నవ్యకవితా పితామహుడు
(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. కవి రాయప్రోలు సుబ్బారావు మరణించినప్పుడు వచ్చిన సంపాదకీయం. ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పుస్తకం.నెట్. ఈ పుస్తకం నుండి స్వీకరించిన ఇతర సాహిత్య సంబంధిత వ్యాసాలను ఇక్కడ చూడవచ్చు)
******
“అడుగులు బొబ్బలెత్త, వదనాంచలమందున చింకు చెమ్మటల్ మడుగులు గట్ట…” అని ఇరవై ఏళ్ళ ఒక యువకవి ఒక ఖండ కావ్యం ప్రారంభించాడు. అది అభినవాంధ్ర కవిత్వానికి ఆద్య పద్యమైంది. అది 1912-13 నాటి మాట.
ఆ ఖండకావ్యం పేరు “తృణకంకణము”. అది రచించిన ఆనాటి ఆ యువకుని పేరు: నవ్యాంధ్ర కవితా పితామహుడుగా ప్రసిద్ధుడైన రాయప్రోలు సుబ్బారావు.
తెలుగు కవిత్వంలో ఒక స్వర్ణయుగానికి కారకులైన విశ్వనాథ, దేవులపల్లి, తల్లావఝల, దువ్వూరి, వేదుల మొదలైన మహామహులందరు ఇంతకుముందే మనమధ్య నుంచి నిష్క్రమించారు. కాగా, వారందరికి ముందు నడిచి, వారందరికి మార్గదర్శకుడైన రాయప్రోలు వారు అందరికంటె వెనుకగా, ఆ యుగానికి చెందిన అంతిమ మధుర సౌరభతరంగాన్ని కూడా తనతో తీసుకుపోతూ నిన్న శాశ్వతంగా కన్నుమూశారు.
గురజాడ, రాయప్రోలు – వీరిరువురిలో నవ్యకవిత్వానికి నాంది పలికినవారెవ్వరని కొంతకాలంపాటు తెలుగునాట ఒక వివాదం రేగింది. ఆ ఇరువురు ఉత్తర, దక్షిణ ధ్రువాల వంటివారు. వారివి భిన్న మార్గాలు. అయినా, ఇరువురు తమ కాలపు ప్రబంధ సంప్రదాయం మీద తిరుగుబాటు చేసిన వారే. ఆంగ్ల సాహిత్యంతో ప్రభావితులైనవారే. నూతన కవితారీతులను ప్రారంభించినవారే. తరువాతి కవులపై అపార ప్రభావాన్ని ప్రసరించినవారే. అందుచేత ఆ ఇరువురిని నవ్యాంధ్ర కవిత్వ యుగకర్తలుగానే పేర్కొనాలి. రాయప్రోలు వారి నిర్యాణంతో తెలుగు కవిత్వంలో ఒక యుగకర్త అస్తమించారు.
రాయప్రోలు వారు గేయ చ్ఛందస్సులలో ఎన్నెన్నో మధుర గీతాలు ఆలపించకపోలేదు. అయినా, ఆయన ప్రతిభ వృత్తచ్ఛందస్సులలో మరింతగా రాణించింది. ఆధునికులలో సరళసుందరంగా వృత్తరచన చేసిన వారు పలువురున్నారుగాని, వారికి మార్గం చూపినవారు రాయప్రోలు వారే. ప్రబంధ కవిత్వానికి భిన్నంగా, వుండీ లేదనిపించేటంత చిన్న ఇతివృత్తంతో, సందేశాత్మకమైన ఖండకావ్యాల రచనకు ఆయనే వరవడిపెట్టారు. నాయికల అంగాంగవర్ణన, చంద్రోపాలంభం, మదనోపాలంభం, రతివర్ణన మొదలైన సంప్రదాయాలను కాలదన్ని, అమలిన శృంగార భావనకు తెలుగు కవిత్వంలో పట్టాభిషేకం చేసి భావకవిత్వమనే పేరుతో ప్రచారం పొందిన పద్ధతికి మార్గదర్శకుడైనది కూడా ఆయనే.
“ఆధునిక కవిత్వమునకు తృణకంకణము ఆది గ్రంథమని అస్మదాదుల ఆశయము” అని దాని రజతోత్సవ సందర్భంలో తల్లావఝల శివశంకరశాస్త్రి గారు అన్నారు. పాతికేళ్ళ తర్వాత ఆమాట అనడంలో విశేషం లేదు. “తృణకంకణము” వెలువడిన కొద్ది నెలలకే 1913 అక్టోబరులో జయంతి రామయ్యగారు “This little poem purports to make the beginning of a new school of Telugu poetry…” అని ప్రస్తుతించారు. అలాగే, 1916లో కట్టమంచివారు “He is almost entitled to be acclaimed as the founder of a new school of poetry.” అని కీర్తించారు. సమకాలికులైన ఉద్దండ పండితులు, అందులో ఇరవై ఏళ్ళ యువకవిని ఒక నూతన కవితా మార్గానికి కర్తగా ప్రశంసించడం గొప్ప విశేషం.
