వార్తల వెనుక కథ

వ్యాసం రాసిపంపిన వారు: మురళి
book-21కొన్ని కథలు ఆనంద పరుస్తాయి, మరికొన్ని ఆలోచింప చేస్తాయి, ఇంకొన్ని వెంటాడతాయి. ఈ మూడో తరహా కథల సమాహారం ‘వార్తల వెనుక కథ.’ నిత్యం జరిగే ఎన్నో సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులుగా ఉండే పత్రికా రచయితలు – వాడుక భాషలో జర్నలిస్టులు – వార్తలను సేకరించడంలో తమకి ఎదురైనా అనుభవాలను కథలుగా మలచి పొందు పరిచారు ఈ సంకలనంలో.
అత్యంత సీనియర్ పాత్రికేయులు మొదలు అప్పుడే వృత్తిలోకి ప్రవేశించిన రిపోర్టర్ల వరకు వివిధ వార్తా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మొత్తం 45 మంది జర్నలిస్టులు కీలక వార్తల సేకరణలో తాము ఎదుర్కొన్న కష్ట నష్టాలను వివరిస్తూనే, ఆ వార్త ప్రజలకి చేరినప్పుడు ప్రభుత్వం స్పందించినప్పుడు ఎంతగా సంబర పడిపోయారో కూడా రాసుకున్నారు. పుస్తకం పూర్తి చేశాక చాలా రోజుల పాటు నన్ను వెంటాడిన కొన్ని కథనాల గురించి ఇక్కడ చెబుతాను.
‘నాగసుందరి’ రాసిన ‘వెంటాడిన దృశ్యాలు’ గురించి మొదట చెప్పుకోవాలి. ‘సుప్రభాతం’ పత్రిక కోసం హైదరాబాద్ పాతబస్తీలో కొందరు రౌడీలను ఇంటర్వ్యూలు చేశారు నాగసుందరి. ఆ కథనాలు చదివినప్పుడు తెర వెనుక ఈ తరహా ఇబ్బందులు ఉంటాయని అస్సలు ఊహించలేదు నేను. మాట్లాడడానికి ఇష్టపడని ఒక రౌడీకి ఫోటో అంతే ఉన్న ఆసక్తిని గమనించి ఫోటోగ్రాఫర్ కి ఫోటోలు తీస్తూనే ఉండమని చెప్పి తన ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్నారీవిడ. ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఒక రౌడీ తనని ‘చెల్లెమ్మా’ అని సంబోధించదాన్ని అపురూపంగా రాసుకున్నారు.
జర్నలిజం రంగం లో మహిళలకి ఉండే ఇబ్బందులని నాగసుందరి తో పాటు మరికొందరు మహిళా పాత్రికేయులూ ప్రస్తావించారు ఈ పుస్తకంలో. ‘దక్కన్ హెరాల్డ్’ విలేఖరి అఖిలేశ్వరి నమీబియా అనుభవాలు ఇందుకు పరాకాష్ట. పరాయి దేశం లో వసతి దొరక్క ఆమె పడ్డ ఇబ్బందులు, ఇతర విలేకరుల సహాయ నిరాకరణ ని తట్టుకుని తన పత్రికకి భిన్న కథనాలు ఎలా అందించారో వివరించారు ‘నమీబియా..ఓ నమీబియా’ కథనం లో.
నక్సలైట్లను తను ఎలా ఇంటర్వ్యూ చేశారో ‘దండకారణ్యంలో జనతన సర్కార్’ కథనం లో సి.వనజ వివరించగా, ‘సల్వాజుడుం కథా కమామీషు’ వర్ణించి చెప్పారు ‘ది వీక్’ విలేఖరి లలితా అయ్యర్. పనిలో పడితే మహిళలం అన్న విషయాన్ని తాము మర్చిపోయినా చుట్టూ ఉన్నవాళ్ళు గుర్తు చేస్తారంటారు వీళ్ళు. అడవుల్లో ఒంటరి ప్రయాణాలు, రిస్కుని ఖాతరు చేయక పోవడం ఇవన్నీ వృత్తిలో మామూలేనంటారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధి హత్య దేశాన్నే కాదు ప్రపంచాన్నే నిర్ఘాంత పరచింది. అంతకు కొన్ని గంటల క్రితమే ఎర్పోర్ట్ తమతో నవ్వుతూ మాట్లాడిన రాజీవ్, రక్తపు ముద్దగా, గుర్తించడానికి వీల్లేని విధంగా కనిపించిన క్షణాలను, ఆ వార్తను అప్పటి పి.టి.ఐ. విలేఖరిగా  ప్రపంచానికి తొలిసారిగా చెప్పిన క్షణాలను గుర్తుచేసుకున్నారు ఆర్. రంగరాజ్ ‘రాజీవ్ గాంధీ దారుణ హత్య’ కథనం లో.
