సాహిత్యానుబంధం: Fiction of Relationship

MOOCs అంటే ఏమిటో, వాటిలో సాహిత్యం ఎలా నేర్పిస్తారో ఈ వ్యాసంలో చెప్పున్నాను. అందులోనే బ్రౌన్ యూనివర్సిటివారు సమర్పిస్తున్న “Fiction of Relationship” అనే కోర్సు జూన్-జూలై నెలల్లో మొదలవుతుందని రాశాను. ఆ కోర్సు ఇటీవలే విజయవంతంగా ముగిసింది. పన్నెండు వారాల పాటు నిర్విరామం నడిచిన ఈ కోర్సుతో నా అనుభవాలు పంచుకోవటమే ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం.

(ఈ ఆన్-లైన్ కోర్సుల్లో ఎలా రిజిస్టర్ అవ్వటం, ఎలా పాలుపంచుకోవటం లాంటి విషయాలు ఇంతకు ముందే చెప్పున్నాను గనుక వాటి ప్రస్తావన ఇక్కడ తేవటం లేదు.)

కోర్సు – దాని కథా కమామిషు:

కొందరికి లడ్డూలంటే నోరు ఊరినట్టు, నాకీ కోర్సు పేరు చదవగానే మనసూరింది. Fiction of Relationship! ఎంతగా ఊరిందంటే ఈ పేరు నాకు కళ్ళబడంగానే, ఇంకా ఆర్నెళ్ళు వ్యవధి ఉన్నా, కోర్సులో రిజిస్టర్ అవ్వటమే కాక, కోర్సుకు సంబంధించిన పుస్తకాలు డౌనులోడు చేసుకోవటమో, కొనుక్కోవటమో మాత్రమే కాకుండ వాటిని చదివిపెట్టుకున్నాను కూడా. భరించలేనంత ఉత్కంఠతతో ఎదురుచూశాను ఈ కోర్సు కోసం.

ఈ కోర్సు చేయాలనుకుంటున్నట్టు కొందరితో అన్నాను. వాళ్ళా పేరు వినగానే నా పక్కనే తేలు ఉన్నట్టు అరిచారు. నేనేదో forbidden regionలో కాలుమోపుతున్నట్టు నన్ను హెచ్చరించారు. బుర్రనంతా చెత్తతో నింపకనీ వారించారు. అంతే కదా మరి! ఫిక్షన్‍లో రిలేషన్స్ గురించి చదువుతున్నా అంటే సరేనంటారుగానీ, బంధాలనే ఫిక్షన్ అని అంటే ఇలాంటి ప్రతిస్పందనలే వస్తాయి. ఇది గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇక్కడ – ఈ కోర్సును చదవాలన్న, చదివి అర్థంచేసుకోవాలన్నా మన బంధాల్లోని కాల్పనికతను గుర్తించగలగాలి, ఆమోదించగలగాలి.  మా ప్రొఫెసర్‍గారి మాటల్లో:

“Breaking up simplistic patterns of life into something more complicated, more provocative is fun! It’s not labor. Seeing the ambiguities of life is not always welcome news, but it does make for a more interesting world.”

ఆ ఆసక్తికరమైన ప్రపంచంలో తిరుగాడడానికి ఓ మార్గదర్శి కావాలి. ఆ బాధ్యతను ఆర్నెల్డ్ వీన్‍స్టన్‍గారు చక్కగా నిర్వర్తించారు. “బంధం” అనగానే ఇద్దరి మధ్యన ఉండే బంధం, ముఖ్యంగా స్త్రీ-పురుషుల మధ్య అనే జెనరిక్ నిర్వచనం నుండి, మనిషికి తనతోటి మనుషులతో ఉండే సంబంధాలు, తన సొంత శరీరంతో ఉన్న బంధాలు, తాను సహజీవనం కొనసాగిస్తున్న చరచరా సృష్టితోనూ, తన సొంత సృష్టి అయిన మతాలు, కులాలు, సామాజిక తరగుతులు, రాజకీయాలు వగైరా వగైరాల గురించి వీలైనంత లోతుగా, కూలంకషంగా ఆలోచించే వీలు కల్పించిందీ కోర్సు.

సిలబస్:

పన్నెండు వారాల్లో పది నవలలు, మూడు కథా సంపుటిలు (అందులో రెంటిలో రెండేసి కథలు మాత్రమే) చదివాము.

