకు ఆయనకు నవ్వు వచ్చివుంటుందిఅన్నారు. నేనన్నాను ‘‘కాదు మాష్టారూ క్షత్రియుడై తన కథను సమానధర్ముడైన ఋషి చెప్తున్నాడని సంతోషించాడేమోనండి’’ అని. ఆయన నావైపు చిత్రంగా చూశారు.

 

‘‘నా కవిత్వం అంతా నా జీవతంలోని అనుభవాలమయం లోకవ్యక్తిని కావ్యవ్యక్తి నయ్యాను. దశరథుణ్ణి గూర్చి బంధుజ్యేష్ఠుడన్నాను, వేయిపడగలలో ‘‘రామేశ్వరశాస్త్రి బంధుజ్యేష్ఠుడు’’ అన్నాను. ఎవరీ బంధుజ్యేష్ఠుడు? మా నాయనగారు. నీ చుట్టూవున్న లోకంలో నీకుచెందని భావం ఏముంటుంది? నీవు పొందని అనుభవం ఏముంటుంది? ఈ భావాలు, ఈ అనుభవాలు నీ మనస్సుపై వేసిన ముద్రలలో నుండే నీ మాటలు దొర్లుకొనివస్తాయి. నీవు కవివయితే ఆ శబ్దము వ్యంజకమై కావ్యత్వాన్ని పొందుతుంది. కవివయితే నంటే ఏమిటి? కవియైనవాడు లోకాన్ని చూచే దృష్టివేరు వానికి కనిపించే లోకము అందరు చేచే లోకమే

‘‘పలుచని బురదలోపల మానిసినిఁ జూచి

నెగచి యాఁకున దూకె నీటిపాము

వెలివడ్డ బొరియముంగలనిక్కి తెల్లఁబో

యెను కొంగ కెఱగాని యెండ్రకాయ

ఒడ్డున బురదలో గొడ్డు గిట్టలు దిగి

పడె జంఘదఘ్నమై పంటకాల్వ

జనుము చల్లుటకు తీసిన పాయ పాపట

చక్కఁదీరిచి దిద్దె సస్యలక్ష్మి

పలుచగా వేడియెక్కుఁ బవళ్ళతోడఁ

బైరగాలి పొరల్ తడియారఁజొచ్చె

పగటి కుషను నా నొప్పె నవార్షుకములు

కాఱులకుఁ దొల్తగా శరత్కాల లక్ష్మి’’

తెలుగు ఋతువులలో ఈ పద్యం వ్రాశాను నేను. మా పల్లెలో చిన్ననాడుచూచిన దృశ్యాలు చెప్పాను. ఆ దృశ్యాలు ఎవరూ చూడలేదా? చూసేవుంటారు కాని చెప్పలేదు. శక్తిలేక చెప్పకపోవచ్చు లేక ఆ దృష్టి లేక చెప్పకపోవచ్చు. కనుక ఎవడు కవి? ఆ శక్తి, ఆ దృష్టి ఉన్నవాడు.

 

‘‘ఉరుదరీకుహర సుప్తోత్థ శార్దూలముల్

ఝరవారి శోణిక శంకద్రావ

వనకుంజమధ్య శాద్వల చరన్మృగపంక్తి

దావపావక భీతిఁ దల్లడిల్ల’’ ఇత్యాది మనుచరిత్రలోని పద్యముంది కదా అది కవి చూచిన దృశ్యమా? అన్న ప్రశ్న రావచ్చు. కవి చూడనక్కరలేదు. ఉత్ప్రేక్షించాడు. అప్పుడు మాత్రం ఏంచేస్తున్నాడు? పులులలో, లేళ్ళలో ఉన్న సహజమైన ప్రవృత్తిని ఎన్ని చెప్తున్నాడు. నేను వట్టి స్వభావోక్తి చెప్పాను. అచ్చమైన తెలుగులో చెప్పాను. నీవు వ్రాసినవన్నీ నీవు చూచినవేనా? చెప్పాను గదా! కవియైన వాడు లోకాన్ని చూస్తాడంటే అన్నం అంతా పట్టి చూడనక్కరలేదు.

 

నా రామాయణంలో అరణ్యకాండ వుంది. అక్కడ అడవిలోని ఎన్ని చమత్కారాలు చూపించాను?

