నాస్తికధూమము -కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీ రాధిక
*******
ఇది పురాణవైర గ్రంథమాలలో రెండవ నవల. ఈ నవలలో బాగా ఆకట్టుకునేది పాత్రచిత్రణ. ఈ నవల మొదలవడమే చాలా విలక్షణంగా మొదలవుతుంది.

“శ్రీముండీ చాముండీ! నిన్నెందుకే యింత కాలము నుండి కొలుచుచున్నాను! నీకు బుద్ధి లేదే! నిన్ను దేవతవని కొలిచినవాడు పశువు…. ఇంకెన్నాళ్ళీ భారతీయ సంస్కృతి, వైయాసిక నాగరికత, కృష్ణ విరచిత భగవద్గీతా పఠనము, వేదోపనిషత్తుల రాజ్యము సాగనిత్తుము!? సాగనీయము. ఎచ్చటి దచ్చట నిర్మూలము చేయుదును….. నాకోర్కె తీర్చవలయును. అది జరిగి తీరవలయును. లేనిచో నీ గతి ఇంతే! కొరడా దెబ్బలు తప్పవు! తపము చేసెడి నాళ్ళలో నా దేహమును కత్తులతో క్రుమ్మితివి. కొండలపై నుంచి దొరలించితివి. సెలయేళ్ళలో విసరివేసితివి. జలపాతముల నుండి దూకించితివి. నీవు నా వశమగు వరకు జేసిన ప్రయత్నములట్టివి! నా వశమయితివి. ఐన తరువాత నా మాట ఎందుకు వినవు? ఇప్పుడు శిక్ష కొరడా దెబ్బలు!”

ఇలా మాట్లాడుతూ చేతిలోనున్న కశతో ఎదురుగా భయంకరమైన ఆకారంతో వున్న చాముండీ విగ్రహాన్ని ఫెడేల్ ఫెడేల్ మని కొడుతున్న వృద్ధుడూ, క్షుద్రుడూ అయిన ఉపాసకునితో ప్రారంభమవుతుంది.

ఆ దేవీ విగ్రహం వింధ్య పర్వతాలలోని ఓ నిర్జన ప్రాంతంలో వుంది. దానిని మగధ రాజధాని యైన గిరివ్రజపురము నుంచి తరలించుకుని వచ్చి ఎవరో కొన్ని వందల ఏండ్ల క్రిందట అక్కడ ప్రతిష్టించారని వదంతి వుంది. జరాసంధుడు ఆ దేవిని ఉపాసించే వాడనీ అయితే ఆ తర్వాత అతని మనుమడైన సోమాధి ఆ దేవత తన రాజ్యానికి అరిష్టదాత్రి అని భావించి యామెను వెడలెనడచె నని చెప్పుకుంటారు. సోమాధి ఆ విగ్రహాన్ని గిరివ్రజపురం నుంచి పంపివేయ దలచి దానిని ఒక చండీ ఉపాసకుడికి ఇచ్చాడు. అతడు దాన్ని వింధ్య పర్వత ప్రాంతాలకు తీసుకువచ్చి ప్రతిష్ఠించడానికి ఇరవై రెండు రోజులు పట్టిందట. అందుకని సోమాధి తర్వాత యిరవై యిద్దరు రాజులు పాలన చేశాక జరాసంధుని వంశం నశిస్తుందని దేవి శాపం వుందని చెప్పుకుంటారు.

ఆ యిరవై రెండో రాజు ఇప్పుడు రాజ్యం చేస్తున్న రిపుంజయుడు. మార్జారి (సోమాధి) మహారాజు తర్వాత రెండు మూడు వందల ఏండ్ల వరకూ ఆ వింధ్య మహారణ్యములలో ఆ దేవికి పూజా పురస్కారాలు జరుగుతూ ఉండేవట. ఆశ్చర్యమేమిటంటే మగధ రాజ వంశంలో మొదటి బృహద్రధ రాజు నుంచి ఇప్పటి రిపుంజయుడి దాకా ఈ పదహారు వందల ఏండ్లలో ముప్పది యిద్దరు రాజుల భార్యలూ ఆ దేవి భక్తురాండ్రు. కొంతమంది కొంచెం ఎక్కువగా కొంత మంది తక్కువగా పూజించినా మొత్తం మీద అందరూ అపుడపుడూ వింధ్య పర్వత ప్రాంతాలకు వెళ్ళి ఆ దేవిని దర్శించడం కానుకలివ్వడం చేశారు. ఇప్పటి రిపుంజయ మహారాజు భార్య మాహేశ్వరి. ఆవిడ ఈ చాముండికి పరమోపాసకురాలు. ఇంతకు పూర్వం రాణులు దేవి భక్తులైనా వారికి తీవ్రోపాసకులైన గురువులు లేరు. మాహేశ్వరికి వున్నాడు. నవల మొదట్లో దేవీ విగ్రహాన్ని తిడుతూ కొడుతూ వున్న తీవ్రోపాసకుడే ఆమె గురువు. అతను జయద్రథుడు. (పురాణవైర గ్రంథమాలలోని మొదటి పుస్తకం – భగవంతుని మీది పగ – లో జయద్రథుని గురించీ, ఆ వంశం వారి పగ గురించీ చెప్పబడింది.) ఇక ఈ మాహేశ్వరి కాశ్మీర రాజ వంశానికి చెందిన స్త్రీ. ఆమె తండ్రి శూరసేనుడు.

