పగటి కల – గిజుభాయి

వ్యాసకర్త: శ్రీమతి ఎస్.జ్యోతి
గ్రేడ్ 2 హిందీ టీచర్
మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కంకణాలపల్లి
(వ్యాసాన్ని మాకు అందించినందుకు దేవినేని మధుసూదనరావు గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
*******
నేను చదివిన పుస్తకం పేరు “పగటికల”. ఈ పుస్తకం ఎలా ఉందో ఇందులో ఏ విషయాలు నచ్చాయో చెప్పే ముందుగా నేను ఈ పుస్తకం శీర్షిక “పగటికల” గురించి చెప్పదల్చుకున్నాను.
నేను పుస్తకం చూడగానే నాకన్పించింది. అసలు ఈ పుస్తకానికి పగటికల అనే పేరు ఎందుకు పెట్టారా ? అని. ఎందుకంటే పగటికలలు అనేమాట చాలాసార్లు మనం వాడుతూనే ఉంటాము. ఎవరైనా మరీ ఎక్కువగా ఊహించుకున్నా, లేక జరగని పని గురించి మాట్లాడినా మనం వెంటనే పగటికలలు కనకు అంటాము. అంటే పగటికలలు నెరవేరవనీ మన పెద్దలు అంటూ వుంటారు.
పగలైనా రాత్రయినా వచ్చే కలలు ఏవైనా నిజజీవితంలో నెరవేర్చుకోవచ్చని నా అభిప్రాయం. ఉదాహరణకు ఒక అమ్మాయి తన తరగతిలో బాగా చదివి అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చినట్టు పగలు కలగన్నదనుకుందాం. నిజంగానే ఆ అమ్మాయి ఆ రోజు నుండి పట్టుదల, కృషితో చిదివి తరగతిలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుందనుకుందాం. అంటే ఆ అమ్మాయి పగటికల నెరవేరినట్టే కదా! అంటే నా ఉద్దేశంలో పిల్లల సామర్థ్యాన్ని మార్కులతో కొలవాలని కాదు. ఉదాహరణకు మాత్రమే అలా తీసుకున్నాను.
ఏ పని అయినా చెయ్యాలనుకున్నపుడు ఇది జరుగదు. ఇది పగటికల అని వదిలేయకూడదు. అని ఈ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది. పగటికల పుస్తకం గిజూభాయి గారు మనకిచ్చిన మంచి బహుమతి అని నాకు అన్పించింది. ఈ పుస్తకంలోని సంఘటనలన్నీ ఒక కథలాగా మన కళ్ళముందు జరుగుతున్నట్లుగా ఉన్నాయి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు తప్పక చదవవలసిన పుస్తకం “పగటికల”.
ఈ పుస్తకం చిదివితే మనకు అర్థమవుతుంది, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి ఎంత సహనం, ఓపిక కావాలో? పిల్లలకు అర్థమయ్యే విధంగా కొత్త కొత్త పధ్ధతులలో ఏ విధంగా బోధించాలో? అలాగే విధ్యార్థులకు పాఠాలు బట్టీపట్టి నేర్పించటం ఎంత తప్పో తెలుస్తుంది.
బట్టీపట్టి చదవటం వల్ల పిల్లలు ఆ పాఠాన్ని ఆ కొద్దిసేపే గుర్తుంచుకుంటారు, అదే మనం వారికి అర్థమయ్యే విధంగా, అవగాహన చేసుకునేలాగా నేర్పించితే వారు ఎప్పటికి మర్చిపోరని గిజుభాయి గారు మనకు సంఘటనల రూపంలో చక్కగా తెలియజేశారు. ఈ పుస్తకం చదివితే ప్రతి ఒక ఉపాధ్యాయుడు తన గురించి పరిశీలించుకుంటారు. నేను ఒక ఉపాధ్యాయురాలినే. నన్ను నేను పరిశీలించుకున్నాను. అప్పుడు అర్థమయ్యింది. నేనూ పాఠాలు బాగానే చెప్తున్నాను. కానీ, ఇంకా పిల్లలకోసం ఎంతో కృషి చేయాలని, ఎంత చేసినా…. తక్కువే అని.
