కథావిమర్శ (చర్చ) – రెండోభాగం : వ్యాఖ్యలూ, విమర్శలూ, సంపాదకులధోరణిలో మార్పులు
ఈ చర్చ మొదటి భాగం ఇక్కడ.
కల్పనః మాలతిగారు, క్రితంసారి మనం కధలగురించి మాట్లాడుకున్నప్పుడు మంచి కధలగురించి తర్వాత మాట్లాడాలనుకున్నాము కదా! అసలు మంచికథ అంటే ఏమిటి? ఎలా నిర్ణయిస్తాం ఏది మంచికథో?
మాలతిః ఏమో మరి. కొన్నాళ్లపాటు నేను కూడా చాలామంది విమర్శకులలాగే, ప్రారంభం, ముగింపూ, సన్నివేశాలూ, సంఘర్షణలూ, పాత్రపోషణ అంటూ కొన్ని కొలమానాలు అవసరం అనుకున్నాను కానీ, ఆలోచించినకొద్దీ అలాటి కొలతల్లో ఇమడకపోయినా, పాఠకుల ఆదరణ పొందినరచనలు కనిపిస్తున్నాయి. అలా చూసినప్పుడు, మనం కథని ఇలా ఒక చట్రంలో బిగించడం రచయితలభావుకతకి ప్రతిబంధకం అనిపిస్తోంది. అంచేత మంచికథ ఏదీ అనడం కంటే నేను ఎందుకు రాస్తున్నాను అంటే చెప్పగలనేమో. మరి నీ అభిప్రాయంలో మంచి కథ అంటే ఎలా వుండాలి?
కల్పనః ఏది మంచికధగా గుర్తించబడుతోంది? లేదా పాఠకులదృష్టిలో ఏది మంచికధ? అనేది ఒక ప్రశ్న అయితే, రచయితదృష్టిలో, సంపాదకులదృష్టిలో మంచికధ అనుకున్నది పాఠకులకు మంచి కధ అవుతోందా, లేదా? అనేది ఇంకో ప్రశ్న. మీరు చెప్పిన కొలమానాలు అవసరమే. అయితే అవి మాత్రమే కధ కాదు. ఇంతకుముందు మనం చాట్‌లో చెప్పుకున్నట్టు ఈనాటి కధాస్వరూపం మారింది అని నేననుకుంటున్నాను. అందుకే narratives కూడా కధలవుతున్నాయి. వీటినన్నింటిని గుర్తించి, అర్ధం చేసుకున్న అవగాహనతో మాత్రమే మనం మంచికధ అంటే ఏమిటి అని మాట్లాడుకోవాలంటాను నేను. మీరేమంటారు? అసలు మీరెందుకు కధలు రాస్తారో చెప్పండి పోనీ.
మాలతిః ఎందుకు రాస్తున్నానంటే, మనకి తోచిన ఆలోచనలు అభివ్యక్తం చెయ్యడం, పక్కవారితో చెప్పుకోవడం మానవనైజం కనక. మనం గమనించినవిషయం – అందరికీ తెలిసినదే అయినా ఎవరూ పట్టించుకోనివిషయం అయినప్పుడూ, ఎవరూ గమనించలేదు – అదేలే నాకు తెలిసినంతలో – అనిపించినప్పుడు రాయాలనిపిస్తుంది నాకు.
ఉదాహరణకి, ఈమధ్య పొద్దు.నెట్‌లో ప్రచురించిన “నాకోసం” కధ చూడు. ఈరోజుల్లో ఉద్యోగాలు దొరకడం కష్టంగా వుంది. దానికోసం పడేపాట్లు చాలా కథల్లో వస్తున్నాయి. అయితే మేథస్సు వుండి కూడా ఒకరకమైన స్వోత్కర్షతో, సీరియస్‌గా ఉద్యోగాన్యేషణ చెయ్యనివాళ్లు కూడా వుంటారన్నది అందులో ఒక అంశం. ఇది అమెరికాలోనేనా కావచ్చు. ఇండియాలోనేనా కావచ్చు. రెండోది, ఈనాటి స్త్రీలు విద్యమూలంగా ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం సంతరించుకున్నవారు. స్త్రీలకి గల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం సంసారంలో కలతలకీ, ఈతి బాధలకీ కారణమవుతున్నాయి అన్నది రెండో అంశం. ఎవరు ఎవరికోసం ఏమిటి త్యాగం చేస్తున్నారన్నది ఇదమిత్థమని మనం చెప్పలేకపోవచ్చు. కానీ ప్రాథమికంగా పాఠకులు గమనించవలసినవి ఈరెండు అంశాలూ నాకథలో. ఈ యువతీ, యువకుల మనస్తత్త్వాలు పాఠకులముందు పెట్టడమే ఈకథలో నేను చెయ్యదలుచుకున్నది. మొదటి డ్రాఫ్టులో ఇందులో సగమే రాసేను. కొందరు స్నేహితులకి చూపించి, వాళ్ల సలహాలు విని, మరికొన్ని సన్నివేశాలు చేర్చి మరింత వివరించడానికి ప్రయత్నించేను. దీనిమీద వచ్చినవ్యాఖ్యలగురించి తరవాత మాటాడుకుందాం.
నువ్వు నీకథ, అయిదోగోడ తీసుకుంటే, అందులో నువ్వు కూడా ఇలాగే చేస్తున్నట్టు అనిపించింది నాకు. నువ్వే ఆతరవాతిటపాలో రాసినట్టు, వయసుమళ్లినమగవాడు మళ్లీ పెళ్లి చేసుకోడంమీద చాలా కథలే వచ్చాయి కానీ వయసు మళ్లినస్త్రీ పునర్వివాహం చేసుకోడంమీద కథలు రాలేదు. అంచేత అది తప్పకుండా రాయవలసినకథ అని నేను అనుకుంటున్నాను. ఏమంటావు?
నువ్వు కథలు రాయడం మొదలుపెట్టినప్పటికీ, ఇప్పటికీ ఏమయినా తేడా వుందా? ఈనాటి విమర్శనాపద్ధతులగురించి నీ అభిప్రాయం ఏమిటి? ఇజాలు ప్రాతిపదికగా మంచికథ రాయడం సాధ్యం కాదా? మరోలా అడగాలంటే, చిన్నకథల్లో సిద్ధాంతపరంగా చర్చ చొప్పించి ఒప్పించడం సాధ్యమే అంటావా?
కల్పనః నా కధలు ప్రధాన అలోచనా స్రవంతిని ప్రశ్నించటం వల్ల కొంత భిన్నంగా కనిపించవచ్చు. చాలామందికి నా కధలు నచ్చకపోవచ్చు, నేను తీసుకునే ఇతివృత్తాల వల్ల. అయితే ఇలా ప్రశ్నించే కధల్ని ఏదో ఒక ” ఇజం” ముద్ర వేసి వాటికి సాహిత్య విలువ లేదని చెప్పేయటం తెలుగు నాట కొందరు విమర్శకులకు, ఇప్పుడు కొత్తగా కొందరు బ్లాగ్ పాఠకులకు అలవాటైపోయింది. అసలు “ఇజాలు” మనుషులకోసం పుట్టాయా? లేక మనుషులు “ఇజాల”కోసం పుట్టారా? ఒక కధలో “ఇజం” వుంది అని ముద్ర వేసి వెలి వేసేవారు, మౌనంగా కూడా తిరస్కరించేవారు, ఫలానాచోట మీరు “ఇజం” మాట్లాడారు, లేదా కధలో బలవంతంగా చొప్పించారు అని చూపిస్తే, నిజంగా ఏ రచయత అయినా అది ప్రయత్నపూర్వకంగా చేస్తే ఆ తప్పును దిద్దుకునే అవకాశం వుంటుంది.
Marital rape గురించి మాట్లాడటం ఇజమా? ఒక స్త్రీ రెండో పెళ్ళి చేసుకోవడం అంత సులభం కాదు. దానిచుట్టూ బోలెడన్ని మనకే తెలియని myths వున్నయని చెప్పటం ఇజమా?