మ్లేచ్ఛ జాతులలో చాలామంది మహాపండితులున్నారు. వాళ్ళు భారతదేశమంతా తిరుగుతూ మ్లేచ్ఛ భావ ప్రచారం చేస్తుంటారు. అటువంటి వారిలో ఒకడయిన వెలియోనసు అనేవాడు శూరసేనుడి కాలంలో వుండేవాడు. అతను మధురమైన కంఠంతో శ్రావ్యంగా పాడుతూ బిక్షాటన చేస్తూ అందర్నీ ఆకర్షిస్తూంటాడు. అతను వట్టి పాటకుడైన బిచ్చగాడు మాత్రమే కాదు. తీవ్ర దేవతోపాసకుడు. కొన్ని మహిమలు, శక్తులు ఉన్నవాడు.

మాహేశ్వరి చిన్నపిల్లగా వున్నప్పుడే అతని పాటకు ముగ్ధురాలయ్యింది. పదేళ్ళు దాటాక ఆమె అతనికి శిష్యురాలయిపోయింది. అతను మాహేశ్వరికి తన క్షుద్రవిద్యలన్నీ నేర్పాడు. దేశమంతా తిరిగే వెలియోనసుకు మగధ రాజాంతఃపురంలోకీ ప్రవేశం వుంటుంది. అతని రాయబారం తోనే మగధ రాజకుమారుడు రిపుంజయుడికీ, మాహేశ్వరికీ వివాహమవుతుంది.

అలా మగధకు వచ్చిన మాహేశ్వరి మొదట అత్తగారితో పాటు, ఆతర్వాత వంటరిగాను కూడా వింధ్య పర్వతశ్రేణులలోని దేవిని దర్శించేందుకు వెళ్తూ వుండడం, అక్కడ జయద్రథుడు ఆమెను తన వశం చేసుకోవడం జరుగుతాయి. అది జరిగి పదహారేళ్ళు. పదహారేళ్ళుగా ఆమె అతనికి శిష్యురాలు. శిష్యురాలు అంటే దాసి, బానిస, ఉంపుడు కత్తె. చాముండీ దేవతనే రండ, లంజె మొదలయిన తిట్లు తిట్టే అతను మాహేశ్వరికీ అలాంటి మర్యాదే యిస్తాడు. అతన్ని ఎదిరిస్తే ఆమెకి విపరీతమయిన తలనొప్పి, కడుపు నొప్పి, జ్వరం లాంటివి వస్తాయి. రాజవైద్యులు వాటిని నయం చేయలేరు. ఈ జయద్రథుడు వింధ్యగిరిస్వామిగా ప్రసిద్ధుడు. విపరీతమైన స్త్రీవాంఛ కలవాడు. “సత్కులీనులైన స్త్రీలను వ్యభిచారిణులను చేయడం ద్వారా వారి వంశ రక్తాన్ని కలుషితం చేయడం ద్వారా వర్ణవ్యవస్థను నాశనం చేయాలి” అన్న భావన వున్నవాడు.

సాధారణంగా అతని దృష్టి పడిన స్త్రీలందరూ అతనికి వశులైనా, అరుదుగా ఒకరిద్దరు అతనికి లొంగకపోవడం తమ భర్తలతో అతని గురించి చెప్పడం వారు అతన్ని ఏమీ చేయలేక వూరుకున్నప్పటికీ అతని కీర్తితో పాటూ అతనిని గురించిన ఈ వాస్తవం కూడా ప్రచారం లోకి రావడం జరుగుతుంది. రిపుంజయుడికీ మాహేశ్వరి మీద, స్వామి మీద అనుమానం కలుగుతుంది. బలపడుతుంది. మాహేశ్వరీ అది గుర్తించి స్వామితో చెబుతుంది. అతడు వికటంగా నవ్వి వూరుకుంటాడు.

