మిమ్మల్ని మీరు గెలవగలరు – యండమూరి వీరేంద్రనాథ్
వ్యాసకర్త: రాగమంజరి
********
మిమ్మల్ని మీరు గెలవగలరు అనే ఈ పుస్తకంలో పాఠకులు అడిగిన ప్రశ్నలకి యండమూరి వీరేంద్రనాథ్ గారి సమాధానాలు వున్నాయి. ఈ ప్రశ్నలని కెరీర్ ప్లానింగ్, వ్యక్తిగత సమస్యలు, ప్రేమ-వైఫల్యాలు, వివాహం తర్వాత సమస్యలు, వైవాహికేతర సంబంధాలు అనే భాగాలుగా విడగొట్టారు.
కెరీర్ ప్లానింగ్ విభాగంలో ప్రశ్నలన్నీ చాలా సాధారణంగా వున్నాయి. మరీ అర్థం లేని సమస్యలు. వాటికి చాలా మామూలు జవాబులు. ఇవి వ్యక్తిగతంగా ఆయా సమస్యలు నిజంగా ఉన్నవారికి ఏమైనా ఉపయోగపడతాయేమో కానీ అందరూ వీటిని చదివి నేర్చుకునేది ఏమీ కనిపించలేదు. ఈ విభాగంలో “జాతకాలు, జ్యోతిష్యం, వాస్తు లాంటివి ఉన్నాయా, వాటిని నమ్మచ్చా?” అన్న ఒక ప్రశ్నకి సమాధానం యిలా వుంది. “జాతకము, జ్యోతిష్యము కరెక్టయితే మనిషి భవిష్యత్తు ఎలా ఉండాలో అది ముందే “నిర్దేశించి” వుంటుంది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. జాతకము జ్యోతిష్యము నిజం కాకపోతే అసలు గొడవేలేదు. కాబట్టి జాతకాలు తెలుసుకోవడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. వారఫలాల్లో మంగళవారం ప్రయాణాలు మానుకోండి అని చెప్తే ఒకవేళ ఆ వారఫలాలు నిజమయితే మనం మగళవారం తప్పకుండా ప్రయాణం చేసి చస్తాం” అని. ఇది చాలా అమాయకమైన సమాధానం అనిపించింది. అంత సులభంగా తేల్చేయగల విషయమా ఇది! “గ్రహస్థితులు ఇలా జరుగుతాయని సూచిస్తున్నాయి, ప్రయత్నంతో దానిని మార్చవచ్చు” అన్నది జ్యోతిష్యం చెప్పేవాళ్ళ, నమ్మేవాళ్ళ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని ఖండించదలచుకుంటే సిద్ధాంత పరంగానో ఆచరణ పరంగానో దాని తప్పొప్పులు, సాధ్యాసాధ్యాలు చర్చించాలి కానీ “గ్రహస్థితులు ఇలా జరుగుతాయని సూచిస్తే దాన్నిక మార్చడం సాధ్యం కాదు.” అనకూడదు. అది సిద్ధాంతాన్ని ఖండించడం కాదు, సిద్ధాంతాన్ని మార్చి చెప్పడం.
తర్వాత “వ్యక్తిగత సమస్యలు” అనే అధ్యాయం. ఇవి కూడా పెద్ద గొప్పగా లేవు. ఈ అధ్యాయంలో “నేను అందంగా లేను” అని బాధపడుతూ వ్రాసిన ఒకరికి సమాధానం చెప్తూ “ప్రపంచంలో గొప్పవాళ్ళు ఎవరూ సాధారణంగా అందమైన వాళ్ళు కారు గమనించండి” అన్నారు. అంతవరకు బానేవుంది. అయితే ఆ తర్వాత “అసలు వాళ్ళ కాంప్లెక్సే వాళ్ళు అలా పైకి రావడానికి ఉపయోగపడుతుంది. రచయితలూ/రచయిత్రులు అందరూ ఏదో ఒక కాంప్లెక్స్ తో బాధపడుతున్నవారై వుంటారు.” అనడం మాత్రం కొంచెం అతిగా అనిపించింది.
