వార్తల వెనుక కథ

రాసిన వారు: చౌదరి జంపాల
**********************
రాజీవ్‌గాంధి హత్య జరిగినప్పుడు ఆ వార్త ప్రపంచానికి వెంటనే ఎలా తెలిసింది? అలిపిరిరోడ్దుపై చంద్రబాబు కాన్వాయ్‌ని మందుపాతరతో పేల్చినప్పటి చిత్రాలు అందరూ ఎలా చూడగిలిగారు? బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రత్యక్ష సాక్షుల అనుభవాలేమిటి? అడవులమధ్యలో ఉన్న నక్సలైటు నాయకులతో ప్రత్యక్ష ఇంటర్వ్యూలు ఎలా సాధ్యమౌతాయి? బషీర్‌బాగ్ చౌరస్తాలో కరెంటురేట్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నవారిపై పోలీసుల దమనకాండ రాష్ట్రప్రజలంతా ప్రత్యక్షంగా ఎలా చూడగిలిగారు? ఒంగోలు నీళ్ళస్వామి బండారం ఎలా బట్టబయలయ్యింది? విజయవాడ లాకప్‌డెత్‌ల వివరాలు బయటకెట్లా వచ్చాయి? కరీంనగర్ బెయిళ్ళ కుంభకోణం, ప్రుడెన్షియల్ బ్యాంకు దివాలా, చిత్రావతి ప్రాజెక్టునిర్మాణంలో నాణ్యతలోపం వంటి ఎన్నో ప్రత్యేక కథనాల వెనుక కథలేమిటి?

రోజూ పత్రికలలోనూ, రేడియోలోనూ, టెలివిజన్‌లోనూ చాలా వార్తలు చదువుతుంటాం, వింటుంటాం, చూస్తుంటాం. కొన్ని చరిత్రాత్మక ఘటనలు జరుగుతున్నప్పుడు ఈ ప్రసారసాధనాలకు అతుక్కుపోతాం. ఒకోసారి, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలప్పుడు, ఈ వార్తలే జీవనాధారాలవుతాయి. సమాజానికి అత్యవసరమైన విషయాల్ని నేర్పుగా పరిశోధించి, ప్రాణాలక్కూడా ఒకోసారి తెగించి, మనకు ఎక్స్‌క్లూజివ్‌గా అందచేస్తారు కొందరు విలేఖరులు. ఈ వార్తలు మనదాకా వాటంతట అవే రావు. కొన్నిమార్లు ఈ వార్తా సేకరణలో థ్రిల్లర్ నవలల ట్విస్టులు, ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు, భౌతిక ఇబ్బందులు, మానసిక సంఘర్షణలూ ఉంటాయి. కుట్రలూ, కుత్సితాలూ, బెదిరింపులూ, దేబిరింపులూ, ప్రలోభాలూ, ప్రగల్భాలూ, హాస్యమూ, విషాదమూ అన్నీ ఉంటాయి. ఈ కథలు ఒకోసారి అసలు వార్తలకన్నా ఆసక్తికరంగా ఉంటాయి.

తెలుగులో జర్నలిస్టులు, ముఖ్యంగా రిపోర్టర్లు, స్వంత అనుభవాలపై వ్రాసిన పుస్తకాలు తక్కువ. ఆ లోటు తీర్చటానికి, కొత్తగా జర్నలిజంలోకి అడుగుపెడుతున్నవారికి మార్గదర్శకంగా ఒక పుస్తకం అందజేయడానికి చేసిన ప్రయత్నం ఈ పుస్తకం. నలభయ్యయిదుగురు జర్నలిస్టులు వార్తారచన, వార్తాపరిశోధనలకు సంబంధించి తమ అనుభవాలను ఈ పుస్తకంలో వివరించారు. వీరిలో ధర్మవరపు సీతారాం, ఐ.వెంకటరావు వంటి రిటైరయిన జర్నలిస్టుల దగ్గరనుంచి ఈ తరం రిపోర్టర్ల వరకూ ఉన్నారు. అల్లం నారాయణ, కొమ్మినేని శ్రీనివాసరావు, కె.శ్రీనివాస్, టంకశాల అశోక్, దేవులపల్లి అమర్, TV9 రవిప్రకాష్, ఎన్. వేణుగోపాల్, ప్రసేన్, మల్లేపల్లి లక్ష్మయ్య, ఘంటా చక్రపాణి, ఆర్.ఎం. ఉమామహేశ్వరరావులాంటి చిరపరిచితమైన పేర్లతోపాటు, అంతగా ప్రసిద్ధిపొందనివారు కూడా ఉన్నారు. గత నాలుగు దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్‌పై విపరీతమైన ప్రభావాన్ని చూపిన వార్తల వెనుక కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. దాదాపుగా ప్రతిఒక్కరూ అసలే ఆసక్తికరమైన విషయాలను, ఇంకా ఉత్కంఠభరితంగా చెప్పారు.

