పుస్తకం
All about booksపుస్తకలోకం

April 3, 2011

విద్యుత్తూ-విద్వత్తూ నిండిన బాపురేఖలు

రాసిన వారు: శ్రీరమణ

(ఈ వ్యాసం 1982 నాటి ఒక ఆంధ్రజ్యోతి వార పత్రిక సంచిక లోనిది. బాపు గారికి రాజ్యలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు వచ్చినప్పుడు వెలువరించిన అభినందన సంచిక ఇది. ఇందులో బాపు గారిని గురించి వివిధ ప్రముఖుల వ్యాసాలు ఉన్నవి. అందులో, ప్రత్యేకం శ్రీరమణ గారు రాసిన ఈ వ్యాసం అందరూ చూసే బాపు బొమ్మలే కాక, ఆయనలోని సాహిత్య పిపాసి ని కూడా పరిచయం చేస్తుందని, ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. ఏవైనా కాపీరైట్ ఇబ్బందులు ఉన్న పక్షంలో మాకు వేగు పంఫితే, వ్యాసాన్ని తొలగిస్తాము. వ్యాసాన్ని యూనీకోడీకరించిన వేణూ శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

************
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రని సజావుగా రాస్తే అందులో రెండు అధ్యాయాలు బాపుగారికి కేటాయించాల్సి వుంటుంది. గత మూడు దశాబ్ధాలలో వచ్చిన రచనలన్నీ దాదాపు ఆయన చేతిమీంచే అచ్చులోకి వెళ్ళాయి. ఇప్పుడు వచ్చిన, వస్తున్న సాహిత్యరీతులూ, రచయితలూ, రచయిత్రులూ, వారి రచనలగురించి బాపు సాధికారంగా చెప్పగలరు. తెలుగు రచనకు ఆయన టోల్ గేట్. సాహిత్య తీర్థానికి బాపు చెయ్యి శంఖువు. ఆయన దృష్టినుంచి ఏ గొప్ప రచన, ఏ చచ్చు రచన కూడా తప్పించుకోగల అవకాశాలు తక్కువ.

పత్రికారంగంలో ఇలస్ట్రేషన్ కి ఓ ప్రత్యేక ఒరవడి దిద్దారు బాపు. తెలుగు పుస్తకాల రూపురేఖల్ని మార్చింది బాపు. తెలుగు కార్టూన్ కి ఒక రూపం, ఒక భాష సమకూర్చారు బాపు. బాపు లిపి ప్రజలలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది. “బాపు లెటరింగ్” పేరుతో ఆ శైలి అక్షరాలను టైపు ఫౌండ్రీలలో పోత పోయించుకుని ప్రెస్ లో వినియోగించేటంత ప్రజాదరణ పొందింది.

కొన్ని క్లాసిక్స్ సామాన్య పాఠకులలోకి వెళ్ళడానికి బాపు బొమ్మలు దోహదం చేశాయి. అందుకు “జనార్ధనాష్టకమ్” ఒక ఉదాహరణ మాత్రమే. వేలాది కథలకీ వందలాది కవితలకీ గీతానువాదం చేసి మాతృకలకి అదనపు అందాలు సమకూర్చారు. కొన్ని రచనలకు ఆయన రేఖలు వ్యాఖ్యానాలు, మరికొన్నిటికి మూలరచనకి పొడిగింపులు, కొన్నిచోట్ల స్వేచ్ఛానుసరణలు.

శ్రీ బాపు చెయ్యితిరిగిన చిత్రకారుడు మాత్రమే కాదు, చెయ్యితిరిగిన జర్నలిస్టు కూడా. పాఠకుల రుచులూ, అభిరుచులూ ఆయనకు బాగా తెలుసు. కార్టూనిస్టుగా రోజు రోజూ మారుతున్న రాజకీయ, నైతిక, ఆర్ధిక పరిస్థితులతో బాటు మారుతున్న సాహిత్య ధోరణులను కూడా ఆయన ఆకళింపు చేసుకున్నారు. సంప్రదాయ సాహిత్యానికి బాపుగారు వేసిన చిత్రాలు చూస్తే ప్రాచీన సాహిత్యంపై ఆయనకు గల అధికారం ఎంతటిదో బోధపడుతుంది. కృతులు రచించి, బాణీలుకట్టి వినిపించి సాహిత్య సంగీతాలలో సముచిత స్థానం సంపాదించుకున్న త్యాగయ్య, అన్నమయ్య లాంటి వాగ్గేయకారుల కోవలోకి శ్రీబాపు వస్తారు. శ్రీ బాపు చిత్రకారుడు, సాహిత్యకారుడు, చరిత్రకారుడు, విమర్శకుడు.