కాలం ముందుకెళ్ళింది అని జబ్బలు చరుచుకునే కుహనా మేధావులకు కూడా తెలుసు ఒక స్త్రీ పెళ్ళి చేసుకోవాలంటే, ఆ పెళ్ళి చుట్టూ అల్లుకొని వున్న అనేకానేకా గృహ, శారీరక, సామాజిక హింసలు. జీవితం వాదన కాదు. కాని కొన్ని సమస్యలు చెప్పేటప్పుడు కధలో పాత్రలమధ్య వాదనద్వారా ఎన్నో విషయాలు చెప్పాల్సి వస్తుంది. అది కధనశైలికి నష్టము అయితే కావచ్చు గాక, కాని ఒక అంశం గురించి, అందులో వుండే బాధ గురించి ఎక్కువ అర్ధం అవటానికి అవకాశం వుంటుంది. మీరు చెప్పిన ద్వని, వక్రోక్తి లాంటి వాటితో నేటి తరం స్త్రీలు పడే ఇబ్బందులమీద కధ రాసి మెప్పించటం ఆసాధ్యమేమి కాదు కాని నాకు ఇష్టం లేదు. స్వేచ్చగా open గా మాట్లాడతాయి నా పాత్రలు.
ఇవే కధలు ఒక పురుషుడు రాస్తే, దానికి వచ్చే response ఖచ్చితంగా భిన్నంగా వుంటుందని నేను చెప్పగలను.
ఒక ఏడాదిక్రితం అనుకుంటాను. ఇక్కడే బ్లాగ్ లో ఒక కధ చదివాను. నాకు ఆ బ్లాగుపేరు కాని, రచయితపేరు కాని గుర్తు లేవు. వుంటే తప్పక చెప్పేదాన్ని. ఆ ఇతివృత్తం అందరికీ తెలుసు, ఎందుకంటే దాన్ని ఒక చిన్న జోకు గా ఒక సినిమాలో వాడటం వల్ల.
ఇండియాలో వున్న ఒక అమ్మాయి గ్రీన్ కార్డ్ కోసం అది వున్న అబ్బాయిని పెళ్ళి చేసుకొని అమెరికా రాగానే విమానాశ్రయంలోనే వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ కధ అందరికీ నచ్చింది. దానిగురించి రచయిత చెప్పిన వివరణ ఏమిటంటే అలాంటి సంఘటనలు జరిగినట్టు ఆయనకు తెలుసట. నిజానికి అలాంటివి ఎన్నివేలల్లో ఒకటో, రెండో జరగవచ్చు. కాని కధద్వారా చాలామందికి తెలిసేలా ఆ రచయిత ప్రయత్నించారు. ఆ కధకి అర్ధం అమెరికాకు వచ్చే ఆడవాళ్ళంతా అలా చేస్తున్నరనా? లేక ఆయన ఇలాంటి కధలద్వారా స్త్రీలను కించపరుస్తున్నారనా? దీనికి ఎవరికి వారు ఎలా కావాలంటే అలా వ్యాఖ్యానం చేసుకోవచ్చు. నాకు గుర్తు వున్నంతవరకు నేను తప్ప ఆ కధ ఇతివృత్తం గురించి వేరెవ్వరు మాట్లాడలేదు అక్కడ.
అలాగే, ఎవరో ఒకావిడను భర్త ప్రతి రోజు పెట్టే శారీరక హింస గురించి మనం ఒక కధ రాస్తే, ఇలా జరగదు, ఇవి feminism కధలు, అంటూ అడ్డదిడ్డంగా వ్యాఖ్యానిస్తుంటే అలాంటివాళ్ళకు ఏమి సమాధానం చెప్తాము? మాకు తెలిసిన ఒకావిడకు ఇలా జరిగింది, అది నేను కధ గా రాశాను అని సాక్ష్యం చూపించాలా?
కాబట్టి కధలంటే జీవితాలే. అయితే కొన్ని సంఘటనలు కధలరూపం గా వచ్చినప్పుడు కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. ఒక రచయతగా నాకర్తవ్యం నేను రాయాలనుకున్నది రాసుకుంటూ పోవడమే. ఎక్కడో ఒకచోట నాకధలతో relate చేసుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ personal letters రాసే పాఠకులు వుంటూనే వున్నారు. వాళ్ళ కోసమే ఆ కధలు.
ఇవి బ్లాగుల్లో నా కధల అనుభవాలు. మరి మీ కధల్ని పాఠకులు ఎలా ఆదరిస్తున్నారు?
మాలతిః పైన చెప్పేను కదా ఏ కథకయినా పాఠకులు వుంటూనే వున్నారు. అయితే కొన్ని వ్యాఖ్యలు మాత్రం ప్రధానాంశానికి సంబంధం లేకుండా వుంటున్నాయి. ఉదాహరణకి ఒక వ్యాఖ్యాత నా కథ “నీకోసం”లో నేను stay-at-home dadsని తక్కువగా మాట్లాడేనన్నారు. నిజానికి వాళ్లు పిల్లలని చూసుకోడమో, మరేదో పని ఇంట్లో వుండి చేయగలిగినది చేస్తారు అని స్పష్టంగానే రాసేను. ఆవ్యాఖ్యాత కాస్త శ్రమపడి కథ సరిగ్గా చదివి వుంటే ఆవ్యాఖ్యానం చేసి వుండేవాడు కాదు. ఇలాటి వ్యాఖ్యానాలకి ఏం సమాధానం చెప్తాం? అలాగే మరో వ్యాఖ్య కూడాను. నేను స్త్రీలు నిర్వహించే గృహకృత్యాలని తక్కువ చేసి మాటాడేనన్నారు. కథలో ఆవాక్యం సందర్భం చూడు. అది ధరణి ఆలోచన. ఒకసందర్భంలో ఒకసామెత మనసులోకి రావడం వేరు. రచయిత లేక కథకుడు కేటగారికల్‌గా తనఅభిప్రాయాలు కథలో చొప్పించడం వేరు. ఈధోరణి – పాత్రచేత అనిపించిన మాటని రచయితఅభిప్రాయంగా గుర్తించడం నాకు మొదట అసందర్భంగా కనిపించింది. ఇలాటివి చాలా వ్యాఖ్యలు చూసేక, నాకు తోచింది ఏమిటంటే, నాకథ ఆధారంగా పాఠకులు వాళ్లకి తోచిన ఆలోచనలు వాళ్లు చెప్తున్నారని. నేను చెప్పనివిషయాలు పాఠకులకి స్ఫురిస్తే, వాళ్లు మరోకథ రాస్తున్నారనుకుంటాను. బహుశా, నాకథకి అది మరో ప్రయోజనమేమో.
మరోలా చెప్పాలంటే నాకు వ్యాఖ్యలు మూడురకాలుగా కనిపిస్తున్నాయి.
1. “అలా ఎవరూ మాటాడరు” అలా ఎవరూ చెయ్యరు” అనేవి ఒక రకం. ఇలాటివ్యాఖ్యానాలు చేసేవారు తమకి తెలిసినలోకమే తప్ప అంతకుమించి ఇంకా ప్రపంచం వుందనీ, కొన్ని కోట్లప్రజలు వున్నారనీ, వాళ్లు వేరేవిధంగా ప్రవర్తించవచ్చనీ అంగీకరించలేరు. అలా అంగీకరించడానికి openmindedness కావాలి. దీన్నే “willing suspension of disbelief” అన్నాడు Wordsworth. ఆయన కవిత్వం విషయంలో అన్నా కథకి కూడా కొంతవరకూ అది అవసరమనే నేను అనుకుంటాను. అంటే మన నమ్మకాల్ని, మనకి పరిచయమయిన ప్రపంచాన్నీ కాస్సేపు పక్కన పెట్టేసి, కథలో లీనమయిపోవాలి. కథ చదువుతున్నంతసేపూ ఆకథే మొత్తం ప్రపంచం. అప్పుడే, పాత్రలూ, సంఘటనలూ అర్థం అవుతాయి.
అంతేగానీ, ఎవరో “అలా జరగదు” “మనుషులు అలా వుండరు” అన్నారని నేను వాళ్లకి ఋజువులూ, సాక్ష్యాలూ చూపించి వాళ్లని నమ్మించాలనుకోను. పాఠకులు తమఇళ్లలో ప్రశాంతంగా కడుపులో చల్ల కదలకుండా కూర్చుని తమనమ్మకాలతో రోజులు గడుపుకుంటాం అంటే నేనెవర్ని కాదనడానికి. నేను మాత్రం, నాదృష్టిలోకి వచ్చినవి, నేను రాయాలనుకున్నవి రాసుకుంటాను.
