The Ice Palace – Tarjei Vesaas

ఇద్దరి మధ్య బంధమో, అనుబంధమో ఎలా ఏర్పడుతుంది? ఎంత సమయంలో ఎంత తీవ్రంగా మారుతుంది? బంధంలో ఉన్న ఆ ఇద్దరికి ఆ బంధమేమిటో, ఎందుకో తెలుస్తుందా? దాన్ని అర్థంచేసుకోగలరా? అర్థంచేయించగలరా? బంధం ఎప్పుడు అంతమవుతుంది? క్షణికమైన కోపతాపాలతోనా? ఇద్దరిలో ఒకరు చనిపోతే ఆ బంధం ముగిసినట్టేనా? పోయినోళ్ళ గురించి పడే శోకంలో ఉన్నదేమిటి? మనల్ని విడిచిపోయారనే కోపమా? మన వెళ్ళలేకపోయామనే అపరాధభావమా? జీవనదిలా పొంగిపారాల్సిన జీవితం మంచులా గడ్డకట్టుకుపోయి ఎన్నాళ్ళుండగలదు? వయసు పెరిగేకొద్దీ మన ప్రపంచం పెరుగుతుందా? తరుగుతుందా? ఏది విజయం, ఏది అపజయం? జీవితమా? మృత్యువా?

ఇలాంటి ఎన్నో ప్రశ్నలను మంచు రాలుతున్నంత సుతారంగా మన మీద కురిపించి, వాటి తీవ్రతలో మనం గడ్డకట్టుపోయేలా చేశా అద్భుతమైన, అరుదైన రచన “ది ఐస్ పాలెస్”. నార్వేకు చెందిన రచయిత తాజ్రేయ్ వెసాస్ 1963లో ప్రచురించిన నవలకు ఆంగ్లానువాదం. నార్వేలో బాగా ప్రసిద్ధి పొందిన ఈ పుస్తకం, తక్కిన ప్రపంచానికి మాత్రం తక్కువగా తెల్సు. కోర్సు-ఎరాలో బ్రౌన్ యూనివర్సిటివారు నిర్వహిస్తున్న “The fiction of Relationship” కోర్సులో భాగంగా ఈ పుస్తకాన్ని చదివాను.

వేసాస్ కవి కూడా. కవులు రాసే వచనంలో ఒక గమ్మత్తు ఉంటుంది. వాక్యాలలో పదాల అర్థాలకు మించిన నిగూఢార్థమేదో ఉంటుంది. అది ఈ చిన్న నవలలో బాగా కనిపిస్తుంది. చెప్పుకోడానికి, ఇది చాలా చిన్న కథ.

సిస్ అనే పదకొండేళ్ళ అమ్మాయి స్కూలులో ఉన్న్ అనే అదే వయసుగల అమ్మాయి చేరుతుంది. కలివిడిగా ఉండే సిస్‍కు, ఉలుకూ పలుకూ లేకుండా దూరంగా నుంచునే ఉన్న్ కూ మధ్య ఏదో ఆకర్షణ కలుగుతుంది. ఓ చలికాలం సాయంత్రం ఉన్న్ ఉంటున్న ఆంటీ ఇంటిలో ఆమెను సిస్ కలుస్తుంది. ఆ పూట వాళ్ళిద్దరి మధ్య చాలా తక్కువ మాటలు చోటుచేసుకుంటాయి. సిస్‍కు నచ్చని పనేదో చేశానని ఉన్న్ అనుకుంటుంది. అలా అనుకొని మర్నాడు స్కూలుకెళ్తే సిస్ ను ఎదుర్కొనాల్సి వస్తుందని, స్కూల్ ఎగ్గొట్టి, ఊరిచివర గడ్డకట్టుకుపోయిన జలపాతాన్ని, ఐస్ పాలెస్‍ను చూడ్డానికి వెళ్తుంది. ఐస్ పాలెస్ అందానికి, “అందని-తనానికి” లొంగిబోయి ఒళ్ళు తెలీకుండా ఐస్ పాలెస్ లోలోపలికి వెళ్తుంది. తిరిగిరాని లోకాలకు చేరుకుంటుంది.