పద్దెనిమిదో శతాబ్దపు యుక్తవయసు ప్రేమకథ Manon Lescautతో మొదలయ్యి, ఇరవై శతాబ్దంలోని దక్షిణాఫ్రికాలోని మారుతున్న నల్ల-తెల్ల జాతుల మధ్య ఈక్వేషన్స్ (ముఖ్యంగా post-apartheid కాలంలో)లో ఒక  ప్రొఫెసర్ గాథ Coetzee రాసిన Disgrace నవలతో ముగిసింది. Charlotte Bronte రచించిన Jane Eyre విక్టోరియన్ పీరియడ్ లో ఒక సామాన్య అమ్మాయి కథను బాల్యం నుండి ఆమె వివాహం వరకూ చూపిస్తే, ఆ కాలానికి దగ్గర్లో “మారేజ్” నవలగా అభివర్ణించదగ్గ రచన, వర్జినియా వూల్ఫ్ రాసిన To the Lighthouse.” Narrative techniquesని వాడుకోవాలే గానీ, మనిషి అంతరాంతరాల్లో భావాల లోతునూ, మనిషి బంధాలలోని వెలితినీ గొప్పగా చూపించవచ్చని తెలియజెప్పే రచన.

లాటిన్ అమెరికన్ లోని నల్ల-తెల్ల జాతుల మధ్య ఘర్షణనూ, అప్పటి ప్రజల సంఘర్షణనూ అద్భుతమైన పదాల ఆటతో కళ్ళకుకట్టినట్టు చూపించిన రచన William Faulkner రాసిన Light in August. తక్కిన రచనలకన్నా సంక్లిష్టమైనది – విషయపరంగానూ, శైలిపరంగానూ. ఈ నవలలోని విషయాన్ని స్త్రీ దృక్పథంతో, స్త్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే ఎలా ఉంటుందన్న ఊహకు దాదాపుగా సరిపోయే సమాధానం Toni Morrison నవల Beloved. ఈ నవలలు కాక, ప్రపంచానికి అంతగా తెలియని చిట్టి నవల The Ice Palace”.

కథల విభాగంలో Borges కథల సంపుటి Ficciones పూర్తిగా, కాఫ్కా రాసిన The Metamorphosis and  A Country Doctor, మెల్విల్ రాసిన Bartleby and Benito Cereno ఉన్నాయి.

కోర్సు విధివిధానం:

కాల్పనిక సాహిత్యానికి సంబంధించిన కోర్సులు దాదాపుగా విపరీతమైన అనాలిసిస్‍లూ, ఫ్రాయిడన్ సింబల్స్ వెతుక్కోవడాలూ ఉంటాయి. ఇవ్వన్నీ Cartesian modelను పాటిస్తుంటాయి. ఈ కోర్సులో మాత్రం ఆ పద్ధతి పాటించకుండా, అనాలిసిస్‍కు కొంత ప్రాధాన్యతే ఇచ్చి, synthesisకు పెద్ద పీట వేశారు. అందుకని, రాసే పేపర్లో సగం అనలిటిక్ పేపర్స్ (అంటే, ఆయా రచనలోని సాహిత్యపు విషయాల – కథనం, భాష, శైలి – పై వ్యాఖ్యానించటం) అయితే, సగం క్రియేటివ్ పేపర్స్ గా(అంటే, ఆయా రచన మనలో కలిగించిన భావోద్వేగాన్ని కథగానో, కవితగానో పట్టుకోవడం.) పెట్టారు. దీనివల్ల కథ, కథకుడు, అతడి జీవితం, అతడి రుగ్మతలు – వీటిని వదిలేసి, హాయిగా కథలోని పాత్రల గూర్చి ఎక్కువగా ఆలోచించే అవకాశం వచ్చింది.

కథలోని పాత్రలతో ఏకమైన, ఆ పాత్రల భావోద్వేగాలను మనం అనుభవించడం విడ్డూరం, అనవసరం అని కొందరి అభిప్రాయం. నాకు మాత్రం అలా చదవటమే ఇష్టం, అలవాటు. ఆ ఇష్టాన్ని, అలవాటునీ ప్రొఫెసరంతటివారు నొక్కి వక్కాణించి మరీ దానికి ప్రాధాన్యత ఇవ్వటంతో నాకు ఈ కోర్సు ఇంకా బాగా నచ్చేసింది.

