శ్రీ బాపు గారికి విశ్వనాథ అభినందన – ఒక పేరడీ
రాసిన వారు: శ్రీరమణ
(ఈ వ్యాసం 1982 నాటి ఒక ఆంధ్రజ్యోతి వార పత్రిక సంచిక లోనిది. బాపు గారికి రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు వచ్చినప్పుడు వెలువరించిన అభినందన సంచిక ఇది. ఇందులో బాపు గారిని గురించి వివిధ ప్రముఖుల వ్యాసాలు ఉన్నవి. విశ్వనాథ రచనాశైలి ని పేరడీ చేస్తూ శ్రీరమణ గారు రాసిన వ్యాసం ఇది . ఏవైనా కాపీరైట్ ఇబ్బందులు ఉన్న పక్షంలో మాకు వేగు పంపితే, వ్యాసాన్ని తొలగిస్తాము. గతంలో ఇదే సంచిక నుండి ప్రచురించిన శ్రీరమణ వ్యాసం “విద్యుత్తూ విద్వత్తూ నిండిన బాపు రేఖలు” ఇక్కడ. – పుస్తకం.నెట్)
************
శ్రీ బాపు రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు తీసుకుంటున్న సందర్భంగా తమ ఆశీస్సులు పంపమని విశ్వనాథ సత్యనారాయణ గారిని కోరితే, వారు పంపే అభినందనలు లేదా అభిప్రాయం ఎలా ఉంటుందో ఊహిస్తే – ఆ ఊహకి అందిన వివరం యిది:
కొందరు తామ్రపత్రములిచ్చి సమ్మానించెదరు. ఒకడు సన్మాన చిత్రముతో సరిపెట్టును. మరియొకడు శాలువా గప్పును. ఇది గుడ్డిలో మెల్ల. మరికొందరు ధనమిచ్చి సత్కరించెదరు. ఇట్టివారు యోగ్యులు. కనుక రాజాగారు యోగ్యులు. బిరుదములు, పొగడ్తలవలన బ్రాప్తించు బ్రయోజనమేమి? శూన్యము. అట్టివి యెన్నైననూ బుక్కెడు కొర్రలు కాజాలవు.
నాకు లౌక్యము తెలియదు. లోకసత్యము జెప్పుట నా మతము. ప్రతిభగలవారినిట్లు గౌరవించుట లోకశ్రేయమగును.
యితని బరామర్శింతుము: ఇతడు యనగా బాపు. అది యతని కలము పేరు. ఇతడు చిత్రకారుడు కనుక కుంచె పేరు యనవలె. అతనికి అసలుపేరు యేమో వుండును. మనకు తెలియదు. కవి అక్షరములలో రచన పేయును. చిత్రకారుడనువాడు రేఖలతో, వర్ణములతో పేయును. ప్రయోజనము భావ వ్యక్తీకరణ, రససిద్ధి. ఇతడు జిత్ర రచన యందే కాక చలనచిత్ర రంగమున దర్శకునిగా గూడ కొంత కీర్తినార్జించినాడు. ఆ రంగమున కీర్తితోబాటు రసము గూడ మిక్కిలిగా యార్జించవచ్చునని కొందరు జెప్పగా వినియుంటిని. సినిమాలోకము గురించి బొత్తిగా నాకు తెలియదు. గూడవల్లి రామబ్రహ్మము ఇదివరలో యిట్టివాటిలో లోగడ పేరు ప్రఖ్యాతులు బడిసినాడు. మేమిద్దరమూ ఒకఊరి వారమగుటచే నాకాపాటి తెలిసినది.
రమణయని వొకడున్నాడు. ముళ్ళపూడి వారు. ఇతని సహపాటి. వీరిద్దరూ మంచి మిత్రులని నాకు తెలియును. స్నేహమనగానేమి? అది యొక అనుబంధము. అవగాహన దానికి ఆలంబన. రెండు జీవుల సమైక్య వేదన. జీవి యనగా ప్రాణి. అయినచో బ్రతిప్రాణి స్నేహము చేయునా? చేయును. చేయదు ..రాజేశ్వరరావని నాకు తెలిసి యొకడున్నాడు. కలకత్తాలో జంతుశాస్త్రమభ్యసించి బ్రస్తుతము సర్కారులో కార్యదర్శిగానున్నాడు. జంతుశాస్త్రము జదివినవానికి కార్యదర్శి బదవి యిచ్చుట ఏమి? ఏమో – అతడందునకు అర్హుడని పైవారికి తోచివుండినది.
అతనికి బక్షిశాస్త్రము గూడ కొంత తెలియును. పక్షులలో మైత్రి స్వభావము మెండుయని అతడొక పర్యాయము చెప్పినాడు – అతని భార్య రూపసి. పేరు కల్యాణి. కల్యాణి యని యొక అశ్వజాతి గలదు. ఆ జాతి గుర్రము వేగమునకు బెట్టినది బేరు.