స్కూలుకీ రాక, ఇంట్లోనూ లేని ఉన్న్ కోసం ఊరిజనం వెదుకులాట మొదలెడతారు. ఎంతకీ ఉన్న్ జాడ తెలీదు. మంచు కురవడమూ మొదలవుతుంది. చివరకు ఐస్ పాలెస్‍కు చేరుకుంటారు. అక్కడ ఉన్న్ కనిపించదు వారికి. మర్నాడు ప్రయత్నిస్తారు. లాభం ఉండదు. మెల్లిమెల్లిగా అందరూ ఉన్న్ మీద ఆశలు వదిలేసుకుంటారు. సిస్ చాన్నాళ్ళు ఎదురుచూస్తుంటుంది. తన స్నేహితురాలని అందరూ మర్చిపోయారు గనుక, తన మాత్రమే అనునిత్యం ఆమెను స్మరించాలని నిశ్చయించుకుంటుంది. చలాకీగా ఉండే సిస్ ఉన్న్ లా తయారవుతుంది, ఇంట్లో అమ్మానాన్నలూ, స్కూల్లో స్నేహితులూ ఎంత మొత్తుకున్నాను. అనాథగా తన పంచను చేరిన ఉన్న్ చనిపోయాక ఆ ఊరినుండి వెళ్ళిపోడానికి నిశ్చయించుకున్న ఆంటీ, సిస్‍కు హితబోధ చేస్తుంది. ఒకరకంగా ఉన్న్ నుండి విముక్తి కలిగిస్తుంది. చలికాలం ముగియడంతో మంచు విరిగి ఐస్ పాలెస్ కూలిపోతుంది. నది మళ్ళీ ప్రవహిస్తుంది. సిస్ మళ్ళీ కళకళాడుతుంది.

చెప్తే చిన్నకథే! చదివినా చిన్న కథే గానీ, ఇందులో ఎన్నో అందాలు ఉన్నాయి. గడ్డకట్టిన జలపాతం మంచుకోటగా మారినప్పుడు ఒక చోట సూర్యునికాంతి కూడా లోపలికి జొరబడనంతగా ఉంటుంది. మరో చోట అద్దంలా మెరుస్తుంది. ఇంకో చోట కన్నీరులా నీటిచుక్కలవుతుంది. ఈ వచనం కూడా అలాంటిదే! ఉన్న్ వెతకడానికి వెళ్ళినవారు ఐస్ పాలెస్‍ను చూసి, అది మూసుకుపోయిందని, లోపలికి దారిలేదని తమ ప్రయత్నాలను విరమించకుంటారు. మంచి వచనాన్ని, అందులోని లోతుల్ని అర్థం చేసుకోనివారికి ఇది కూడా పేలవమైన కథలానే ఉంటుంది. కానీ ఉన్న్ లా ఎంత దూరమైన వెళ్ళగలిగేవారికి ఇదో అద్భుతమైన రచన. ఇద్దరు పదకొండేళ్ళ అమ్మాయిల బంధాన్నే కాదు, మనిషికి సమాజానికి, మనిషికి తల్లిదండ్రులకి, మనిషికి ప్రకృతికి ఉండే బంధాల మీద కొత్త వెలుగులు ప్రసరించే రచన ఇది. అవ్వడానికి ఈ కథలో ముఖ్యపాత్రలు ఇద్దరు ప్రీ-టీనేజ్ పిల్లలే అయినా దీన్ని యంగ్ అడల్ట్స్ చదవడం ఉచితమా? అనేది నాకు అనుమానమే! పెద్దలు, ముఖ్యంగా తల్లిదండ్రులు చదవాల్సిన పుస్తకంగా తోచింది. ఆ వయసు పిల్లలలో ఉండే ప్రపంచాలు, వాటికి కావాల్సిన ఎనర్జీ పెద్దవాళ్ళకు ఊహకందదనిపిస్తుంది.

రచనంతా థర్డ్ పార్టీ నరేషన్లో కొనసాగినా, ముఖ్యంగ ఉన్న్, సిస్‍ల మనోగతాలు మనముందున్నా రచయిత చాలా చాకచక్యంగా ఉన్న్ ను పీడిస్తున్న రహస్యమేమిటో చెప్పరు. అదో బాక్ హోల్‍గానే మిగిలిపోతుంది. అయితే దానిమీదకన్నా, దాని వల్ల కలిగిన పరిణామాలపై పాఠకుల దృష్టి పోయేట్టు చేయటంలో మాత్రం ఆయన దిట్ట. ఇది అనువాదం కావటం చేత ఒరిజినల్ లో ఉన్న కొన్ని గొప్ప సంగతులు ఇందులో మిస్ అయ్యే ఉంటాయి. అయినా అనువాదం బాగా కుదిరింది. ఆ అనువాదమే లేకపోతే ఇంత గొప్ప నవలే మిస్స్ అయ్యేది.

