పుస్తకం ద్వారా పాఠకుని పరిచయం

వ్యాసకర్త: రానారె

కుక్కలు పచ్చిగడ్డి మొలకలను తింటాయి. ఎందుకు?

నేనూ ఈ పుస్తకాన్ని అలాంటి కారణాలతోనే చదివాను.

“లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా”

 ఇది ఒక అనువాద రచన. ఇటీవలే చదివాను. స్పానిష్ భాషలో వ్రాయబడిన “El amor en los tiempos del cólera” అనే నవల దీని మూలం.  అసలు ఈ పుస్తకాన్ని చదవడానికి నాకున్న రుగ్మతలేమిటి?

పుస్తకంలోని పాత్రల మనసులలో మాదిరే నా మనసులో కూడా ప్రశాంతతే ఎప్పుడూ నిండివుండదు. అలాగని ఆందోళనే ఎప్పుడూ నిండి వుండదు. నాలుగురోజులు హాయిగా నిద్రపడుతుంది – మెలకువగా వున్నప్పుడు నా బంధుమిత్రులు, ఉద్యోగం, టెలివిజన్, తదితరాలు నాకు ఆహ్లాదాన్నిస్తాయి. నాలుగురోజులు సరిగా నిద్రపట్టదు – మెలకువలో అదే బంధుమిత్రులు, అదే ఉద్యోగం, అదే టెలివిజన్, అవే తదితరాలు నన్ను ఆందోళనకు గురిచేస్తాయి. ప్రభుత్వమనే బ్రహ్మపదార్థం, జాతీయ రహదారుల మీద రాత్రిపూట రోడ్డుపైనే నిలిపివుంచిన మృత్యుశకటాలూ, ఇసుక మాఫియా ఆగడాలు, రోజూ అలవాటుగా పట్టుబడుతున్న కొద్దిపాటి ఎర్రచందనపు దుంగలు, యాసిడ్ దాడుల్లో వికృత ముఖాలు, ఆక్రమణలు, అక్రమ కట్టడాల్లాంటివి అప్పుడప్పుడూ అంతవరకూ లేని అలజడిని మనసులో నాటిపోతాయి.

కం. మతిఁ దలఁపఁగ సంసారం
బతి చంచల; మెండమావు లట్టుల సంప
త్ప్రతతు లతి క్షణికంబులు;
గతకాలము మేలు వచ్చుకాలముకంటెన్.

భారతంలో వ్యాసుడన్నట్లు సంసారం అతి చంచలమైనదే కావచ్చు, సంపదలు ఎండమావులే కావచ్చు కానీ, రాబోయేదెప్పుడూ చెడుకాలమేనా? వచ్చుకాలము కంటే గతకాలము ఎప్పుడూ మేలైనదే అయిందా? “కలికాలం” అని నిట్టూరుస్తారు కొందరు. ఒక శతాబ్దం క్రితం ఈ ఆంధ్రదేశంలో ఎలాంటి పరిస్థితులుండేవో చూద్దామనిపించింది. అంత కంటే వెనుకకు వెళ్లేకొద్దీ దొరికేది ఆధారాలు బలహీనంగా వుండే చరిత్ర. అందువల్ల నూరేళ్లకిందటి సమాజాన్ని చూద్దామనిపించి, రియలిస్ట్ నవలలుగా పేరుబడిన రచనలైతే ఆ సమాజానికి అద్దం పడతాయని ఆశించి, దాశరథి రంగాచార్య “చిల్లరదేవుళ్లు”; మహీధర రామ్మోహనరావు “కొల్లాయిగట్టితేనేమి”; మన పొరుగుదేశం చైనాలో పరిస్థితులెలావుండేవో చూద్దామని పెర్ల్ ఎస్ బక్ “ది గుడ్ ఎర్త్”;  ఆ తరువాత, దాదాపు అదే సమయంలో భూగోళానికి ఆవలివైపు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అప్పటి సమాజాన్ని చూపించిన జాన్ స్టైన్‌బెక్ “ది గ్రేప్స్ ఆఫ్ రాత్”; తూర్పుయూరోప్(రష్యా) పరిస్థ్తితులను వర్ణించే మాక్సిమ్ గోర్కీ “అమ్మ” (తెలుగులో)… ఈ పచ్చిగడ్డి మొలకలను కొరుక్కుని తిన్నాక…  నాకర్థమైనదేమిటంటే – వర్తమానంలో మనదేశపు ప్రజానీకం గతంలోకంటే ఎన్నోరెట్లు మెరుగైన ఉపాధి అవకాశాలతో, పరిరక్షిత హక్కులతో, ఒకింత శృతిమించిన స్వేచ్ఛతో, మానవత్వాన్ని చవిచూస్తున్నారని. నూటాయాబై రెండొందల సంవత్సరాల నాటి అబ్రహామ్ లింకన్ జీవితకథ (గాడిచర్ల హరిసర్వోత్తమరావు రచన)లో బానిసల వ్యాపారం గుఱించి కూడా చదివాక ఈ అభిప్రాయం బలపడి ఆందోళన తగ్గింది. ఒక మానసిక రోగానికి మందులాగ పనిచేసిన ఈ పఠనం కలగజేసిన ఉత్సాహంతో, వందేళ్లనాటి దక్షిణ అమెరికా ప్రాంతపు సమాజాలు ఎలా వుండేవో చూద్దామనిపించి, మిత్రుల సూచనమీద “లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా” చదివాను.