చూచితిరా ఈ వైచిత్రి! ఆమె సంగీతజ్ఞుని భార్య యగుచో మనకు కల్యాణి రాగము జ్ఞప్తికి వచ్చును. ఇతడు జంతుశాస్త్రవేత్తయగుటచే గుర్రం మనసున తోచినది. దీనిని స్ఫురణ అందుము. అదియొక మానసిక యవస్థ. అవస్థ యనగా స్థితి. అయినచో నిట్టి స్థితి … (అదండీ పరిస్థితి)
Rama Bhaskar
అంత్య ప్రాసలతో పేరడీ బాగుంది , ఇక్కడ పెట్టినందుకు( పోస్ట్ చేసినందుకు ) ధన్యవాదాలు
amarnath
విశ్వనాథ గారు సినిమాలోకము గురించి బొత్తిగా నాకు తెలియదు అంటారని నేననుకోను. ఆయన అప్పట్లో అన్ని సినిమాలు (పర భాషా చిత్రాలతో సహా ) చూసేవారని నా ఊహ. శ్రీరమణ గార్ని నేను కూడా అభిమానిస్తాను కాని, ఈ పేరడి బాగా లేదు.
ఉదాహరణకి ఈ క్రింది పేరడి దీనికన్నా బాగుంది. ఇక్కడ రచయితకి విశ్వనాథ గారి మీద సదభిప్రాయం లేక పోవచ్చు కాని controversial గా, పేలవంగా లేదని నాకనిపించింది 🙂
http://blaagadistaa.blogspot.in/search/label/%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0%E0%B0%A1%E0%B1%80
విషయం బాపు గారినుంచి విశ్వనాథ గారి మీదకి మళ్ళింది.. ఇది యొక శాఖా చంక్రమణమెమో 🙂
pavan santhosh surampudi
వేయి పడగలు మొదలుకొని ఆయన రాసిన ఎన్నో నవలలు, వ్యాసాలూ, ఇతరమైన రచనల్లో ఆంగ్ల సినిమాల గురించిన విపులమైన వివరణ ఉంది. ఆయన చాలా సినిమాలు చూశారు. తెలుగులో తొలినాళ్ళ సినిమాలు చూసి అభిప్రాయాలు చెప్పినవి అనగ్డోట్స్ గా దొరుకుతున్నాయి. భానుమతి తొలినాటి సినిమా సంస్కృత మహాకవి ఒకరి నాటకాన్ని ఆధారం చేసుకుని తీసారు. ఆ సినిమాలో భానుమతి నటన చూసి విపరీతంగా మెచ్చుకున్నారాయన. అనంతర కాలంలో మళ్ళీ కొన్ని సినిమాల్లో నప్పని పాత్రలు పోషిస్తే ఆమె వైదుష్యం వ్యర్థం అయ్యేలా ఉందని బాధపడ్డారు కూడా. బాపు తీసుకువెళ్తే సంపూర్ణ రామాయణమే చూశారు.
jayasri.bhamidipati
నాకు చాల
i చాలా నచింది.
రఘోత్తమ రావు
//చూచితిరా ఈ వైచిత్రి! ఆమె సంగీతజ్ఞుని భార్య యగుచో మనకు కల్యాణి రాగము జ్ఞప్తికి వచ్చును. ఇతడు జంతుశాస్త్రవేత్తయగుటచే గుర్రం మనసున తోచినది. దీనిని స్ఫురణ అందుము. అదియొక మానసిక యవస్థ. అవస్థ యనగా స్థితి. అయినచో నిట్టి స్థితి … //
అచ్చు విశ్వనాథ వారి శైలినే బోలియున్నది. శ్రీరమణ గారికి, రవణగారికి నామసామ్యముతో బాటు చతురోక్తులను బల్కుటందు గూడా సామ్యము గలదని నిరూపణ ఐనది. ఇది అపురూపు. అస్తు 🙂
pavan santhosh surampudi
విశ్వనాథ సత్యనారాయణ శైలి అటుంచితే ఆయన ఎంచుకునే వస్తువు పట్టుపడలేదు పేరడీ రచయితకు. పైన ఎవరో చెప్పినట్టు భారతీయమైన చిత్రకళకు, పాశ్చాత్య చిత్రకళకు భేదం తెలిపి, భారతీయులలో చిత్రకళకు ఆత్మోన్నతికి ఎలా ముడి ఉందనేది చెప్పి ఉండేవారు. లేదంటే వ్యక్తిగతమైన విషయాలు తీసుకున్నా విశ్వనాథ నవలలకు అనేకం బాపు బొమ్మలు వేశారు. విశ్వనాథ సమకాలీన సాహిత్యం బాగా చదివేవారు-ఆయనకు బాపు తెలియకపోయే సమస్యే లేదు. ఆ కోణంలో ఆయనకు, బాపుకు ఉన్న సాన్నిహిత్యమో, బాపు ప్రతిభో ప్రస్తావించేవారు. ఇక విశ్వనాథ వారిని బాపు ప్రత్యేకంగా ఆహ్వానించి తీసుకుని వెళ్లి మరీ సంపూర్ణ రామాయణం చూపిస్తే చాలావరకూ చూసి వృద్ధాప్యం కారణంగా చివరి కొద్దిసేపు చూడకుండా వెళ్ళిపోయారుట. అది అయినా ప్రస్తావించేవారు.