కల్పనః ఇలాటిపాఠకులు కథలలో ఏమిటి ఆశిస్తారంటారు? నేననుకుంటాను, పాఠకులు తమ అభిప్రాయాలకు దగ్గరగా వున్న కధల్ని రచయతలనుండి ఆశిస్తారు. అలా కాకుండా మనం భిన్నంగా చెప్తే వాళ్ళకు నచ్చకపోవచ్చు.
మాలతిః నిజమే. నేనూ అలాగే అనుకుంటున్నాను. బహుశా తమకి తెలిసినవీ, తమ నమ్మకాలని ధృవపరిచేవి అయితేనే చదివి ఆనందించగలరేమో వారు.
2. ఇక రెండోరకం వ్యాఖ్యాతలు మనకథలోనుండి మరోకోణం లాగుతారు. కథలో ఏదో ఒక అంశమో, వాక్యమో తీసుకుని ఆలోచిస్తూ ఆ ఆలోచనవెంట మరోవైపుకి పోతారు tangentially. ఇలా చెయ్యడంవల్ల నేను కథలో అనుకోని కోణాలు ప్రదర్శితమవుతాయి. ఆ అంశాలు కథలో కలపడానికి అవకాశం లేకపోవచ్చు కానీ, కొత్తవిషయాలు తెలియడం జరుగుతుంది. ఇది కూడా బ్లాగుల్లో మాత్రమే జరుగుతోంది కానీ సాంప్రదాయకంగా విమర్శలు చేస్తున్నప్పుడు కనిపించదు.
3. మూడో రకం వ్యాఖ్యానాలు కథని విశ్లేషిస్తూ చేసినవి. కథలో ప్రధానాంశం, శైలీ, శిల్పంమీద చేసిన వ్యాఖ్యానాలు. ఉదాహరణకి నాకథమీద “ఆకథలో సింప్లిసిటీ లేదు. లోతు లేదు” అన్నవ్యాఖ్య తీసుకో.
ఈమధ్య “లోతు లేదు” అన్నమాట తరుచూ వింటున్నాను. కథలో లోతు ఎలా వస్తుంది అని చాలా ఆలోచించేను. సీదాగా “ధరణి దినకర్‌ని ఉద్యోగం చూసుకోమంది. అతను చూసుకోలేదు.” అంటూ ఏకోన్ముఖంగా కథ చెప్పుకుపోవడం ఒక పద్ధతి. రెండోపద్ధతిలో ఒక వ్యక్తి ఇలా ప్రవర్తించేడు అని మాత్రమే కాక, అలా ఎందుకు ప్రవర్తించేడు, తన ప్రవర్తనని ఎలా సమర్థించుకుంటాడు, ఆ ప్రవర్తన ఎదటివారికి ఎలా కనిపిస్తుంది, వారికి కలిగిన అభిప్రాయానికి వెనక వారి సమర్థన ఏమిటి – ఇలా విస్తరించుకుపోవడమే కథలో “లోతు” అని నేను అనుకుంటున్నాను. అయితే ఇలా విస్తరించినప్పుడు కొంత అయోమయానికి ఆస్కారం వుంది కానీ సింప్లిసిటీ సాధ్యం కాదు. నామటుకు నాకు ఆరెండూ పరస్పర విరుద్ధం అనిపిస్తోంది.
కల్పనః మీరు మొదటినుంచి కధారచయిత్రి అయినప్పటికి, బ్లాగ్ కోసం నిరంతరం కొత్తగా కూడా కధలు, చిన్న చిన్న స్కెచెస్ లాంటివి, సాహిత్య విమర్శలాంటివి రాస్తున్నారు కాబట్టి మీకు ఈ పాఠకులకామెంట్లు, వారిధోరణి బాగా అర్ధమైనట్టు వుంది. పాఠకులగురించి మీ విశ్లేషణ బావుంది.
అయితే నాకు మాత్రం బ్లాగ్ పాఠకులధోరణి ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు. ఎందుకంటే, నేను నాబ్లాగుకోసమంటూ, బ్లాగ్ పాఠకుల కోసమంటూ ఏమీ రాయలేదు. నేను వేరే పత్రికలకోసం ఇంతకుముందు రాసినవి, ప్రచురితమైనవి ఇక్కడ నాబ్లాగ్‌లో పెట్టుకుంటున్నాను.
మాలతిః ఈనాటిసంపాదకులధోరణిలో మార్పు వచ్చింది కదా. నీ అనుభవంలో ఆమార్పువల్ల లాభనష్టాలు ఏమిటంటావు?
కల్పనః సంపాదకుల ధోరణి అంటే పండితారాధ్యుల, పురాణం, నార్ల, పొత్తూరి, ఏబికే, దీక్షితులు, రామచంద్రమూర్తి, ఎంవీఆర్ శాస్త్రి, వేమూరి బలరాం, కనకాంబరరాజు ఇంతమందిగురించి నాకు అంతో, ఇంతో బాగానే తెలుసు. అంటే వ్యక్తిగతంగా తెలియటం కాదు, సంపాదకులుగా వారి వారి పధ్ధతులగురించి. కధల ఎంపిక గురించి నాకన్న మీరే ఎక్కువ వివరాలు చెప్పగలరు.
మాలతిః లేదులే. ఏవో ఒకటి రెండు పేర్లు విన్నవే అయినా వారిగురించి నేను చెప్పగలిగినది అట్టే లేదు. నాఅనుభవం చెప్తాను. నాచిన్నతనంలో సంపాదకులు వ్యక్తిగతంగా పరిచయం వున్నరచయితలకి సూచనలు ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఆరోజుల్లో గోరాశాస్త్రి, నార్ల వెంకటేశ్వరరావు, పురాణం వంటి పత్రికాసంపాదకులు ఏవో చిన్న చిన్న సూచనలు చేసేరనుకుంటాను. కానీ, నాకు అలాటి పరిచయాలు లేవు కనక నాకథలు అంగీకరించడమో, అంగీకరింపబడకపోవడమో మాత్రమే జరిగేది. అంతే.
నాకు తెలిసి, సంపాదకులు, అదీ నెట్ పత్రికలే విస్తృతంగా సూచనలు ఇవ్వడం ఇప్పుడే మొదలయింది. ఒకొక్కప్పుడు మంచి తప్పులే ఎత్తి చూపుతున్నారు. నా “పెంపకం”కథలో ఒకే పాత్రకి రెండు పేర్లు పెట్టేను పొరపాటున. అలాగే, “నాకోసం” కథలో దినకర్ ఉద్యోగంవిషయంలో టైమ్‌లైను సరిగ్గా చూసుకోలేదు. ఇలాటివి ఎత్తి చూపితే సంతోషంగా అంగీకరిస్తాను. ఇవి factual errors కనక. కానీ, కథలో సన్నివేశాలూ, శైలీ మార్చమనడం, ఎంత మర్యాదగా చెప్పినా ఉచితం కాదనే నానమ్మకం. రచయితలే అలాటి కోణాలగురించి అడిగితే అది వేరే దారి.
నాకు మరొక సందేహం కూడా వస్తోంది. సంపాదకులు ఒక కథమీద సూచనలు ఇస్తున్నప్పుడు వారు తమ పాఠకులని దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నారా, లేక, తమ స్వంత అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారా? అని. ఇలా తాము సంస్కరణలు సూచించి, అలా సరిదిద్దబడినకథని పాఠకులు ఇతోధికంగా ఆదరిస్తున్నట్టు దాఖలాలు ఏమైనా వున్నాయా?
ఈమధ్య “మంచికథలు రావడంలేదు” అన్న అభియోగం తరుచూ వింటున్నాం. మరి సంపాదకులు ఇలా పూనుకుని కథలు సరిదిద్దడంమూలంగా కథల్లో వాసి ఏమైనా పెరిగిందా?
నేను కూడా సంపాదకురాలినే కనక, నేను ఏం చేస్తున్నానో చెప్తాను. తూలికకి వచ్చిన అనువాదాలు చూసినప్పుడు రెండు అంశాలు చూస్తాను.
(1) కథాంశం నా సైటుపాలసీకి అనుగుణంగా వుందా, లేదా?