కొన్ని చెప్పుకోదగ్గ కథలు: తన పెళ్ళిలో అదనపు సంభావన అడిగిన పురోహితుడి కథ వందలమంది పేదబ్రాహ్మణులను వెట్టిచాకిరీనుంచి ఎట్లా విముక్తిచేసిందో సి.వి.ఎస్. రమణారావు చెబుతారు. కష్టాల్లో ఉన్న స్త్రీకి సహాయం చేద్దామని ఆమె కథను ఆదివారం అనుబంధానికి కవర్‌స్టోరీ చేసిన ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు, ఆకథ తనను ఎట్లా వెంటాడింధో వివరిస్తాడు. మర్లకుంటలో మంత్రిగారి విందులో వన్యప్రాణుల వంటకాల గురించి ఆసక్తికరమైన కథ చెప్పిన ప్రసేన్, తాను వండి జోడించిన కథగురించీ నిజాయితీగా చెపుతాడు. గోదావరిఖనిలో ఒకప్పుడు చెలరేగిన హింసాకాండ సామాజిక మూలలను వెతికి పట్టుకొన్న వైనాన్ని ఘంటా చక్రపాణి వివరిస్తే, నెల్లూరు ప్రాంతంలో పుట్టిపెరిగిన సారా వ్యతిరేక ఉద్యమం గురించి అన్నమనేని శ్రీరామమూర్తి చెబుతారు. నక్సలైట్ల చేతిలో మలహర్‌రావు కిడ్నాప్, హత్యల పూర్వోత్తర విషయాలు చెబుతారు దేవులపల్లి అమర్. ఛత్తీస్‌ఘర్‌లో నక్సలైట్లు, సాల్వాజుడుంల మధ్య జరుగుతున్న పోరుగురించి ఇద్దరు మహిళా జర్నలిస్టులు (లలిత అయ్యర్, సి.వనజ) పరస్పర విభిన్న కథనాలని వినిపిస్తారు. తన మనసులోమాటని హైదరాబాద్ విలేఖరుల నోట పలికించిన జైల్‌సింగ్ జాణతనం కథ శ్రీనివాసరెడ్డి చెప్తారు. రామారావు ప్రభుత్వాన్ని 1983లో నాదెండ్ల భాస్కరర్రావు, 1995లో చంద్రబాబు పడగొట్టటానికి పూర్వరంగాలలో విలేఖరులపాత్ర గురించి ఆసక్తికరమైన కథలున్నాయి. రాష్ట్రంలో జరిగిన సంఘటనలే కాక, రాజీవ్‌గాంధీ మరణం, బాబ్రీ మసీదు కూల్చివేత, లాతూర్ భూకంపం, నమీబియాలో స్వాతంత్రోదయం వంటి వార్తల తాలూకు కథలూ ఉన్నాయి. ఇల్లా చెప్పుకొంటూ పోతుంటే నలభై ఐదు కథనాలలో ప్రతిదాని గురించీ విడివిడిగా చెప్పుకోవాల్సి వస్తుంది.

అందరూ రాయటంలో అనుభవం ఉన్నవాళ్ళే కాబట్టి కథనాలన్నీ ఉత్కంఠభరితంగానే సాగుతాయి. అవకాశం బాగానే ఉన్నా, స్వోత్కర్ష – అక్కడక్కడా తప్పిస్తే- తక్కువగానే ఉంది. ఈ వార్తల సేకరణలో వాళ్ళు పడ్డ శ్రమ, పోటీదారులని ’స్కూప్’ చేసినప్పుడు కలిగే ఆనందం, ఎడిటరో పబ్లిషరో ’బాగా చేశావ్’ అని మెచ్చుకొంటే మురిసిపోవటం, ప్రజలకు మేలు చేశాం అన్న ఆత్మ సంతృప్తి వర్ణించి చెప్తుంటే ఆ అమాయకపు ఆనందానికి ముచ్చటేస్తుంది. ఈ స్ఫూర్తే కదా కొంతలో కొంతయినా దేశం పూర్తిగా దొంగల పాలవకుండా కాపాడుతుంది అన్న అభినందనతోపాటు, పర్వాలేదు, ఇలాంటి పాత్రికేయులు ఉన్నంతకాలం ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకుని, ప్రజాక్షేమాన్ని బలపరుచుకోవచ్చన్న ఆశ మిగుల్తుంది.

పుస్తకం పొందికగానే తయారయింది. జర్నలిజం విలువ గురించి, విలువల గురించి మంచి కొటేషన్లను ప్రత్యేకంగా అందించారు. అచ్చుతప్పులు తక్కువే కానీ, ముందుమాటలో దాదాపు మొదటి వాక్యంలోనే alien అనే పదానికి బదులు align అని ఉండటం ఆదిలోనే హంసపాదులా ఇబ్బంది పెట్టింది.