ఈ రచనను ఆస్వాదించడంలో నాకెదురైన పరిమితులు: నాకు హిస్పానిక్ అమెరికా గురించిన పరిచయం దాదాపు శూన్యం. అందుకే ఈ పుస్తకం నా చేతికి అందివచ్చే లోపుగా వికీపీడియాలో హిస్పానిక్ అమెరికా చరిత్ర, ఇంకా కొంత సమాచారం చూశాను. రెండోది – స్పానిష్ భాష, నుడికారం గురించిన పరిచయం కూడా శూన్యమే. మూడోది, ఎంత గొప్ప అనువాదమైనా ఆ సంస్కృతిని నాకు పరిచయం చేయాల్సిన భారాన్ని ఈ నవల ఆంగ్లానువాదకుడు ఎడిత్ గ్రాస్‌మన్ పైనే పెట్టాను.

ఇక భాష విషయానికి వస్తే, పుస్తకం పార్శిల్ పొట్లం విప్పి, ఇష్టంగా చవడం మొదలుపెట్టిన నాకు మొట్టమొదటి వాక్యంలోనే కనీవినీ ఎరుగని పదం కనబడింది – “unrequited” – అచ్చంగా ఈ కథలోని పాత్ర డాక్టర్ “హూవెనాల్ అర్బినో”కు – తన కాబోయే భార్య “ఫెర్మీనా డాజా” రెండో పరిచయంలో కలిగించిన అనుభవం. అక్కడివాళ్ల ఇళ్లు, దుస్తులు, ఆభరణాల  వర్ణణల్లో నాకు తెలీని పదాలు చాలానే వున్నాయి. ఆ నవలలోని కథాప్రదేశం కొలంబియా దేశంలో కరీబియన్ సముద్రానికీ, మాగ్దలెనా నదికీ సమీపంలో వుండడం వల్ల సాగరసంబంధమైన నౌకాసంబంధమైన పదాల వాడకం ఎక్కువగా జరిగింది – ఉదా: estuary, taruya, schooner. పడవలూ, ఓడలు, నౌకలూ కాదుగదా కనీసం బల్లకట్టు, పుట్టి కూడా నేనింతవరకూ దగ్గరగా చూడలేదు. అంతర్జాలం అందుబాటులో వుండబట్టి సరిపోయింది.

Emergency love, hurried love, Sunday loves లాంటి కొన్ని పదబంధాలు నవ్వు తెప్పిస్తాయి.

ఈ నవలలో ఎన్నో పాత్రలున్నాయిగానీ, వాటిమధ్య సంభాషణలు మాత్రం చాలాచాలా అరుదు. దాదాపు నవలంతా కథకుని గొంతుకే మనకు వినిపిస్తుంది. పాత్రలు గొంతుకలు ఎక్కడోగానీ వినబడవు. నా వరకూ, ఇదేమీ ఆనందించాల్సిన విషయం కాదు – పఠనీయతకు సహకరించేది కాదు గనక.

ఈ నవలా పఠనంలో వహ్వా అనిపించిన కొన్ని వాక్యాలు:

“… curiosity was one of the many masks of love.”
“… only thing he had to learn about love: that nobody teaches life anything.”
“… one does not love one’s children just because they are one’s children but because of the friendship formed while raising them.”
“I don’t believe in God, but I’m afraid of Him.”