(2) అందులో భాష మనసంస్కృతి తెలియనివారికి అర్థం అయేలా వుందా, లేదా? అని. లేకపోతే ఒకటో రెండో పేరాల్లో నేను కొంత మార్చి చూపిస్తాను ఎలా వుంటే బాగుంటుందనుకుంటున్నానో. అయినా అది వేరే ప్లాట్‌ఫారం కనక నా పాలసీ ఇక్కడ పనికిరాదేమో.
సరే, కల్పనా, ఇలా మాటాడుతూంటే, మనకి అర్థమవుతున్నది మంచి కథ అన్న పదానికి నిర్దుష్టమయిన ఒక నిర్వచనం లేదనే. పాఠకులు ఎంతమంది వున్నారో అన్ని నిర్వచనాలు. ఇక్కడ పాఠకులంటే చదివేవారందరూ, రచయితలూ, సంపాదకులతో సహా. ఇప్పటికే చాలా పెద్ద చాటు అయిపోయింది. ఈనాటికి సరిపెడదాం. ఇంక ఇది చదివిన పాఠకులు ఏమంటారో చూద్దాం.
telugu4kids
కథ, బొమ్మలూ, నిజానికి ఏ విధమైన కళాకృతినైనా, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చేమో. ముఖ్యంగా రచయిత అందుబాటులో లేనప్పుడు. ఒకప్పుడు మా ఇంటికి వచ్చిన భాష తెలియని ఒకతను ఏకవీరలో కథానాయకుడు తన ప్రేయసిని ఆరాధిస్తూ పాడిన పాటకి వినాయకుడి బొమ్మ వేసి ఇలా అర్థం చెప్పాడు, “ఈ పాటలో longing ఉంది. నాకు భాష రాదు కనక నేను ఆ భావాన్ని నాకు పరిచయమైన భగవంతుని యందు భక్తుని ఆరాధనా భావానికి అన్వయించుకున్నాను. పదాలు అర్థం కాక భావం మాత్రమే అందినందున బొమ్మను hazy గా వేశాను.”
రచయితతో నేరుగా సంభాషించగలిగినపుడు అది రచయితకీ పాఠకుడికీ కూడా ఇంకో వెసులుబాటు.
రచయిత ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇవ్వదల్చుకున్నప్పుడే ఇలాంటి openness సమస్య అవుతుందేమో.
లేదా పాఠకుడు ప్రత్యేకమైన సందేశాన్ని రచన నుంచి కాక రచయిత నుంచి ఆశించినప్పుడూ సమస్య కావచ్చు.
ఇప్పుడు Da vinci code ఉందనుకోండి. అది సరదాగా చదువుకోవచ్చు.
అక్కడ open interpretation తో సమస్య లేదనుకుంటా. ఏమో?
బడిలో పిల్లలకు reading comprehension ఇచ్చి రచయిత ఉద్దేశం గురించో, లేక ఇంకేవైనా open ended ప్రశ్నలు అడిగినప్పుడో టీచర్లు ఒక పరిధిలోనే జవాబులను accept చెయ్య గలుగుతారు. పిల్లలు వేరేగా ఆలోచిస్తే మన దగ్గర మొద్దు అంటారు, ఇక్కడ ఇంకేమైనా మానసిక సమస్యలేమో అని భయపడతారు. ఆఖరికి తల్లిదండ్రులుగా కూడా నిజమైన openness ని పూర్తిగా ప్రోత్సహించడం కష్టమే కదా. మనం ఏదో కథ చెప్తాము వారికి ఒక సందర్భానికి తగిన పాఠం చెప్పడానికి. పిల్లలు మనకి ఇంకో నీతి నేర్పిస్తారు 🙁 ?
అంతే కాదు, గురువులుగానో, తల్లిదండ్రులుగానో మనకు అర్థమైనది వారితో పంచుకోకపోతే వారు ఒక్కోసారి సరిగా ఆస్వాదించే అనుభవాన్ని పోగొట్టుకుంటారు కూడా. “చివరకు మిగిలేది” పై వ్యాఖ్యానం గురించి జరిగిన చర్చలో ఎవరో Pride and Prejudice ప్రస్తావన తెచ్చారు. మాకు అది పాఠ్యాంశంగా ఉండేది. కథ చదివేసి నేను ఏముంది, సినిమా కథ కంటే ఇందులో ఎక్కువ అనుకున్నాను. కానీ మా గురువు గారి దయ వల్ల ఆ పాత్రల ప్రాముఖ్యాన్ని తెలుసుకోగలిగాను, నా అపార్థాలను దాటుకుని నవలను నిజాయితీతో ఆస్వాదించగలిగాను. అది నాకు ఒక పాఠం, చదవడం గురించి. ఆమే, కవితలు అర్థం చేసుకోవడం పరీక్షల కోసం మాకు నేర్పించేటప్పుడు బాధ పడే వారు, “ఇలా కవితలను విడగొట్టి అర్థం చేసుకోకూడదు, పూర్తిగా భావాన్ని అనుభవించాలి” అని.
మొత్తానికి కళను ఆస్వాదించడం కూడా ఒక కళేనేమో 🙂
పొద్దు » తెలుగు వెబ్ పత్రిక - Poddu, Telugu Web Magazine » రమాదేవి మళ్ళీ రమ్మంది
[…] కథావిమర్శపై నిడదవోలు మాలతి, కల్పనా రెంటాల పుస్తకం.నెట్‍లో జరిపిన చర్చ రెండవ భాగం […]
తెలుగు కథాచర్చ -రెండవ భాగం « తూర్పు-పడమర
[…] http://pustakam.net/?p=1460 […]
మాలతి గారితో తెలుగు కధల గురించి నా చాట్ (పునర్ముద్రితం) « తూర్పు-పడమర
[…] http://pustakam.net/?p=1460 […]
మాలతి
సి.ఎస్. రావుగారూ, మీరు ఓపిగ్గా మొత్తం చర్చ చదివి, మేం వెలిబుచ్చిన అభిప్రాయాలు చక్కగా సమీకరించారు. మాయిద్దరితరఫునా ధన్యవాదాలు.
@కొత్తపాళీ,
మీఅభిప్రాయాలకి సంతోషం. నాకథల్లో మీకు నచ్చినఅంశాలు చెప్పినందుకు ఇంకా సంతోషం. కల్పన ఇచ్చిన సమాధానానికి, జోడిస్తూ, నాకు తోచినమాటలు కూడా చెప్తాను.
సామాజిక ప్రయోజనం. – విష్ణుశర్మ, హాలుడు ..వంటివారిసాహిత్యం సాధికారంగా నేను చర్చించలేనండి. నాకు తోచింది ఆరోజుల్లో పాఠకులు (నిజానికి ఆనాటి శ్రోతలు) ఏం అనుకుంటారో అని కాక, తమమనసులోకి వచ్చినతలపులు వాచ్యం అని అన్నాను. ఇది దాదాపు అన్నికాలాల్లోనూ జరిగింది, ఈనాటి సంపాదకులూ, విమర్శకులూ వచ్చి కథరూపురేఖలు తీరిచిదిద్దడం మొదలుపెట్టేవరకూ.
వ్యక్తివికాసపాఠాలు – రచనలన్నీ వ్యక్తివికాసపాఠాలే అంటున్నాను. ఆ లేబుల్ కొత్తది కావచ్చు కానీ వ్యక్తివికాసం అంటే కుటుంబానికీ, సమాజానికీ ఉపయోగపడేవిధంగా మనిషిగా తీరిచి దిద్దడమే కదా. అలాటిబోధనలు అన్నికాలాల సాహిత్యంలోనూ వున్నాయి అన్నాను.
రాసేది ఎవరికోసం – నేను రాస్తున్నప్పుడు కొత్తపాళీకోసం రాయనా, కల్పనకోసం రాయనా అని గానీ, పొద్దుకోసమా, ఈమాటకోసమా అని కానీ మొదలుపెట్టను అంటున్నాను.
నాకు ఏదో ఒకవిషయంమీద రాయాలనిపించినప్పుడు రాస్తాను. ఒకొప్పుడు కథాంశం లేకుండా కేవలం కొన్నివాక్యాలు మాత్రమే స్ఫురించి, దానిచుట్టూ కథ అల్లినసందర్భాలు కూడా వున్నాయి. అంతేకానీ, ప్రత్యేకించి “నాకు అర్థం అయేలా రాయండి”, “నాకిష్టం అయేలా రాయండి” అనేవారికోసం రాయడం సాధ్యంకాదు అంటున్నాను.
నిజానికి, రెండు కారణాలూ – తనకోసమూ, పాఠకులకోసమూ – కూడా నిజమే. ఎవరికి ఏది ప్రధానం అన్నవిషయంలో తేడా వుండొచ్చు. అందుకే, ఇదే ఒక సర్వే అనుకుని రచయితలందరూ తమ తమ అభిప్రాయాలు రాస్తే, ఒక స్పష్టత ఏర్పడడానికి అవకాశం వుంటుంది.
మరొకసారి, అందరికీ – వ్యాఖ్యాతలకీ, పాఠకులకీ, మాకీఅవకాశం ఇచ్చిన పుస్తకం.నెట్‌వారికీ ధన్యవాదాలు.
C.S.Rao
ఇక్కడ కధా విమర్శ గురించి ఇద్దరు సుప్రసిద్ధ రచయిత్రుల మధ్య జరుగుతున్న చర్చ సుహృద్భావ ,స్నేహ పూర్వక వాతావరణం లో విషయపరమైన సత్య శోధన ధ్యేయం గా జరగటం బావుంది.సహజంగానే,ఈ సందర్భం గా రచన గురించి,విమర్శ గురించి కొన్ని మౌలికమైన విషయాలు వారు ప్రస్తావించటం జరిగింది.
1.కధ గానీ,కవిత గానీ,ప్రచురణకు ఉద్దేశ్యించినపుడు గానీ ,అలా కానప్పుడు కానీ రచయిత ఎప్పుడు ఏది వ్రాసినా తన కోసమే వ్రాసుకోవటం జరుగుతుంది.ఒక సన్నివేశానికీ లేదా ఒక సన్నివేశాల సముదాయానికి రచయిత స్పందనల సృజనాత్మక రూపమే రచన;అది కధ కావొచ్చు ,కవిత కావచ్చు.రచయిత తన ప్రగాఢమైన అనుభూతులను తోటివారితో పంచుకోవాలనే తహ తహ కలిగి ఉంటాడు.ఇది అసలు సంఘజీవిగా మానవ నైజం.ఇది మరీ బలవత్తరంగా రచయిత లో ఉంటుంది.కానీ ఇలా అన్నంత మాత్రాన రచయిత తన రచన పాఠకుని కోసమే వ్రాయాలని చూస్తే అది పరిపుష్టమైన కళారూపావిర్భావానికే గొడ్డలిపెట్టు. పాఠకులతో తన సృజనానందాన్ని పంచుకోవటం వేరు,పాఠకుని కోసం ఒక సృజనాత్మక రచన చెయ్యటం వేరు.సృజనాత్మక వ్యాసంగం ఒక రచయిత ఆత్మ సంతృప్తికే జరుగుతుంది.మరి,సృజనాత్మక రచనా వ్యాసంగం లో పాఠకునికి స్థానమేమీ లేదా అంటే,తప్పనిసరిగా ఉంది.రచయిత రచయితే కాదు,పాఠకుడు,విమర్శకుడు కూడా.సృజన రచనా వ్యాసంగంలో రచయిత లోని విమర్శకుడైన పాఠకుని పాత్ర చాలా ఉంటుంది.రచయితలో పాఠకుడున్నాడు,పాఠకునిలో రచయిత ఉన్నాడు.కాబట్టే కమ్యూనికేషన్ సాధ్యమయ్యింది.ఈ shared sensibilities వల్లనే ఏ భాషలో వ్రాసిన సాహిత్యప్రక్రియలకైనా universality of appeal ఉండటం జరుగుతుంది. రచయితలోని పాఠకునికి,బాహిరమైన పాఠకునికి ఎంత సామీప్యత,భావ సారూప్యత ఉంటే ఆ రచన ఆ పాఠకునికి అంత చేరువవుతుంది,రసాద్వైత స్థితి లోకి నడిపిస్తుంది. స్పష్టంగా చెప్పదలుచుకున్న విషయం ఏ సృజనాత్మక రచన బాహిరమైన పాఠకుని దృష్టి లో ఉంచుకుని జరగదు.
2.సాహిత్య ప్రక్రియలన్నిటికీ పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేయటమే ధ్యేయం గానీ, వారిని enlighten చేయటం కాదు.అంచేత వేమన కానీ,సుమతీ శతక కారుడు కానీ వారికి సంప్రాప్తమైన జీవితానుభవాలను ఒక సృజనానందం తో సాహితి రూపాలుగా మలిచి, లోకం తో పంచుకున్నారు.దీన్ని ప్రధానంగా,ప్రబోధంగా భావించకూడదు. “చల్లుడాంధ్రలోకమున అక్షతలు నేడు” అని రాయప్రోలు వారు “ప్రబోధము” అని పేరు పెట్టినా ఆ సీస పద్యం ఆఖరులో అన్న ఈ మాటల్లో ప్రబోధం ఎక్కడుంది? తన జాతి సుదీర్ఘమైన ,సుసంపన్నమైన,జాజ్వల్యమానమైన వారసత్వాన్ని తలచుకుని రోమాంచితమైన దేహం తో స్పందించటమే గానీ!!!
3. రచయిత తన కధని ,మరొకరి కధని విమర్శిస్తున్నంత నిష్పాక్షింగా విమర్శించుకోగలడా అనే విషయమై చర్చ జరిగింది.రచయితలందరూ సమానమైన ప్రజ్ఞాపాటవాలు గలవారు కారు.వారి శక్తియుక్తుల్లో తప్పనిసరిగా తారతమ్యాలు ఉంటవి. విమర్శించగలగటం మేధోపరమైన సమర్ధత. నిష్పక్షపాతంగా ఉండటం నైతికమైన నిబద్ధత.కాబట్టి ఇది ఆ వ్యక్తికి సంబంధించిన critical capabilities కు,ethical fineness కు సంబంధించిన విషయం కాబట్టి అందరూ ఇలా చేస్తారనో,లేదా అలా చేస్తారనో చెప్పటం కుదరదు.
4.అన్ని సాహిత్య ప్రక్రియల కు ధ్యేయం రసానంద స్థితికి పాఠకుడిని తీసుకెళ్ళడం.పాఠకుడిని రసానంద స్థితికి తీసుకెళ్ళి తనకు తెలీకుండానే తనలో నిద్రాణంగా లేదా స్పష్టాస్పష్టం గా ఉన్న ఉత్తమాభిరుచిని,కారుణ్యాన్ని,నిగర్వమైన హుందాతనాన్ని జాగృతం చెయ్యడం.అప్పుడు అన్ని ఉత్తమోత్తమైన ప్రయోజనాలు సాధించబడతాయి. అలా జరగనపుడు వాటికి అస్థిత్వం లేదు.
ఇంత పొడవైన కామెంట్ పెట్టటానికి inspiration ఇద్దరు రచయిత్రులూ ఇంత హుందాగా,అర్ధవంతంగా ,thought provoking గా చర్చ సాగించటం.కొంత digressive గా చర్చ అక్కడక్కడా లేకపోలేదు.కాకపోతే ,ఇది informal గా జరిగిన సంభాషణ కాబట్టి అది సహజమేమో.
అభినందనలు
సి.ఎస్.రావు.
Vamsi M Maganti
కల్పన గారూ, మీరు మరీనండీ బాబూ – మీ హాస్యానందాలు నాకు చక్కగా అర్థమయ్యాయి…నా హాస్యమే మీకు అర్థం కాలేదనుకుంటా…మీరు పెట్టని ఆ స్మైలీలు చూసి నాకు సిమిలీలు కూడా ఎలా రాయాలో తెలియట్లా… సరే కొద్దిగా విపులంగా వివరిచటానికి ప్రయత్నిస్తాను –
మీరన్నట్టు సిద్ధయోగులవ్వఖ్ఖరలేదండీ…ఒక గునపం – ఆపైన చేతిలో తవ్వే శక్తీ, ఉంటే చాలు – తప్పుగా అనుకోనంటే మీ లాటి రచయితల చేతిలో పెన్ను ఉన్నట్టు… :)…తవ్వితే చాలు, ఆ తవ్విన మట్టి మీదేసి కప్పొచ్చు….చదివేసాక మట్టి చీల్చుకుని బయటకూ రావచ్చు…గునపమే లేకపోతే, తవ్వను శక్తీ లేకపోతే, ఆ పైనా మట్టీ లేకపోతే – సమాధీలేదు, అందులో ఉండే యోగమూ లేదు…
సమాధిలోకి తీసుకెళ్ళలేకపోతే కథలే సమాధిలోకి పోతాయని నేను చెప్పింది…:) 🙁 …
ఈనాటి “మహారచయితలకు” “కథాశిఖండులకు” భీష్ములు ఎవరో ఒకరు కావాలిగా మరి…భారతం నడపటానికి…నెమ్మదిగా శ్రీకృష్ణులవారు వస్తారు…. తర్వాత పాండవులు, పాండవులు తుమ్మెదా కూడా వస్తుంది…..
మామూలు కథలు ఎవరయినా రాయొచ్చు, ఎవరయినా చదవొచ్చు, మమూలుగా ఎవరయినా జీవించొచ్చు – కానీ వృద్ధిలోకి, అభివృద్ధిలోకి పోవటమే రచనా లక్షణం, మనుషుల లక్షణం…నానాటికీ తీసికట్టు నాగంభొట్లులాగా తయారవుతూ, మంచినీళ్ళు దొరక్కుండా, మురుగునీరు తాగిస్తూ గోడలెక్కిస్తున్న ఈనాటి రచయితలని, రచనలని ఏమనాలో మీ నోటి ద్వారా వినాలని ఉన్నది…. 🙂 వీలున్నప్పుడు చెప్పండి….
kalpana
కొత్తపాళి గారు,
మీ అభిప్రాయల్ని మేము సహృదయత తోనే తీసుకుంటామని, ఆ పాటి సంస్కారం మాకు వుందని మీకు కూడా తెలుసనుకుంటాను.
ఇక మీ సందేహాల పట్ల…
మొదట ” ఇవి కేవలం మా అభిప్రాయలు మాత్రమే. తెలుగు కధల మీద పరిశోధన చేసి కనుగొన్న విషయాలు కావు.మా అభిప్రాయలు మాత్రమే కాని generalised statements కావు. ”
అలాగే chat కి కూడా కొన్ని పరిధులు, పరిమితులు వుంటాయి , పైగా పుస్తకం లో ప్రచురిస్తున్నందున స్థలాభావం వల్ల చాలా విషయాల్ని పైపైన మాత్రమె స్పృసించటం వల్ల మీకు కొంత గందరగోళం గా అనిపించి వుండవచ్చు. chat రెండు భాగాల్లో చాలా విషయాలు మాట్లడటం వల్ల దేని గురించి సమగ్రంగా, సంపూర్ణంగా చర్చించలేకపోయామని మేము కూడా అనుకున్నాము.
తెలుగు కధ పుట్టుక నుంచి కూడా సామాజిక ప్రయోజనమే లక్ష్యంగా నడిచింది. అయితే నా వుద్దేశం ప్రకారం అస్తిత్వ వుద్యమాలు వచ్చాక సొంత బాధల్ని, వేదనల్ని కూడా కధల రూపంలొ, కవిత్వ రూపం లో వ్యక్తీకరిస్తూ వస్తున్నారు. యే కాలంలో రచయతలకు స్వేచ్చ ఎక్కువ వుంది అంటే మనం చాలా విషయల నుంచి అలోచించి చెప్పాల్సి వుంటుంది. రాజుల కాలం లో రాజులకు మెచ్చే రచనలు చేశారు. ఇప్పుదు సంపాదకులకు, పాఠకులకు నచ్చే సాహిత్యాన్ని రాస్తున్నారు. ఒకప్పుడు నవలలకు పత్రికల్లో అగ్రపీఠం వుండేది. తర్వాత వారపత్రికలు వచ్చాక serials కి, కధలకు డిమాండ్ పెరిగింది. తర్వాత పత్రికల్లో కధలకు పేజీలు తగ్గించటం వల్ల కధలు కాస్తా కధానికలు అయ్యాయి. దీనివల్ల ఎక్కువ పాత్రల చిత్రీకరణ లేకుండా క్లుప్తం గా, తక్కువ పేజీల్లో కధ రాయల్సిన పరిస్థితి రచయతలకు వచ్చింది. ఇవన్నీ కధా స్వరూపాన్ని మార్చాయి.
వంశీ గారు,
కధలు సమాధి స్థితిలోకి తీసుకెళ్ళాలా? (smilies ఎలా పెట్టాలో తెలియక పెట్టడం లేదు. నా హాస్యం మీకు అర్ధమవుతుందనుకుంటున్నాను) భలే వారండి బాబూ మీరు.. రచయతలేమైన సిధ్ధ యోగులనుకుంటున్నారా? కధలు రాసే వాళ్ళు, చదివే వాళ్ళు, ప్రచురించేవాళ్ళు ఇంతమంది సమాధి లోకి వెళ్ళిపోతే ఇక మాములుగా జీవించేవాళ్ళు ఎవరండీ? అలాంటివన్నీ ” పెద్ద పెద్ద మహా రచయతలకు” ” విమర్శక శిఖండులకు” వదిలెపెట్టి మనలాంటి వాళ్ళము మాములు కధలు రాసుకొని చదువుకుందాము? ఏమంటారు?
కల్పన
కామేశ్వర రావు
“ఒక పాఠకుడిగా పాపం మీకు అవి బోరు కధలే కాని, ఆ స్త్రీలకు, ఆ రచయతలకు అది ఇంకా ఒక outlet.”
అవును. నేను కాదనలేదు. అది స్త్రీలకి, రచయితలకి మాత్రమే పరిమితమైన ఒక outlet అని అనుకుంటే మిగతా పాఠకుల గురించి (వారి స్పందన గురించి) మీరు పట్టించుకోవలసిన, ఆలోచించాల్సిన అవసరమే లేదని నేనన్నాను.
“పాఠకుల్ని కదిలించే శక్తి కధల్లో వుండాలి…
కదిలించే శక్తి రచయతకేమో కాని కదిలిపోయే గుణం పాఠకులకి కూడా వుండాలి కదండీ.”
కచ్చితంగా ఉండాలి. ఒక పాఠకునిగా కథలో ఉన్న విషయం గురించి నాకు కనీస అవగాహన ఉంటేనే నాకు ఆ కథని అర్థం చేసుకొనే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి నేను హిందువుని. నాకు ముస్లింల జీవన విధానం గురించి అవగాహన లేదు. ఒక ముస్లిం జీవితాన్ని చిత్రించే కథని నేను చదివినప్పుడు, ఆ కథని నేను అర్థంచేసుకోవాలంటే నాకు ముస్లిం జీవన విధానం కొంతైనా తెలియాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నగరవాసులకి పల్లె జీవితాలు కూడా. అయితే ఒక పాఠకునిగా నేను చెయ్యగలిగింది, కథలోని విషయం గురించిన “సమాచారం” కథ చదివే ముందు సేకరించగలగడం. నాకు తెలిసిన ఆ సమాచారంతో కథని అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం. అంతే కాని కథలో పాత్రలతో మమేకమై, వాళ్ళ బాధలని నా బాధలుగా, వాళ్ళ ఆలోచనలని నా ఆలోచనలుగా అనుభూతి చెందడానికి నాకు కథ ఒక్కటే మార్గం. పల్లేజీవుల కష్టాలని నేను స్వయంగా అనుభవిస్తేనే, వాటిని చిత్రించే కథలు నన్ను కదిలిస్తాయి అంటే నేను వాటిని చదవగలనా? నేను స్వయంగా అనుభవిస్తే మళ్ళీ దాన్ని కథల్లో చదివి నాకేంటి ప్రయోజనం, పుండు మీద కారం జల్లినట్టు తప్ప?
కొన్నాళ్ళ క్రితం ఈమాటలో రానారేగారి కథలు రెండువచ్చాయి. ఆ భాష, ఆ వాతావరణం అన్నీ నాకు కొత్తే. అయినా ఆ కథలు నన్ను కదిలించగలిగాయి. వాటిలో భాష నాకు కొత్త కాబట్టి చిరాకుపడి చదవడం మానేస్తే, ఆ కథని ఆస్వాదించే అవకాశం నాకు పోయుండేది. పాఠకునిగా నాకా మాత్రం సహనం అవసరం.
పాఠకుడు ఒక కథని అర్థం చేసుకోడానికి కథవైపు తప్పకుండా రెండడుగులు ముందుకు వెయ్యాలి. అలాగే రచయిత కూడా పాఠకుడివైపు అడుగులు ముందుకి వెయ్యాలి. అప్పుడే ఇద్దరూ కలుసుకోగలరు.
kalpana
కామేశ్వర రావు గారు,
* మంచి కధ అంటే ఏమిటి? అని మీరు వేసిన ప్రశ్న ప్రశ్న గానే మిగిలిపోయింది…
అవునండి. ఎందుకంటే, ఒక fixed frame లో, కొన్ని నిర్వచనాలతో, కొన్ని నియమ నిబంధనలతో మంచి కధను నిర్ణయించలేము అన్నది మా అభిప్రాయము. నాకు మంచి కధ అనిపించింది మీకు ” ఇజం” అనిపించవచ్చు. ” మంచి” ” ఉత్తమ” అనేది relative terms అనుకుంటాను. ఉత్తమ కధా సంకలనాల మీద భిన్నాభిప్రాయలుండటం ఇందువల్లనే అనుకుంటాను.
* కధ కి, వ్యాసానికి ఇంకా తేడా మిగిలి వుందంటారా?
లేదు అంటాను. కధా స్వరూపం మారింది. ఆ మార్పు నాతోనో, ఇకెవరితోనో మొదలు కాలేదు. చాలా కాలం క్రితమే మారింది అని తెలియకుండానే మారిపోయింది. subtle గానే కాకుండా అవసరమైతే open గా చెప్పటము, కధలో చర్చలు, వాదాలు, ఉపన్యాసాలు ఒక భాగమయ్యాయి. అయితే, ఒక కధలోనో, ఒక నవల లోనో ఒక వాదం చెప్పుకుంటూ పోతే అది రక్తి కట్టించకపోవచ్చు. అది వేరే సంగతి. అంత మాత్రన అది కధ కాకుండా పొతుందని నేననుకోను. బహుశా అది కొందరి ” మంచి” లేదా ” ఉత్తమ” కధల జాబితాలోకి చేరకపోవచ్చు.
గొప్ప కధకుడిగా గుర్తింపు పొంది, చాలా మంది అభిమానాన్ని సంపాదించుకున్న్న కొడవటిగంటి కుటుంబరావు గారి లాంటి వారి కధల మీద వున్న ప్రధాన విమర్శ అదే మరి. ఆయన కధలు పెద్ద వ్యాసాలు అని.
* కధల్లో ” ఇజా”ల గురించి….
” ఇజం” అనే పదాన్ని తెలుగులో ఒక వాదన అనే అర్ధంతోనే, negative గా వాడుతున్నారు. రచయతలు ” ఇజలతో రాస్తున్నారో, లేదో తెలియదు గాని పాఠకులు మాత్రం వాటిని కధల్లో వెతుక్కుంటూనే వున్నారు. పాత ముద్రల్ని తిరస్కరించడము చాలా “ఇజాలు” చేసిన పని. ఆ క్రమంలో కొన్ని కొత్త ముద్రలు కూడా వేశాయి ” ఇజాలు”. వాటికి యే వాదము మినహాయింపు కాదనుకుంటాను.
మీరు ఏ ఇజం గురించి మాట్లాడారో నాకు స్పష్టం గా తెలియదుకాని చాలా చొట్ల మీ వ్యాఖ్యల్ని బట్టి మీరు ప్రస్తుతం మాట్లాడే “ఇజం” స్త్రీవాదం అనే అనుకుంటున్నాను.
ఒకే రకమైన వస్తువు అంటే మీ వుద్దేసం ఒకే రకమైన ఇతివృత్తాలనుకుంటాను. అంటే స్త్రీల సమస్యలు, కష్టాలు, మానసిక సంఘర్షణలు ఇవన్నీ ఒక వస్తువు గా పాతబడిపోయి వుండవచ్చు. అయితే వాటిని అనుభవించే స్త్రీలు ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టి కొత్తగా అనుభవిస్తూనే వున్నరు. కొత్త రచయత్రులు వారి వారి అవగాహన పరిధుల మేరకు వాటి గురించి రాస్తూనే వున్నరు. ఒక పాఠకుడిగా పాపం మీకు అవి బోరు కధలే కాని, ఆ స్త్రీలకు, ఆ రచయతలకు అది ఇంకా ఒక outlet.
* పాఠకుల్ని కదిలించే శక్తి కధల్లో వుండాలి…
కదిలించే శక్తి రచయతకేమో కాని కదిలిపోయే గుణం పాఠకులకి కూడా వుండాలి కదండీ.
Vamsi M Maganti
అన్నీ బాగానే ఉన్నాయి – అదేదో “డైగ్రెస్స్” అంటారే అలా అనుకోకపోతే, ఈ కింది లైన్లు చదువుకోండి…ఇంకా బోలెడు రాయొచ్చు కానీ, అంత సమయం లేకపోవటం మూలాన…మళ్ళీ తర్వాత తీరిగ్గా రాస్తాను…
ప్రత్యేకత కావాలి అన్న కథకుల్లో ఒక్కొక్కరికీ ఒక్కొక్క మౌలికాంశం వారి కథకి ఆధారంగా ఉంటుంది. అయితే ఆ రచనని చదివినప్పుడు, పాఠకుడిని దృష్టిలో పెట్టుకుని గనక ఒకవేళ రచయిత రాస్తే, అలా రాస్తేనే సుమా !, పాఠకుడు దాన్ని చదివినప్పుడు ఆ రచయిత రాసిన ప్రతి వాక్యంలోని స్పందననీ మురుగునీళ్ళలాగా కాక మంచినీళ్ళలాగా తాగి సేద తీర్చుకున్నప్పుడు మాత్రమే “రచనా సంబంధమయిన అనుభూతి, అనుభావం” కలుగుతుంది…అయితే విమర్శ దగ్గరికి వచ్చేటప్పుడు, వివిధ అంశాల్ని ప్రాతిపదికగా తీసుకుంతేనే అది సమగ్రమయిన విమర్శ అవుతుంది. కేవలం పైన చెప్పిన అనుభూతిని ప్రాతిపదికగా తీసుకుంటే అది శ్మసానంలో పెరిగిన గడ్డితో సమానం.
రచయిత రాసేది, పండితుల హృదయాల్ని మటుకే తాకితే ‘ ఉత్త ‘ కథే మిగులుతుంది…. మరి అలా ఆ మాదిరిగా మిగిలిపోయే వాటిలోనే ఈనాటి కథలు ఎన్ని వున్నాయో సగటు పాఠకుడికి తెలుసు..ఎవరూ చెప్పనఖ్ఖరలా…కథ చిన్నదయినా ఒక సమాధి స్థితిలోకి తీసుకుని పోవాలి….అంతే కానీ, ఈ లైను బాగుంది, ఈ పేరాగ్రాఫు బాగుంది అంటూ పాఠకుడు అనుకునే రచనలు రచనలూ కావు, ఆ రచయిత రచయితా కాడు…
ఇక సంపాదకుల విషయానికి వస్తే అదో లోకం. వారు నగరవాసుల అనుభవాల్లాంటివారు. వచ్చిన ఊహాసామాగ్రిని ఒకపట్టు పట్టి, అప్సరసను తయారు చేసి వదలటమో, శూర్పణఖను తయారు చేసి వదలటమో వీరికి తెలిసిన విద్య..అందులో ఇసుమంత కూడా సందేహం లేదు. అయితే ఆ పని సమర్థంగా నిర్వహించే సంపాదకులెంతమంది అన్న ప్రశ్న రావొచ్చు. వస్తే బోలెడు మాట్టాడుకోవచ్చు..