వర్తమాన విశేషాల మీద, జర్నలిజం మీద, లేక ‘థ్రిల్లింగ్ రియాలిటీ స్టోరీ’లమీద మక్కువ ఉన్నవారు తప్పక చదువుకోవలసిన పుస్తకం.

వార్తల వెనుక కథ
సంపాదకులు: కె. రామచంద్రమూర్తి, కట్టా శేఖరరెడ్డి
సహసంపాదకులు: డాక్టర్ ఎల్. విజయకృష్ణారెడ్డి (ఎల్వీకె), రొద్దం శ్రీనివాసులు
ప్రచురణ: మార్చ్, 2007; న్యూమీడియా కమ్యూనికేషన్స్, హైదరాబాద్
ప్రతులకు: విశాలాంధ్ర, ప్రజాశక్తి వగైరా
374 పేజీలు; రూ.200

ఈ పుస్తకంపై, పుస్తకం.నెట్ లో ఇదివరలో మురళి గారు రాసిన వ్యాసం, ఇక్కడ.

You Might Also Like

3 Comments

  1. bhandaru srinivasarao

    విషయాన్ని వివాదం చేయడం ఉద్దేశ్యం కాదు కేవలం వివరణ మాత్రమె. తెలుగు జర్నలిజం గురించి మాట్లాడుకునేటప్పుడు తప్పనిసరిగా అందరికంటే ముందు స్మరించుకోవాల్సింది నార్ల గారిని. నార్ల గారి స్కూల్లో చదువుకున్నవాళ్ళు ‘విలేకరి ‘అనే రాస్తారు. అలాగే ఆయన అందరికీ చెప్పేమాట – ‘యొక్క’ అనే పదం ఏ పరిస్తితిలో వాడవద్దని. ‘యొక్క’ తెలుగు భాషకు ‘బొక్క’ అని ఆయన వ్యంగంగా అనేవారు. వారికి నచ్చని మరో తెలుగు పదం ‘నుండి’ – ‘నుంచి’ అని రాయాలని సుగ్రీవాజ్ఞ. నార్ల గారిని అనుసరిస్తూ ప్రతి సంపాదకుడు తనదయిన శైలిని పత్రికా భాషలో ప్రవేశ పెడుతూ వచ్చారు. అందువల్ల ‘ఏది తప్పు ? ఏది ఒప్పు?’ అనే మీమాంస లోకి పోవడం – ప్రత్యేకించి పత్రికా భాషకు సంబంధించి – అంత భావ్యం అనిపించుకోదు. నేనూ ఒకప్పుడు నార్లగారి సంపాదకత్వంలో – నేరుగా ఆయనగారివద్దనే – ఆంధ్ర జ్యోతిలో నా జర్నలిస్ట్ జీవితంలో ‘ఓనమాలు’ దిద్దుకున్నాను. ప్రస్తుతానికి వస్తే ‘వార్తల వెనుక కధ’ పుస్తకానికి సంబంధించి నాకూ కొంత బాదరాయణ సంబంధం వుంది. ఇందులో రేడియో విలేకరిగా ఆ నాటి ప్రధాని రాజీవ్ గాంధీతో భద్రాచలం అడవుల్లో సంచరించినప్పటి అనుభవాలను ‘అడవి బాటలో రాజీవ్ గాంధీ’ పేరుతొ – పుస్తక సంపాదకులు కట్ట శేఖరరెడ్డి గారి కోరిక మేరకు రాసిచ్చిన నా వ్యాసం కూడా ఈ పుస్తకం లో వుంది. – భండారు శ్రీనివాసరావు

  2. జంపాల చౌదరి

    @Srinivas:
    శ్రీనివాస్ గారూః ఇంకా నయం, మీకు బాగుండాలని విలేకరి అని వ్రాసుంటే భూషణ్ గారి వంటి పెద్దలెవరైనా కోప్పడి మళ్ళీ ఇంపోజిషన్ వ్రాయించేవారు. 🙂

    విలేఖరి అని వ్రాయటమే సరి అయిన వాడుక (చూ. తెలుగు-తెలుగు లేక ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, తెలుగు అకాడమి, 2001). విలేఖనము అన్న పదానికి వ్రాయుట అన్న అర్థం ఉంది.

    (నా మొదటి ప్రతిలో ఎక్కడో విలేకరి అని ఉంటే, పుస్తకం సంపాదకులు సౌమ్యగారు చూసేశారు. ఇంపోజిషన్ వ్రాయించలేదు లెండి.)

  3. Srinivas

    ఆసక్తికరంగా ఉంది. ఈ పుస్తకం మంచి ప్రయత్నం. కొత్త జర్నలిస్టులకూ ఉపయోగపడొచ్చులా ఉంది.
    మీరు విలేకరులను విలేఖరులు చేయడం బాలేదు.

Leave a Reply