ఇంకో సంభాషణ కూడా వుంది – నాకు గుర్తుండిపోయేది.

భార్య: “You don’t understand how unhappy I am.”
భర్త: “Always remember that the most important thing in a good marriage is not happiness, but stability.”

కథను సంక్షిప్తంగా చెబితే చదువరులకు విముఖత కలిగిస్తుందనడంలో నాకెలాంటి సందేహం లేదు. చెబితే నవలగానే చెప్పాలి. కాబట్టి చెప్పను. ఇందులోని ప్రధాన పాత్రల నేపథ్యాలు మాత్రం ప్రస్తావిస్తాను.

ఫ్లోరెంటినో – తండ్రి వివాహితుడు. తల్లి అవివాహిత. ఆ సమాజంలో గౌరవప్రదం కాని ఈ బిడ్డకు తల్లి కుటుంబ నామం సంక్రమిస్తుంది. బాల్యంలో తండ్రి పోషణ, యవ్వనంలో తల్లి ఆదరణ, వృద్ధాప్యానికి సమీపంలో తండ్రి మరియు పినతండ్రుల వ్యాపార వారసత్వమూ సంపదా లభిస్తాయి. ఇతనికి బాల్యంలోనే తండ్రి మరణిస్తాడు. ఫ్లోరెంటినోతో రహస్య సంబంధం నెరపిన సవాలక్షమందిలో ఒకతెయైన ఓ విధవరాలు చెప్పినట్టు, ప్రేమించడమనేది ఇతనికి పుట్టుకతోనే అబ్బిన సహజమైన టాలెంటు. ఇతని ప్రేమకు సామాజికవర్గము, వయస్సు, మానసిక స్థాయి వంటి హద్దులున్నట్టు కనిపించదు. తన ఇంట్లో పనిచేసే ఒక పడుచు సేవికను కోడిపుంజు వేగంతో ఆమె ఇష్టాయిష్టాలకు తావివ్వకుండా ‘family way’ పట్టించి, ఒక ఇల్లు రాయించి ఇచ్చి, ఒక అమాయకునికిచ్చి పెండ్లిచేయించగలిగిన వీర ప్రేమికుడు. రక్తసంబంధీకుడనీ రక్షకుడనీ నమ్మి ప్రభుత్వ స్కాలర్‌షిప్ సాధించిన తమ కూతురును సెంకడరీ స్కూలు విద్యకై ఇతనివద్దకు పంపితే, “he won her confidence, he won her affection, he led her by the hand, with the gentle astuteness of a kind grandfather, toward his secret slaughterhouse”. తాత్కాలిక సంబంధం వల్ల భర్తచేతిలో ప్రాణం కోల్పోయిన యువతి, ఇంట్లోని సామానంతా దొంగలపరం చేసిన మరో స్త్రీ … ఇలా సాగుతుంది ఇతని జీవితమంతా. కాకపోతే ఈ వ్యవహారాలన్నీ ఫెర్మీనా ప్రేమకోసం కోసం ఫ్లోరెంటినో అలుపెరగకుండా వేచివున్న సమయంలో జరిగే పిట్టకథల్లాగ కనబడతాయి.

ఫెర్మీనా – అనుమానాస్పద వ్యాపారాలు చేసేవాడిగా జనం చెప్పుకునే వ్యక్తి ఈమె తండ్రి యొక్క గతం ఆ పట్టణంలో ఎవరికీ తెలియదు. తల్లి స్థానిక తెగకు చెందిన ఒక సాధారణ స్త్రీ. బాల్యంలోనే ఫెర్మీనా తల్లి మరణిస్తుంది. ఒక ఇంటి బాధ్యతను నిర్వహించగల నేర్పరితనం చిన్నప్పుడే అలవడిన ఈమెకు ఆభిజాత్యం ఎక్కువ. అమాయపు మూర్ఖతతో కూడిన పొగరు అంటే కూడా తప్పు వర్ణన కాదేమో. తనవల్ల ఏదైనా తప్పు జరినట్లు అనుమానం కలిగితే వెంటనే ఆ తప్పును సమీపంలోని మనిషిమీదకు నెట్టేయడం, పట్టుబడతానేమోననిపించినప్పుడు కోపంతో ఆ భయాన్ని కప్పిపుచ్చడం ఈమెకు మరణించేవరకూ వీడని లక్షణాలు. అత్తగారి, ఆడబిడ్డల ఈసడింపుల వంటి సమస్యలున్నా, తనకంటూ ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే, పరిస్థితులకు తొందరగా అలవాటు పడగల సామర్థ్యం కలది. అందంగా కనిపించిన వస్తువేదైనా తన ఇంటికి చేర్పించేయడం ఈమెకు సరదా – ఇంట్లో అది అందంగా అమరినా అమరకపోయినా. ఈ విధంగా చేరిన వస్తువులతో ఇల్లంతా నిండి అసౌకర్యం కలుగుతున్నా వాటిని ఎవరికైనా ఇవ్వడంగానీ, పారవేయడం చేయలేని బలహీనత ఈమెది. భర్త, స్నేహితులూ, బిడ్డలూ వీరందరికన్నా తన తల్లి సమాధి మాత్రమే కల్మషం లేనిదని – జీవిత చరమాంకపు ఒంటరి చీకటి దినాలలో ఈమె తీర్మానం.

హూవెనాల్ – పెద్ద పేరున్న సంపన్న కుటుంబంలో జననం. ఫ్రాన్సు దేశంలో డాక్టరుగా చదువు. స్వదేశంలోని తన పట్టణంలో ఆ కుటుంబానికున్న పరపతిని పెంచి కొనసాగించగలిగిన క్రమశిక్షణ గల వ్యక్తి. మూఢనమ్మకాలను ప్రశ్నించే వివేచన గలిగిన సంప్రదాయ-అభ్యుదయవాది. పట్టణంలో ఏ పెద్ద ఉత్సవం జరిగినా భార్యాసమేతుడై హాజరు కావలసిందే. బెలూన్ లో ఆకాశమార్గంలో మొదటి సారిగా తపాలా చేరవేయడం వంటి సాహసాలకూ ముందువరుసలో నిలబడగల ధైర్యశాలి. తాను ఎన్నడూ ఊహించని విధంగా ఒకరిద్దరి స్త్రీల విషయంలో లౌల్యానికి గురియై బయటపడలేక దాచలేక మథనపడిన పెద్దమనిషి.

సహజత్వానికి దగ్గరగా వుందో దూరంగా వుందో తెలీదుగానీ – ఈ నవలలోని దాదాపు తొంభైశాతం పాత్రలు తమ సమాజం అగౌరవంగా భావించే private love life గడిపినవే వున్నాయి. ఫ్లోరెంటినో తండ్రి, గాడ్ ఫాదర్, నౌక కెప్టెన్ కొన్ని ఉదాహరణలు. ఫ్లోరెంటినో తండ్రి, ఆ తండ్రి సోదరులు కూడా ఇలాంటి సంబంధాల సంతానమే. ఇటువంటి సంతానానికి ఆ పట్టణంలోని సోషల్ క్లబ్‌లో గడిపే అర్హత, అనుమతీ వుండవు. ఫ్లోరెంటినో ధనికుడైవుండి కూడా ఈ అవమానం పొందుతాడు. ఫెర్మీనాతో పెండ్లికోసం అమె తండ్రి లొరెంజో ను సోషల్ క్లబ్‌లో విందుకు ఆహ్వానించడం ద్వారా డాక్టర్ హూవెనాల్, నియమాల ఉల్లంఘనకు పాల్పడి తీవ్ర ఆక్షేపణకు గురియవుతాడు. సభ్యత్వం కోసం ఫెర్మీనా తండ్రి చాలా సార్లు ప్రయత్నించి ఘోరంగా విఫలమౌతాడు. పొడుగాటి కుటుంబ నామాలు గలవారిమీద దాడి చేయడమే ఉద్దేశంగా Justice అనే సాయంకాలపు పత్రిక ఒకటి మొదలౌతుంది – దాని పుట్టుకకు కారణం ఆ పత్రిక యజమాని కుమారులకు సోషల్ క్లబ్బులో ప్రవేశం దొరకకపోవడమే. ఇలాంటి వాళ్లకు ఆశ్రయం కల్పించే కమర్షియల్ క్లబ్ ప్రస్తావన కూడా ఇందులో వుంది.

నల్లజాతిదే అయినా చొరవా చురుకుదనమూ దక్షతా కలిగి ఫ్లోరెంటినో నౌకల కంపెనీలో ఉన్నత స్థానానికి ఎదిగే లియోనా ఇందులో మనకు కనిపించే హుందా కలిగిన పాత్ర.