ఇపుడు మాహేశ్వరికి స్వామి మీద భక్తీ, ప్రేమ లేవు. భయం మాత్రమే వుంది. మాహేశ్వరి కూతురు తులసీదేవిని తన దగ్గరకు తీసుకు రావాలని వత్తిడి చేస్తూ ఉంటాడు స్వామి. మాహేశ్వరి ద్వారా తనకు పురుషసంతానం కలిగితే అతను మగధకు రాజవుతాడు కనుక అతని ద్వారా వైదికమతంపై తన పగ తీర్చుకోవాలనుకుంటాడు స్వామి. అది జరగలేదు కనుక ఇపుడు తులసీదేవి ద్వారానైనా కొడుకుని కనాలని అతని ఉద్దేశ్యం. తులసీదేవి లోకోత్తర సౌందర్యవతి. రెండేళ్ళ క్రితం స్వామి ఆమెను చూసినపుడు ఆమెను తన శక్తులతో ముగ్ధురాలిని చేసి ఫలానా రోజున నీకు తీవ్రమైన శిరోబాధ కలుగుతుంది. అప్పుడు నన్ను తలచుకుంటే అది తగ్గుతుంది. అని చెప్తాడు.

మగధ రాజ్య మాహాసేనాని మునీకుడు. ఆయన తులసీదేవికి శిరోబాధ కలిగినపుడు గంగాధరశర్మ అనే ఆయనని ఆమె దగ్గరకు తీసుకువస్తాడు. ఆ గంగాధరశర్మ తులసీదేవి బాధని సులభంగా నివారించాడనీ, వింధ్యగిరిస్వామి దుష్టత్వాన్ని కూడా ఆమెకు తెలియచేశాడనీ మాహేశ్వరికి అర్ధం అవుతుంది. ఆమె ఆ విషయాన్ని స్వామికి తెలియచేస్తుంది కూడా. అయినా స్వామి తులసీదేవిని తీసుకురావలసిందేనని, లేకుంటే కుటుంబం మొత్తాన్నీ నాశనం చేస్తాననీ మాహేశ్వరిని భయపెడతాడు.

ఆ స్థితిలో మాహేశ్వరి తన బలాబలాలని అంచనా వేసుకుంటుంది. ఆమె ఆలోచనలు ఇలా సాగుతాయి – పేరుకు రాణి అయినా రాజు తనపై కోపంగా వున్నాడు కనుక తనకు ఉండవలసినంత అధికారం లేదు. అయితే పూర్తిగా లేకనూ పోలేదు. ఆమె అధీనంలో ఒక వంద మంది సైన్యం వున్నారు. ఆమె వింధ్యగిరి వెళ్ళినపుడల్లా ఆమెకు రక్షణగా వెళ్ళేందుకు రాజు నియమించిన సైన్యం అది. అయితే ఆ సైన్యంలోని వారందరికీ ఆమెకి స్వామితో వున్న సంబంధం గురించి తెలుసు కనుక ఆమెపై పెద్ద గౌరవముండదు. ఉద్యోగధర్మంగా ఆమె ఆజ్ఞలని పాటిస్తారు. అంతే. ఆ సేనానాయకుని పేరు వీరసేనుడు. అతనికి తానంటే గౌరవం లేకపోవడమూ, అవకాశం దొరికినపుడు తనని తాకాలని ప్రయత్నించడమూ మాహేశ్వరి గమనించింది. అలాగే మహాసేనాధిపతి మునీకుడు. ఆయన వృద్ధుడు. అయినా ఆయనకీ తన మీద కోరిక వుందని ఆమె గ్రహిస్తుంది.

ఆమెకున్న మరొక బలము ఆమె పినతల్లి కుమారులు. అవంతీ రాజు సింహనాధుడు, అతని తొమ్మిదిమంది సోదరులు. వారు వీతిహోత్ర వంశజులు. ఆ పదిమందీ దిగ్దంతులు. వాళ్ళకు మునీకుడు భయపడతాడు. మునీకుడి కొడుకు ప్రద్యోతనుడు. మునీకుని వయసు నూట యాభై పైనే. ప్రద్యోతనుడికి యాభై ఏళ్ళు వుంటాయి. ప్రద్యోతనుని కూతురు పద్మావతి. పద్మావతి, మాహేశ్వరి కూతురు తులసి సమవయస్కులు. స్నేహితురాళ్ళు.

