India’s Struggle for Independence – Bipan Chandra & Others
ఓ కొలీగ్ దగ్గర ఈ పుస్తకం చూసీచూడగానే “నాకొద్దు ఈ టెక్స్ట్ బుక్ లాంటి పుస్తకాలు” అని టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చూసి పక్కకు పెట్టేశాను. కొన్ని రోజులకు మళ్ళీ అదే పుస్తకం మళ్ళీ కనిపిస్తే, అసలేముందా అన్న ఆసక్తితో మొదలెట్టాను. అలా మొదలెట్టిన నేను దీన్నో థ్రిల్లర్‍లాగా చదివాను. అంత ఆసక్తికరంగా, ఉత్కంఠ రేపేలాగా ఉంది ఈ రచన. చాప్టర్ తర్వాత చాప్టర్ అలా చదివించుకుంటూనే పోతుంది.
అవును. నేను మాట్లాడుతున్నది సివిల్స్ లాంటి కాంపిటీటివ్ పరీక్షలకు తప్పనిసరైన బిపాన్ చంద్ర పుస్తకం గురించే. ఇది పరీక్షలకోసం మాత్రమే చదవాల్సిన పుస్తకం కాదని నా అభిప్రాయం. క్విట్ ఇండియా ఎప్పుడు జరిగింది? ఉప్పు సత్యాగ్రహం ఎన్నాళ్ళు జరిగింది? ఎవరు మోడరేట్స్? సైమన్ కమీషన్, ఆక్ట్ ఆఫ్ 1935, లాహోర్ రెసల్యూషన్, నాన్-కో-అపరేషన్ మూవ్‍మెంట్ లో ఏది ముందు, ఏది వెనుక? ఫలానా పార్టీ ఎవరు పెట్టారు? ఫలానా వాళ్ళు ఆ పార్టీలో నుంచి ఏ వివాదం వల్ల పక్కకు తప్పుకున్నారు? – ఇవ్వన్నీ పరీక్షలకోసం బట్టీ వేయాల్సిన సమాచారం. కానీ ఈ రచన అలాంటి విశేషాలు మాత్రమే కాదు. అంతకన్నా ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది, నా లెక్క ప్రకారం.
నేను చూసినంతలో, మరి వారు ఎంత చదువుకున్నారో నాకు తెలీదుగానీ, కొందరి నెహ్రూ-గాంధీల పేర్లు వినగానే మండిపడిపోతారు. వాళ్ళ వల్లే మన దేశానికి తీరని నష్టాలు జరిగాయని వారి వాదన. ఇంకో వర్గంవారూ ఉన్నారనుకోండి గాంధీ-నెహ్రూలను ఆల్మోస్టు డెమి-గాడ్స్ లా చూసేవాళ్ళు. అయితే, ఈ రెండు extremesలా కాకుండా అసలు గాంధీ-నెహ్రూ ఏం సాధించారు? ఏం సాధించలేకపోయారు? అసలు వాళ్ళకు ముందు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఆ పరిస్థితుల్లో నాయకత్వం వహించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు? గాంధీ రంగప్రవేశం చేసేవరకూ అంతకుముందువారు చేసిన పనులు ఎలాంటివి? అవి గాంధికి తన నాయకత్వం వహించడానికి ఎంతవరకూ దోహదపడ్డాయి? గాంధిని అనేక అంశాలపై వ్యతిరేకించినవారు కూడా ఆయణ్ణి అంతగా ఎందుకు గౌరవించేవారు? లేక, అంతటి గౌరవమర్యాదలున్నా కూడా గాంధితో ఎందుకు విభేదించారు? అసలు బానిసత్వానికి అలవాటు పడిపోయిన భారతప్రజలు ఎలాంటి పరిస్థితులు బ్రిటిష్ వారిని వ్యతిరేకించేలా చేశాయి? రైతులు, కార్మికులు, సైనికులు ఎందుకు ఎలాంటి తిరుగుబాటులు చేశారు? అందులో మహిళల పాత్ర ఎలాంటిది? – ఈ ప్రశ్నలకు వీలైనంతగా సమాధానాలు ఇస్తుంది ఈ పుస్తకం.