అయితే అది కొద్దిసేపు పక్కనబెట్టి, కొద్దిగా పాత తరం వారిని వదిలెస్తే, ఈనాటి రచయితల వద్దకి వస్తే అహం బ్రహ్మస్మి – కథం కాకమ్మస్మి అనే ధోరణి కనపడుతోంది. అది ఎవరు అయినా కాదనలేని సత్యం. లేదు లేదు అలా లేదు, అన్నవారు భ్రమణ లోకంలో విశ్వామిత్రుడు గారు తయారు చేసిన కలకండ తింటూ మాట్టాడేవారిలోకి వస్తారు అని పెద్దల అభిప్రాయం..ఇందులో శ్లేష ఉందనుకుంటే, అనుకున్నవారి ఖర్మ…
ఇంతే సంగతులు చిత్తగించవలెను…మళ్లీ సమయం ఉన్నప్పుడు కలుద్దాం…సర్వేజనా స్సుఖినోభవంతు
మాలతి
కామేశ్వరరావుగారూ,
మీ ఆలోచనలు రాసినందుకు ధన్యవాదాలు. . కల్పన వెలిబుచ్చినఅభిప్రాయాలమీద మీప్రశ్నలకి ఆమే చెప్పగలరు. నాకు సంబంధించినవాటికి మాత్రం నేను రాస్తున్నాను
మంచికథ ఏది అన్నది నాక్కూడా ఇంకా స్పష్టం కాలేదండీ. పుస్తకం.నెట్ అడిగారు కనక, పాఠకులందరూ తమకి ఏకథ నచ్చిందో, వాటిలో నచ్చినఅంశాలేమిటో రాస్తే, మనకి కొంత అవగాహన ఏర్పడుతుందేమో. ఆరచనలకోసం ఎదురుచూస్తున్నాను.
పాఠకుడిని కథలో లీనం చేసుకోగలసత్తా కథకి ఉండాలి – ఒప్పుకోకతప్పదు 🙂
రచయిత తనకి సానుభూతిగలపాత్రచేత సామెత చెప్పిప్తే, పాఠకులమనసులో అది ముద్రవేస్తుంది – మీరు చెప్పినతరవాత అవునేమో అనిస్తోంది.అయితే,ఇంకా ఆలోచిస్తే, అలా ముద్ర పడడానికి ఆపాఠకుల అభిప్రాయాలూ, అనుభవాలూ, పరిస్థితులూ కూడా కొంత దోహదం అవుతాయా?
ఈవిషయంలో ఇతరపాఠకులు కూడా స్పందిస్తారని ఆశిస్తున్నాను.
– మాలతి
కామేశ్వర రావు
ఈ చర్చ చదివిన మీదట నాకు వచ్చిన ఆలోచనలు:
“వీటినన్నింటిని గుర్తించి, అర్ధం చేసుకున్న అవగాహనతో మాత్రమే మనం మంచికధ అంటే ఏమిటి అని మాట్లాడుకోవాలంటాను నేను.”
మీకున్న అనుభవంతో, అవగాహనతో దీనిగురించి వివరంగా మాట్లాడుకుంటే బాగుండేది. మంచి కథ అంటే ఏమిటి అని మీరు వేసిన ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది. కథాస్వరూపం మారిన/మారుతున్న మాట నిజమే. అయితే కథకీ వ్యాసానికీ ఇంకా తేడా మిగిలి ఉందంటారా? ఉంటే ఏమిటి?
“ఇజా”లా కథల గురించి నా ఆలోచనలు. పాఠకులు ఒక కథని “ఇజం” ముద్ర వేసి తిరస్కరించడం వెనక కారణం సహజమైనది, స్పష్టమైనది. ఒకే రకమైన వస్తువు, విషయాన్ని గురించి పాఠకులు పదే పదే అదే అదే చదివినప్పుడు వాళ్ళలో విసుగు కలగడం చాలా సహజం. అది సమాజంలో బాగా వ్యాపించే ఉండవచ్చును. కానీ దాన్నే మళ్ళీ మళ్ళీ చదవడం వల్ల పాఠకుల్లో దానిపట్ల ఒక నిర్లిప్తత, నిరాసక్తి కలుగుతుంది తప్ప వేరే ప్రయోజనం ఉండదు. స్త్రీల హక్కులూ,సమస్యలకీ సంబంధించిన కథావస్తువు ముప్ఫై నలభై ఏళ్ళ కిందట మనకి కొత్త. అంచేత అప్పట్లో ఆ వస్తువుతో ఏ కథ వచ్చినా అది కొత్తగానే ఉంటుంది. చదివేవాళ్ళలో ఆసక్తి కలిగించే అవకాశం ఉంటుంది. అదే వస్తువు ఇప్పుడు పాతదైపోయింది. అవే సమస్యలున్నాయి, కాని ఆ వస్తువు పాతదైపోయింది కదా. అంచేత చదివే పాఠకుడిలో ఆసక్తి ఉండదు. కాబట్టి అదే వస్తువుతో ఇప్పుడు కథలు రాయాలంటే, అవి పాఠకులని కదిలించాలంటే, వస్తువొక్కటీ సరిపోదు. వాదన చేస్తే సరిపోదు. పాఠకులని కదిలించే శక్తి మరేదో కథలో ఉండాలి.
“ఎక్కడో ఒకచోట నాకధలతో relate చేసుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ personal letters రాసే పాఠకులు వుంటూనే వున్నారు. వాళ్ళ కోసమే ఆ కధలు.”
అలా నిర్ణయించేసుకుంటే మంచిదే (Good for you)! అలాంటప్పుడు,
“నేననుకుంటాను, పాఠకులు తమ అభిప్రాయాలకు దగ్గరగా వున్న కధల్ని రచయతలనుండి ఆశిస్తారు. అలా కాకుండా మనం భిన్నంగా చెప్తే వాళ్ళకు నచ్చకపోవచ్చు.”
అని ఆలోచించడం ఎందుకు? మీరు కథలు రాస్తున్నది మీ అభిప్రాయాలకి దగ్గరగా ఉన్నవాళ్ళ కోసమే కదా! భిన్నంగా ఆలోచించేవాళ్ళకి కూడా నచ్చడం కోసం మీరు కథ రాయడమే లేదు కదా. మరి వాళ్ళకెలా నచ్చుతుంది?
“అంటే మన నమ్మకాల్ని, మనకి పరిచయమయిన ప్రపంచాన్నీ కాస్సేపు పక్కన పెట్టేసి, కథలో లీనమయిపోవాలి. కథ చదువుతున్నంతసేపూ ఆకథే మొత్తం ప్రపంచం. అప్పుడే, పాత్రలూ, సంఘటనలూ అర్థం అవుతాయి.”
అలా లీనం చెయ్యగలిగే సత్తా కథకి ఉండాలి. అప్పుడే అది మంచి కథ అవుతుంది.
చివరిగా,
“నేను స్త్రీలు నిర్వహించే గృహకృత్యాలని తక్కువ చేసి మాటాడేనన్నారు.”
మీరన్నది నేను రాసిన వ్యాఖ్య గురించే కాబట్టి, ఇక్కడ వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. మీరనుకున్నది తప్పు. నా వ్యాఖ్య మరోసారి చూడండి. “కథలోని పాత్ర అభిప్రాయమే అయినా యిది రచయిత్రి అభిప్రాయం కూడానేమో అని అనుమానమొచ్చింది.” అని నేను స్పష్టంగా చెప్పాను. నేను మిమ్మల్నేదో తప్పుపట్టాననే భావన పక్కన పెట్టి నా వ్యాఖ్య గురించి ఆలోచించి ఉంటే, నేనెందుకు ఆ వ్యాఖ్య రాసానో మీకు బోధపడి ఉండేది. ఇది మీ అభిప్రాయం కాకపోవచ్చు. ఇది మీ అభిప్రాయమా అని అడిగితే కాదని చెప్తారనీ తెలుసు. కల్పనగారి కథలో చెప్పిన అయిదో గోడ మీచేత అలా అనిపించి ఉండవచ్చు కదా? అంతకన్నా ముఖ్యంగా, మీ కథ చదివిన పాఠకులకి అసంకల్పితంగా ఆ అభిప్రాయం కలిగే అవకాశం చాలా ఎక్కువ. ఒక పాత్ర చేత (అదీ రచయిత్రి సానుభూతి స్పష్టంగా కనిపిస్తున్న పాత్ర చేత) అలాంటి సామెత చెప్పించడం వల్ల అది పాఠకుల మనసుల్లో ముద్రపడుతుంది, అని హెచ్చరించడమే నా వ్యాఖ్య ఉద్దేశం. పైగా యీ విషయం కథకి బొత్తిగా సంబంధం లేనిది కూడా కాదు.