నాతో సహా చాలా మంది ఉపాధ్యాయులు “పాఠం చెప్పానూ, మా పని అయిపోయింది. ఇక పిల్లల పని నేర్చుకోవటం”, అనుకుంటాము. కానీ, “పిల్లలకు పాఠాలు ఏ విధంగా చెప్పాము? అర్థమయ్యేలా చెప్పామా? లేదా?” అని ఆలోచించము. ఇది మన ఉపాధ్యాయులకు కోపం వచ్చినా ఇది నిజం.
ఇందులో ఇంకో విషయం చెప్పాలి. పిల్లలకు పాఠాలు బాగా చెప్పాలని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కోరుకుంటారు. కానీ, మన పుస్తకాలలో ఈ నెలలో ఇన్ని పాఠాలు కావాలీ, ఇంత సిలబస్ కావాలీ, అని చెప్తుంటారు. ఇలాంటి పరిస్థితులలో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరిగిపోతుంది. అందువల్ల వారు కూడ సిలబస్, పాఠం అనే ధోరణిలోనే ఆలోచించాల్సి వస్తుంది. ఇది మారాలనీ అధ్యాపకులపై ఒత్తిడి ఉండకూడదని నా అభిప్రాయం.
మనకు పగటికల పుస్తకం ద్వారా గిజూభాయి గారి పిల్లలకు పాఠాలు మాత్రమే కాదు. వారిలో ఆటలు, పాటలు కథలు, నాటికలు ఇలా సృజనాత్మకంగా చేసే అన్నింటిలో కూడ విద్యార్థులకు తర్ఫీదునివ్వాలని చెప్పారు.
ఇక్కడ నేను మా పాఠశాలకు సంబంధించిన ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మా పాఠశాల పేరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కంకణాలపల్లి, త్రిపురాంతకం మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పాఠశాలలో అందరు ఉపాధ్యాయులు పాఠాలు బాగానే చెప్తారు. కానీ, నేను ముఖ్యంగా మద్దిరాల శ్రీనివాసులు అనే నా సహచర ఉపాధ్యాయుని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే, నేను ఈ పుస్తకం చదువుతున్నంతసేపు ఈ పగటికల పుస్తకంలోని ఉపాధ్యాయుడికి బదులుగా మా సార్ మద్దిరాల శ్రీనివాసులు గారి గురించే చదువుతున్నట్లుగా అనిపించింది.
ఎందుకంటే మా పాఠశాలలో సార్ పుస్తకంలోని పాఠాలే కాకుండా ఎన్నో విషయాలు విద్యార్థులకు నేర్పిస్తూ ఉంటారు. కథలు, కవితలు, పద్యాలు రచించడం, చక్కటి వ్రాత, చక్కగా మాట్లాడడం, పరిశుభ్రత, పదవినోదం మొ., ఇలా దాదాపు 60 రకాల అంశాలు నేర్పిస్తూ వుంటారు. ఇలా ఇవన్నీ చేసేవారిని చూసి నాకూ అన్పిస్తుంది. ఈయనకు ఇవన్నీ చేయడానికి ఇంత టైము ఎక్కడినుంచి వస్తుందీ అని. కానీ, మనకు ఈయన వాళ్లలాంటి వారందరికీ రోజుకు 24 గంటలే అనే విషయాన్ని మర్చిపోతాం మనం.
విద్యార్థుల కోసం బడిలోనే కాదు, ఇంటిలో కూడ పిల్లలకు ఏం నేర్పించాలి? ఎలా నేర్పించాలి? అని తపనతో ఆలోచించే అధ్యాపకులకు నా అభినందనలు. గిజూభాయి గారు కూడ పుస్తకంలో ఇదే విషయాన్ని చెప్పారు. గిజూభాయి గారు పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తూ మన ఉపాధ్యాయులు ఎలా ఉండాలో? తెలియజేస్తూ మనకందరికీ “పగటికల” అనే ఒక చక్కటి పుస్తకాన్ని అందించారు.