ఈ రచనని కూడా ప్రో-కాంగెస్‌గా కొట్టిపారేసేవాళ్ళుండచ్చు, కానీ చరిత్రను చదివేటప్పుడు opposite viewpointsను తెల్సుకొని, వాటిని బేరీజు వేసుకొని, అప్పుడు ఒక అభిప్రాయానికి వస్తే మేలు. ఎవరి understanding బట్టి వాళ్ళ అభిప్రాయాలు ఏర్పడతాయనుకోండి. కానీ ఈ పుస్తకం నాకు చదువుతున్నప్పుడు గట్టిగా అనిపించిన విషయం ఒకటుంది. నాయకునిగా ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయాలవల్ల కలిగే పరిణామాలను బట్టి నాయకుని మంచితనం,ప్రతిభ తదితరాలను లెక్కవేయడం అంత సమంజసం కాదేమోనని. ఆ పరిణామాలు తీవ్రమైనవి, నష్టం కలిగించేవి అయినప్పుడు వారిని తిట్టుకోవడం కొంతవరకూ అర్థం చేసుకోగలిగిందే అయినా, తర్వాతి తరాలవారు అప్పటి పరిస్థితులను, ఆ పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చిన నిర్ణయాలనూ అర్థంచేసుకునే వీలుంటుంది. వారితో empathize అయ్యే వీలుంటుంది. అలాంటి వీలుని కలిపిస్తుంది ఈ పుస్తకం.
1857లో జరిగిన మొదటి పోరాటం నుండి మనకి స్వాతంత్ర్యం వచ్చేవరకూ జరిగిన అనేక ముఖ్యఘటనలు, పోరాటాలు, ఆక్టులు, నాయకులు, వారి విధివిధానాలను కూలంకషంగా చర్చించే పుస్తకం ఇది. చాలా వరకూ జరిగిన ఘటనలను objectiveగా చెప్పుకుంటూ పోయినా, అవసరమైన చోట “ఇప్పుడీ పోరాటం వల్ల జరిగిన లాభాలేంటి? నష్టాలేంటి?”, “ఈ పోరాటంలో మనవాళ్ళు వెనక్కితగ్గాల్సిన వచ్చినా, మనవాళ్ళ విజయం సాధించిన అంశాలు ఏంటంటే?” అని వివరించారు. ఆ వివరణలన్నీ సరైనవే, నమ్మాల్సినవే అని అననుగానీ, whole set of thingsను అర్థంచేసుకోవడంలో ఈ చర్చలూ ఉపయోగపడతాయని నా నమ్మకం.
అసలు భారత స్వాతంత్ర్య పోరాటాన్ని Gramscian “War of Position” point of viewలో చెప్పటం నాకు భలే ఆసక్తికరంగా అనిపించింది. ఉపోద్ఘాతంలో్ దీని గురించి సూచనప్రాయంగా చెప్పి, పుస్తకం చివర్లో దీనికి ఓ చాప్టర్‍ను కేటాయించారు. వందేళ్ళకు పైగా సుధీర్ఘంగా జరిగిన ఈ పోరాటం “Struggle-Victory” కాకుండా, “Struggle-Truce-Struggle”గా ఎందుకు కొనసాగిందో, అందుకుగల కారణాలేమిటో చాలా వివరంగా చెప్పారు. భారత స్వాతంత్ర్య పోరాటం మామూలు వ్యవహారం కాదని ఎవరికైనా తెల్సిన విషయమేగానీ, అందులో ఉన్నన్ని సాధకబాధకాలను క్షుణ్ణంగా అర్థంచేసుకునే వీలుంది ఈ రచన వల్ల.