కుటుంబతో గడపాల్సిన ఎన్నో ఆదివారాలని త్యాగం చేసి దొరుకుతుందో దొరకదో తెలియని వార్త కోసం నేవల్ క్వార్టర్ల చుట్టూ తిరిగి చివరికి ఓ సంచలన కథనాన్ని ఎలా సంపాదించారో చెప్పారు జి.వల్లీశ్వర్ తన ‘చెమటలు పట్టించిన టైగర్లు’ కథ లో.  తన కథనం పత్రిక యాజమాన్యం, పాఠకుల ప్రశంశలు పొందడతో కష్టాన్ని మర్చిపోయానని రాసుకున్నారు.
పెళ్లి పీటల మీద కూర్చుని కూడా వార్తా కథనాన్ని వెతికిన సి.వి.ఎస్. రమణ రావు కథనం ‘అయ్యవార్లకు రుణ విముక్తి’ ఆసక్తికరంగా సాగుతుంది. పేద పురోహితులని తన గుప్పిట్లో పెట్టుకున్న ఓ పెద్ద పురోహితుడి లీలలను వార్తా కథనంగా ప్రచురించడం, అందుకు అధికారుల నుంచి వచ్చిన స్పందననూ వివరించారు.
కేవలం సీరియస్ కథనాలే కాదు నవ్విస్తూనే ఆలోచింపచేసే కథనాలూ ఉన్నాయి ఈ పుస్తకంలో. సంచలనం సృష్టించిన ‘మర్లకుంట’ విందు గురించి ఎన్నెన్నో కథనాలు రాసిన విలేఖరులు ఒక్క వంటకాన్నీ రుచి చూడలేదట. ఆ రాత్రి రోడ్డు పక్కన బండి మీద దొరికిన బజ్జీలతో కడుపు నింపుకున్నామనీ, పత్రికా యాజమాన్యాల నుంచి అవమానాలు మాత్రం తప్పలేదనీ చెబుతారు ప్రసేన్ ‘ఓ వంటకం కథ’ లో.
ఓ మహిళ స్థితి పై జాలి తలచి వార్తా కథనం ప్రచురిస్తే తన సమస్యని పరిష్కరించాల్సిందిగా ఆ మహిళే స్వయంగా వచ్చి విలేఖరి వెంటబడ్డ  వైనం ఏమిటో ఆర్.ఎం. ఉమామహేశ్వర రావు రాసిన ‘వెంటాడిన వార్త’ లో తెలుసుకోవచ్చు. చిత్తూరు నుంచి వచ్చిన ఆ మహిలకి హైదరాబాద్ లో చికిత్స చేయించి పంపారు రావు.
లాతూర్ భూకంపం, బాబరీ మసీదు కూల్చివేత, ఎన్టీర్ పదవీచ్యుతి, బషీర్ బాగ్ కాల్పులు లాంటి సంఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యులైన విలేకరులు ఆ సంఘటనల పూర్వాపరాలపై రాసిన కథనాలు మనకి ఆయా సంఘటనలని మరోసారి గుర్తు చేస్తాయి. వార్తా కథనాన్ని సమగ్రంగానూ, మిగిలిన అందరికన్నా ముందుగానూ పత్రికకి అందించడానికి జర్నలిస్టులు పడే ఇబ్బందులని ఈ కథనాలు వివరిస్తాయి. ఎలక్ట్రానిక్ మీడియా గురించి రెండు కథనాలున్నాయి, బషీర్ బాగ్, అలిపిరి కవరేజ్ ల గురించి.
ఈ పుస్తకం చదివిన తర్వాత పత్రికల్లో కథనాలని చదివి పక్కన పెట్టి ఊరుకోకుండా, ఈ కథనాన్ని వీళ్ళెలా సంపాదించి ఉంటారు? అని ఆలోచించకుండా ఉండలేము. టీవీ చానళ్ళు బాగా విస్తరించాక కామెడీ కి ముడిసరుకుగా మారుతున్న జర్నలిస్టుల తెరవెనుక కష్టాలను రకరకాల వత్తిడులను, వాటిని అనుభవిస్తూనే వాటినుంచి వారు వెతుక్కునే ఆనందాలనూ ఆవిష్కరిస్తుంది ఈ పుస్తకం.  జర్నలిస్టుల మీద కొంత గౌరవ భావాన్నీ కలిగిస్తుంది. వార్తాంశాల పట్ల ఆసక్తి ఉన్నవారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
న్యూ మీడియా కమ్యూనికేషన్స్ (5-117, బుద్ధ నగర్ కాలనీ, రోడ్డు నెంబర్ 6, ఉప్పల్ బస్ డిపో ఎదురుగా, హైదరాబాద్) విశాలాంధ్ర, ప్రజాశక్తి ఇంకా అన్ని ముఖ్య పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతుంది. పేజీలు 373. వెల రూ. 200.