ఇక శిల్పం విషయానికి వస్తే ఆయన నవలల్లో శాఖా చంక్రమణం చేస్తూంటారు. అంతగా చోటులేని పండితాభిప్రాయాలు, పీఠికల విషయంలో చేయనే చేయరు. వందల కొద్దీ రాసిన పీఠికలలో చాలావరకూ చదివి ఉన్నాను కనుక చెప్తున్నాను. పైగా ఉన్న కొద్ది స్థలం, ఆ కవికి ఉన్నది కొద్ది ప్రతిభ అయినా దానిని మెచ్చుకునేందుకు వెచ్చించేవారు.
కేవలం హాస్యానికే రాసాను అన్నా ఆ విరుపు ఏమీ కనబళ్ళేదు.d
mythili abbaraju
Absolutely. I do agree with Pavan Santosh
M.V.Ramanarao
శ్రీరమణగారి పేరడీ చదువుచుండగా అపుకొనినను నవ్వు వచ్చినది.నవ్వెందులకు వచ్చును?అదియొక మనోవికారము———-
K. Chandrahas
ఒక్క శ్రీరమణ గారికే ఇది సాధ్యము.
C.S.Rao
విశ్వనాధ వారి శైలి మహా మనోహరంగా ఉంటుంది.తర్కం తో ప్రభావితమై ,ప్రకాశితమై ఉంటుంది. వాక్యనిర్మాణ రీతిలో గొప్ప జిగి ఉంటుంది.భేషజం లేని భాషా సౌందర్యం ఉంటుంది .ఎవరో,ఏదో అనుకుంటారేమో అనే శంకలకు పూర్తిగా అతీతం గా ఉండి ధైర్యంగా విశ్లేషణ ను విస్తరింపచేస్తూ సాగుతుంది .రవంత హ్యూమర్ ఉండనే ఉంటుంది .గొప్ప ease ఉండి చదువరిని పూర్తిగా లోబరచు కుంటుంది .
శ్రీ రమణ గారి పేరడీ ఈ లక్షణాలన్నింటినీ చక్కగా ప్రతిబింబిస్తూ అలరిస్తుంది .కానీ ,ఆఖరు రెండు పేరాలలో రాజేశ్వరరావు గారి సతీమణి ప్రస్తావన సమంజసం గా ఉన్నట్లు నాకనిపించలేదు .
రచయిత రమణ గారికి ,topical relevance ఉన్న ఈ రచనను త్రవ్వి తీసి ప్రచురించిన పుస్తకం.నెట్ వారికీ అభినందనలు.
సి.ఎస్.రావ్
సౌమ్య
రావు గారికి: వ్యాసం చదువుతున్నప్పుడు నేనూ ఈ రాజేశ్వర రావు సతీమణి ప్రస్తావన ఎందుకు ఇక్కడ? అనుకున్నాను. మీ వ్యాఖ్య ఇప్పుడే చూస్తున్నాను 🙂
pavan santhosh surampudi
నిజంగా విశ్వనాథ రాస్తే ఇందులోని మొదటి పేరా తప్ప మిగిలినవి ఏవీ అలా ఉండవు. చాలా విశ్వనాథ పీఠికలు చదివి ఉన్న అవగాహనతో చెప్తున్నాను. నవలల్లోని నిర్మాణ శైలి(విస్తారమైన నవల కనుక కొంత అటూఇటూ పోతూంటుంది) పట్టుకుని పీఠిక, అభిప్రాయం వంటి వాటికి అడ్డంగా ఆపాదించేశారు శ్రీరమణ.
vsrnanduri
బాపు రమణలు తీసిన సంపూర్ణరామాయణం విశ్వనాధ ఆసాంతం చూచి ఆశీర్వదించారని కోతికొమ్మచ్చిలో ఉంది. కనుక విశ్వనాధకు బాపు సినీదర్శకత్వ నైపుణ్యం గురించి తెలీకపోలేదు.
బాపు రామ భక్తి కూడా జగద్వితమే కనుక నిజంగా విశ్వనాధ రాస్తే దానిని ప్రస్తావించి ఉండేవారు.
అలాగే నిజంగా విశ్వనాధే రాస్తే రచన వల్ల లభించే రసానందానికీ, చిత్రకళ వల్ల లభించే రసానందానికీ తేడా తెలియజెప్పేందుకు లభించిన అవకాశం వదులుకొనేవారు కాదు.
ఇదంతా శ్రీ రమణ ప్రయత్నం యొక్క గొప్పదనాన్ని తక్కువ చేసేందుకు కాదు, కానీ విశ్వనాధే రాస్తే అన్నప్పుడు ప్రస్తావించకుండా ఉండలేక పోతున్నాను.
అభినందనలతో
విన్నకోట నరసింహా రావు
బాపు – రమణ ల నిష్క్రమణ End of an era