మిత్రవాక్యం – 2
“…తెలుగులో ఇటీవల మంచి పుస్తకాలే కాదు; అందంగా అచ్చయిన, అర్థమున్న పుస్తకాలు వస్తున్నాయొస్తున్నాయి. ప్రతి నెలా ఒక పుస్తకం కొందాం. లేదా పుస్తకానికని రోజుకో రూపాయి దాచుకుందాం. వాటిని కొంటే మంచికి మనం సాయపడ్డట్లు –
అలాంటివి మన దగ్గర దాచుకొంటే మన పూరి గుడిసె వైటు హౌసు అయినట్లు
వైటు హౌసంటే ఏవిటా –
మరాళం, మల్లికా హారం!
తుషారం!
ఫేనం!
రజతాచలం!
ఎవరికి గురుతులో ఆ దేవి ఉండే ఇల్లు అన్న మాట!
సంఝే?”
***
బావుందా?
మిత్రవాక్యం-IIలో నాకు ఎంతో నచ్చిన మాటలివి.
మొన్నీనడుమ చదివిన మిత్రవాక్యం సంకలనంలో పై వాక్యాలతో ముగిసే చక్కని సంపాదకీయం ఎందుకు వేయలేదు చెప్మా అని ఆశ్చర్య పోతూ నవోదయా బుక్‌షాపుకు చేరుకున్నానా, నాకు మిత్రవాక్యం-II చివరి కాపీ దొరికిందోచ్! నేను వెదుకుతున్న సంపాదకీయం ఈ సంపుటంలో ఉన్నది.
“జీవితం లాంటి తెల్ల కాగితాల మీద అనుభవాల్లాంటి నల్లక్షరాల పదాలు. ఘనీభవించిన గతాలు, వర్తమానాలు, భవితవ్యాలు. ఆలోచన అరణి సెగ తగలగానే అక్షరాల మంచుకొండలు కరిగి ప్రవహించే గంగా నదులు ఎన్నో కదా! వాటిలో దూకి, ఈది, గెంతి, మునిగి, స్నానమాడి, ఎప్పటికప్పుడు అన్ని కాలాలలోనూ ఒక్కసారిగా జీవించి, వందలాది మనుషులు నేనై, సర్వమూ నాదై…” విశ్వరూప సాక్షాత్కారాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి యత్నించిన వ్యక్తి ఏం చూసారు, ఏం రాసారు?
ఈ సంకలనంలో –
బీథోవెన్, హరివల్లభ్ పారిఖ్, కార్ల్ పాపర్, డేవిడ్ బామ్‌ల జీవిత రేఖా చిత్రాలున్నాయి. వివేకానందుడిని ఉగ్గడిస్తూ రాసిన వ్యాసమూ ఉన్నది. కుక్కనీ, కోతినీ ఆవునీ ఆత్మీయుల్లా చూసుకున్న “అరుణాచల దీపం” రమణ మహర్షి గురించి రాసిన వ్యాసమూ ఉన్నది.
“అరవయ్యేళ్ళంటే ఇంటర్వెల్లే, సార్” అని బాపుకి అభినందనలు చెప్పిన ఆత్మీయ వ్యాసం ఉంది. వేయి పున్నమలను చూసేసిన పినాకపాణిగారి సంగీత యాత్ర గురించి, డైమండ్ జూబిలీకి చేరుకున్న పన్‌డిత పఠాభి జీవిత సంరంభం గురించీ రాసిన వ్యాసాలున్నాయి. విశాఖపట్నం స్మృతులను కలబోసుకున్న జ్యేష్ట సంస్మరణ వ్యాసం ఉన్నది. విశాఖ లైటు హౌసు రావిశాస్త్రి స్మృతి వ్యాసమూ ఉన్నది.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములుగారి చేసిన ఆమరణ నిరశనదీక్షా ఉద్విగ్నఘట్టపు ప్రత్యక్షసాక్షి కథనమూ ఉంది.
గృహలక్ష్ములు ఉద్యోగ సరస్వతులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నప్పుడు వారికి సమాజం అందివ్వగల తోడ్పాటు గురించి రాసిన మంచి వ్యాసమూ ఉంది.
ఇంకా…
వరుణ జపాలతో వానలు కురిపించలేమన్నందుకు (అన్యాయంగా) హేతువాదులను కోప్పడడాలు, ‘కలడో లేడో’ ప్రశ్నపైన ఓ గో.పి. చర్చ, ‘క్యూ’ల చలన సూత్రాల మీద “ఫోర్డు ఫౌండేషన్ ఆధ్వర్యంలో” మూడేళ్ళ పాటు చేసిన “రీచర్చి“… ఉన్నాయున్నాయింకెన్నెన్నో ఉన్నాయి.
***
45 వ్యాసాలు. ఒకో వ్యాసం నిడివి కాస్త అటు-ఇటుగా మూడు-నాలుగు పేజీలు ఉంటుందేమో. అంత తక్కువ స్థలంలో ఎన్నేసి విషయాలను చెబుతారో, ఎంత ఉత్సాహాన్ని పంచుతారో…
మొదటి వ్యాసంలోనే – రాజుల ముందు తల వంచని బీథోవెన్ ఆత్మాభిమాన కథలతో ఆరంభించి, అటు ఎమర్సన్‌ను, ఇటు అన్నమయ్యాది భక్త కవులను తలచుకొని, “ఆగామి కాల గంభీర స్వామి కంఠాన వేయబోయే మాలగా” కవిని సంభావించిన తిలక్ కవితా పంక్తుల మీదుగా సాగి… “ప్రతి సుమము తన్మయత్వంతో కిలకిలా నవ్వగా లేనిది, ప్రతి పక్షి ఉన్మాద పరవశతతో నర్తించగా లేనిది మీరు పులకించి పులకించి పద్నాల్గు లోకాలుగా విస్తరించలేరా ఏమిటి?” అని పాఠకులను సవాల్ చేస్తారు. సదాశివ మాస్టారు గారి మలయ మారుతాలు శీర్షిక మొదలుపెట్టేప్పుడు రాసిన వ్యాసం ఇది.
