మానవతావాది సార్త్ర
(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. Jean-Paul Sartre మరణించినప్పుడు వచ్చిన సంపాదకీయం. ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పుస్తకం.నెట్. ఈ పుస్తకం నుండి స్వీకరించిన ఇతర సాహిత్య సంబంధిత వ్యాసాలను ఇక్కడ చూడవచ్చు)
******
ఇతరులకు తత్వబోధ చేసేవారు ఎందరైనా ఉన్నారు. కానీ తమ తాత్విక విశ్వాసాలకు అనుగుణంగా జీవించేవారు అరుదు. ఆ విధంగా తన తాత్విక సిద్ధాంతాలను తన జివితంలోనే ఆచరించి చూపిన మహావ్యక్తిగా మొన్న తన 75వ యేట కన్నుమూసిన ఫ్రెంచి మేధావి, రచయిత జాఁపోల్ సార్త్రను ప్రపంచం కలకాలం జ్ఞాపకం ఉంచుకుంటుంది.
“దేవుడు లేడు. ఒకవేళ దేవుడు ఉన్నా అతనివల్ల మానవుడికి ఒరిగేదేమీ లేదు. మనిషి సర్వ స్వతంత్రుడు. అతడి చర్యలకు అతడే బాధ్యుడు. వాటి ఫలితాలకు కూడా అతడే బాధ్యుడు. మంచి పని చేయాలో, చెడు పని చేయాలో నిర్ణయించుకోవలసిన బాధ్యత అతనిదే. ఈ స్వయం నిర్ణయ స్వేచ్ఛ వల్ల మానవుడు అంతులేని ఆవేదన (యాంగ్విష్)కు లోనవుతాడు. ప్రపంచానికి అర్థం లేదు. దానికొక అర్థాన్ని కల్పించవలసిన బాధ్యత మనిషిదే. అతనికి మార్గదర్శకులంటూ ఎవరూ లేరు. తనకు తానే మార్గదర్శకుడు. మనిషికి మార్గదర్శక సూత్రాలంటూ ఏవీ లేవు. తన మార్గదర్శక సూత్రాలను తానే రూపొందించుకోవాలి. ఒక విధంగా మనిషి స్వేచ్ఛా శాపగ్రస్తుడు..”
ఇటువంటి విచిత్ర భావాలతో 1940 ప్రాంతాలలో ఒక వినూత్న తాత్విక సిద్ధాంత మహాసౌధాన్ని నిర్మించిన మేధావి సార్త్ర. అతని తాత్విక వాదన అస్తిత్వవాదం (ఎగ్జిస్టెన్షలిజం) పేరుతో జగత్ప్రసిద్ధమైంది. ఈ శతాబ్దంలో సమకాలికులపై, ముఖ్యంగా సమకాలిన సాహిత్యంపై అంతగా ప్రభావాన్ని ప్రసరించిన తత్వవేత్తలు అరుదు.
సార్త్ర 1965లో నోబెల్ బహుమతిని తిరస్కరించిన సంఘటన అందరికీ విదితమే. బహుమతులు, సన్మానాలు, సనదులు వ్యక్తి స్వేచ్ఛను పరిమితం చేస్తాయని, ఒక వ్యక్తి చేసిన పనులను గౌరవించాలి కాని, వ్యక్తిని కాదని సార్త్ర విశ్వాసం. ఈ సందర్భంలోనే ఆయన “జాఁపోల్ సార్త్ర అని సంతకం పెట్టడానికి, జాఁపోల్ సార్త్ర – నోబెల్ బహుమతి గ్రహీత అని సంతకం పెట్టడానికి ఎంతో తేడా ఉంది” అని పేర్కొన్నాడు.
సార్త్ర వొట్టి తాత్వికుడు మాత్రమే కాదు, క్రియావీరుడు కూడా. ద్వితీయ ప్రపంచ యుద్ధంలో ఫ్రెంచి సేనలతో చేరి నాజీలతో పోరాడాడు. ఖయిదీగా జర్మనీలో కొన్నాళ్ళున్నాడు. ఆ తరువాత పారిస్ ప్రతిఘటనోద్యమంలో పాల్గొన్నాడు. ఫ్రెంచి వాడై వుండికూడా ఫ్రెంచి వలసవాదాన్ని తీవ్రంగా నిరసించాడు. అల్జీరియా స్వాతంత్ర్యోద్యమాన్ని బలపరిచాడు. ఇందుకై అతడిని జైలులో పెట్టాలని కొందరు ఒత్తిడి తేగా ప్రెసిడెంట్ డిగోల్ “సార్త్ర కూడా ఫ్రాన్సు దేశమే” (సార్త్ర ఈజ్ ఆల్సో ఫ్రాంస్) అంటూ నిరాకరించాడు.
తాను వ్రాసిన అనేక నాటకాలలో, నవలలలో, కథానికలలో, ముఖ్యంగా తన ‘అస్తిత్వ వాద ‘ తాత్విక గ్రంథాలలో వ్యక్తి స్వేచ్ఛకు అన్నిటికంటే అగ్రస్థానమిచ్చిన సార్త్ర చివరివరకు మార్క్సిస్టుగా, రాజకీయాలలో తీవ్ర సామ్యవాదిగా వుండటం ఒక విశేషం. మార్క్సిజం నిజమైన మానవతావాదానికి దారి తీయగలదని ఆయన విశ్వాసం. ఈ కారణంగా ఆయన ఎన్నో వివాదాలలో చిక్కుకున్నాడు. ఒక తత్వవేత్తగా, ఒక మహా రచయితగా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఏప్రిల్ 17, 1980
Leave a Reply