మా మాంచి ప్రొఫెసరుగారు:

ఈ కోర్సును నిర్వహించింది Prof. Arnold Weinstein. వీరి రెస్యూమె ఇక్కడ చూడవచ్చు.

ఈయన గురించి చెప్పుకునే ముందు, అసలు సాహిత్యాన్ని ఇలా అధ్యయనం చేయటం ఎంత వరకూ అవసరం అన్న ప్రశ్న ఉదయించచ్చు. ముఖ్యంగా కాలేజీలలో, యూనివర్సిటిల్లో కాల్పనిక సాహిత్యాలు చదవని వాళ్ళకు, సరదాగా, కాలక్షేపానికి చదివేవాళ్ళకు ఒక రచనను “స్టడి”చేయటం ఎంత వరకూ ఉపయోగకరం అనిపించచ్చు. దీనికి ఒక నిర్దిష్టమైన సమాధానం ఉందని నేననుకోను. ఒక రచన చదివి దానిపై ప్రసంగమో, రచనా వ్యాసంగమో (మార్కులకోసమో, సర్టిఫికేట్ల కోసం) చేయాల్సిన అవసరం లేనివారు కూడా ఆయా రచనను శ్రద్ధగా, వీలైనంత లోతుగా చదివి తమ ఆలోచనలను పంచుకునేవారూ ఉంటారు. ఒక రచనపై వీలైంతగా అధ్యయనం చేయటానికి ఆసక్తి, మేధతో పాటు ప్రొ.వీన్‍స్టెన్ లాంటివారు మార్గనిర్దేశకత్వానికి తోడుగా ఉంటే, ఆ ప్రయాణం మరింత ఉజ్జ్వలంగా ఉంటుందని నా అనుభవం.

“We live in a society that is awash in facts, awash in data – all you’ve to do is to log on and you’ll find out – but, starved for understanding, starved for interpretation. You can’t log on to understanding or interpretation. You can understand a theorem, but how do you understand its possible ramifications? What changes it is likely to produce or prevent?” అని అడిగారాయన తొలి లెక్చర్ లోనే. కాల్పనిక సాహిత్యంలో బంధాల గురించి, బంధాల్లోని “కాల్పనికత”ను గూర్చిన అనేకాంశాలను ఆలోచించడానికి ప్రేరేపించాయి ఈయన పాఠాలు. కాల్పనిక సాహిత్యాన్ని బాగా ఆస్వాదించడానికి ఆ పాత్రలతో మమేకమవడం, వాటి స్థితిగతులు, పరిస్థితులను సహానుభూతితో అర్థంచేసుకోవడం చాలా అవసరం. అయితే వాటిని అంతగా చదివే ఒకానొక పాఠకునికి “నా మెదడులోని ప్రతి కణంపై నీ పేరే ఉంది.” అని ఎవరన్నా ప్రేమలేఖంటూ రాశారనుకోండి, దాన్ని పైత్యమని కొట్టిపారేస్తాడేగానీ నెత్తినెట్టుకోకపోవచ్చు. అదే ఒక కథలో, కవితలో ప్రేయసి, ప్ర్రియునికి అదే భావం స్ఫురించే మాటల వరుస రాసుంటే అతడికి బాగా అర్థం అవ్వచ్చు. మన దైనందిక జీవితంలో పనికిరాని ఈ కాల్పనిక సాహిత్య అధ్యయనం ఎందుకు మరి? అని అడిగితే.. ఏమో మరి, ఎప్పుడు, ఏది, ఎలా పనికివస్తుందో, ఎవరు చెప్పగలరు?

ప్రొ. వీన్‍స్టెన్ ప్రత్యేకతల్లో ఒకటి విషయాన్ని సూటిగా, సరళంగా ఉంచుతూనే దాని లోతుల్లోకి విద్యార్థులను తీసుకెళ్ళడం. చదివిన సాహిత్యంలోనే కొత్త వింతలు, గమ్మత్తులు చూపగలగడం. స్పష్టమైన ఉచ్ఛరణ, చక్కని స్వరం ఈయన సొత్తు కాబట్టి లెక్చర్లు ఇంకా ఆసక్తిగా వినవచ్చు.  

