ఊరువాడ బ్రతుకు – దేవులపల్లి కృష్ణమూర్తి
ఈ పుస్తకం దేవులపల్లి కృష్ణమూర్తి ఆత్మకథ. తెలంగాణ లోని ఒక పల్లెటూరిలో ఆయన బాల్యం గురించి, స్కూలు ఫైనలు పరీక్ష రాసుకుని 18ఏళ్ళైనా నిండకుండానే పెళ్ళి చేసుకునేవరకు కథ సాగుతుంది. తెలంగాణ మాండలికంలో, ఒక అరవై ఏళ్ళ క్రితం నాటి సాలె కులస్థుల జీవన విధానం, వారి పద సంపద, వాళ్ళు పాడుకునే మాటలు, అనుకునే మాటలు – ఈ పుస్తకం నిండా ఉన్నాయి. నిజానికి అవే ఈ పుస్తకం నా అభిప్రాయంలో.
పుస్తకాన్ని 2012లో చూసినపుడు – “ఎవరో ఈయన.. నవల కాబోలు” అనుకున్నాను. తరువాత పుస్తకం గురించి వివరాలతో ఒక compelling pitch విని కొనేశాను. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా ఇల్లు గుర్తొస్తే ఆ పుస్తకం తెరవడం అలవాటైంది – నిజానికి ఆ పుస్తకంలోని జీవనవిధానానికి నాకూ సంబంధం లేదు.. అయినా ఇలా అనుకుంటూన్నాను అంటే అందులో కొంచెం సార్వజనీనత ఉంది అనే అనుకుంటున్నా. భాష కొంచెం కష్టంగా ఉండింది కానీ, పోను పోను అలవాటవడమే కాక అందంగా అనిపించడం మొదలైంది.
“ఆత్మకథ రాయడానికి ఆయనకు ఏ అర్హతా లేదు. కళాకారుడు కాదు. రచనాకారుడూ కాదు. చిన్న గుమాస్తాగా చేరి పెద్ద గుమాస్తాగా రిటైరైన మనిషి. ఏ సాయుధ పోరాటంలోనో సాయుజ్య ఆరాటంలోనో నానావిధి క్రియలనాచరించి వాటితో మనల్ని వేధించగల అర్హతా సంపాదించుకోలేదు. డబ్బయినా సంపాదించుకోలేదు .. .. .. ఇంత సామాన్యుడికి ఆత్మకథా! సాహిత్యం మరీ అంత అలుసైపోయిందా! అని ఆగ్రహించబోయాను…”
-చందు సుబ్బారావు ఈ పుస్తకాన్ని గురించి రాసిన వ్యాసంలోని వాక్యాలివి. కానీ, పుస్తకానికి విలువ దాన్నుంచే వచ్చిందేమో అనిపిస్తుంది నాకు.
“…1940లోకి వెళ్ళిపోయి, స్వచ్ఛమైన రుతువులతో, జానపద గీతాలతో, కులభావన లేని కులాలతో, పల్లెలుగా వృత్తులతో, పండుగలతో, పేదరికంతో, ప్రేమలతో, సమిష్టి కుటుంబాలతో, స్నేహాలతో, స్నేహ క్రీడలతో, పోరాటాలతో, జీవితాన్ని అది అంది వచ్చినట్లుగా అతి సహజంగా తీసుకుని 1958లోకి ప్రవేశించిన వైనం…” అంటూ వర్ణించారు వరవరరావు గారు ముందుమాటలో. ఈ పుస్తకంలో ఏముందంటే – అదే!
ఎక్కడికక్కడ చిక్కటి తెలంగాణం లో జానపద గీతాలు, సామెతలూ అలా అలవోకగా రాసేస్తూ పోయాడాయన. నాకు తెలంగాణ పల్లె జీవనంతో (ఆ మాటకొస్తే అసలు పల్లె జీవనంతో) ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, కళ్ళకు కట్టినట్లు ఉండింది అంతా. కొన్ని పాటలు నాకు మోటుగా అనిపించాయి అన్నది వేరే విషయం. అది పుస్తకం చదవడానికి ఆటంకం కాలేదు. వాళ్ళమధ్య వాడుకలో ఉన్న పదజాలం (ఉదా: కాలర్లను మేకసండ్లు అనేది వంటి వాక్యాలు) కూడా నాకు ఆసక్తికరంగా అనిపించింది. నాకు బొత్తిగా ఆ జీవన విధానంతో పరిచయం లేకపోవడం మూలాన నేనైతే ప్రతీదీ ఆశ్చర్యంతోనూ, ఊహించుకుంటున్నప్పుడు కళ్ళకి కట్టినట్లు కనబడ్డం వల్ల ఆనందంతోనూ చదివాను. ఏలె లక్ష్మణ్ బొమ్మలు పుస్తకానికి వన్నె తెచ్చాయి.