ఎంతటి గొప్ప రచననైనా ఇట్టే ఇలస్ట్రేట్ చేసి ఇంకా బాగా రాసివుంటే ఇంకెంత గొప్ప బొమ్మ వేసేవారోనని రచయిత డీలాపడిపోయేలా చేస్తాయి బాపు బొమ్మలు. ఒంటిజడ రాధలూ, రెండుజళ్ళ సీతలూ, పెంకుటింటి గోపాలాలూ ; పక్కింటి పిన్ని గార్లూ; వొంటింటి బామ్మగార్లూ ; ఇంటింటి బుడుగూలూ ఎందర్నో సృష్టించారాయన. వాళ్ళంతా ప్రాణం పోసుకుని మనందరితో సహజీవనం సాగిస్తున్నారు.

గత ముప్పై ఏళ్ళలో శ్రీ బాపు వేల సంఖ్యలో చిత్రాలను చిత్రించారు. కోటాను కోట్ల వేలిముద్రలున్నా ఏ రెంటికీ గీతలలో పోలిక ఉండనట్లే, బాపు ముద్రలో వైవిధ్యం వుంది. రావిశాస్త్రి, కొడవటిగంటి, ఆరుద్ర, శ్రీశ్రీ, మల్లాది రామకృష్ణశాస్త్రి, విశ్వనాథ, త్రిపురనేని రామస్వామి చౌదరి, గోపీచంద్, చలం, ముళ్ళపూడివారి రచనలను బాపు సచిత్ర పరిచారు. పంచతంత్రం, రామాయణం గాలిబ్ గీతాలు, గీతాంజలి, హరివంశం, ప్రాచీన గాథాలహరి, మహప్రస్థానం (ఫేసిమిల్) వంటి ప్రసిద్ధ కావ్యాలకు బాపు గీసిన బొమ్మలు “ఎడిషనల్” విలువల్ని తెచ్చి పెట్టాయి. ఇటీవల వెలువడిన బారిష్టర్ పార్వతీశం, అమరావతి కథలు, జరుక్ శాస్త్రి పేరడీలు, అన్నమయ్య కథ, శృంగారమంజరి లకు బాపుగారి చిత్ర రచనలు చూస్తే రేఖల్లో రూపాల్లో ఒక కొత్తదనం కన్పిస్తుంది.

ఒకే అంశానికి అనేకమార్లు బొమ్మ గీయాల్సివస్తే చిత్రకారుడికి అది ఒక సవాలుగా పరిణమిస్తుంది. శ్రీ బాపు పంచతంత్రానికి ఇప్పటికే మూడు నాలుగు సార్లు బొమ్మలు వేశారు. ఈ మధ్య మళ్ళీ వేయాల్సి వచ్చింది. మరోసారి రూపులు ఆకృతులూ రేఖలూ మార్చి ఎంతో వైవిధ్యం చూపారు. అడివి జంతువులకు సుకుమారంగా వాటి స్వభావాలను బట్టి గాంభీర్యత తగ్గకుండా బొమ్మలు రచించారు. అందమైన స్త్రీని వర్ణించేప్పుడు సింహం నడుముతో పోల్చడం మనకు ఆనవాయితీ వుంది. బాపు పంచతంత్రంలో సింహానికి కాటుక కళ్ళు దిద్ది, రాజఠీవి తగ్గకుండా సహజత్వం చెదరకుండా సరికొత్త వాతావరణాన్ని సృష్టించారు.

ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం వెంపరలాడి బాపు బొమ్మల్ని సృష్టిస్తూ వుండబట్టే బొమ్మలవంశం (బొమ్మలంటే బాపు బొమ్మలు) తామర తంపరగా వృద్ధి చెందుతోంది. బాపుగారి ఇలస్ట్రేషన్ ఒక్కటి వస్తే దాన్ని అనుసరించి, అనుకరించి కనీసం పది ఇలస్ట్రేషన్స్ వస్తున్నాయి. అలాగే ఆయన కార్టూన్ లలోంచి వస్తున్నాయి. అణువుల్లోంచి పరమాణువులులాగా…

“ఆంధ్రపత్రిక” నిర్వహించిన తెలుగు వెలుగులు శీర్షికకు బాపు గీసిన రేఖాచిత్రాలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆ శీర్షికలో వివిధ రంగాలకు చెందిన ప్రసిద్దవ్యక్తుల పరిచయ వ్యాసాలతోబాటు ఆ వ్యక్తుల రేఖాచిత్రాలు ప్రచురించారు. పొదుపుగా గీసిన రేఖల్లో ఆవ్యక్తి స్వరూపంతో బాటు స్వభావంకూడా వ్యక్తమయ్యే రీతిలో, ఎంతో భావగర్భంగా రచించారు. రూపంతోబాటు స్వభావం కూడా అచ్చుగుద్దినట్టు అందులో ప్రస్ఫుటిస్తుంది. అది బాపు ప్రత్యేకత.

ఏదో మొక్కుబడి కోసం బొమ్మలు ఎప్పుడూ గీయలేదు. ఏదో బొమ్మకోసం అన్నట్టు ఏ రచనా చదవలేదు. ఏ రచననైనా మనసుపెట్టి చదివి, బొమ్మకి పట్టుదొరక్కపోతే మరోసారి చదివి, ఆలోచించిగానీ కుంచెపట్టరు. ప్రౌఢ కావ్యాలనుంచి బాల సాహిత్యందాకా ఆయన క్షుణ్ణంగా చదివారు. తెలుగు పత్రికలకీ, పుస్తకాలకేగాక “కలైమగళ్, కల్కీ” లాంటి పత్రికలకి కూడా ఆయన బొమ్మలు వేశారు. వేల సంఖ్యలో “లోగోలు”, “ఎంబ్లెమ్”లు ఆయన డిజైన్ చేసి యిచ్చారు. ఆయన జీవితమూ, రేఖా సింప్లిసిటీ వుట్టిపడుతూ వుంటాయి.

బాపు బొమ్మలు అందంగా వుంటాయని చెబితే ఆకాశం ఎత్తుగురించి, సముద్రం సైజు గురించి చెప్పినట్లు వుంటుంది. బాపు రేఖల్లో, విద్యుత్తూ విద్వత్తూ వుంటుంది. అవి సవ్వడిచేసే రేఖలు.. చిరుగాలికి పువ్వు కదిలిన సవ్వడి, గోదావరిపై వెన్నెల వాలిన సవ్వడి, పసిడికిరణం నేలజారిన సవ్వడి. అది సడిలేని సవ్వడి. అది రసహృదయాలకి విన్పించే సడి.

శ్రీ బాపు ఒక సంస్థకాదు ఒక వ్యక్తి, ఒక కళాశీలి, ఒక కళా శైలి. బాపు కుంచె రామబాణం. ఆయన రేఖ ఎందరో చిత్రకారులకు లక్ష్మణ రేఖ.

వాక్ మన్ చెవికి పెట్టుకు వింటూ, పైపు కాలుస్తూ, ఉడ్ హౌస్ నో గ్రూచో మార్క్స్ నో చదువుతూ, తీయబోయే సీన్ ఆలోచిస్తూ, లొకేషన్ కి వెళుతూ.. ఇలా అయిదారు వ్యాపకాలు ఒకేసారి చక్కపెట్టడం ఆయనకు ఇష్టం. అందుకే శ్రీ బాపు వన్ ఇన్ వన్ కాదు – సిక్స్ ఇన్ వన్. రోజుకి పాతిక గంటలు పని చెయ్యటం ఆయనకి సరదా. వేల సంఖ్యలో బొమ్మలు గీసి ఎన్నెన్నో ప్రయోగాలు చేసి ఇంటా బయటా గెలిచినా, ఇప్పటికీ చిన్న బొమ్మ వెయ్యాలన్నా “ఎలా వస్తుందో” నని సంకోచిస్తూ “ఎందుకు రాదులే” అనే కసితో ప్రారంభిస్తారాయన. చిత్రకారుడుగా ఆయన అల్పసంతోషి. ఎవరైనా “ఫలానా మీ బొమ్మ బావుందండీ” అంటే బోలెడు సిగ్గుపడి, బోలెడు ఆనందపడతారు. బాపు బొమ్మలు బాగుండడం అనేది ఒక యూనివర్సల్ ట్రూత్ గా మారిన తర్వాత బావుందని ఎవరన్నా అంటే చిత్రకారుడికి ఎక్కువ థ్రిల్ వుండదు, సహజంగా కాని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తెలియని బాపుగారు యిప్పటికీ తన బొమ్మలపై అభిప్రాయానికి ఎదురు చూస్తారు, ఇమ్యూన్ కాకుండా అభిప్రాయాలకు రియాక్ట్ అవుతారు. అందుకే ఆయన బొమ్మలు ఎప్పటికప్పుడు కొత్త కాంతులతో వస్తుంటాయి.

