Bird by Bird: Anne Lamott
ఒక రెండు మూడేళ్ళ క్రితం “How to read?”, “How to write?” అన్న అంశాలను చర్చించే పుస్తకాలను వరుసగా చదివాను. Stephen King రాసిన On Writing, Self Editing for Fiction Writers లాంటి పుస్తకాలు తెల్సినవాళ్ళు సిఫార్సు చేస్తే, Francine Prose రాసిన Reading Like a Writer, How to write like Chekhov, Zen in the art of writing అన్న పుస్తకాలు నా వెతుకులాటలో దొరికాయి. ఇవ్వన్నీ బ్రహ్మాండమైన పుస్తకాలు. ఏదో ఒకటి రాసేయాలని లోలోపల పురుగు దొలిచేయనవసరం లేదు ఈ పుస్తకాలు చదువుకోవాలంటే. రచనా వ్యాసంగం ఎంత కష్టమైనా, దాన్ని ఇష్టంగా మార్చుకొని, దానికోసం ఎంతో శ్రమపడిన వారి అనుభవాలు ఇవి. అవి చదువుకోవాలంటే మనం కూడా గొప్ప రచయితలై పోవాలనే ఆశయాలు, ఆవేశాలు ఉండనవసరం లేదు. ఒక సైంటిస్ట్ సైన్స్ గురించి మాట్లాడితే, ఒక ఆటగాడు తన ఆటను గురించి మాట్లాడితే.. వాళ్ళ రంగాలైన సైన్స్, స్పోర్ట్ లో పనికొచ్చే విషయాలు ఎన్ని తెలుస్తాయో, అలానే ఆ రంగాలకు పరిమితంగానీ ఒక universal truth అనిపించుకునే లక్షణాలు ఉన్న సంగతులూ తెలుస్తాయి. లాబ్‍లో చేసే ప్రయోగాల్లోనూ, ఎంతెంతో దూరం వెళ్ళే పరుగులోనూ, బల్ల దగ్గర నుండి లేవకుండా వేళ్ళు నొప్పి పెట్టేంతగా రాసే రచనలోనూ దీక్ష, పట్టుదల, శ్రమ దాదాపుగా ఒకటే! తెల్సుకునేకొద్దీ అవన్నీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అందుకే, అలాంటి పుస్తకాలు చదివే అవకాశం వదులుకోడానికి ఇష్టపడలేదు.
ఈ పుస్తకాల జాబితాలో తెలిసి వచ్చిన మరో పుస్తకం: Bird by Bird: Some Instructions on Writing and Life అనే పుస్తకం కూడా ఒకటి. అయితే, ఈ పుస్తకం నాకు అప్పట్లో దొరకలేదు. ఇండియన్ స్టోర్స్ లో స్టాక్‍లో లేదు. బయట నుండి తెప్పించుకుందామంటే బోలెడు ఖర్చు. కానీ ఎక్కడ చూసినా దీని గురించి మంచి రివ్యూలు, రేటింగ్‍లూ. చానాళ్ళు ఎదురుచూశాక, మొన్నీ మధ్యే నా చేతికి దొరికింది. ఎన్నాళ్ళ ఎదురుచూపులవల్ల ఈ పుస్తకం గురించి నా ఆశలు రెట్టింపు అయ్యాయేమో, రచన మాత్రం నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. “ఈ చాప్టర్ బాగోపోతే ఏం? వచ్చేది బాగుంటుంద”ని అనుకుంటూ మొత్తం పుస్తకం చదివేసినా ఏదీ నచ్చలేదు. ఏదో అక్కడక్కడా వాక్యాలు అండర్‍లైన్ చేసుకున్నా, మొత్తంగా పుస్తకంలో ఏముందో నాకింకా అర్థం కావటం లేదు.
ఈవిడో రచయిత. ఏవో కథలూ, నవలలూ రాసిందట. రచనా వ్యాసంగంపై ఈవిడేవో లెక్చర్లు ఇస్తూ ఉంటారనుకుంటా. అందుకని పుస్తకం మొత్తం “నా స్టూడెంట్స్ కి ఇలా చెప్తా”, “నా స్టూడెంట్స్ నన్ను అది అడుగుతారు” లాంటి వాక్యాలతో నిండి ఉంటుంది. ఈవిడ నాన్నగారు కూడా రచయిత. ఆయన కాన్సర్‍తో పోరాడుతున్నప్పుడు, ఆ అనుభవాలన్నింటిని రాసి పబ్లిషర్‍కి పంపించనప్పటి విశేషాలతో పుస్తకం మొదలవుతుంది. ఆ తర్వాత, యాధావిధిగా, కథలో పాత్రలను ఎలా సృష్టించాలి? అవి ఎలా మాట్లాడుకోవాలి? ప్లాట్ అంటే ఏంటి? దాన్ని పకడ్బందిగా ఎలా రూపొందించాలి? లాంటి అంశాల మీద ఈవిడ అనర్గళంగా మాట్లాడుతూ పోతారు. (అవును. నాకు రాసినట్టు అనిపించలేదు. ఏదో చెప్పుకుంటూ పోయినట్టు అనిపించింది. ఇష్టంలేని క్లాసులో కునిపాట్లు పడుతూ విన్నట్టు చదివాను దీన్ని.)