మునీకుడిని సాధించాలంటే మాహేశ్వరికి పినతల్లి కొడుకులైన వీతిహోత్రులే దిక్కు. అయితే వారికీ వింధ్యగిరి స్వామికీ మైత్రి వుంది. ఆ అన్నదమ్ములలో ఒకడు స్వామి శిష్యుడు. వారి అండ జూసుకుని తను స్వామిని ఎదిరించలేదు. ఇలా మాహేశ్వరి తన స్థితి గురించి తర్జన భర్జన పడే సమయంలో స్వామికీ తనకీ వున్న సంబంధం విషయంలో ఆమె భావాల గురించి బాగా చెప్తారు రచయిత. “భయంతో స్వామికి తాను లొంగిపోయింది. భయముతో మునీకుడికీ వశము కావచ్చు. కానీ స్వామి యందలి భయములో ఏదో అలౌకిక వాసన వుంది. మునీకుని వలని భయములో అది లేదు. ఇది భేదము కల్పించుచున్నది.” అనుకుంటుంది.

ఇక వీరసేనుడికి తనపై ఆశ వుంది. తాను కనులెర్ర చేయడంతో కొంత భయపడి ఆగాడు. అతనిని వశపరచుకుని వీతిహోత్రులకు వార్త పంపటం ఎలా ఉంటుందని మాహేశ్వరి ఆలోచిస్తూ వుంటుంది. ఈలోపే మునీకుడు ఒక చిత్రమైన వ్యూహం పన్ని వీతిహోత్రులలో తొమ్మిదిమంది రాకుమారులు చనిపోయేలా చేస్తాడు. అసలీ మునీకుడి కథ ఏమిటంటే అతను చిన్నప్పుడే యింటి నుండి పారిపోతాడు. ఎక్కడెక్కడో తిరిగి ఏవో క్షుద్ర విద్యలు నేర్చుకుంటాడు. ఒక పిశాచ దేవతని ప్రత్యక్షం చేసుకుని తాను రాజు కావాలని కోరుకుంటాడు. ఆమె “నువ్వు సేనాపతివి అవుతావు. నీ కొడుకు ఒక రాజకుమార్తెని పెళ్ళాడి రాజవుతాడు.” అని చెప్తుంది. అప్పుడతడు మధుర చేరి ప్రస్తుత మగధ రాజైన రిపుంజయుని తాతగారైన సత్యజిత్తు కాలంలో మగధ సేనలో చేరతాడు.
అప్పటినుంచి యిప్పటివరకు అతడే మహాసేనాధిపతి! మునీకుడు దుష్టుడు. కాని అతని కొడుకు ప్రద్యోతనుడు తన సుగుణములతో ప్రజల అభిమానాన్ని పొందినవాడు. ఇంతకీ యిపుడు మునీకుడి కోరిక తన కొడుకుని రాజుని చేయాలని. పాతికేళ్ళ క్రితం అతనికి పెళ్ళి చేయాలనుకున్నపుడే ఎవరైనా రాకుమార్తెని యిచ్చి చేసేందుకు ప్రయత్నించాడు. కుదరలేదు.

ఇపుడు రిపుంజయుడికి పురుష సంతానం లేదు కనుక అతని కూతురైన తులసీ దేవి ప్రద్యోతనుడినిని పెళ్ళాడితే ప్రద్యోతనుడు రాజవుతాడు. ఈ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు రచిస్తాడు మునీకుడు. అది చాలావరకు నెరవేరుతుంది కూడా. యాభైఏళ్ళ ప్రద్యోతనుడికి, అతని కూతురి సమవయస్కురాలైన తులసీదేవికి మధ్య ప్రేమ చిగురించడం, రాజు రిపుంజయుడు అనారోగ్యానికి గురి చేయబడడం, ఆ తర్వాత మరణించడం అంతా మునీకుడి వ్యూహం ప్రకారం జరుగుతుంది. రాజు చనిపోయాడు. అంతా మునీకుడి వ్యూహం ప్రకారం జరిగింది అన్నాం కదా! అంటే ఏమిటి? రాణి ఓడిపోయిందా? కాదు. రాణి మాహేశ్వరి ఆఖరి క్షణంలో అంతకు మించిన వ్యూహరచన చేస్తుంది. అప్పటివరకూ ఏ ప్రాధాన్యతా లేని గంధవాహుడు, విశ్వపతి లాంటి పాత్రలన్నీ ఉన్నట్లుండి బయటకి వచ్చి మాహేశ్వరి ఆధ్వర్యంలో అద్భుతమనిపించే సమర్థతని కనపరుస్తాయి. అంటే మాహేశ్వరిది పైచేయి అవుతుందా! అదీ కాదు.
మరేమవుతుంది?

