అశ్వమేధము – విశ్వనాథ సత్యనారాయణ
వ్యాస కర్త: Halley
*****
ఈ పరిచయం విశ్వనాథ వారి ‘పురాణవైర గ్రంథమాల’ లోని ఆరవ నవల “అశ్వమేధము” గురించి. ఇది పుష్యమిత్రుడి కథ. అయన తలపెట్టిన అశ్వమేధ యాగం యొక్క కథ. పుష్యమిత్రుడి గురించి వికీ లింకు ఇక్కడ. ఆ వికి పరిచయంలో ఉన్న తారీఖులతో ఈ పుస్తకం ఏకిభవించదు. ఆ వివరాలు ఈ పుస్తకంలోని ‘పురాణవైర గ్రంథమాల పీఠిక’లో ఉన్నవి. ఏది చరిత్రో ఏది కల్పనో చెప్పటానికి ఈ పుస్తకం తాలుకా పీఠిక ఉండనే ఉన్నది. కాబట్టి ఈ విషయాల గురించి వాదనలు అనవసరం. పుస్తకం DLIలో లభ్యం. (ashwa_medamu అన్న పేరుతో)
ఇక ఈ పరిచయం విషయానికి వస్తే , ఇందులోనున్న విషయాల గురించి లోతుగా అధ్యయనం చేసేంత విద్వత్తు , చరిత్ర మరియు పురాణ పరిజ్ఞానం నాకు లేవు. కాబట్టి ఆ విషయాల గురించి నేను వ్రాయబోవట్లేదు. విశ్వనాథ వారి రచనలలో నాకు నచ్చే విషయాలు కొన్ని ఉన్నవి. అక్కడక్కడ ఈ పుస్తకంలో నన్ను ఆలోచింపజేసిన అటువంటి విషయాలను మాత్రమే ఈ పరిచయంలో పొందుపరుస్తున్నాను.
“సర్వ మనవ సమానత్వం” అనే మాట గురించి చెబుతూ ఇలా అన్నారు. “మహారాజు బౌద్ధుడు. వాని గుర్రపు వాడు బౌద్ధుడు. మహారాజు తన గుర్రపువానికి నెలజీతమును మించి యీయడు. మహారాజు కుమార్తెను గుర్రపు వాని కుమార్తెకిచ్చి పెళ్లి చేయునా? వారొక వేళ ప్రేమించినచో నిద్దరును లేచిపోవలెను. అందరూ సమానులని చెప్పెడి ఏ సంఘమునందయిన నేదేశమునందైనను బరిస్థితి ఇదియే”. ఇదే విషయం గురించి “ఈ మనోనిర్మితమైన భేదము మత సంబంధమన్నచో ద్వేష్యమా? లౌకికములయిన ధనాధికారముల విషయమయినపుడు స్వీకార్యమా?” అని ఒక మాట అన్నారు. అప్పటి నుండీ ఇప్పటి వరకు ‘అందరూ సమానులే’ అనేదే కదా మన సంస్కర్తల పంచ్ డైలాగూ! (వారు బౌద్ధులు కావచ్చును, కమ్యునిస్టులు కావచ్చును, మిషనరీలు కావచ్చును, ఫ్రీ మార్కెట్టు ఆరాధకులైనా కావచ్చును). అంత సులభంగా అర్థమయ్యే విషయం కాదు ఇది. ఒకవేళ అర్థమైనా కూడా పది మందిలో చెప్పుకోనేటిది కాదు. ఈ పోస్టు లో ఈ మాట రాయాలంటేనే భయమేస్తోంది మరి! సంఘ సంస్కర్తలంతా ఏకమై ఒక్కసారిగా దాడి చేస్తారో ఏమో! అసలు “Art for art’s sake” అనుకొని ఇటువంటివి చదివి వదిలేయాలో ఏమో (ఆ మాత్రానికి చదవటం ఎందుకో!). ఈ విషయం ఇంతటితో ఇలా వదిలేద్దాం. ఈ విషయంలో నాతో ఏకీభవించని వాళ్ళు “post for post’s sake” అనుకోని వదిలేయండి.