ప్రేమ వైఫల్యాలు అధ్యాయం లోని ప్రశ్నలు రచయితకి కూడా చిరాకు తెప్పించినట్లున్నాయి. చాలావాటిని ఆయనే అపహాస్యం చేస్తూ సమాధానాలు చెప్పారు. ఈ అధ్యాయం చదువుతుంటే అసలు ఇలా సమాధానాలు ఇవ్వడం ఎంత కష్టమో అర్ధమయింది. ఆ ప్రశ్నలు సృష్టించినవో నిజంగా పాఠకులు అడిగినవో తెలియదు. సృష్టించినవి అయితే ఏమో కానీ నిజంగా పాఠకులు రాసి వుంటేను లేక ఆ పరిస్థితులలో వున్న పాఠకులెవరైనా చదివితేను పాపం ఈ అపహాస్యానికి బాధపడతారు కదా అనిపించింది.
తర్వాతి అధ్యాయం “వివాహం తర్వాత సమస్యలు”. ఇవి శీర్షిక చూస్తూనే వూహించగల సమస్యలు, సమాధానాలు. ఇందులో ఎక్కువ ప్రశ్నలు లేవు. ఉన్న వాటికి ఇచ్చిన సమాధానాలు కూడా సరిగా లేవనిపించింది. ఒకావిడ “మా అత్తగారు (మేనత్తే అత్తగారట) హిట్లర్. ఆవిడ వల్లే మా తోడికోడలికి పిచ్చెక్కింది. అయినా మా అమ్మా, నాన్నా నన్ను ఓర్చుకోమంటారు.” అని సమస్య చెప్తే దానికి ఆయన సమాధానం “ముసుగులో గుద్దులాట కాకుండా ఆ యింట్లో మీ స్థానమేమిటో తేల్చుకుని అవసరమైతే విడిపోవడానికి ప్రయత్నించండి” అని. ఆమె చెప్తున్నది ఎంతవరకూ నిజం అన్న విషయము, అవతలివైపు వాదన ఏమిటన్న విషయము యివేమీ ఆలోచించకుండా చర్చించకుండా సమాధానం యివ్వడం సరికాదనిపించింది.
ఇంకా ఈ అధ్యాయంలో “ఉల్లిపాయ” అనే కథ కూడా వుంది. ఆ కథని ఆయన విజయలక్ష్మి అనే మారుపేరుతో రాసారట. కథలో కొన్ని బాగున్న అంశాలు ఉన్నాయి. అది విశేషం కాదు. అయితే చాలా లోపాలు కూడా వున్నాయి. అది మాత్రం విశేషమే, ఎందుకంటే ఆయన పెద్ద రచయిత కాబట్టి.
ఈ కథలో రచయిత చెప్పదల్చుకున్నది “మానవసంబంధాలన్నీ ఉల్లిపాయ లాంటివి. బంగారు రంగులో మెరిసే తొక్క పైనుంటేనే అవి బాగుంటాయి. లేకపోతే కన్నీళ్లు తెప్పిస్తాయి.” అని. ఇక్కడ బంగారు రంగు తొక్క అంటే హిపోక్రసీ అని. అబద్ధాలు కప్పి ఉన్నంతసేపు బానేవుంటుంది. నిజం బయట పడితే కన్నీళ్ళు వస్తాయి అని. ఈ పోలికే పెద్ద బాలేదు. ఏదో తొక్క, అది తీస్తే కళ్ళల్లో నీళ్ళు రావడం సరిపోయాయి కదా అని అతితెలివిగా పోలిక తీసుకున్నా అది అతకలేదనిపించింది. కథ హీరోయిన్ చెప్తుంది. చిన్నప్పుడు క్లాసులో ప్రపంచంలో అన్నిటికన్నా అందమైన పక్షి ఏది? అని టీచర్ అడిగితే ఆ అమ్మాయి లేచి నిలబడి “కాకి” అందట. ఎందుకంటే కాకి కాకి లాగే కనబడి కాకిలాగే ప్రవర్తిస్తుందట, లోకులు నెమళ్ళట, తమ అందాన్ని చూసి తామే మురిసిపోతారట. పైకి కనబడే అందం, చదువు, డబ్బు వున్నవాళ్ళు నెమళ్ళ జాతి లోకి వస్తారట. అందరూ అలాంటి వాళ్ళ కంపెనీనే కావాలనుకుంటారట, అంతేకానీ నెమలి శరీరంలో కాకి మనసు వుందేమో అని ఆలోచించరట. ఎందుకంటే మానవసంబంధాలన్నీ ఉల్లిపాయ లాంటివి కాబట్టిట. ఇలా మొదట ఒక పేజీ ఉపోద్ఘాతం ఈ కథకి. అదంతా పూర్తిగా అనవసరం. అందులో ప్రతివాక్యమూ అసంబద్ధం. ఏదో చిన్నపిల్ల తెలిసీ తెలియకుండా వాగిన వాగుడు అనుకోవడానికి లేదు. కథ మొదలయినప్పటికి ఈ తెలివయిన హీరోయిన్ డిగ్రీ చదువుతూ వుంటుంది. ఈ చిన్నప్పటి సంగతిని మనతో గొప్పగా చెప్తుంది. అయితే అంత చిన్నప్పుడే మానవసంబంధాలన్నీ ఉల్లిపాయ లాంటివి అని తెలుసుకుని స్కూల్లో, కాలేజిలో అందరితో పదే పదే చెప్తూ వుండే హీరోయిన్ ఇంకేం చేస్తుంది కథలో అంటే, మళ్ళీ చివరివరకూ అదే విషయాన్ని తెలుసుకుంటూ వుంటుంది.
