మారిపోతున్న భాష – పురోగమనమా? తిరోగమనమా?

Jean Aitchison అని, ఒక బ్రిటీష్ భాషా శాస్త్రవేత్త. ఇప్పుడు విశ్రాంత ఆచార్యులు అనుకుంటాను కానీ, నాకు వారి రచనలతో పరిచయం గత ఏడాది చివర్లో కలిగింది. చక్కటి కథనబలంతో కూడా పాఠ్యపుస్తకాలు రాయొచ్చు అని నాకు తెలియజెప్పిన రెండు పుస్తకాలు చదివాకా, జనసామాన్యానికి తన పరిశోధనాంశాల గురీంచి పరిచయం చేస్తే ఇచ్చిన BBC రేడియో లెక్చర్ల సంకలనం The language web అన్న పుస్తకం చదివాకా – ఆవిడ రాసిన ఇతర పుస్తకాల గురించి కుతూహలం కలిగింది. ఆ క్రమంలో నే ఈ Language Change: Progress or Decay? అన్న పుస్తకం తారసపడ్డది. ఆవిడ తక్కిన పుస్తకాల లాగానే, ఇది కూడా కథ చెబుతున్నట్లు సాగిపోయే పాఠ్య పుస్తకం. Historical, Sociolinguistics గురించి ఒక ప్రాథమిక అవగాహన కలిగించే పుస్తకం. భాష ఎలా మార్పు చెందుతుంది? అసలుకి మార్పుని భాషావేత్తలు ఎలా అధ్యయనం చేస్తారు? నిజంగా ఈ మార్పు మంచిదా? చెడ్డదా? అసలుకి ఎలా పోలుస్తారు? ఈ విషయమై చెలామణిలో ఉన్న అభిప్రాయాల్లో ఏవి శాస్త్రీయం? ఏవి అలా కనబడే వ్యక్తిగత అభద్రతాభావాలు? – ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా కలిగి ఉంటే, ఈ పుస్తకం వాటికి జవాబులు చెబుతుంది మీకు.

ఇక్కడ ఒక చిన్న గమనిక: ఇదివరలో ఈవిడ రాసిన ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాల గురించి ఇతరులకి కూడా పరిచయం చేయాలి అనిపించినా, అసలుకి ఎలా రాయాలి? ఆధ్యాయాల వారీగా చెప్పాలా? సారాంశం చెప్పి క్లుప్తంగా వదిలేయాలా? ఏమని చెప్పాలి – ఒక పరిశోధనారంగాన్ని పరిచయం చేసే పుస్తకాల గురించి? అన్న మీమాంసలో రాయలేకపోయాను. ఇప్పుడూ అదే పరిస్థితి. కనుక, నాకు తోచిన రీతిలో, నా పరిధిలో నేను స్పష్టంగా ఎంత చెప్పగలనో అంత వరకు మాత్రం పరిచయం చేస్తున్నాను.

పుస్తకంలో ఏముంది?

ఈ పుస్తకం ప్రధానంగా నాలుగు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగం ఈ పుస్తకంలో మనమేం చూడబోతున్నాము? అని. నన్ను అడిగితే, ఈ భాగంలోని మూడు అధ్యాయాలు చదివినా చాలు – ఆట్టే ఈ రంగంపై పెద్దగా ఆసక్తి లేకపోయినా, ఊరికే చూద్దాంలే అని మొదలుపెట్టేవారికి. ఈ భాగం మీలో ఆసక్తి రేకెత్తిస్తే, అప్పుడు తదుపరి భాగాల్లోకి వెళ్ళొచ్చనమాట! ఇక్కడ ప్రధానంగా – భాష మార్పు చెందడం అనేది మనం కాదనలేని సత్యమనీ, దాన్ని గురించి emotional గా విమర్శించడం కంటే అసలుకి ఎందుకు మారుతోంది? ఎలా మారుతోంది? వంటి అంశాలు అధ్యయనం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని చెబుతున్నట్లు నాకు అనిపించింది.