తృణకంకణం తర్వాత రాయప్రోలు వారి లేఖిని నుంచి స్నేహలతాదేవి, కష్ట కమల, స్వప్న కుమారము, ఆంధ్రావళి, జడకుచ్చులు, తెనుగుతోట వంటి ఖండకావ్య సంపుటాలెన్నో వెలువడి ఆంధ్ర రసికలోకాన్ని అలరించాయి. అన్నిటిలోను ఆయన అమలిన శృంగార సిద్ధాంతం – ప్లేటోనిక్ లవ్ గా పేర్కొనదగిన ప్రేమభావం–ప్రముఖంగా భాసిస్తుంది. వీటిలో వరకట్నపు దురాచారాన్ని ఖండించిన స్నేహలతాదేవి ఒక విలక్షణ ఖండకావ్యం.
ఇక రాయప్రోలు వారి పేరు చెబితే ఆయన మహావేశంతో, మహానురక్తితో పలికిన ఎన్నో దేశభక్తి పద్యాలు జ్ఞాపకం వస్తాయి. “ఏ దేశమేగినా, ఎందుకాలిడిన, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురయిన, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీజాతి నిండు గౌరవము” అని ప్రారంభమయ్యే ప్రసిద్ధ గీతం స్వాతంత్ర్య సమరకాలంలో తన పాత్ర తాను నిర్వహించింది.
“…చావలేదు చావలేదు ఆంధ్రుల మహోజ్వలచరిత్ర, హృదయములు చీల్చి చదువుడో సదయులార!” మొదలైన పద్యాలు నాటి ఆంధ్రోద్యమానికి చేసిన దోహదం సాటిలేనిది.
“కలదయేని పునర్జన్మ కలుగుగాక, మధుర మధురంబయిన తెనుగు మాతృభాష” అని తెలుగువారిలో రాయప్రోలువారు రేకెత్తించిన స్వభాషాభిమానం ఎన్నటికీ మరువరానిది.
రాయప్రోలు వారి తక్కిన ఖండకావ్యాలన్నీ ఒక ఎత్తు. వారి రమ్యాలోకం, మాధురీ దర్శనం ఒకెత్తు. అందులో రమ్యాలోకం మరీని. నవ్య కవితా లక్షణాలను, ఆశయాలను, ఆదర్శాలను సూత్రీకరించే అలంకార శాస్త్ర గ్రంథంగా దాన్ని ఉద్దేశించినప్పటికి “రమ్యా లోకం” ఒక గొప్ప రసాత్మక కావ్యంగా కూడా భాసిస్తుంది.
ఆయన ఏది వ్రాసినా మధురమధురంగా వ్రాశారు. ఆర్ద్రంగా వ్రాశారు. ఉదాత్త శైలిలో ఒక ఋషి వలె వ్రాశారు. “మామిడి క్రొమ్మమీద కలమంత్ర పరాయణుడైన కోకిల స్వామికి మ్రొక్కి యీ యభినవ స్వరకల్పన కుద్యమించితిన్…” అని ఆయనే చెప్పుకున్నారు. ఆ కోకిల స్వామి రాయప్రోలువారే, ఆయన జపించింది కలమంత్రమే. ఆయన ఆలపించింది అభినవస్వరమే.
తెలుగు భాషలోని తీయదనమంతా ఆయన కవితలో గూడు కట్టుకున్నది. అవధాన ప్రక్రియా కృత్రిమత్వం నుంచి మరల్చి తెలుగు కవిత్వాన్ని రమ్యాక్షర క్షోణిగా మార్చిన ఘనత ఆయనది. ఒక తరం తెలుగు కవిత్వాన్ని ప్రభావితం చేసి, తొంభయి రెండేళ్ళ పరిపూర్ణ జీవితం గడిపి కన్నుమూసిన రాయప్రోలు వారికి తెలుగువారు ఎంతైనా ఋణపడి వున్నారు
(జులై 1, 1984)
******
రాయప్రోలు సుబ్బారావు వర్ధంతి సందర్భంగా గతంలో తెలుగుసాహిత్యం వెబ్సైటులో మంగు శివరామప్రసాద్ రాసిన వ్యాసం ఇక్కడ.
Leave a Reply