మన ఇష్టాన్ని ఇష్టంగా చెప్పకుండా, ఎవరినో ఉద్ధరించినట్టు చెప్పినప్పుడు ఇష్టం బయటకి రాదు. అదే, ఈ పుస్తకంలో నాకు ముఖ్యమైన సమస్య. నేను చదివిన తక్కిన పుస్తకాలకీ, దీనికి అక్కడే తేడా. రచనా వ్యాసంగం గురించి మాట్లాడుతూ ఈవిడ జీవితంలో నుండి తీసుకున్న సంఘటనలు, ఉదాహరణలు కూడా నన్ను అంతగా ఆకట్టుకోలేకపోయాను. ఆఖరకి, ఇది Bird by Bird ఎందుకైందోనన్న కారణం చాలా పేలవంగా చెప్పినట్టు అనిపించింది.
“Thirty years ago my older brother, who was ten years old at the time, was trying to get a report written on birds that he’d had three months to write, which was due the next day. We were out at our family cabin in Bolinas, and he was at the kitchen table close to tears, surrounded by binder paper and pencils and unopened books about birds, immobilized by the hugeness of the task ahead. Then my father sat down beside him put his arm around my brother’s shoulder, and said, “Bird by bird, buddy. Just take it bird by bird.”
పేజీలకు పేజీలు రాసేసి, పుస్తకాన్ని అచ్చేసి, బోలెడంత పేరూ, సంపద దొరికించుకోవాలన్నఆశయాలున్నవారిని దృష్టిలో ఉంచుకుని రాసిన పుస్తకం అనిపించింది. మాథ్స్ పై ఇంటరెస్టింగ్‌గా రాయడానికి, ఓ ఎంసెట్ క్రాష్ కోర్సు మెటిరీయల్‌కు ఉన్నంత తేడా ఉంది ఈ పుస్తకంలో.
ఇహ, ఫిక్షన్ అంటే మన జీవితాల గురించి మనమే రాసుకోవడం అన్న థియరీ నాకు చిరాకు పుట్టిస్తుంది. ఈవిడ దాన్ని మాత్రమే నొక్కి వక్కాణించి చెప్పింది.
“Remember that you own what happened to you. If your childhood was less than ideal, you may have been raised thinking that if you told the truth about what really went on in your family, a long bony white finger would emerge from a cloud and point to you, while a chilling voice thundered, “We *told* you not to tell.” But that was then. Just put down on paper everything you can remember now about your parents and siblings and relatives and neighbors, and we will deal with libel later on.”
“You own everything that happened to you. Tell your stories. If people wanted you to write warmly about them, they should have behaved better.”
మనకి ఏ విధంగానో అన్యాయం చేసినవారి గురించి ఆక్రోశంగా ఓ కథ రాస్తే సరిపోతుందా? దాని కన్నా తలుపు మూసుకొని గొంతు చించుకొని అరవడం మేలు కదా?
అరుదుగా, ఎక్కడో ఒక చోట ఒక్కో మంచి వాక్యం తగులుతుంది ఇలా.
“Don’t look at your feet to see if you are doing it right. Just dance.”
అయినా కూడా, ఇది అంత చదవదగ్గ పుస్తకం అనిపించలేదు. దీనికి ఎందుకింత మంచి రివ్యూలు, రేటింగులూ వచ్చాయో అర్థం కాలేదు. మరీ ఖాళిగా ఉండి, ఇది తప్ప చదవడానికి ఏం లేదంటే తప్ప, చదవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశ్యం.
మొదటి పేరాలో నేను చెప్పిన పుస్తకాల వల్ల మంచి మంచి రచనలు ఇంకెన్నో తెలిశాయి. ఈ పుస్తకం ద్వారా అలా ఇంకో మంచి పుస్తకం కూడా దొరకలేదు. అది ఇంకో నిరాశ.
Non Fiction
Paperback
237
Hari
Bravo