రెండవ భాగంలో – ఈ మార్పు చెందే ప్రక్రియని వివరిస్తారు, వివిధ భాషావేత్తల పరిశోధనలను గురించి చెప్పడం ద్వారా. ఉదాహరణకి – ఫలానా పదం పలికే విధానం కాలక్రమంలో ఎలా మారుతూ వచ్చింది? కొన్ని రకాల వాడుకలు కొన్ని ప్రాంతాల్లోనే ఎలా నిలదొక్కుకుంటాయి? కొన్ని పదాల అర్థాలు కాలక్రమంలో ఎలా మారిపోయాయి? వ్యాకరణం ఎలా మారింది? ఇలా భాష మార్పు చెందడంలో వివిధ సాంఘిక వర్గాల పాత్ర, ఆడా-మగా తేడాలు, ఇతర సాంఘిక కారణాలు కూడా ఉంటాయా? ఇలాంటి అంశాల పై జరిగిన పరిశోధనల గురించి చెబుతారిక్కడ. ఇక్కడ చూపిన కొన్ని పరిశోధనల ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నా, వాళ్ళ inferencing పద్ధతి నాకు అంత convincingగా అనిపించలేదు. అయితే, బహుశా social sciences లో పరిశోధనా విధానాల గురించి నా అవగాహనారాహిత్యం ఇందుకు కారణమేమో అనుకున్నాను.
అయితే, ఈ అధ్యయన ప్రక్రియ ఎంత శ్రమతో కూడుకున్నదో మాత్రం మాబాగా అర్థమైంది.

ఇక, మూడో భాగం – ఎందుకు ఈ మార్పులు జరుగుతాయి? అన్న అంశాన్ని అన్వేషిస్తుంది. ఏవి సాంఘిక కారణాలు? ఏవి సహజ పరిణామాలు? ఏవి తప్పుల్ని సరిచేసే పరిణామాలు (therapeutic changes) వంటి అంశాలు చర్చిస్తారు. వీటన్నింటికి చాలా విస్తారమైన రిఫరెన్సులు జతచేస్తారు కనుక ఆసక్తి గలవారు వెళ్ళి అవి చదువుకోవచ్చు.

ఇక చివ్వరి భాగంలో – భాషల పుట్టుక, మరణం, మరణానికి ముందు వాటిలో రూపొందే మార్పులు, కొత్తగా పుట్టుకొస్తున్నా sms భాష, అసలుకి ఇదంతా మంచా? చెడా? అన్న విషయాల గురించి. ఇక్కడ ప్రధానంగా రచయిత్రి కూడా ఈ రంగంలో ఒక ప్రముఖ పరిశోధకురాలు కావడం వల్ల, తన అనుభవంలో తెలుసుకున్నవి, తన అభిప్రాయాలు రెండూ విలువైనవే అని నా అభిప్రాయం. భాషల మరణం గురించి, అలాగే, ఒక భాష మరో భాషతో కలిసిపోయే code mixing (ఉదా: తెంగ్లీష్) గురించీ మరింత చర్చ ఉంటుందని నేను ఆశించాను. కానీ, ఆ విషయంలో కొంత నిరాశ పడ్డాను. నిజానికి అసలు ఇది ఉంటుందేమో? అన్న ఆలోచనతోనే నేనీ పుస్తకం మొదలుపెట్టింది. పైగా, ఇక్కడ ఆ విధమైన code mixing చర్చించిన కాసేపూ – మరణించే భాషలనూ లేదంటే దగ్గర దగ్గరగా ఉండే భాషలనూ మాత్రమే చర్చించారు. మరి మన దేశం లాంటి పరిస్థితుల్లో జరిగే code mixing గురించి ఏవీ విశ్లేషణలు లేవు.

