యె హై బొంబై మెరి జాన్..
గత రెండు మూడేళ్ళల్లో అనురాగ్ కశ్వప్ మీద నాకు కొంచెం గురి కుదిరింది. ముఖ్యంగా ఆయన తీసిన “బ్లాక్ ఫ్రైడే” సినిమా చూశాక. ఆయన తీస్తున్న కొత్త సినిమా “బాంబే వెల్వట్” జ్ఞాన్ ప్రకాశ్ రాసిన “ముంబై ఫాబల్స్” అనే పుస్తకం ఆధారంగా తీయబడుతోందని తెలిసాక, దాని మీద ఆసక్తి హెచ్చింది. అంతర్జాలంలో కూడా ఆ పుస్తకాన్ని గురించి మంచి మాటలు వినేసరికి పుస్తకాన్ని చేజిక్కించుకోవడం, చదవడం రెండూ పూర్తయ్యాయి.
మనుషుల గురించి బయోగ్రఫీలు ఉంటాయి. ఓ డభై, యనభై ఏళ్ళ జీవితంలో జరిగిన ముఖ్యఘటనలు, వైఫల్యాలు, విజయాలు వీలైనంత ఆసక్తికరంగా రాసుకొస్తారు వాటిలో. అలా రాసుకొచ్చేవారు ఆ మనిషిని, జీవితాన్ని దగ్గరనుండి చూసుండచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు ఎంత దూరం నుండి ఈ మనిషిని గురించి రాస్తున్నారన్న దాని బట్టి ఆ జీవితచరిత్రలో విషయాలు, విశేషాలుంటాయి. ముంబైలాంటి మహానగరాన్ని గురించి ఏ చరిత్రకారుడో చెప్తే అది ఒకరకంగా ఉంటుంది. అదే ఈ పుస్తకంలోలా, తమ నగరాన్ని గురించి అక్కడి నివాసులు, పాత్రికేయులు, రచయితలు, సినిమాలు, కార్టూన్లూ – ఇవ్వన్నీ చెప్పుకొస్తే, ఆ నగరానికి ఎప్పుడూ వెళ్ళనివారికి కూడా దాని గుండె చప్పుడు వినిపిస్తుంది. దాని నాడి తెలుస్తుంది. ’గమన్’ అనే హింది సినిమాలో ’సీనే మె జలన్..’ అనే ఘజల్‍లో ’హర్ షక్స్ యహా పరేషాన్‍సా క్యు హై?’ (ఈ నగరంలో ప్రతి ఒక్కరూ కలతచెంది ఉంటారెందుకు?) అన్న లైన్ ఉంటుంది. మరి ఇందరి కలతతో ఆ నగరమెంతటి కలతచెందుతుందో ఊహించుకునే అవకాశం కల్పిస్తుంది ఈ రచన.
బ్రిటిష్ పరిపాలన కాలంలో పెట్టిన పేరు(బొంబాయి)ను చెరిపేసుకొని, ఇప్పుడు ముంబైగా వెలుగుతోంది. అయినా ముంబై కథ అక్కడే మొదలవుతుంది. పోర్చిగీస్ కాలంలో బొంబాయి గురించి, ఆపై బ్రిటిష్ వారి పరిపాలన, ప్రపంచ యుద్ధాల మధ్య బొంబాయిలో ఎగసిపడిన వ్యాపార కెరటం, అంతలోనే దేశవిభజన, దాన్ని తట్టుకొని కొత్త కలలు సాకారం చుట్టిన స్వాతంత్ర్యం, ఆపై స్వపాలనలో పెరిగిన అన్యాయాలు, అసమానతనలు, వాటిని వాడుకొని ఆడుకుంటున్నవారి గురించి ఒక్కొక్కరి దృష్టికోణంలో ఆసక్తికరంగా చెప్పుకొస్తారు. నగరానికి సంబంధించిన ఏ అంశాన్ని ఎత్తుకునే ముందు, రచయిత ఆ అంశానికి సంబంధించిన narrativeను ఏ నవలలోనుండో, సినిమాలోనుండో, వాస్తవిక ఘటనను చెప్తూనో మొదలెడతారు. ఒక నగరం నేపథ్యంలో వచ్చిన కాల్పనిక సాహిత్యాన్ని, ఆ నగరం యొక్క చరిత్రను చెప్పడానికి ఇంత అందంగా వాడుకోవచ్చనని నాకీ పుస్తకం చదివాకే తెలిసింది.