సహవిద్యార్థులు-వారి అనుభవాలు:

ఏ MOOCలోనైనా చర్చా వేదికలు కీలక పాత్ర వహిస్తాయి. ఈ కోర్సులో ఆ వేదికల్లో పంచుకున్న విషయాలూ, అనుభవాలూ నన్ను బాగా కదిలించాయి. ఉదాహరణకు, కాఫ్కారాసిన మెటమార్ఫసిస్ నేను నాలుగేళ్ళ కిందటే చదివాను. అప్పట్లో ఒకరిద్దరితో ఆ కథను గురించి చర్చించాను. ఒకరు కాఫ్కాపై అమిత భక్తి కనబరచి ఆ రచనను ఆకాశానికెత్తేశారు. ఇంకొకరు అది అర్థంపర్థంలేని కథని కొట్టిపారేశారు. ఈ కోర్సు చర్చావేదికల్లో ఆ కథలోని “గ్రెగర్ సామ్సా” (అతడు ఓ ఉదయాన నిద్రలేచేసరికి మనిషి పరిమాణమంత పురుగుగా మారిపోతాడు.) తమలాంటి వాడేనని, కారణాంతరాలవల్ల అకస్మాత్తుగా కాళ్ళుపడిపోయి మంచానికే అంకితమైన కొందరు అభిప్రాయపడ్డారు. ఆ కథ ఎప్పుడు చదివినా మనిషిని “పురుగులా చూడ్డం” అనే అనుకోలు నాది. కానీ వీరి స్వగతాలు విన్నాక ఆ రచనను అలా కూడా అర్థంచేసుకోవచ్చా అని ఆశ్చర్యమేసింది. 

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకూ, అనేక సంస్కృతులకూ సంబంధించినవారు, పైగా పందొమ్మిది నుండి డబ్భై ఏళ్ళ లోపు ఉన్నవారు ఉండడం చేత చర్చలు విస్తృతంగా, ఆసక్తికరంగా, గౌరవప్రదంగా జరిగాయి. ముఖ్యంగా అభిప్రాయవిభేధాలను వ్యక్తీకరించటంలో ఇక్కడ పాటించనంత సమన్వయం నా ఇంటర్నెట్టు జీవితంలో నేను మరెక్కడా చూడలేదు. అసైన్మెంట్లు లేని వారాల్లో కూడా ఆయా రచనలను తిరిగి చదవడానికి, వాటిని గురించి రాయడానికి ఈ వేదికలు, అందులో పాల్గొన్న సభ్యులు దోహదం చేశారు.  

ముగింపు కాదిది – ఓ నూతనారభం:

ఫిక్షన్‍పై ప్రత్యేక శ్రద్ద ఉన్నవారు తప్పక చేయవలసిన కోర్సు ఇదని నా అభిప్రాయం. మళ్ళీ ఎప్పుడు మొదలెడతారో ప్రస్తుతానికైతే తెలియదు. నా మట్టుకు నాకు ఇదో అద్భుతానుభవం. అందుగ్గాను, ఈ క్లాసుకు నేను సదా ఋణపడి ఉంటాను. ఈ కోర్సు ముగుస్తుందన్న సమయంలో కొంతమంది చొరువ తీసుకొని గుడ్‍రీడ్స్.కామ్ లో ఒక స్టడి గ్రూప్ మొదలెట్టారు. అందులో ప్రొఫెసర్‍గారివి లెక్చర్స్ కొని, చదవాలని మా ప్లాను.  కొనడమయ్యింది, ఇక చదవడమే తరువాయి.

కోర్సు ముగిసిన తర్వాత ప్రొఫెసర్గారు పంపిన లేఖలో ఈ ముక్క, పుస్తకం.నెట్కు సంబంధించిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందనుకుంటాను.

“What I hope this course has seeded are………… a richer sense of how books might build communities, how people who’ve never seen each other might weave together, via shared texts and individual responses, a fiction of relationship.”

 

You Might Also Like

2 Comments

  1. సాహిత్యానుబంధం: Fiction of Relationship | Bagunnaraa Blogs

    […] Purnima MOOCs అంటే ఏమిటో, వాటిలో సాహిత్యం ఎలా […]

  2. valaludu

    పుస్తకాలను ఇంతలోతుగా అవగాహన చేసుకుంటున్నందుకు అభినందనలు. సందర్భమో అసందర్భమో తెలియదు కానీ మన తెలుగు సాహిత్యంపై కూడా ఇటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తే బావుంటుంది.(అసలు వచ్చేవాళ్లుండాలి కదా అంటే ఏమీ చెప్పలేను.) బహుశా గొడవలకు దారితీసి ఊరుకుంటుందేమో చివరికి.

Leave a Reply