నేను రాసే పుస్తకాల గురించి రాసేటప్పుడు అతిగా రాస్తానని, ఆ పుస్తకాన్ని మించిన పుస్తకం లేదన్నట్టు రాస్తానని కొందరి కంప్లెంట్. అదృష్టవశాస్తూ నాకంతటి గొప్ప పుస్తకాలు తారసపడుతున్నాయి మరి. ఈ పుస్తకం కూడా ఆ కోవకు చెందినదేనని నా ఉద్దేశ్యం. ఇది కేవలం నా అజ్ఞానంగా అని మీకు తోస్తే, నాపై దయుంచి, ఇంతకన్నా గొప్ప పుస్తకాల ఆచూకి తెలియజేయండి.. ప్లీజ్… 🙂

For Indian customers, you may get the kindle e-version at a get-able price here.

For US customers & others, you may get the hard copy here.

You Might Also Like

5 Comments

  1. సాహిత్యానుబంధం: Fiction of Relationship | పుస్తకం

    […] లాటిన్ అమెరికన్ లోని నల్ల-తెల్ల జాతుల మధ్య ఘర్షణనూ, అప్పటి ప్రజల సంఘర్షణనూ అద్భుతమైన పదాల ఆటతో కళ్ళకుకట్టినట్టు చూపించిన రచన William Faulkner రాసిన “Light in August”. తక్కిన రచనలకన్నా సంక్లిష్టమైనది – విషయపరంగానూ, శైలిపరంగానూ. ఈ నవలలోని విషయాన్ని స్త్రీ దృక్పథంతో, స్త్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తే ఎలా ఉంటుందన్న ఊహకు దాదాపుగా సరిపోయే సమాధానం Toni Morrison నవల “Beloved”. ఈ నవలలు కాక, ప్రపంచానికి అంతగా తెలియని చిట్టి నవల “The Ice Palace”. […]

  2. manjari lakshmi

    థాంక్సండి. గబుక్కున అలా రాయాలనిపించి రాశేశాను కానీ మీరేమనుకుంటారో అని భయమేసింది. ఆ నవ్వే బొమ్మ రావాలంటే ఏం కొట్టాలండీ.

  3. manjari lakshmi

    మీ సౌమ్యగారు “మీరేం చదువుతున్నారు” లో ఇంతకన్నా గొప్ప పుస్తకాల ఆచూకీ తెలియ చేస్తూనే ఉన్నారు. అయినా మీరమాయకంగా ఇవ్వే చదువుతున్నారు!(జోక్)

    1. Purnima

      మరే.. సౌమ్య అవ్వన్నీ “మీరేం చదువుతున్నారు”లో కదా పంచుకుంటుంది.. అందుకని నేను చదవనన్న మాట. అందుకే ఇక్కడ “నన్నేం చదవమంటారు?” అని అడుగుతున్నానన్న మాట. అమాయకులంకదా, బ్రాకెట్సులో జోక్ అని రాయమన్న మాట!

  4. sahitya abhimani

    //నేను రాసే పుస్తకాల గురించి రాసేటప్పుడు అతిగా రాస్తానని, ఆ పుస్తకాన్ని మించిన పుస్తకం లేదన్నట్టు రాస్తానని కొందరి కంప్లెంట్.//
    ఎంత గొప్ప పుస్తకాన్నైనా(/సినిమా/ఎనీథింగ్ ఎల్స్) సామాన్యంగా చెప్పే స్కూల్ ఒకటి ఉంది లెండి. అది సహజమో లేక ఈయనకి(/ఈవిడకి) ఇంత గొప్ప పుస్తకమే ఇంత సామాన్యంగా కనిపిస్తే ఈయన మెచ్చుకుని పిచ్చెక్కిపోవాలంటే ఎంత గోప్ప పుస్తకం రావాలో అనుకోవాలని అలా చెప్తారో తెలియదు.

Leave a Reply