ఇదిగో, ఇదీ చివర్లో రచయిత్రి తేల్చేది:

Continual language change is natural and inevitable, and is due to a combination of psycholinguistic and sociolinguistic factors.

Once we have stripped away religious and philosophical preconceptions, there is no evidence that language is progressing or decaying. Disruption and therapy seem to balance one another in a perpetual stalemate. These two opposing pulls are an essential characteristic of language.
… ….
Language change is in no sense wrong, but it may, in certain circumstances, be socially undesirable. . … ..
If this happens, it may be useful to encourage standardization – the adoption of a standard variety of one particular language which everybody will be able to use, alongside the existing regional dialects of languages. Such a situation must be brought about gradually, with tact and care, since a population will only adopt a language or dialect it wants to speak.

-దీనికి ఎవరికి emotional responses వాళ్ళకి ఉండొచ్చు కానీ, పరిశోధన వేరు, ఉద్వేగం వేరు అన్న విషయం అర్థం చేసుకుంటే ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవడం సులభతరం అవుతుందని నా అభిప్రాయం.

మొత్తానికి: చాలా ఆసక్తికరమైన, అలాగే sound research ఆధారంగా రూపొందిన పుస్తకం. ఎక్కడికక్కడ ఎవరికివారు self proclaimed experts అయిపోతున్న ఈ కాలంలో, మళ్ళీ ఈ pseudo experts కి అభిమాన సంఘాలు కూడా తయారై అసత్యప్రచారాలు రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఇలాంటి పుస్తకాల గురించి పరిచయం చేయాలంటే ఇలా ఇన్నిసార్లు ఈ research అన్న పదం పలకడం తప్పదనుకుంటాను. రచయిత్రి సొంత అభిప్రాయాలు చాలా చోట్ల ఉన్నాయి కానీ, ప్రధానంగా ఈ పుస్తకం భాషాశాస్త్రవేత్తల అధ్యయనాల ఫలితాల గురించే. అందునా, ఈ రంగంలో విశేషమైన పేరున్న పరిశోధకురాలీ రచయిత్రి. అందువల్ల ఆమె వ్యక్తిగత అభిప్రాయాలూ కూడా అంత తీసిపారేయాల్సినవి కావని నా అభిప్రాయం.

అన్నట్లు, పుస్తకం చివర్లో బోలెడు రిఫరెన్సులు, నోట్సులూ కాక, ప్రతి అధ్యాయానికి సంబంధించీ కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి ..పాఠం లా చదువుకునేవారి స్వీయ పరీక్ష కోసం. షరా మామూలేమిటంటే : అన్ని ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాల లాగానే, ఈ పుస్తకం శ్రద్ధగా చదివితే, బోలెడు ప్రశ్నలు మిగులుతాయి. ఆసక్తి గలవారు వాటి సమాధానాలు వేరే వనరులతో వెదుక్కోవాల్సిందే. అలాగే, ఈ రంగంలో తలపండిన వారికి కాదు ఈ పుస్తకం. కొత్తగా తెలుసుకోగోరే వారికి మాత్రమే.

పుస్తకం వివరాలు:
Language Change: Progress or Decay?
Jean Aitchison
Cambridge University Press, 2013. (మొదటి ముద్రణ 1991లో జరిగింది. కొన్ని మార్పులతో, చేర్పులతో తాజా ప్రచురణ ఇటీవలే వచ్చింది. నేను చదివింది 2013 ప్రచురణ.)
google books preview ఇక్కడ.
ఈ అంశంపై నేరుగా కాకపోయినా, భాషల మధ్య సంబంధాలని అధ్యయనం చేయడం పైకి తెలుగులో సురేశ్ కొలిచాల గారు రాసిన ఒక చక్కటి వ్యాసం ఇక్కడ.
పుస్తక ప్రచురణకర్తల సైటులో కొనుగోలు లంకె ఇక్కడ.

You Might Also Like

Leave a Reply