మంటోను గురించి ఎప్పుడు చదివినా ముంబై ప్రస్తావన వస్తుంది. ఆయన జీవితంలో ముంబై ఎంత కీలకమైన పాత్ర వహించిందో, అదంటే ఆయనకు ఎంత ప్రేమో జగద్వితమే! ముంబై చరిత్రకు సంబంధించిన ఈ పుస్తకంలో మంటో ప్రస్తావన రావడం నాకు ఆశ్చర్యకరంగానూ, ఆనందంగానూ అనిపించింది. ఎంతటి మహానగరమైనా అదీ మర్చిపోలేదేమో కొందరిని – అన్న ఊహ కలిగింది. దేశవిభజనపై రచనలు విరివిగా చదువుతున్న నాకు, అనుకోకుండా ఈ పుస్తకరూపేణ మరో మంచి రిసోర్స్ దొరికింది. అప్పట్లో ఏర్పడ్డ ప్రొగసివ్ రైటర్స్ గురించి మరిన్ని వివరాలు తెల్సుకునే వీలుకలిగింది. కె.ఎ.అబ్బాస్, ఇస్మత్ చుగ్తాయి, భీష్మ్ సహానీ తదితరుల ముచ్చట్లు ఇందులో కూడా చదువుకునే అవకాశం దొరకడంతో నాకీ పుస్తకం మరీ నచ్చేసింది.
దేశవిభజనను మొత్తం ఆనాటి రచయితల దృక్కోణం నుండి చెప్పుకొచ్చి, విభజన లేవదీసిన ప్రశ్నలకు హింది సినిమా ఎలా జవాబులివ్వడానికి ప్రయత్నించిందో చెప్పుకొచ్చారు. యాభై, అరవైలలో వచ్చిన సినిమాల్లో స్వాతంత్ర్యానికి, దేశభక్తికి పెద్దపీట వేయడానికి అప్పటి రచయితుల మానసికావస్థ ఎలా దోహదపడిందో వివరించడానికి ప్రయత్నించారు. అలానే యనభై, తొంభైలలో నగరంలో పేట్రేగిపోతున్న లాండ్ మాఫియా, అల్లర్ల గురించి “డోగా కామిక్స్” ద్వారా చెప్పుకొచ్చారు. ఓ రకంగా ఆ కామిక్స్ కు పూర్తిస్థాయి పరిచయాన్ని కల్పించారు. ఈ పుస్తకం చదివి డోగా కామిక్స్ వేట ప్రారంభిస్తే పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదనుకుంటాను. ముంబై అంటే ముందు గుర్తొచ్చే బాలీవుడ్, ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‍లో బా నడుస్తున్న నేటి బాలీవుడ్ గురించి ఏమీ రాయలేదు. అయితే, బాలీవుడ్ తొలినాటి విశేషాల గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యంగా Fearless Nadia గురించి చెప్పుకొచ్చిన కబుర్లు.