ఒక ప్రక్క మునీకుడి వ్యూహం బయట పడుతుండగానే కథ చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతుంది. మునీకుడు, మాహేశ్వరి, వింధ్యగిరిస్వామి, ప్రద్యోతనుడు, తులసి, గంగాధరశర్మ, గంధవాహుడు – చిన్న పాత్రలూ, పెద్ద పాత్రలూ కూడా ఒకదాన్ని మించి ఒకటి వామనుడిలా పెరిగిపోతాయి. ఏ పాత్ర చూస్తే ఆ పాత్ర ఇక ఇదే మిగతా కథని తన చేతుల్లోకి తీసుకుని నడిపించేస్తుందేమోననిపిస్తుంది. ఒక కథానాయకుడు, ఒక ప్రతినాయకుడు.. స్పష్టమైన రెండు పక్షాలు.. అంతకంటే స్పష్టంగా కనబడే ఆ రెండు పక్షాల సంబంధాలు, ద్వేషాలు, ప్రేమలు – ఇలాంటి మామూలు కథలకి అలవాటు పడిన మనం ఎవరు నాయకుడు? ఎవరు ప్రతినాయకుడు? ఎవరు బలవంతుడు? ఎవరు బలహీనుడు? మునీకుడే పక్షం? ఏ కొడుకుని రాజుని చేయాలని మునీకుడు సర్వవ్యూహాలూ రచిస్తున్నాడో ఆ కొడుకు ప్రద్యోతనుడే పక్షం? మాహేశ్వరి ఏ పక్షం? ఏ కూతురి క్షేమం కోసం ఆమె వింధ్యగిరి స్వామి అంతటి వాడిని ఎదిరించడానికి సిద్ధపడిందో ఆ కూతురు తులసి ఏ పక్షం? ఎవరు ఎవరికి శత్రువులు? ఎవరు ఎవరికి మిత్రులు? – వీటిలో ఏ ఒక్క ప్రశ్నకీ సులభంగా సమాధానం చెప్పలేని విధంగా పాత్రలనీ, సంఘటనలనీ, సన్నివేశాలనీ, సంభాషణలనీ సృష్టించి, నడిపించిన రచయిత మాయలో నిజంగా వూపిరయినా తీసుకోకుండా కొట్టుకుపోతాం.

చివరికి ఏమవుతుంది? అన్న ప్రశ్న అసలు ముఖ్యమే కాదనిపిస్తుంది. అయినా సమాధానం చెప్పుకోవాలంటే ప్రద్యోతనుడు తులసిని పెళ్ళాడి మగధ రాజ్యాధిపతి అవుతాడు. మునీకుడు గంధవాహుడి చేత, గంధవాహుడు, మాహేశ్వరి వింధ్యగిరిస్వామి చేత యుద్ధంలో చంపబడతారు. వింధ్యగిరిస్వామి (జయద్రథుడు) తానూ శారీరకంగా నిర్వీర్యుడై చితి పేర్చుకుని చితారోహణము చేస్తాడు. ఆ చితిలో నుంచి పైకెగసిన నాస్తికధూమములు ఉలూక, త్రిగర్త, కాంభోజ, గాంధార మత్స్య, కుంతిభోజ, మాగధ, నిషధ, హైహయ, వంగ, ఆంధ్ర, ద్రావిడ, పుండ్రాది సర్వదేశములకు సాగుతాయి. కొన్ని పొగలు సముద్రములు దాటిపోతాయి. తెల్లవారేసరికి పక్షుల కిలకిలారావాలతో పాటు ఒక భక్తుడు వదిలిపెట్టిన చిలుక చండీ విగ్రహము శిరస్సు మీద కూర్చుని “కృష్ణా” అంటూ వుంటుంది. అదీ కథ!

ఇక్కడ చాలా క్లుప్తంగా చెప్పిన విషయాలూ, వ్యూహాలూ నవలలో చాలా గొప్పగా ఉద్విగ్నభరితంగా చిత్రీకరించబడినాయి. మాహేశ్వరి మనసులోని భావాలనీ, ఆమె ఆలోచనలనీ చాలా చక్కగా చిత్రిస్తారు రచయిత. స్వామితో తనకున్న సంబంధమేమిటో అర్ధమయ్యి భర్త తనతో మాట్లాడటం మానివేశాక, ఒక ప్రక్క కూతుర్ని అప్పగించమంటూ స్వామి వత్తిడి, మరొక ప్రక్కన తన కొడుకుని రాజుని చేసేందుకు మునీకుడి వ్యూహాలు – వీటన్నిటినీ ఎదుర్కునే సమయంలో ఆమె పాత్రని చిత్రించిన తీరు నిజంగా అద్భుతంగా వుంటుంది.