తన భర్త పరస్త్రీ వ్యామోహానికి గురికావడాన్ని ఫెర్మీనా సహించినా, ఆ పరస్త్రీ ఒక నల్లజాతిది అయివుంటుందని ఊహించలేకపోతుంది, ఆ నిజం తెలిశాక జీర్ణించుకోలేకపోతుంది. And worst of all, damn it: with a black woman. బ్లాక్ ఉమన్, కాదు Mulatta (తలిదండ్రుల్లో ఒకరిదే నల్లజాతి) అని దిద్దబోతాడు డాక్టర్. భార్యాభర్తల గొడవల్లో తరచూ జరిగే తమాషా. ఇంతకూ ఇక్కడ నాకు నచ్చిన అంశం ఏమిటంటే – ఈ వివాహేతర సంబంధాన్ని గురించి డాక్టర్ హూవెనాల్ చర్చిలో కన్ఫెస్ చేసుకోవడాన్ని ఆ ఇల్లాలు భరించలేదు. అది అతనికి మాత్రమే సంబంధించినది కాదనీ, తన గౌరవానికీ సంబంధించినదని, కాబట్టి ఈ సంగతిని మరో వ్యక్తికి చెప్పుకునే హక్కు భర్తకు లేదనేది ఆమె ఆక్రోశం. ఎందుకంటే Ever since her days at the Academy she had been convinced that the men and women of the Church lacked any virtue inspired by God. ఈ కన్ఫెషన్ వల్ల ఆమెకు మంచే జరుగుతుంది – అది తరువాతి సంగతి. డాక్టర్ తో పెళ్లికి ఫెర్మినాను ఒప్పించడానికి సిస్టర్ Franka de la Luz వచ్చి ప్రలోభపెట్టజూసినప్పుడు నరాల్లో రక్తం మరిగిపోతుండగా “I do not understand how you can lend yourself to this,” she said, “if you think that love is a sin.” నేపథ్యం ఏమిటంటే, అంతకు మూడునాలుగేళ్ల క్రితం ఫెర్మీనా-ఫ్లోరెంటినోల ప్రేమ లేఖనాలను నిరసించి ఆమెను అవమానించి బళ్లోనుంచి నిర్దయగా తొలగించినది కూడా ఇదే సిస్టర్ Franka de la Luz.

ఫ్లోరెంటినో తల్లి – బతికి చెడిన కుటుంబాల స్త్రీల నగలతో తనఖా వ్యాపారం చెయ్యడం సజావుగా సాగుతుంటుంది. ఫ్లోరెంటినో తండ్రులకు చెందిన the River Company of the Caribbean కు నూరేళ్ల గుత్తాధిపత్యం వుంటుంది ఆ నదిమీద రవాణా హక్కులకు. సంఘంలోని వ్యక్తుల్లో అసమానతలు, డబ్బూ పలుకుబడులకు చర్చిజనాలు దాసోహం కావడం, పిల్లల ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడం, వృద్ధులమధ్య ప్రేమను పిల్లలు జీర్ణించుకోలేకపోవడం వంటి సాంఘిక అంశాలూ; మూడంకెల టెలీఫోన్ నంబర్లూ, బెలూన్ ద్వారా మొదటిసారి ఎయిర్ మెయిల్, కలరాతో ఊళ్లకు ఊళ్లే చనిపోవడం, coup de grace వంటి చారిత్రక అంశాలూ కనబడినప్పటికీ; నవల ఆద్యంతమూ నేపథ్యంగా ప్రస్తావించబడిన Liberals and Conservatives మధ్య తరచూ జరిగే అంతర్యుద్ధపు ప్రభావం ఈ నవలలోని పాత్రలపై అంతగా కనబడదు. నేనాశించిన అంశాలు – జన జీవనం, సంపాదన మార్గాలు, ఉపాధి భద్రత, సామాజిక భద్రతా సమస్యలు – ఇందులో అంతగా కనపడలేదు.

కాబట్టి ఇంకో పుస్తకం – Doña Bárbara చదువుతున్నాను. “Love in the time of cholera” కొలంబియాలోని పట్టణ ప్రాంతాన్ని చిత్రించిన రచన కాగా, పొరుగుదేశమైన వెనిజువెలాలోని గ్రామీణ ప్రాంతాలను చిత్రించిన రచన “Doña Bárbara”. చూద్దాం అందులో ఏముందో. ఈ రెండూ కూడా మంచి పుస్తకాలుగా పేరు పడ్డాయి.

