ముగింపులో సరిక్రొత్త ప్రయోగం – కథకు కథ
వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
***********
సాధారణంగా కథకులు కథను చెప్తున్న విధానం నచ్చినవారూ, నచ్చని వారూ కూడా ఎలా ముగిస్తారన్న కూతూహలం మాత్రం చూపించడం పాఠకులకూ శ్రోతలకూ సర్వసామాన్యమైన విషయమని మనందరికీ తెలుసు. దీన్ని బట్టే ముగింపుకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది.
ఈ విషయంలో ఎన్నో ప్రయోగాలు కథకులు చేశారు, చేస్తున్నారు. ఉత్కంఠ పెంచుతూ పోయి ఎవ్వరూ అనుకోని విధంగా సమన్వయం సాధిస్తూ ముగింపు నిచ్చే సస్పెన్స్ కథలు ఈ ప్రయోగాల్లో ఒకటి. సాధారణ లోకరీతులకు, జనసామాన్యానికి అనుకూలమైన విధంగా కాకుండా పాత్రలే కథలను నడిపించాలంటూ వచ్చిన వాదనల ప్రకారం ప్రగతి పూర్వక/నిరోధక ముగింపులివ్వడం ఇంకో పద్ధతి. కథకుడు ఇచ్చిన ముగింపు నచ్చలేదంటూ మరో కథకుడు కథను మార్చిపారేసి, కథలో పాత్రల వ్యక్తిత్వాలను చంపేసి తమకు తోచిన విధంగా మార్చి వ్రాయడం మరో పద్ధతి. అసలు ముగింపు ఇవ్వడమే కథకుల తప్పని, పాఠకులే ఎవరికి నచ్చిన ముగింపుని వాళ్ళనే ఊహించుకొని తృప్తి పడమనే ఓపెన్ ఎండింగ్ కథలు ఇంకో పద్ధతి.
అయితే సస్పెన్స్ కథల ముగింపు ప్రజాదరణ పొందినట్టుగా మిగతా ప్రయోగాలు అంతగా ప్రజాదరణ పొందినట్టు అనిపించదు. విఫల ప్రయోగాల్లో కూడా రచయితల శైలి వల్లో, ఇతర కారణాల వల్లో కొన్ని రచనలు సంచలనాలు సృష్టించి ఉండవచ్చు.
ఈ కథకు కథ అనే కథాస్క్వేర్ ల సంపుటిలో ముగింపులతో ఒక కొత్త ప్రయోగం చేశారు రచయిత. ఒక మంచి కథకుని కథల్లో తొమ్మిది కథలను ఎన్నుకొని వాటి ముగింపుని కథా భాగంగా మలచుకొని మరో సరికొత్త ముగింపునిచ్చారు. పైగా మూలకథలనీ వాటి అనుసారి కథలనీ పక్కపక్కనే ఉంచి భిన్నమైన ముగింపు ఇచ్చారు.
చక్కటి కథనంతో ఉన్న రచనలని తీసుకుని అంతే చక్కటి కథనంతో రచించడమే కాక, మూలకథలోని పాత్రల వ్యక్తిత్వాలకు లేదా వారు నమ్ముకున్న విలువలకు ఏ భంగమూ కలుగనివ్వకుండా మూల కథ సాగిన ధారలోనే కొనసాగిస్తూ భిన్నమైన ముగింపు ఇచ్చే పనిని విజయవంతంగా చేయగలిగిన రచయితకు అభినందనలు.
అంతే కాదు, మూల కథల ముగింపుని, పాత్రల ఆలోచనా విధానాన్ని, పరిస్థితులను బలవంతంగా మార్చకుండా, తప్పని చెప్పకుండా దాన్నంతా కథలో భాగంగా మలచడం ఈ ప్రయోగం యొక్క విశిష్టత. దీనికి ఉదాహరణగా కృష్ణవేణి, రమ, రాఘవరావ్, సుందరమ్మ, మల్లి మొదలైన పాత్రలను చూపవచ్చు. శ్యామల, పార్వతమ్మ కొంత మార్పును ఆహ్వానించినా అదీ కృతకంగా లేదు. పార్వతమ్మ తనను తాను సంస్కరించుకుంటే, శ్యామల ఆ పరిస్థితికి తగిన పరిణతిని చూపింది.
ఈ విశిష్టత వల్ల మూలకథల రచనా విధానాన్ని సవాల్ చేస్తున్నట్టుగా కాకుండా చేతులు కలిపి నడచినట్టుంది అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే మూలకథనీ, సీక్వెల్ నీ కలిపి ఒకే పెద్దకథగా చదువుకున్నట్టుంటుంది.
ఈ విధమైన సరిక్రొత్త ప్రయోగాన్ని తన కథల విషయంలో స్ఫూర్తిమంతంగా స్వీకరించిన మూలకథల రచయితకూ, మరొకరి కథను తనదిగా చేసుకొని విభిన్నతతో సరిక్రొత్త సీక్వెల్ ప్రయోగాన్ని చేసిన సీక్వెల్ రచయితకూ కూడా అభినందనలు.
సంపుటి పేరు – కథకు కథ
మూలకథల రచయిత – సలీం
సీక్వెల్ కథల రచయిత – భీమరాజు వేంకటరమణ
ఆవిష్కరణ – జూన్ ఒకటి 2015
* * * *
Leave a Reply