ఇక చివరి అధ్యాయం వైవాహికేతర సంబంధాలు. ఒక భావుకుడయిన యువకుడు భార్య తన అభిరుచులకు తగ్గట్లు లేదనీ మరో యువతి తనను ప్రేమిస్తోందనీ ఏం చేయాలో అర్థం కావడం లేదనీ సమస్యకి పరిష్కారం చెప్పమనీ అడిగితే “మీలో భావుకత్వం అవసరమైన దాని కన్నా ఎక్కువగా వుండి మిమ్మల్ని పాడుచేస్తోంది.” అని సమాధానం యిచ్చారు. ఇదే ప్రశ్న ఒక స్త్రీ అడిగితే ఏం చెప్పేవారో!
ఇలా “మిమ్మల్ని మీరు గెలువగలరు” అన్న గంభీరమైన పేరు వున్న పుస్తకంలో మనల్ని మనం గెలవడానికి సహాయపడే విషయాలేమీ కనబడలేదు. మన మనసుని, బలహీనతలని జయించడం సంగతి దేవుడెరుగు, బయటి విజయాలకి అవసరమైన సమాధానాలు కూడా సరిగా లేవు. ఈ అధ్యాయం మొదట్లో తన ఋషి నవలలోని వాక్యం ఒకటి ఉదాహరణగా చెప్పారు రచయిత. “ఈ ప్రపంచంలో కొంతమంది మంచివాళ్ళు ఉండటానికి కారణం వాళ్ళకి చెడిపోవడం చేతకాక పోవడమే.” అని. అది చదివితే, ఈ రకమైన ఆలోచనలు వున్నవాళ్ళు, “ఈ ప్రపంచంలో కొంతమంది మంచివాళ్ళు ఉండటానికి కారణం వాళ్ళకి చెడులో వున్న చెడు తెలియడం” అన్న అవగాహన లేనివాళ్ళు ‘మనల్ని మనం గెలవడం’ ఎలాగో మనకి చెప్తున్నారు కదా అనిపించింది.
pavan santhosh surampudi
యండమూరి అనే పేరు బ్రాండ్ స్థాయికి వెళ్ళిపోయాకా తనను తాను గెలవడానికి చేసిన నిష్ఫలమైన ప్రయత్నాలు ఇవన్నీ. ఆ యండమూరికీ ఈ యండమూరికీ పేరు మాత్రమే ఒక్కటి పరిస్థితులు ఒకట్టే కాదు. ఆయనలోని ప్రతిభా వ్యుత్పత్తులు అప్పటిలా లేవు.(నేను అప్పటి పాఠకుణ్ణి కాకున్నా ఇప్పుడు అవన్నీ చదివిన వాణ్ణి) మీరు ఆనాటి వారైతే నేటి అన్నీ రచనలూ నిరాశపరిచేలానే ఉన్నాయి. ఇన్ ఫ్యాక్ట్ చాలామంది గొప్పగా ప్రస్తావించే “అంతర్ముఖం” కూడా నాకు పడదు. నీరు లేని సీసా మాత్రమే కనిపిస్తుంది నాకు అన్నిటిలోనూ.