చిత్రకారుడిగా మాత్రమే గాక సాహితీ ప్రియుడుగా ఆయన ఎన్నో పుస్తకాలు చదివారు సాహిత్యం, చిత్రకళ, ఫోటోగ్రఫీ, కార్టూన్ కళలకు సంబంధించి పెద్ద లైబ్రరీకి బాపు యజమాని.

వావిళ్ళ సంస్థకీ, భారతి పత్రికకీ తెలుగు సాహిత్యంలో సముచిత స్థానం వున్నట్టే బాపుగారికి సాహిత్యంలో ప్రత్యేక స్థానం వుంటుంది. రచనకు తన ఇలస్ట్రేషన్స్ తో మెరుగులు దిద్ది పాఠకుని మనసుని రచన మీదికి మళ్ళించగల నేర్పు ఒక్క బాపుగారిలోనే వుంది. “తెలుగు సాహిత్యం-బాపు” అంశంపై క్షుణ్ణంగా పరిశీలించి థీసీస్ రాయతగిన అంశం. దీనితో పుస్తక ప్రపంచంలో తెలుగు పత్రికా ప్రపంచంలో వచ్చిన మార్పులూ, మారిన విలువలూ పరిశోధిస్తే ప్రతి మలుపులో, ప్రతి మార్పులో బాపు హస్తం కన్పిస్తుంది.

బాపు రేఖ కళామతల్లికి కాటుక రేఖ
బాపు కుంచె తెలుగు సంస్కృతికి వింజామర.About the Author(s)

పుస్తకం.నెట్0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

బాపుతో మేము

వ్యాసకర్త: శంకర్ (సత్తిరాజు శంకరనారాయణ) (డిసెంబర్ 15, బాపు గారి పుట్టినరోజు సందర్భంగా, ...
by అతిథి
0

 
 

బాపు గారి గురించి కొన్ని జ్ఞాపకాలు

వ్యాసకర్త: భానుమతి ****** నమస్తే. నా పేరు భానుమతి. బాపు గారి అమ్మాయిని. నాకు మీ అందరితో కొన...
by అతిథి
44

 
 

ఓ బాపు బొమ్మ కథ

  గతవారం బాపుగారి మరణానంతరం ఫేస్‌బుక్‌లో చాలామంది స్నేహితులు బాపు గారి ఫొటోలు, బొమ...
by Jampala Chowdary
13

 

 

శ్రీ బాపు గారికి విశ్వనాథ అభినందన – ఒక పేరడీ

రాసిన వారు: శ్రీరమణ (ఈ వ్యాసం 1982 నాటి ఒక ఆంధ్రజ్యోతి వార పత్రిక సంచిక లోనిది. బాపు గారి...
by పుస్తకం.నెట్
14

 
 

వెలుగు నీడలు -ముళ్ళపూడి కళ్ళకి కట్టించిన వెండితెర నవల

వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్ ************ ముళ్లపూడి వెంకటరమణకు తెలుగువచనం సహజాభరణం. త...
by అతిథి
0

 
 

మళ్ళీ బాపు కొంటె బొమ్మలు

నా హౌస్‌సర్జెన్సీ ఐపోతున్న రోజుల్లో (సెప్టెంబరు, 1979) నవోదయా వారు కొంటె బొమ్మల బాపు అం...
by Jampala Chowdary
4