భర్త వింధ్యగిరి స్వామి దర్శనానికి వెళ్ళేందుకు అనుమతినీ అందుకు కావలసిన ధనాన్నీ మంజూరు చేయలేదు. ఆవిషయమై అతనితో మాట్లాడేందుకు వెళ్ళడమా అనుకుంటుంది. ‘కులీనురాలయిన రాజు భార్య, తనతో మాటలు మానిన భర్త వద్దకు తానెప్పుడును పోదు. తాను కులీనయా?’ అని ప్రశ్నించుకుంటుంది.
తన భర్త ఒక రాజు. రెండు వేల ఏళ్ళనుండి అవిచ్ఛిన్నంగా సాగుతున్న ఉపరిచరవసు వంశోత్పన్నుడు. అతను వింధ్యగిరి స్వామి కన్నా తీసిపోయాడా? స్వామి తనని అనరాని మాటలు అనడం లేదా? ఆ స్వామి దగ్గరికి వెళ్ళడంలో లేని అమర్యాద అతని దగ్గరకు వెళ్ళేందుకు అనుమతి కోరేందుకు గాను రాజు దగ్గరికి వెళ్ళడం లో వుంటుందా! అనుకుంటుంది.

ఆ స్థితిలో వున్న పాత్ర అచ్చంగా ఇలాగే ఆలోచిస్తుందేమో అనుకునేట్లు వుంటుంది ప్రతి వాక్యమూ. అవి చదువుతుంటే ఆమె ఉద్వేగాన్నీ, భయాన్నీ, బాధనీ మనమే అనుభవిస్తున్నట్లుగా వుంటుంది. ఆమె గుండె చప్పుడు మనం స్పష్టంగా వింటున్న అనుభూతికి లోనవుతాం. అప్పుడు ఆమె తన పరిచారికలలో అన్నపూర్ణ అనే ఆమెకు విషయమంతా వివరించి రాజు దగ్గరకు పంపుతుంది. ఆమె వల్ల కాకపొతే అపుడు స్వయంగా తానే వెళ్ళాలనుకుంటుంది.
ఆ అన్నపూర్ణ మరొక ఆసక్తికరమైన పాత్ర. చాలా సాధారణ పాత్ర అనుకుంటాం మొదట ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ గురించి. పరిచయం చేసేటపుడే రచయిత కొన్ని విశేషణాలు చెప్తారు. అయితే ఆ పరిచయాన్ని బట్టి మనం వూహించుకున్న దాన్ని మించిపోతుంది ఆ పాత్ర. ఆమె మాట్లాడే మాటలు.. ఆమె తెలివితేటలు.. మునీకుని వ్యూహం మొత్తాన్నీ కనిపెట్టే ఆమె చాకచక్యం చదివి నివ్వెరపోతాం.

అంతే కాదు. రాజుపై కుట్ర నడుస్తోందని అర్ధమైన రాత్రి మాహేశ్వరి, అన్నపూర్ణల మధ్య సంభాషణ, రాణి అన్నపూర్ణ మెడను కౌగిలించుకుని ఏడవడం.. తాను సేవకురాలనీ, రాణి రాణి అనీ మర్చిపోయి అన్నపూర్ణ కూడా రాణిని కౌగిలించుకుని ఏడవడం. వాళ్ళిద్దరూ అన్ని ప్రమాదాలనీ, కష్టాలనీ కాసేపు మర్చిపోయి ఒక చిత్రమైన అనుభూతికి లోనవడం, తల్లీకూతుళ్ళ వలె ఆ రాత్రంతా చర్చించుకోవడం, ఆ సాన్నిహిత్యంలో నుంచి వచ్చే ఒక ధైర్యం – ఆ అధ్యాయం వివరించడానికి వీలవనంత బాగుంటుంది.

అంతఃపుర రక్షక సైన్యానికి సేనాని అయిన గంధవాహుడు. అదింకొక అబ్బురపరిచే పాత్ర. మునీకుడు మహాసేనాని. గంధవాహుడు అతని క్రింది ఉద్యోగి. కానీ రాణి మర్యాద కాపాడటానికి అతను చూపే శౌర్యం, మునీకుడు అమర్యాదగా ప్రవర్తించబోయినపుడు అతనిని ఎదిరించడం- ఆ అధ్యాయమంతా కూడా ఊపిరి బిగపట్టి చదివేంత ఉత్కంఠగా వుంటుంది.

