‘కొంచెం ఇష్టం – కొంచెం కష్టం’ – పొత్తూరి విజయలక్ష్మి
వ్యాసకర్త: వారణాసి నాగలక్ష్మి
*****************
ఆంద్ర భూమి దినపత్రికలో ఏడాది పైగా నడిచిన ధారావాహిక కాలమ్ ‘కొంచెం ఇష్టం – కొంచెం కష్టం’ పాఠకుల సౌకర్యార్థం పుస్తకంగా వచ్చింది. విజయోత్సవ దిశగా దూసుకుపోతున్న బబ్లూ గాడి సినిమా ముచ్చట్ల ‘సూపెర్ డూపర్ హిట్టు’తో మొదలై ‘నంబి కొండా ఏం సాయం?’ అనే కాంతం మామయ్య కథతో ముగిసే ఈ పుస్తకాన్నిరచించింది శ్రీమతి పొత్తూరి విజయ లక్ష్మి.
ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టి, ముగించే లోపు ఎన్నో అడ్డంకులొస్తాయి. కళ్ళనీళ్ళు కారిపోతాయి, బుగ్గలు నొప్పెడతాయి, డొక్కలు చేత్తో పట్టుకుని ఒకటే అవస్థ పడాల్సి వస్తుంది. ‘ఇన్ని అవస్థలు పడుతూ ఈ పుస్తకం చదవకపోతే ఏం?’ అంటారేమో! నవ్వలేకపోవడమొక రోగం అంటారు కదా. ఆ రోగానికి ఔషధం ఈ పుస్తకం. ఇది చదువుతూ నవ్వకుండా ఉండగలమని ఎవరైనా అంటే వాళ్లతో వందో, వెయ్యో పందెం కట్టి డబ్బుసంపాదించుకోవచ్చు.
ఈ కాలమ్ కబుర్లలో తిమింగలం పార్టీకొస్తుంది. దేవుణ్ణి ప్రత్యక్షం కావద్దని వేడుకునే భక్తురాలు కనిపిస్తుంది, ప్రతివాళ్ళూ రోజుకింత ప్లాస్టిక్ వాడకపోతే శిక్షించాలనే రూలు కనిపిస్తుంది, పెళ్లి సంబంధం కోసం సభలోకొచ్చి ఎక్కాలు చెప్పుకునే ప్రేక్షకులు కనిపిస్తారు .. దేభ్యం చీరలు, దగుల్బాజీ ఇళ్ళ ప్రస్తావనలోస్తాయి. స్టోర్ రూముల్లో పనికిరానివస్తువులతో డబ్బు సంపాదించే ఉపాయాలూ, ఎవరో రాజకీయ నాయకుడు రాజీనామా చేస్తే కళ్ళ నీళ్ళ పర్యంతమైపోయే ప్రజలూ అచ్చ తెలుగు నవ్వుల పందిట్లోకి లాక్కెళ్ళి వదిలేస్తారు.
అమెరికా ఆసుపత్రిలో పలకరించిన పెద్దావిడ మాటలు చదవగానే పగలబడి నవ్వే ప్రమాదమెదురవుతుంది. నుమాయిష్ వైరాగ్యం, కాల్ సెంటర్ మర్యాదలు, గుర్రు పెట్టే కుక్కలు, వీకెండొస్తే బెంబేలు పడే పెద్దలు, సంగీత గండం బారిన పడే పసి ప్రాణాలు కనిపించి పకా పకా నవ్విస్తారు. రాకోయీ అనుకోని అతిథీ, ముద్దుగారే యశోద, దైవాధీనం బతుకులు – చదివితే వేదనని కూడా వెన్నెలగా మార్చి నవ్వులు పండించగల రచయిత్రి ప్రతిభ ప్రదర్శితమై ఆహ్లాదం కలుగుతుంది. ఒకటేమిటి ఇందులో ఉన్న 56 కాలమ్స్ అన్నీ నవ్వించే కాప్స్యూల్స్ అంటే అతిశయోక్తి కాదు. ఈ పుస్తకం చదివి వదిలేసేది కాదు. కొనుక్కుని మళ్ళీ మళ్ళీ చదువుకోదగ్గది. ఆత్మీయులకి బహుమతివ్వదగ్గది.
మణి వడ్లమాని
పొత్తూరి విజయలక్ష్మి గారి తెలుగు వారు అవడం మనందరికి గర్వకారణం. ఆవిడ రచనలు చదివితే చాలు ఏ నవ్వులక్లబ్ కి వెళ్లక్కరలేదు అంత ఆరోగ్యకరమైన హాస్యాన్ని మనకిస్తారు
ఆవిడ కలం ఎప్పటికి నిరంతరస్రవంతి లా సాగి పోవాలని మనసార కోరుతూ
మణి వడ్లమాని
venkat
కినిగే లో దొరుకుతుందా ?
pvlakshmi
ఎస్ .దొరుకుతుంది.
alluri gouri lakshmi
నేనైతే recharge అవ్వడం కోసం మళ్లీ మళ్లీ చదువుతాను ఈ పుస్తకం