మరొక చోట జ్యోతిష్య శాస్త్రము గురించి, యజ్ఞ క్రతువుల గురించి, సృష్టి యెట్లా జరిగింది, దాని రహస్యమేమిటి, భూమండలమున మానవుడు ఎలా పుట్టాడు, గ్రహ గతులకి కర్మలకి గల లంకె వంటి విషయాల గురించి కొన్ని వాదనలు ఉన్నవి. ఇవన్నీ నా తరం పాఠకులకి “out of syllabus” అన్న భావన నాలో కొంత ఉన్నపటికీ ఈ వాదనలను త్రోసి ప్రుచ్చటానికీ మరియు తప్పు పట్టటానికీ నా దేగ్గరేమి లేదు ప్రస్తుతానికి (అసలెందుకు తప్పు పట్టాలో?). కాబట్టి ఇదంతా చదివి .. ఊ కొట్టి .. ఓహో అలాగా అని అనుకోటం ఉత్తమం. సాధారణంగా ఇటువంటి వాదనలకు ప్రతిగా నా తరం వారి వాదనలు “డార్విన్ పరిణామ వాదం ప్రకారం…” అని మొదలు అవుతాయి. ఈ సందర్భంలో పురాణ వైర గ్రంథమాల పీఠికలో ఉన్న ఒక వాక్యాన్ని తలుచుకోవటం సమంజసమేమో. “ఇంగ్లిషు నేర్చిన మన పెద్దలు వారినే (పాశ్చాత్యులు) విశ్వసించుచున్నారు. మన వాండ్రకు పురాణములయందు చెప్పబడిన సర్గ ప్రతిసర్గలయందు విశ్వాసము లేదు. డార్విను సిద్దాంతము నందు విశ్వాసము”. ఇదీ విశ్వనాథ వారి వాక్కు. ఇది కూడా పైన చెప్పిన విషయమునకు మల్లే అంత సులభంగా అర్థమయ్యే విషయం కాదు మరి! పైన చెప్పినట్టే ఈ విషయంలో కూడా దాడి జరిగే అవకాశాలు లేకపోలేదు. అందుకని ఇది ఇంతటితో ఆపుదాం.
మరొక చోట భారతీయుల విశ్వాసాల గురించి చెబుతూ ఒక మాట అన్నారు. పుస్తకం మొత్తం మీద ‘నీకు నచ్చిన ముక్కలు మూడు చెప్పుము’ అని మా తెలుగు మేస్టారు నన్ను అడిగితే ఇదిగో ఇవి అని చెప్తాను.
“భగవంతుడు, దేవుడు మొదలయిన శబ్దముల యొక్క వ్యుత్పత్యర్థములు విచారించినచో భారతీయ విజ్ఞానము యొక్క శాస్త్ర మూలత్వము తెల్లమగును. దేవుడనగా ప్రకాశించు వాడు. ప్రకాశము, జ్ఞానము. ఉనికి, ఆనందము. వీని చుట్టును భారతీయ విజ్ఞానము పర్యటించినది. వాని యంతరాంతములకు పోయినది. ఇంతటి గూఢమైన మత రహస్యములను తెల్సికొనుట సామాన్యబుద్ధులకు బరువై యా బరువుతో పాటు నీ పరమ సూక్ష్మా సుక్ష్మ విషయముల నుపాసించి ఫలమును బొందుటకు నిర్మించబడిన కర్మకాండము నాచార సంపత్తి నియమములు మొదలైన వాని నాచరించుట యందు సోమరులయి జనము మ్లేచ్చులు కాజొచ్చిరి. వైదిక ధర్మము నుండి పరిభ్రష్టులైరి. పరమ విజ్ఞాన పేటికయైన వేద మతము నుండి బాహిరులయిరి. తనకు దెలియనిది లేదనట్లు, తనకు దోచనిది కాదన్నట్లు, తానెరుగనిది మృషయన్నట్లు మ్లేచ్చ భావం విజృంభించెను. సృష్టిలోనున్న దోషమేమియో తెలియదు. విజ్ఞుల యొక్క సంఖ్య తక్కువ. అజ్ఞుల సంఖ్య ఎక్కువ. లోకము తేనెపట్టు వంటిది. మధు భాగము కొద్ది. కీటక భాగము ఎక్కువ”.
ఇది మాత్రమే కాక ఇందాక చెప్పిన “Art for art’s sake” అనెడి వాదం గురించి విశ్వనాథ వారు చెప్పిన విషయాలు నాకెంతో నచ్చాయి. సామవేదములో నుండి పుట్టిన సంగీతాన్ని పరమేశ్వరానుబంధముగా నుపాసించటానికీ, వినటానికి బాగుంటే చాలు అని అనుకోని ఉపసించటానికి గల తేడా చెప్పిన విధానం నాకు నచ్చింది. దేనికదిగా సేవించి దానికదే పరమార్థమనుకొనుట మ్లేచ్చుల మార్గమట!
నేను ఎం.బీ.ఎ చదివే రోజుల్లో మా ఎకనామిక్స్ మేస్టారు “institutions.. institutions” అని మొత్తుకొనే వారు ప్రతీ క్లాసులో. ఈ పుస్తకంలో కుడా ‘వ్యవస్థా బలము – వ్యవస్థాగత మూల శక్తి – దేశ భద్రత’ అన్న విషయం మీద కొన్ని మంచి మాటలున్నాయి. మరొక చోట యజ్ఞములలో జరిగెడి “హింసను” గురించి చెబుతూ “హింసా బుద్ధితో చేసిన హింస హింస. హింసాబుద్ధి లేని హింస హింస కాదు” అని అన్నారు. ఈ విషయం మీద ఇంకా లోతైన వాదనలు కూడా ఈ పుస్తకములో ఉన్నాయి. ఎంతైనా అశ్వమేధము గురించిన పుస్తకము కదా! అందులోను యజ్ఞమంటే కసాయి దుకాణం అనుకొనెడి కాలము నాటి కథ!