‘‘ఉద్భవచ్ఛృంగమౌ యువకురంగము దడి

పొడిచి లోనికిఁజూచి పోవుచుండ

నిస్తబ్ధమౌగాలి నిల్చినిల్చి తరంగ

భృతిఁజెట్లపై ముర్మురించుచుండ

అపుడప్డు రోమంధమాపి పరున్న ఆ

శ్రమగవి నిట్టూర్పు జార్చుచుండ

నడికిరే ఘూక స్వనము సింగర్జయు

వదలి వేర్సవ్వడి మెదలకుండ

ధరణి సంతానమునకు నిద్రామనస్సు

స్వామి జాగ్రత్తపడి పతిపైని జేయి

చాచి మాటికిమాటికిఁ జూచుచుండ

బ్రభుసుఖాపాదిని గతించె రాత్రియెల్ల

అడవిలో సీతారాములు గడపిన మొదటిరాత్రిని గురించి చెప్పాను. నేను ఈ పద్యం వ్రాయాలంటే అడవిలో కాపురముండనక్కరలేదు. ప్రకృతిలోని ఆయా వేళల ఆయాతావుల స్థితిని భావించగల మనస్సొకటి ఉండాలి. అది నాలో నిత్యజాగ్రదవస్థలో వుంటుంది. నేను రైలులో వెళ్ళినా కారులో వస్తున్నా ఎప్పుడు ఆ మనస్సు ఈ భావనతోనే నాచుట్టూ చూస్తూవుంటుంది. దీనికితోడు నేను అడవిని గూర్చి సవాలక్ష గ్రంథాలు చదివాను. అడవిలో తెగ తిరిగాను. వేటను గూర్చిన గ్రంథాలెన్నో తిరగేశాను. Jim cobet, Henderson Singh –ఇలాంటి వాళ్ళ గ్రంథాలన్నీ చదివాను. ఇవన్నీ నాకేమి ఒరిగించినాయి. వాటిలోని విషయాలు నామనసులో పడినతరువాత వాటికి కలిగే సంస్కారం వేరు. అవి నా అనుభవ విషయాలవుతాయి. ఏనాడో ఎక్కడో నేను అలా అడవిలో రాత్రిళ్ళు గడపివున్నాననే అనిపిస్తుంది. నా (పాడు) మనస్సుకి విశ్రాంతి ఏది? ఎప్పుడూ ఇలా ఏదో భావించనిది దానికి తోచదాయె. దాంతో నాకు విశ్రాంతి అన్నమాటలేదు. కాసేపు ఆ మనసును పట్టించుకోకుండా వుందామని చీట్లపేక ఆడుతూ కూర్చుంటా. అప్పుడూ ఆగదు. ఈమనస్సు నేను ఎన్ని రాత్రులు నిద్రలేకుండా ఆకాశంవైపు చూస్తూ గడిపానో. మనకు తిథులున్నాయి కదా. ప్రతి తిథిలోనూ చంద్రుడెప్పుడు ఉదయిస్తాడు? ఎప్పుడస్తమిస్తాడు? ఏదిశ నిండి వెన్నెలలు ఎలా పడతాయి? చీకట్లు ఎలాక్రమ్ముతాయి ఇవి చూడకుండా వ్రాసినవి కావు. నా నవలల్లో చూడు నెలకు సరిపడ రాత్రులన్నిటి స్వభావం తెలుస్తుంది. నా రామాయణం ‘‘నా సకలోహ వైభవసనాధ’’ మని వట్టి గప్పాలు చెప్పుకోలేదు నాయనా వాడికి మనస్సనేదే వుంటే, చదవడమనేది తెలిస్తే నా రామాయణం చదివినవాడు లోకాన్ని నేను ఎంత నిశితంగా అనుశీలించానో తెలుసుకుంటాడు. కాలంలోని ప్రతిలిప్తను నేను చూచాను. దేశంలోని ప్రత్యంగుళం నేను కొలిచాను. ఇలా ఉపన్యాసాల్లో చెప్తే వీనికి అహంకారం అనుకుంటారు. కాదు నాయనా నా గ్రంధాలు చదవండి, నేను ఏమి చెప్పానో చూడండి అంటాను. నాపుస్తకాలు చదవకుండా విమర్శించేవారే నాకు ఎక్కువైనారు. నేనేం చేసేది’’ ఇలా గురువుగారు అప్పుడప్పుడు తన ఊహ పద్ధతిని, తన రచనావైలక్షణ్యాన్ని మాటవరసకు చెప్తూవుండేవారు.