“ఇది పగటికలే. మనం చేయలేం. ఆచరించలేం” అని ఇక నుంచి నేను అలా ఆలోచించదల్చుకోవటంలేదు. మీరు కూడా అలా ఆలోచించకుండా ఆచరణలో పెట్టాలని కోరుకుంటున్నాను.
******
* Teachers of India వెబ్సైటులో “పగటికల” పుస్తకం ఈబుక్ గా లభ్యం.
* Gijubhai Wikipage
* పై వ్యాసంలో ప్రస్తావించబడ్డ మద్దిరాల శ్రీనివాసులు గారు ఈ పుస్తకంపై రాసిన వ్యాసం ఇక్కడ.
* ఈపుస్తకం గురించి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ బ్లాగులో టపా ఇక్కడ.
P.kasi viswanadham
నేను వ్రాసిన సమీక్షలువ్యాసాలు ఇక్కడ పోస్ట్ చేయాలంటే ఎలా? దయచేసి తెలియచేయగలరు.
కాశీ విశ్వనాధం పట్రాయుడు
Jogeswararao Pallempaati
నేను ౧౩ ఏళ్ళు స్కూలు టీచరుగా, వైస్ ప్రిన్సిపల్ గా, హెడ్మాస్టర్ గా చేసిన అనుభవం …
పిల్లలేకాదు … నేను సైతం ఇంట్లో భర్తగా, పిల్లలకి తండ్రిగా ఎంతో మారాను! పిల్లల్నుంచి ఎన్నో నేర్చుకున్నాను! మా స్కూల్లో పనిష్మెంటు అసలు ఉండదు, హోంవర్కు ఉండదు, పుస్తకాల మోత ఐదోతరగతివరకు ఉండదు! ఆటలంత హాయిగా పాటలతో చేతలతో చదువుకోగలగాలనీ, పుస్భాతకం పట్టుకుని చదువుతూ పాఠంచెప్పే పద్దతి ఉండకూడదనీ … ర్యాంకులు కాకుండా గ్రేడులతోనే రిపోర్టులిస్తూ … భావవ్యక్తీకరణకి ప్రాధాన్యతనిస్తూ, చేతులు కట్టుకుని నిలబడని విధంగా ధైర్యంగా చర్చించగల వాతావరణం కల్పించి … నలభై మందితో మొదలైన స్కూలు, పదేళ్ళలో ౩౦౦కి పైగా విద్యార్థులతో హాస్టల్ సదుపాయంతో. ఏ పిల్లలతో విజయవంతంగా సక్సెస్సయ్యాం! పగటికలలాంటి పుస్తకాలు చదవనే లేదు! పుస్తకాలు చదివి మారేది చాలా తక్కువ … సహజంగా ఉట్టిపడాలి ప్రయోగాలతో, పాటలతో, కథలతో పాఠాలు చెప్పే నైపుణ్యం! బీ.ఎడ్. చేసినవారంతా టీచర్లనుకుంటే పొరపాటే … డిగ్రీ చదివినవారిలోనూ నైపుణ్యాలుంటాయన్నది మా అనుభవం! తరువాత చానాళ్ళకి చదివాను పగటికల … మేమెలా అనుకుని ప్లాన్ చేసుకున్నామో … అలా అనిపించింది, ఆ స్కూలు! చాలా అరుదుగా ఉండే పద్దతి! అందివల్లా కానిపని! మీ విశ్లేషణ బాగుంది! ధన్యవాదాలు!
Desu Chandra Naga Srinivasa Rao
ఈ వ్యాసం చదివిన తరువాత, హైస్కూల్ లో లెక్కల మాస్టారు శ్రీ నరసింహ రావు గారు గుర్తుకు వచ్చారు.
(a+b)2 = a2+2ab+b2 లాంటి ఫార్ములాలు అర్థమయ్యే విధంగా, అవగాహన చేసుకునేలాగా నేర్పించారు. పిల్లలకు ఎలా నేర్పించాలి అని తపనతో ఆలోచించే అధ్యాపకులు శ్రీ నరసింహ రావు గారు. వారికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను.