బ్రాహ్మీమయమూర్తి పుట్టపర్తి

(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. పుట్టపర్తి నారాయణాచార్యులు మరణించినపుడు వచ్చిన సంపాదకీయ వ్యాసం. ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి editor@pustakam.net కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పుస్తకం.నెట్)
******
చాలా ఏళ్ల నాటి మాట. ౧౯౨౮-౨౯ ప్రాంతంలో ౧౪ సంవత్సరాల బాలుడు ఒక ప్రౌఢ కావ్యం వ్రాసాడు. ఆ తర్వాత కొన్నేళ్ళకు ఆ బాలుడు విద్వాన్ పరీక్షకు కూర్చున్నాడు. తాను వ్రాసిన కావ్యంలో నుంచి ఇచ్చిన ప్రశ్నకు తానే సమాధానం వ్రాయవలసి వచ్చింది. రెండు వాక్యాలలో సరిపెత్తవలసిన సమాధానాన్ని ౪౦ పేజీలలో వ్రాసాడు.

ఆ ప్రౌఢ కావ్యం పేరు “పెనుకొండ లక్ష్మి”. దాని కర్త పేరు పుట్టపర్తి నారాయణాచార్యులు. ఆ కావ్యాన్ని విద్వాన్ కోర్సుకు మద్రాసు విశ్వవిద్యాలయం వారు పాఠ్యగ్రంథంగా నిర్ణయించినందున, ఆ తర్వాత ఆయనే అది చదివి సమాధానం వ్రాయవలసి వచ్చింది. ఇంత చిత్రమైన, ఆశ్చర్యకరమైన సన్నివేశం సాహిత్య చరిత్రలోనే మరొకటి ఎక్కడా, ఎప్పుడూ వుండి వుండదు. అదీ నారాయణాచార్యులవారి ఆబాల్య ప్రతిభా, పాండిత్య గరిమ.

మరొకటి కూడా చాలా ఏళ్ల నాటి మాటే. మానసికమైన అశాంతితో నారాయణాచార్యులవారు హృషీకేశంలో గంగానదీ తీరాన తిరుగాడుతూ స్వామీ శివానంద సరస్వతిని కలుసుకున్నారు. ఆనంద కుటీరంలో ఏడాదిన్నరపాటు స్వామీజీకి అంతేవాసిత్వం నెరపారు. ఆచార్యులవారి సకల శాస్త్ర పారీనతకు, బహుముఖ ప్రజ్ఞకు అబ్బురపడి స్వామీజీ ఆయనకు “సరస్వతీ పుత్ర” బిరుదం ప్రసాదించారు.

అక్షరాలా ఆయన చదువుల తల్లి ముద్దుబిడ్డడే. మాతృ ముఖరిత కచ్ఛపీ గానామృత ఝరిలో ఓలలాడి సకల కళలను స్వాయత్తం చేసుకున్నారు. ఆయనకు రాణి విద్య లేదనడం న్యూనోక్తి. అసలే పండిత వంశం. తండ్రి సంస్కృత పండితుడు. తల్లి సంగీత విదుషీమణి. చిన్ననాటి నుంచే సంస్కృతాంధ్రాలు, సంగీత సాహిత్యాలు అలవాదినాయి. స్వయంకృషితో వాటిని మరింత పెంపొందించుకొనడమే కాక నాట్య విద్యనూ కూడా అభ్యసించారు. వ్యాకరణం, అలంకార శాస్త్రం, దర్శన మంత్ర శాస్త్రాలు ఇవన్నీ ఆయనకు కొట్టిన పిండి.

అంతే కాదు, పెద్దన కూర్చిన సమాసంలో చెప్పవలసి వస్తే నారాయణాచార్యుల వారు ‘భాషాపరశేషభోగి’: ఆయన స్వయంగా చెప్పుకున్నారు తన ‘పాండితీ శోభ పదునాల్గు భాషలందు’ అని. సంస్కృత, ప్రాకృతాంధ్రాలు, ఆంగ్లం కాక, తమిళ, మళయాళ, కన్నడ, మరాఠీ, హిందీత్యాది భాషలు ఆయనకు కరతలామలకాలు. కనుకనే ఇతర భాషల నుంచి ఎన్నో కృతులను ఆయన తెనిగించారు. అలాగే, తెలుగు నుంచి ఇతర భాషలలోనికి విశ్వనాథవారి ‘ఏకవీర’ను మలయాళం లోనికి వలె అనువదించారు.

ఆచార్యులవారి కావ్య, కావ్యేతర కృతులు శతాధికాలు. బాల్యంలో వ్రాసిన పెనుకొండ లక్ష్మి కాక, షాజీ, విరహ గోపి, సాక్షాత్కారము, పండరీ భాగవతము, అష్టాక్షరీ కృతులు ఇత్యాదిగా ఎన్నో వారికి కీర్తి ఆర్జించి పెట్టాయి. ఒక విలక్షణ కావ్యం ‘మేఘదూతం’. పేరును బట్టి కాళిదాస కృతికి అనుకృతి అనిపిస్తుంది కాని, దాని ఇతివృత్తం భిన్నమైంది. ఒక ఖయిడీ కారాగార క్లేశం అనుభవిస్తూ దూరానగల తన భార్యకు మేఘం ద్వారా సందేశం పంపుతాడు. మార్గమధ్యంలోని తెలుగునాడునే కాక, పీడిత తాడిత ప్రజల దుఃఖ జీవితాన్ని కూడా కవి మానవతావాద దృక్పథంతో మంచి రసార్ద్రంగా వర్ణిస్తారు.

ఆచార్యుల వారి అన్ని కృతులు ఒక ఎత్తు. “శివతాండవం” ఒక ఎత్తు. అది ఆయన కీర్తికి మూలస్తంభం; సంగీత, సాహిత్య, నృత్య కళల త్రివేణీ సంగమం.

తలపైని చదలేటి యలలు దాండవమాడ
వలల త్రొపుడుల క్రొన్నెల పూవు కదలాడ
మొనసి ఫాలముపైన ముంగురులు చెఱలాడ
కనుబొమ్మలో మధుర గమనములు నడయాడ
కనుపాపలో గౌరి కసినవ్వు బింబింప
కనుచూపులను తరుణ కౌతుకము చుంబింప
కడగి మూడవ కంట గటిక నిప్పులు రాల
కడుబేర్చి పెదవిపై గటిక నవ్వులు వ్రేల
ధిమిధిమి ధ్వని సరిద్గిరి గర్భములు తూగ
అమిత సంరంభ హాహాకారములు రేగ
ఆడెనమ్మా! శివుడు
పాడెనమ్మా! భవుడు

అని ప్రారంభమయ్యే ‘శివతాండవ’ గేయకావ్యం వంటిది ఆధునిక సారస్వతంలో మరొకటి లేదని శివశంకర శాస్త్రి ప్రస్తుతించారు. ఆ గీతాలను ఆచార్యులవారు స్వయంగా అనేక వేదికలనుంచి ఆడుతూ, పాడుతూండగా చూచి, ఒకనాడు ఆంధ్రదేశం ఆనందపారవశ్యంలో మునిగి తేలింది.

జరా జర్జరితులై, వ్యాధిగ్రస్తులై నారాయణాచార్యుల వారు శనివారం తన ౭౬వ ఏట తనువు చాలించడం సాహిత్యాభిమానులందరికీ దుఃఖ వార్త. చాలా కాలం క్రిందటే ఆయన ‘పాద్యము’ అనే కావ్యంలో భగవంతుడిని ఇలా వేడుకున్నారు.
ఎంతగ నేడిపించెదవొ? యీ జడ కాష్ఠము నేడిపించి నీ
సంతము దీర్చుకో! తనువు బాసిన బుణ్యమె పండిపోవు; ని
శ్చింతత బోదు గాని, నను జీవముతో మననిచ్చి కష్టముల్
వంతుకు దెచ్చి, గ్రుమ్మకుము ప్రాణము నీకు నమస్కరించెదన్

నారాయణాచార్యులు గారు ధన్యజీవితం గడిసి నిశ్చింతతో లోక నాటక రంగం నుంచి నిష్క్రమించినా, కవితా యశఃకాయంతో చిరంజీవిగా నిలిచేవుంటారు.

సెప్టెంబర్ ౨, ౧౯౯౦
(September 2, 1990)

You Might Also Like

2 Comments

  1. madhavaraju

    He is a great person,but alas! He born in Rayalaseema.Otherwise he would have got ,why? only Gnanapeetha award the great Nobel prize,even!

  2. patnala eswararao

    aa mahaatmuni minchutadugudammula paadyamarpinchi kadalaraa-puttaparthi garu vraasina eevaakyam aayanakea anvayistundi

Leave a Reply