 

ఆయన యేమో చెప్పారని కాదు. ప్రత్యక్షంగా కొన్ని విషయాలు నేను చూచాను. ఒకసారి మేము ఇల్లెందులో ఒక సభకువెళ్ళి తిరిగివస్తున్నాము. టాక్సీలో ఇల్లెందు నుండి కంభంమెట్టుకు వచ్చే రోడ్డు రెండు ప్రక్కలా ఎడారిలాగవుండి, అంతా కొండలూ గుట్టలూ అక్కడక్కడా చిన్నచిన్నచెట్లు, ఒక కొండమీద రెండు చెట్లు చూపించారాయన. ఆ రెండు చెట్లు నర్తకీనర్తకుల జంటలాగా కనిపించాయి. టాక్సీ రెండుమైళ్ళదూరం పరుగెత్తినదాకా ఆ దృశ్యం అలాగే కనిపించింది. ఇంతలో టాక్సీ ఆ కొండ ప్రక్కకువచ్చేసరికి, ఆ కొండమీద ఒక్కచెట్టేవుంది. దూరానికి ఈ రెండు చెట్లూ ఒకే జంటగా, అందులో నర్తకీనర్తకులుగా కనిపించాయి. రామాయణంలో యిలాంటివి కొన్ని విచిత్రాలు వ్రాశామన్నారు.

‘‘ఎదురుగా నేగుచోనెదలపై హారనాయకరత్నముల కంశులప్పువెట్టి

యెడమకు దిరుగుచునేగుచో గుడిబుజమ్ముల నంగదచ్ఛవుల్ గిలకరించి

కుడివైపుతిరిగి యేగుటయందు వామాక్షి లాలితాపాంగమాలలనుగదిపి

యాగ్నేయమీశాన్యమై యేగ ముప్పాతికమొగంబు వెలినీడగామలంగి

సాగిప్రొదెక్కినకొలంది చండకరుడుదారిమలకలుతిరిగిన దశరథేశు

సైన్యములయందుఁగాంతి ప్రసారచిత్రవల్గు గమనంబులన్ వళావళులు జేసె’’

ఇలా చూపాలంటే ఎన్నో వున్నాయి.

‘‘రాతిరై మరల భార్యాభర్తలకు గలసికొనువేళయయి యింటితో చివరకు సర్దుచున్న పాత్ర సామగ్రి మ్రోతలే మన్మధుని జ్యాటంకారమువలె ధ్వనించెను’’ అంటారు. ఇవి ఆయన అనుభవాలకు ప్రతిధ్వనులన్నారు.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

విశ్వనాథునకు వివిధ కవి నాథుల పద్య నివాళి

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు, ఇందు కిరణ్ కొండూరు ****************** ముందు మాట ఈ నెల (అక్టోబ...
by అతిథి
0

 
 

విశ్వనాథ చిన్న కథలు

విశ్వనాథ గారివి ఇదివరలో నవలలు కొన్ని, ఆత్మకథాత్మక వ్యాసాలు/ఇంటర్వ్యూలు చదివాను కాన...
by సౌమ్య
1

 
 

తెలుగు సాహిత్యంలో బలమైన స్త్రీ పాత్రలు-మొదటి భాగం:విశ్వనాథ నాయికలు

వ్యాసకర్త: సూరంపూడి మీనాగాయత్రి ***************** ఏ సాహితీ ప్రక్రియలోనైనా కథ, కథనంతో పాటు బలమైన...
by అతిథి
2

 

 

తెఱచిరాజు – ఒక పరిశీలనా ప్రయత్నము

వ్యాసకర్త: శ్రీకాంత్ గడ్డిపాటి (విశ్వనాథ గారి తెఱచిరాజు నవలపై బెంగుళూరులో జరిగిన సా...
by అతిథి
7

 
 

స్వర్గానికి నిచ్చెనలు – అస్తి నాస్తి ల గంభీర చర్చ

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************ భారతీయ భాషల్లో ఆలోచనాత్మకమైన రచనలకు ఏ క...
by అతిథి
0

 
 

విశ్వనాథలోని ‘నేను’ – మూడవభాగం

రచయిత: పేరాల భరతశర్మ టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి మొదటి భాగం ఇక్కడ. రెండ...
by అతిథి
1