అయితే పుస్తకం చదవడం ఎప్పటికప్పుడు నెమ్మదించడానికి ప్రదాన కారణం కథనం అంత గొప్పగా లేకపోవడం. దీని వల్ల ఇప్పటిదాకా నేను పార్ట్లు పార్ట్లుగా పుస్తకమంతా చాలాసార్లు తిరగేసినా, ఒక్కసారి కూడా మొదట్నుంచి చివరి దాకా చదవలేకపోయాను. రచయిత అప్పటికి అంత చేయి తిరిగిన రచయిత కాకపోవడం ఓ కారణం కావొచ్చు. ఇదొక్క విషయంలో నాకు చాలాసార్లు ఎక్కువసేపు కొనసాగలేని నా ఆశక్తతకు విసుగొచ్చింది. అయితే, ఈ సమస్యతో కూడా ఈ పుస్తకం తెలుగు ను ఇష్టపడేవారు అందరూ తప్పనిసరిగా చదవాలని నా అభిప్రాయం. తెలంగాణ ప్రాంతాల వారైతే మరీనూ. నాకైతే అలా ఇంట్లో పెట్టుకుని అప్పుడప్పుడూ ఆ భాషలో కాసేపు మునిగి పైకి తేలుతూ ఉండే తరహా పుస్తకం ఇది.
వరవరావు గారి ముందుమాట కొంత మేరకు ఆసక్తికరంగా ఉన్నా, నాకు కాసేపటికే బోరు కొట్టింది. ఎ.క్.ప్రభాకర్ గారు చివర్లో రాసిన “శ్రామిక కులాల సామాజిక చరిత్ర” వ్యాసం కొంత context అర్థం కావడానికి ఉపయోగపడింది. చివర్లో ఒక glossary ఇచ్చారు. పుస్తకంలోని పదసంపదకు తూగకపోయినా, కొన్ని పదాలకైనా అర్థాలు తెలుసుకోవచ్చు.
ఇక నాకు నచ్చిన కొన్ని వాక్యాలు/కవితలు:.
కొన్ని పుస్తకంలో ఉన్న సామెతలు:
* సందంతా దాసర్లే, బిచ్చమెవడు పెట్టాలె?
* ఉత్తుత్తి పుట్నాలు మూడు కుప్పలు పెట్టినట్లు
* ఎన్ని వేషాలేసినా కూటికే, ఎన్నేండ్లు బతికినా కాటికే
* వండిన కుండాగదు, వంగిన పొద్దాగదు
* తీయటి మాటలకు తీర్థం పోతే, వాడు గుల్లె, వీడు గుల్లె
కొన్ని కవితలు/పాటలు:
* “మోటుకాడా వుంటావని
నీళ్ళనంటూ నేనూ వస్తే
మోటా లేదు నీవూ లేవు
కంటి నీరే కడువా నిండెరా”
* “నల్లదాన్నను కున్నవేమో, నచ్చదేమో నీదు మనసూ
నల్లరేగడి దున్ని చూడు, తెల్లజొన్నలు పండవేమో
పొట్టిదాన్నను కున్నవేమో, పొందదేమో నీదు మనసూ
పొట్టి గిత్తలు పెట్టి దున్నితె దుబ్బ చెల్కకు సాలు రాదా
* “ఆకలివంటి మంట లోకాన లేదు
ఏ ఊరు చూసినా మావూరు గాదు
తల్లివంటి బంధువులు ధరణిలో లేరు
ఎవర్ని చూసినా మావారు గాదు”
మళ్ళీ చందు సుబ్బారావు గారి మాటల్నే అరువు తీసుకుని ఈ వ్యాసాన్ని ఆపుతాను:
“పల్లెటూళ్ళో పిల్లలు…ఆటలు…పాటలు…కులాలు…వృత్తులు…గ్రామీణ చిత్రం ..సంపాదనలు…దరిద్రాలు…దౌర్జన్యాలు…పండుగలు…కొలువులు.. వేటలు… బలులు… మాంసాలు…చేపల కూరలు…కల్లు ముంతలు… సారా కుండలు…బత్తీసాలు…కవ్వేలు….తాతీళ్ళు…మర్లబందాలు… గిన్నె చెట్లు…చింతపాలు..ఆడబాపలు…దూపలు…చెల్కలు…బింకోలు…అటికలు…మైల సముద్రాలు…ఇవన్నీ ఏమిటంటారా….తెలంగాణా తెలుగు పలుకుబడిలో బంగారు చిలకలు. అర్థాలు అడిగి తెలుసుకుందురుగాని…ముందు సదువుండ్రి..”
పుస్తకం హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారి ప్రచురణ.
Leave a Reply