ప్రపంచం పట్ల, సమాజం పట్ల మన అవగాహనా దృక్‌పథపు విశాలతను పెంచడమే కదా మంచి పుస్తకాలు మనకు చేసే మేలు!

Love in the Time of Cholera
Gabriel García Márquez (Translated by: Edith Grossman)
Novel
Alfred A. Knopf (US)
1985 / 1988
Paperback
348

You Might Also Like

2 Comments

  1. రానారె

    థాంక్యూ@ Edith Grossman is a she.
    “రచనతో తమ స్థల కాలాల వాస్తవికత తెలియజెప్పటమే ప్రధాన లక్ష్యమైన రచయితలు చాలా మైనర్ ఆర్టిస్టులనిపిస్తుంది నాకు” – కానీ నా వెతుకులాట ఈ ఆర్ట్ కోసమే మరి!
    నేను ఏ వెతుకులాటలో ఈ పుస్తకాన్ని చదివానో ఆ ఉద్దేశం నేనాశించినంతగా నెరవేరలేదు. పోనీలెమ్మనుకుంటే, ఈ కథాంశం (theme) కూడా నాకు అసలు ఆసక్తి కలిగించేదికాదు. మొదలెట్టాక చివరిదాక చదివి చూద్దామని చదివాను తప్ప, ఇదేమీ గొప్ప రచన అని నాకనిపించి కాదు. గ్రేప్స్ ఆఫ్ రాత్, డాన్యా బార్బారా, ది గుడ్ ఎర్త్ నన్ను బాగా ఆకట్టుకున్న రచనలు. ఎందుకంటే వీటిల్లో కనిపించే పాత్రల మనస్సులు బల క్షమాది వివిధైశ్వర్యంబులను కలిగినవి. కథాస్థలి వర్ణనలు – తెన్నేటి సూరి “ఛంఘీజ్ ఖాన్”లో వర్ణించినంతగా ఉర్రూతలూగించేవి కాకపోవచ్చుగానీ – కళ్లకుకట్టేవే.

  2. Meher

    ఇందాక ఫేస్బుక్ లో ఈ పెయింటింగ్ చూసినపుడు ఈ నవలే గుర్తు వచ్చింది, కాసేపటికే ఈ సమీక్ష చూశాను:

    http://cdn.viralnova.com/wp-content/uploads/2013/06/crazy-talent10.jpg

    నా చేత ఈ నవల చదివేలా చేసింది Thomas Pynchon అనే మరో మంచి రచయిత రాసిన ఈ సమీక్ష:

    http://www.nytimes.com/1988/04/10/books/the-heart-s-eternal-vow.html?sec=&spon=&pagewanted=all

    రచనతో తమ స్థల కాలాల వాస్తవికత తెలియజెప్పటమే ప్రధాన లక్ష్యమైన రచయితలు చాలా మైనర్ ఆర్టిస్టులనిపిస్తుంది నాకు (మీరు పేర్కొన్న పెర్ల్ ఎస్.బక్, గోర్కీతో సహా నా దృష్టిలో, వేరే కారణాలతో కూడా).

    తమ అంతరంగ ప్రపంచంపై స్థలకాలాల వక్రీకృత ప్రతిబింబాల వాస్తవికతను పట్టుకున్నవాళ్లు ఇంకా నచ్చుతారు. మార్క్వెజ్ కూడా ఆ కోవకు చెందినవాడే. అసలీ గుణం వశం చేసుకునే అతను మాజిక్ రియలిజాన్ని పుట్టించగలిగాడు. ఈ పర్టిక్యులర్ నవల్లో అది ఉండీ ఉండనట్టు ఉంటుంది. ఇందులో కనిపించే ప్రపంచం పూర్తిగా మార్క్వెజ్ మానసిక ప్రపంచం. ఇది అప్పటి లాటిన్ అమెరికన్ ప్రపంచానికి ప్రాతినిధ్యం వహించేది చాలా తక్కువ. నేను చదివిన మార్క్వెజ్ రచనల్లో పూర్తి రియలిస్టు ధోరణిలో నడిచేది No One Writes to the Colonel అనే చిన్న నవలిక. మీ ఉద్దేశానికి ఇది సరిపోవచ్చు. (Btw, Edith Grossman is a she. Trying to get her translation of Don Quixote)

    & I loved the way you prepared yourself for this book. 🙂

Leave a Reply