అన్నపూర్ణ, గంధవాహుడు, వాళ్ళతో రాణి ప్రవర్తన – యిదంతా ఎంత అబ్బురంగా సాగుతుందంటే చివరికి అంత దుష్టుడైన మునీకుడు కూడా గంధవాహుడితో యిలా అంటాడు “ఓయీ! .. నీవంటి వాని గౌరవమునకు పాత్రురాలయిన యామె, అమర్యాదకును పాత్రురాలు కాదు. నీవు కూడ వీరసేనుని వంటి వాడవైనచో నేనామెను నిస్సందేహముగా నమర్యాద పరచి యుండెడివాడను. ఆమె నీయందు సర్వదా రాణితనమే నెరపెను. ఈ అన్నపూర్ణమ్మ గారియందును రాణితనమే నెరపెను. ఆమె కొందరియందింత రాజ్ఞీత్వము నిలువబెట్టు కొనెనని నేననుకోలేదు. ఆటవికురాలు. గ్రామీణురాలు. వింధ్యగిరిస్వామికి చెప్పుక్రింద తేలు. ఈమె వలన రాజ్యమునకు మర్యాద లేదనుకున్నాను. ఆమె వలన రాజ్యమునకు మర్యాద యున్నదని మీరిద్దరును నాకు రుజువు పరచినారు.” అంటాడు.

నిజాయితీ, నిబద్ధత వున్న సేవకుల వల్ల యజమాని గౌరవమర్యాదలు ఎలా పెరుగుతాయో రచయిత వివరించిన తీరు చూసి ముగ్ధులమవకుండా ఉండలేము. అంతే కాదు అటు రాణి ప్రవర్తన లోని మార్పు, అప్పటివరకూ పైకి గౌరవించినా లోలోపల ఒక శీలం లేని వ్యక్తి అన్న చులకన భావనతో ఉన్న సేవకులూ శత్రువులూ కూడా ఆమె రాజ్ఞీత్వాన్ని చూసి నివ్వెరపోవడం – ఆ మలుపు అద్భుతంగా వుంటుంది. ఆ పాత్ర పట్ల సానుభూతి చూపాలన్న వూహ అయినా అంతవరకూ లేని పాఠకులు ఒక్కసారిగా ఆమె పక్షమై పోతారు.

రాజు మరణించిన వెంటనే మహాసేనాని మునీకుడు కోటని తన అధీనం లోకి తీసుకోకుండా నిలువరించాలనీ, తమ రాజభక్తిని నిరూపించుకోవాలనీ ఆదేశిస్తూ రాణి మిగిలిన సైనికాధికారులతో మాట్లాడే సన్నివేశం, ఆ అధ్యాయం చాలా ఉద్విగ్నభరితంగా వుంటుంది. ఆ అధ్యాయం లో చివరి వాక్యాలు ఇవి:
“రాణి నోటివెంట వచ్చిన చివరి మాటలతో ఆ సేనాపతులు కదలాడిపోయిరి. భయపడిరి. ఒక మహాయాజ్ఞ వచ్చి తమ్ము మొగముపైన కొట్టినట్లయ్యెను. ఇంత యాజ్ఞ వారిదివరకెరుగరు. ఇదివరకు వారెరిగిన యాజ్ఞ తమ ఉద్యోగమునకు సంబంధించినట్లుండెను. ఈ యాజ్ఞ తమ యాంతరము లందున్న రాజభక్తి రాణి రూపమున యెట్టయెదురుగా నిలుచుండి – భయము, గౌరవము, ప్రేమ, భక్తి, రాజ్యరక్షణము, దుష్టశిక్షణము, స్వధర్మ నిర్వహణము మొదలగు సర్వభావముల ఏకీకృతిగ భాసించెను.”