భారత విభజన గురించి నేనీ మధ్యకాలంలో బా శ్రద్ధపెట్టి చదివాను. ముఖ్యంగా దాన్ని నేపథ్యంగా చేసుకున్న వచ్చిన కాల్పనిక సాహిత్యం గురించి. ఈ పుస్తకంలో పార్టిషన్ గురించి ఒకటే చాప్టర్ ఉన్నా – అసలు పార్టిషనే అంత హడావిడిగా జరిగిందికదా – అది నాకున్న కొన్ని సందేహాలను తీర్చింది. ముఖ్యంగా రచయితలు పార్టిషన్ కాంగ్రెస్ నాయకత్వ విఫలంగా తేల్చటం నన్ను అబ్బురపరిచింది. జనాల్లోకి పోరాటం చొచ్చుకొని పోయిన రోజుల్లోనే హిందు-ముస్లిమ్ ఐక్యతమీద సరిగ్గా దృష్టి నిలపకపోవటం, ప్రత్యామ్నాయం లేక అతివాదులను బతిమాలుకోవడం, వారు ససేమీరా అంటే వారి పంతాన్నే నెగ్గనీయడం కాంగ్రెస్ వైఫల్యమంటూ చెప్పుకొచ్చారు.
అప్పడు రాజుకున్న మత విద్వేషాలు నేటికి మానకపోవడం దారుణం. ఒకరకంగా పదవిలేకుండా ప్రజల మధ్యనుండి పోరాటాలు లేవదీయడం తేలికేమో, ఆ తర్వాత పదవిలో ఉండి అవే సమస్యలను తీర్చటంకన్నా అని కూడా అనిపించింది ఈ పుస్తకం చదువుతుంటే. ఈ రచయితదే స్వాతంత్ర్యం అనంతరం భారతదేశం అన్న పుస్తకం కూడా ఉందట. అది చదవాలి, త్వరలోనే.
చరిత్రంటే తారీఖులను, ప్రముఖ వ్యక్తులను, వారి వారి ఘనకార్యాలనూ మననం చేసుకోడానికన్నా చాలా ఎక్కువ అని స్పష్టం చేసే రచన. ఏ కాంపిటీటివ్ పరీక్షలకు వెళ్ళకున్నా కనీసం ఒకసారైనా చదవాల్సిన పుస్తకమిది. కొంచెం ఓపిగ్గా చదువుకుంటే బోలెడన్ని విషయాలను బోర్ కొట్టకుండా చెప్పే పుస్తకం. పరీక్షలకు వెళ్ళే వాళ్ళు మాత్రం ఈ పుస్తకం చదవటం, మళ్ళీ మళ్ళీ చదవటమే కాక, బోలెడన్ని నోట్స్ చేసుకోవాల్సి ఉంటుందని అనిపిస్తుంది. ఇది కాన్సెప్ట్స్ బాగా చెప్పే పుస్తకమేగానీ, చివరి క్షణంలో తిరగేసి పరీక్షలో కూర్చుంటే అంతే సంగతలు!
వెనుక అట్ట మీద ఇచ్చినట్టు, ఇది Indispensable for students and for all those who want to know our past in order to understand the present. అక్షర సత్యం!
History
Penguin Group
Paperback
533
ఫణీన్ద్ర పురాణపణ్డ
ప్రో-కాంగెస్‌గా… కాదనుకుంటా… ప్రో లెఫ్ట్ అనుకుంటా. రెండింటికీ పెద్ద తేడా లేదనుకోండి. 🙂 రొమిల్లా థాపర్, బిపిన్ చంద్ర… వీళ్ళందరూ నెహ్రూ టైమ్ నుంచి ఇండియా హిస్టరీ కాంగ్రెస్‌లో పీఠాలు వేసుకుని కూచుండిపోయిన జేఎన్‌యూ మేధావులు అని గుర్తు.
ఎంవీఆర్ శాస్త్రి గారి చరిత్రావలోకన పుస్తకాల సీరీస్ చదివే ఉంటారుగా…
Halley
^The above should be “broad marxist tradition”
Halley
In terms of readability i agree that it is a good book. I read this first long ago in 2009 and keep reading it now and then. However, as mentioned by the authors themselves in the Introduction of the book, their approach “remains within the broad marxist approach” . A majority of the authors have spent their academic life in a certain university up north in the country who’s ideological underpinnings (back then) are anybody’s guess. Given that backdrop it is difficult to assume the objectivity in their narration at all times. So i think when you said “చాలా వరకూ జరిగిన ఘటనలను objectiveగా చెప్పుకుంటూ పోయినా” , the objectivity needs to be taken with a pinch of salt. That said, i doubt if any historian or writer can ever be fully objective.