ధర్మవిజయం – డా. సోమరాజు సుశీల
వ్యాసకర్త: కామాక్షి
*****
డా. సోమరాజు సుశీల గారు మరాఠీ నుండి తెలుగులోకి అనువాదం చేసిన పుస్తకం ఇది. మూలకథా రచయిత్రి శ్రీమతి సింధూ నావలేకర్, లోకమాన్య బాలగంగాధర తిలక్ మునిమనుమరాలు.
ఆవిడ వారానికి ఒక రోజు చొప్పున సుమారు రెండు సంవత్సరాల పాటు మహాభారత కథపై ప్రవచనాలు చేశారట. ఆ ప్రవచనాల సంకలనం “మునిసాంగే నృపనాథా!” అనే పేరుతో ప్రచురించబడింది. దానినే ధర్మవిజయం అనే పేరుతో సోమరాజు సుశీల గారు తెలుగులోకి అనువదించారు. మహాభారత కథను సరళ భాషలో సంక్షిప్తంగా వివరించిన ఈ పుస్తకం బాగుంది. 18 అధ్యాయాలు వున్నాయి పుస్తకంలో.
పుస్తకం మొదట్లో పాండవుల వంశక్రమం యిచ్చారు వివరంగా. ఇంతవరకూ మహాభారతం వివరంగా చదవలేదు. సంక్షిప్త రచనలు మాత్రమే చదివాను. ఇది కూడా సంక్షిప్త రచనే అయినా కొన్ని చోట్ల చిన్న చిన్న వివరాలు కూడా యిచ్చారు. గంగ భీష్ముడిని శంతనుడికి అప్పగిస్తూ “ఇతడు వశిష్టుని వద్ద వేదాలు అధ్యయనం చేశాడు, శుక్రనీతినీ, బృహస్పతి నీతినీ కూడా నేర్చుకున్నాడు. పరశురాముని వద్ద శస్త్రాస్త్ర ప్రయోగాలు నేర్చుకున్నాడు.” అని చెప్పడం, అలాగే తనకోసం భీషణ ప్రతిజ్ఞ చేసినందుకు ఆనందించి శంతనుడు భీష్ముడికి స్వేచ్చా మరణం పొందేట్లుగా వరం ఇవ్వడం – సాధారణంగా ఇటువంటి విషయాలు యింత వివరంగా సంక్షిప్త రచనలలో వుండవు.
నారద మహర్షి యుదిష్టరుడి దగ్గరికి వచ్చిన సందర్భం. యముడు, వరుణుడు, కుబేరుడు, ఇంద్రుడు, బ్రహ్మ మొదలైన వారి సభలను వర్ణించడం – ఇది కూడా కొంత వివరంగానే వుంది. ఇంద్రుడి సభ పేరు పుష్కరమాలిని. నూరు యోజనాల పొడుగు, నూట యాభై యోజనాల వెడల్పు, ఐదు యోజనాల ఎత్తు కలిగి దివ్యంగా మెరిసే సుందరమైన సభ అది. అక్కడ ఇంద్రుడు శచీదేవితో కూడి కూర్చుని ఉంటాడు. మరుద్గణాలు, సిద్ధగణాలు, దేవర్షులు అనేకమంది వచ్చి ఇంద్రుణ్ణి సేవిస్తూ వుంటారు.
యమరాజు సభ బంగారపుది. సూర్యుని వలే ప్రకాశిస్తూ వుంటుంది. ఎక్కువ వేడి గాని, ఎక్కువ చల్లదనం గాని లేని సుఖమయమైన వాతావరణం కలిగి వుంటుంది. పళ్ళు, పూలు కలిగిన వృక్షాలతో నిండిన సలక్షణమైన సభ అది.
వరుణుని పుష్కర తీర్థం పేరు ‘మాలిని’. అది శుభ్ర, దివ్య, రత్నఖచిత సభ. పరిసరాలలో గల తోటలలో నుంచి పక్షుల మధుర స్వరాలు వినిపిస్తుంటాయి. నాగశ్రేష్టులు, దానవులు ఈ సభకు తరచుగా వస్తూ వుంటారు.
కుబేరుడి సభ కైలాస శిఖరము వలే ఎత్తుగా వుంటుంది. మంచి పూల పరిమళం ఆ గాలిలో వుంటుంది. చందన వృక్షాలు చుట్టూ వుంటాయి. అప్సరసలు, గంధర్వులు ఆ సభకి తరచూ వస్తారు.
బ్రహ్మ యొక్క సభా సౌందర్యాన్ని వర్ణించడం కష్టం. క్షణక్షణానికీ వేర్వేరు దివ్యమైన రూపాలుగా కనిపించే అద్భుతమైన సభ అది. అక్కడ దేవతలు, మహర్షులు ఎప్పుడూ వచ్చి కూర్చుని వుంటారు.
ఇలా ఇంత వివరంగా సభల వర్ణన వుంది. అయితే మూల మహాభారతంలో ఒక్కొక్క సభ గురించి ఒక్కొక్క అధ్యాయమే వుందట.
అలాగే పాండురాజు కుంతిని నాలుగవ పుత్రుడి కోసం ప్రయత్నించమని అడిగితే (ధర్మరాజు, భీముడు, అర్జునుడు పుట్టాక) ఆవిడ కాదని స్పష్టంగా చెప్పింది. నాల్గవ కుమారుడిని కంటే స్త్రీని స్వైరిణి అంటారు. ఐదవకుమారుడిని కంటే వేశ్య అంటారు. కాబట్టి ధర్మం తెలిసిన పాండురాజు తనని బలవంత పెట్టకూడదని చెప్పింది – అన్న విషయం ఈ పుస్తకంలో క్రొత్తగా చదివాను. ఇంతకు మునుపు ఎపుడూ వినలేదు.
_____________
పుస్తకం వెల రూ 200/-
ప్రతులకు : సాహిత్య నికేతన్, కేశవనిలయం,బర్కత్ పురా, హైదరాబాద్ – 500027
మరియు సాహిత్య నికేతన్,పెద్దిభొట్లవారి వీధి, విజయవాడ – 520002
Srikanth
Please tell us where can we buy a copy of this book? Thank you.
eswar
నైస్ బుక్ ..ప్రతి వ్యక్తి చదవవలిసిన పుస్తకం…దీనిలో ప్రతి విషయం చెప్పబడింది….. కొన్ని విషయాల గురించి నేను ఫస్ట్ టైం దర్మవిజయం లో చదివాను..చాల బాగా వివరించారు సింధు గారు.థాంక్స్ సుశీల గారు ..మంచి కథని అనువదించి మాకు అందించారు…
Amarnath
నాలుగవ, ఐదవ కుమారుడి గురించి చెప్పిన విషయం కుంతి ఉపయోగించిన మంత్రానికి/వరానికీ సంబంధించినది అని (అది ఆపద్ధర్మం కోసం వాడినది కనుక) ఒక వ్యాఖ్యానం లో చదివినట్టు గుర్తు. సహజంగా కలిగే పుత్రుల విషయం లో కాదు.