You Might Also Like

10 Comments

  1. పుస్తకం » Blog Archive » వార్తల వెనుక కథ

    […] లో ఇదివరలో మురళి గారు రాసిన వ్యాసం, ఇక్కడ. (No Ratings Yet)  Loading […]

  2. పుస్తకం » Blog Archive » 2010లో నా పుస్తకాలు

    […] వార్తల వెనుక కథ – కె. రామచందమూర్తి, కట్టా […]

  3. పుస్తకం » Blog Archive » 2009 – పుస్తక నామ సంవత్సరం

    […] ‘చూస్తునే ఉండండి’ ‘వార్తల వెనుక కథ‘ ఆకట్టుకున్నాయి. ‘సలాం […]

  4. jagan,

    mee sameeksha chdivina tharuvatha thappaka varthala venuka katha pusthakam chadvalanna korika, uthsayam rettimpayindi. varthala kosam, vati sekarana,parkikalaku pampadam kosam vilekarulu padebhadalu aanekam. vatini pathrikalo chusaka, sambanditha vyakthuala nunchi vache spandana marichipolenidi.

  5. నరేష్ నందం

    వార్తల వెనక కథ:

    “టీవీ చానళ్ళు బాగా విస్తరించాక కామెడీ కి ముడిసరుకుగా మారుతున్న జర్నలిస్టుల తెరవెనుక కష్టాలను రకరకాల వత్తిడులను, వాటిని అనుభవిస్తూనే వాటినుంచి వారు వెతుక్కునే ఆనందాలనూ ఆవిష్కరిస్తుంది ఈ పుస్తకం. జర్నలిస్టుల మీద కొంత గౌరవ భావాన్నీ కలిగిస్తుంది.”

    నిజమే.. ఇది తప్పక చదవాల్సిన పుస్తకం.

    కానీ ఇక్కడ మా అదృష్ఠం గురించి కూడా నేను చెప్పుకోవాలి.
    ఈ పుస్తకం సంపాదకునిగా ఉన్న రామచంద్ర మూర్తి గారు జర్నలిజంలో మా గురువు గారు. సంవత్సరన్నర కాలం నుంచీ ఆయనతో పనిచేస్తున్నను. ఇక ఆ పుస్తకంలో తమ అనుభవాలు పంచుకున్న ఆర్.ఎం. ఉమా మహేశ్వర రావు, మల్లేపల్లి లక్ష్మయ్య వంటి హేమాహేమీలతో పని చేస్తుండటం, వారి వద్ద శిక్షణ తీసుకోవటం మాకు అయాచిత అదృష్ఠం. ఇక నాగ సుందరి నాకు సోదరి సమానం. ఎన్నో సార్లు ఆఫీసు నుంచి పంజాగుట్ట వరకు నడచిన సమయాల్లో ఎన్నో అనుభవాలు వివరించి నాకు స్ఫూర్తిని నింపింది. ఇప్పటికీ.. తిట్టుకుంటూ.. కొట్టుకుంటూనే ఉంటాం మేము.

  6. రవి

    మీ విశ్లేష్ణ చాల బాగుంది. ఈ పుస్తకం చదవటానికి ప్రయత్నిస్తాను. నేను ఎక్కువగా యండమూరి నొవెల్స్ చదువుతాను. నాకు ఇంక కొన్ని మంచి రచయితల్ పుస్తకాలు సూచించగలరు.

  7. వేణూశ్రీకాంత్

    మంచి పుస్తకం పరిచయం చేశారు. వచ్చే సోమవారం గుంటూరు లోని విశాలాంధ్ర పై దాడి చేయడానికి నిశ్చయించాను. జాబితా లో మరో పుస్తకం కలిసింది, ధన్యవాదాలు.

  8. కొత్తపాళీ

    మంచి పుస్తకం పరిచయం చేశారు. తప్పక కొంటాను.

  9. kalpana

    మురళి గారు,

    మంచి పుస్తకం గురించి నాలుగు మాటలు మంచిగా రాసారు. సంతోషము.

    ” టీవీ చానళ్ళు బాగా విస్తరించాక కామెడీ కి ముడిసరుకుగా మారుతున్న జర్నలిస్టుల తెరవెనుక కష్టాలను రకరకాల వత్తిడులను, వాటిని అనుభవిస్తూనే వాటినుంచి వారు వెతుక్కునే ఆనందాలనూ ఆవిష్కరిస్తుంది ఈ పుస్తకం. జర్నలిస్టుల మీద కొంత గౌరవ భావాన్నీ కలిగిస్తుంది.”

    నిజమే నండీ. point correct గా చెప్పారు.

    కల్పన రెంటాల

  10. తృష్ణ

    ఈ రివ్యూ చదవగానే మధుర్ భండర్కర్ తీసిన “పేజ్ 3” సినిమా గుర్తు వచ్చింది.పత్రికా విలేఖరులు ఎదుర్కునే సమస్యలను ఒక సరికొత్త కోణంలో చూపిస్తాడు దర్శకుడు ఆ చిత్రంలో.

Leave a Reply