’సప్నో కా షెహర్’ (కలల నగరం)గా పేరొందింది కాబట్టి, తట్టబుట్టా పట్టుకొని కలలను మాత్రమే నమ్ముకొని ఇక్కడికి వచ్చేవారి కథలనూ హైలైట్ చేయలేదు. కానీ ఎన్నో తరాలుగా నగరంలోనే ఉంటున్నా, దాన్ని ’నాది!’ అని చెప్పుకునే స్థితికి ఎదగలేని పేదవారి కథలు, వారి గూడుమీదే కన్నేసే రియల్ ఎస్టేట్ దొరల గురించిన కథలున్నాయి. అలానే, విభజన సమయంలో మిగిలిన గాయాలను మాననివ్వకుండా వాటిని రెచ్చగొట్టే అతివాదుల కథలున్నాయి. దేశం నలుమూలల నుండి వచ్చి, నివసించి, తోటివారితో శాంతియుతంగా సహజీవనం కొనసాగిస్తున్నవారి టార్గెట్ చేసుకుంటే, ముంబై తమది మాత్రమేనని విర్రవీగేవారి కథలూ ఉన్నాయి. బాల్ ఠాఖరే గురించి ఇంతకు ముందు నేనేం చదవలేదు. ఈ పుస్తకంలో అతడిని గురించి ఏకంగా ఒక చాప్టరే ఉంది.
“నాదంటే నాది!” అన్న గొడవలో చిక్కుకున్న ముంబైను గురించి చదువుతుంటే, ప్రస్తుతం హైదరాబాదు గురించి జరుగుతున్న రచ్చ గుర్తొచ్చింది. మహారాష్ట్ర, గుజరాత్ ఏర్పాటులో ఎప్పటి ప్రభుత్వంకూడా ఓటు బాంక్ పాలిటిక్సే ఆడిందని తెల్సుకొని విస్తుపోయాను. తమతర బేధాలు లేకుండా అందరికి ఆశ్రయమిచ్చే ఈ నగరాలకి ఎన్నేసి అగచాట్లో?
ముంబై నగరంలో అర్బన్ ప్లానింగ్, బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి వరకూ జరిగినవి, జరుగుతున్నవాటి గురించి చాలా విషయాలు పొందుపరిచారిందులో. ముఖ్యంగా ముంబై సాగర తీరాన్ని అందమైన నివాసయోగ్యంగా తీర్చదిద్దటానికి బ్రిటిష్ పాలనలోనే చేసిన విఫలప్రయత్నాలు, వేసిన కమీషన్ల గురించి తెలుస్తాయి. స్వాతంత్ర్యానంతరం జరిగిన అర్బన్ ప్లానింగ్‍పై కూడా సుధీర్ఘమైన చాప్టర్ ఉంది.
ఇలాంటి పుస్తకాల్లో ఉండాల్సిన maps, ఫొటోలు, రిఫెరెన్స్లులు అన్నీ చక్కగా ఉంచారు పుస్తకంలో.
ఏదైనా నగరానికి వెళ్ళినప్పుడు అక్కడి ట్రాఫిక్, రోడ్ల గురించి తిట్టుకొని, అక్కడి సందర్శనా స్థలాల ముందు నుంచొని ఫోటోలు దిగి, అక్కడ దొరికిందేదో తిని, ఆ పై దాని గురించి మర్చిపోయేవాళ్ళు ఈ పుస్తకం చదవక్కర్లేదనుకుంటాను. ముంబై అంటే ఇష్టమైన వాళ్ళు చదవాల్సిన పుస్తకం. ఏదో ఒక నగరంలో నివసిస్తూ, ఎంతోకొంత ఆ నగరాన్ని సొంతంచేసుకొని, ఎంతోకొంత దానికి సొంతమైన వాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం. ఎన్నేళ్ళ బట్టి ఉంటున్నా, నగరానికి అపరిచితులగానే మిగిలిపోయేవారు చదవడానికి ప్రయత్నించచ్చు.
బొంబాయిలోని తళుకుబెళుకులని, చీకటినీ ఇంత అందంగా రాసిన రచయితకు ధన్యవాదాలు!
Non-fiction
Harper Collins
2010
Paperback
395
పద్మవల్లి
It seems like an interesting read. Should try to get it. Thanks for introducing it.