చూపు-దృష్టి అని పేరు పెట్టుకున్న వ్యాసమో?
“సీకట్లో సూడాలి నీ కంటి తళతళలు/ఆరిపెయ్యవే దీపమూ” అన్న ఎంకి పాటతో మొదలవుతుంది.
చీకటి ప్రస్తావనతో స్ఫురించిన శ్రీకృష్ణ కర్ణామృత కథ, ఆ తరువాత. కళ్ళు రెండూ గాఠిగా మూసేసుకొని, “రాత్రి వచ్చేసిందమ్మా! మరింక పాలివ్వు!” అన్నాడట తల్లితో చిన్ని కృష్ణుడు ఆ కథలో.
“ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి”యైన (విశ్వ సృష్టి లయలను కనురెప్పల కదలికలుగా అమర్చుకున్న) అమ్మవారి ముచ్చట అటు పిమ్మట. “ముఖ సౌందర్య స్రవంతిలో ఈదులాడే చేపల జంట వంటి కళ్ళు” గలావిడట ఆ జగజ్జనని.
అసలు విషయం ఏవిటంటారా? ఇంద్రియ జ్ఞానానికి ఉండే పరిమితుల గురించి రాసిన వ్యాసం ఇది. “భౌతిక పదార్థం తప్ప ఏదీ లేదు అనుకోవడం విజ్ఞానం. అన్ని పదార్థాలలోనూ ఒక పరమ చైతన్యం ఉంది అని తెలియడం జ్ఞానం. పరమ చైతన్యం తప్ప వేరేది లేదు అని తెలియడం ప్రజ్ఞానం.” అన్న రామకృష్ణ పరమహంస మాటలను చర్చించడం దాని లక్ష్యం.
ఊపిరాడని పెద్ద పెద్ద విషయాలేనా? కాదేదీ మిత్రవాక్యానికనర్హం!
పిల్లి మీద – ఆఫ్టరాల్, పిల్లి మీద – వ్యాసం రాయమంటే?
కాలిఫోర్నియా నుంచి ఓక్లహామాకి సాహస యాత్ర చేసిన ఓ పెంపుడు పిల్లి షుగర్ కథతో మొదలు పెట్టి…
““పిల్లులు తిండికోసం ఇతరుల పై ఆధారపడతాయి గానీ ఎవరి అధికారాన్ని సహించవు. విశ్వాసానికి అవి చాలా దూరం. బాధ్యతా భారాన్ని మోయవు. సోమరితనం వాటికిష్టం.” అన్నాడొక [మార్జాల?] మానసిక తత్త్వవేత్త.” అన్న సాధికార ప్రకటన తరువాత ఓ చిన్న పాజ్ తీసుకొని…
“అంటే ఉండాల్సిన సల్లక్షణాలన్నీ ఉన్నాయి గనుక వాటి తరువాతి జన్మలో పిల్లులు ‘రానా’లుగా పుడతాయి అనుకోవచ్చా?” అని పైసంగతి వేసి ముగించేస్తారు.
గురక ఇతివృత్తంగా ఆంధ్రప్రభలో ఓ కథ అచ్చయిందట ఒకానొక గతవారంలో. ఇహనేం, మరో సంపాదకీయానికి ఐడియా దొరికింది. అందులో మనకు కనబడే ఓ వచన కవి కుమారుడు, “ఏ వంద డీబీల స్థాయి గురక దాడికి గురి అయి”, తన డైరీలో ఇట్లా రాసుకున్నాడట.
“ప్రియా!
నా నిద్ర – కోట.
నీ గురక – ఫిరంగి.
ఇది పేలదు
అది కూలదు!”
దాన్ని తీసుకెళ్ళి “వారపత్రికల వాళ్ళకిస్తే వాళ్ళు దాన్ని తల కింద పెట్టుకుని నిద్రపోయారట“.
ఇలా చదివిందల్లా రాస్తూ పోతే, ఈ పరిచయం ముగిసేదెలా…?
ఆంధ్రప్రభ పాఠకులకు టాటా చెప్పిన ఆఖరి మిత్రవాక్యం ముగింపు మాటలతో నేనూ ఆపేస్తాను.
“చదువరీ,
అర్ణవమంత ఆనందం నీది. అందుకో!
అంబరమంత అనురాగం నీలో ఉంది. పంచుకో.
ఫిర్ మిలేంగే!”
***
33 రూపాయల ధర ఉన్న ఈ వ్యాస సంకలనాన్ని 2002లో వాకాటి ట్రస్టు వారు ముద్రించారు. ఇదిప్పుడు మార్కెట్‌లో దొరక్క పోవచ్చును. నవోదయా బుక్‌షాపులోనో, విశాలాంధ్రలోనో ప్రయత్నించి చూడండి.
A. S. Babji
Good.
It can be more better.
Regards,
Babji