అలాగే గంధవాహుడు మునీకుడితో కత్తియుద్ధం చేసే సందర్భం ఒకటుంటుంది. గంధవాహుడికి మునీకుడి పై గౌరవమూ, అభిమానమూ ఏమీ లేవు. యుద్ధంలో అతనిదే పై చేయి అవుతుంది. మునీకుడిని చంపగల అవకాశమూ వస్తుంది. కానీ చంపకూడదు. చంపితే కథ వుండదు. అయిపోతుంది, లేదా మారిపోతుంది. మరో రచయిత మరోరచయిత అయితే ఇక్కడ ఎలాంటి కల్పన చేసి మునీకుడు బ్రతికి పోయినట్లు వ్రాస్తారో తెలియదు కానీ.. విశ్వనాథ చేసిన పని మాత్రం ఇంకెవవరూ చేయలేరనిపిస్తుంది. ఈ క్లిష్ట సన్నివేశంలో నుంచి ఒక ధర్మసూక్ష్మం చెప్తారు మనకి. మనసు ఎంత చిత్రమైందో అది ఎటువంటి అనూహ్యమైన ఆలోచనలు చేస్తుందో చెప్తారు. ఆ పని చేస్తూ, దానినే కథ తనకి కావలసిన మలుపు తిరిగడానికి వీలుగా వాడుకుంటారు. అదెలా చేస్తారో చూడండి.

యుద్ధంలో మునీకుడిని సంహరించ వలసిన క్షణంలో గంధవాహుడు “ఇతన్ని సంహరించి నేను మహావీరుడనవుతాను నిజమే కానీ తర్వాత రాజ్యమేమవుతుంది? రాజ్యాన్ని ముంచినా, తేల్చినా అందుకు సమర్ధుడు మునీకుడే కదా! తనకు ఆ సమర్థత లేదు కదా!” అనుకుంటాడు. ఆ ఆలోచనతో మునీకుడిని వదిలేస్తాడు.
ఆ ఆలోచనలో పొరపాటు తర్వాత అర్ధమవుతుందతనికి. తాను ఒక వీరుడిలా, సాహసికుడిలా ప్రవర్తించ లేదనీ, ఒక మంత్రిలా, రాజనీతిజ్ఞుడిలా ప్రవర్తించాడనీ అది తప్పనీ తెలుస్తుంది. తాను చాలా వివేకంగా ప్రవర్తించాననుకున్నాడు కానీ అది వివేకం కాదని కోపంతో ఎర్రబడిన రాణి కన్నులు చూసినపుడు కానీ అతనికి స్ఫురించదు. రాణి అంటుంది అతనితో “ఓయీ! నీ ధర్మము నీవు నెరవేర్చలేదు. నీ కవసరము లేని ఆలోచన నీవు చేసినావు. … ఆలోచన భటుని ధర్మము కాదు. భటుని యొక్క ధర్మము కత్తి నుపయోగించుట. ఆలోచన సేనాపతి చేయును. యుద్ధమంత్రి చేయును. రాజు చేయును. నీ యుద్యోగమును నేను తీసివేయుట లేదు. నీవు మా ఎదుటి నుండి పొమ్ము. సింహద్వారమును రక్షించుచుండుము…..” అని.

నాకు చమత్కారంగా అనిపించిన మరొక సంభాషణ వుంది. తనతో చనువుగా వుండేందుకు ప్రయత్నిస్తున్న తులసీదేవిని ప్రద్యోతనుడు తమ యిద్దరి మధ్య వున్న తేడాలు చెప్పి వారిస్తాడు. మన యిద్దరికీ ఈడు కాదు అంటాడు. అపుడు అతన్ని ఒప్పించేందుకు చాలా అంశాలు చెప్తుంది తులసీదేవి. వింధ్యగిరి స్వామి లాంటి వృద్ధులకి చిన్న పిల్లలైన స్త్రీలతో వున్న సంబంధాల గురించి చెప్పి “.. ఆ యధర్మమైన సంగమము చేయుటకు స్త్రీలకు వయసు మీరిన వారు పనికివత్తురా! వివాహము చేసికొనుటకు పనికిరారా!” అని ప్రశ్నిస్తుంది. వయసులో తేడా పెళ్ళికి అభ్యంతరకరం కాదంటూ ఏవేవో ఉదాహరణలు చెప్తుంది. ఇంకా అతను సందేహిస్తుంటే అంటుంది.. “కలి మరి నాలుగువేల యేండ్లు దాటిన తర్వాత మాటాడెడి మాటలు మాటాడకుము.” అని. అదీ రచయిత చమత్కారం! ఇప్పటి విమర్శలకి అప్పటి పాత్ర ద్వారా సమాధానం చెప్పించడం!
*****

ఈ పుస్తకం గురించిన తెలుగు వికిపీడియా పేజీ

విశ్వనాథ వారి రచనల కోసం :
Sri Viswanadha Publications
Vijayawada & Hyderabad…
8019000751/9246100751/9246100752/9246100753

(ముఖచిత్రం అందించినందుకు మాగంటి వంశీ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

You Might Also Like

Leave a Reply