పుష్యమిత్రుడు తాను రాజయ్యాక చేసిన ప్రసంగం చాలా బాగుంది. అందులో ఒక చోట పుష్యమిత్రుడు “బౌద్ధ మతము యందు సంఘ వ్యవస్థా నిరూపణం లేదు” అని అంటూనే “నేను బౌద్ధ మతమును నాశనం చేయుటకు సంకల్పించుట లేదు. కొందరు తమ యాత్మ పరిణతికి అది యొక స్థానముగా బరిగణించినచో నాకేమి నష్టం” అని అంటాడు. ఇంతే గాక “బౌద్ధ మతంలో దౌర్జన్యం ఉన్న చోట నేను శిక్షించినచో దానిని బౌద్ధ మతమునండలి నా ద్వేషంగా బరిగణించు వారిని నేనేమియు జేయలేను” అని మరొక మాట కూడా అంటాడు. నేటి మన చరిత్రకారులలో ‘పుష్యమిత్రుని హయాం లో బౌద్ధం’ అనే విషయం పైన చాలానే చర్చలు జరిగినట్టుగా ఉన్నాయి మరి. ఆ వాదనలలో ఇదొక వాదం అని అనుకోవచ్చును.
ఇలా సాగిపోతుంది ఈ పుస్తకం. ఇంతకంటే ఎక్కువ “spoilers” ఇవ్వటం భావ్యం కాదు. అసలు ఈ వైదిక మతమూ బౌద్ధమూ ఈ గోలంతా నాకు వద్దు అని అనుకొనే వాళ్ళు కూడా కేవలం ఒక “historical fiction” లేదా “revenge drama” నవల గా కూడా ఈ పుస్తకాన్ని చదవచ్చు. చదివాక మీకు నచ్చవచ్చును కూడాను. ఎందుకంటే కథా కథనంలో ఆ మాత్రం పట్టు ఉంది. కాని ఇది అలా చదవాల్సిన పుస్తకం కాదు అని నా అభిప్రాయం.
**
(వ్యాసానికి జతచేసిన చిత్రం విశ్వనాథ వారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రభ దినపత్రికలో 2011లో వచ్చిన వ్యాసంలోనిది. వ్యాసం లంకె ఇక్కడ. ఒకవేళ ఇది కాపీహక్కుల క్రిందకి వచ్చే చిత్రం అయిన పక్షంలో editor@pustakam.net కు ఈమెయిల్ చేయగలరు. – పుస్తకం.నెట్)
ంమన
దయ్యాలు వేదాలు వల్లించేలాగా ఉన్నాయి ఈ పుస్తకం డాట్ నెట్ వ్యాసాలు.
వల్లభ మంత్రి- విశ్వనాథ సత్యనారాయణ | పుస్తకం
[…] విశ్వనాథ వారి పుస్తకాలలో (ధర్మచక్రం, అశ్వమేధం, ఆరు నదులు,చందవోలు రాణి వగైరా) చాలా […]
Dr.R.P.Sharma
ఈ నవలను ఆన్ లైన్ లో ఇక్కడ
Prasad Charasala
రవి గారూ,
వావ్! మీ విశ్లేషణ అద్బుతం. నా కామన్ సెన్స్‌కు అందుంతోంది. కానీ విశ్వనాధ వాదము ఎంత నిష్పాక్షికంగా ఆలోచించినా నా కామన్ సెన్స్‌కు అందదు.
కొత్తపాళీ
మంచి చర్చ. ఈ చర్చకి తెరతీసినందుకైనా హేలీగారిని అభినందించాలి 🙂
ఇటీవలనే కాశ్మీర రాజవంశ నవలల్లో పాతిపెట్టిన నాణెములు, మిహిరకులుడు అనే రెండు చేదు మాత్రల్ని అతి కష్టమ్మీద మింగాను. కొన్నాళ్ళు విశ్వనాథకి దూరంగా ఉండదల్చుకున్నాను 🙂
కామేశ్వరరావు
రవిగారూ,
మీ ఆవేశమ్మీద నా వ్యాఖ్య నీళ్ళు చల్లలేదు కదా?! 🙂
>>”మతం – అనేది – అది ఏ మతమైనా సరే – దాని మూల ఉద్దేశ్యం ఆత్మ ఔన్నత్యం, ఆత్మావిష్కరణ అని నా ఉద్దేశ్యం.”
మీకు మతం మీద చాలా నమ్మకం ఉన్నట్టుంది 🙂 నాకు లేదు. లేదంటే ఏదో వ్యతిరేకమైన అబిప్రాయం/నమ్మకం అని కాదు. ఏ నమ్మకమూ లేదని.
>>”ఆత్మ ఔన్నత్యం ద్వారా సమాజ సంస్కరణ (inner to outer)”
హిందూ మతం యిలా uni-directional కాదని నా అభిప్రాయం. అంటే, ఆత్మౌన్నత్యం గురించి మాత్రమే పట్టించుకొని, ప్రతి వ్యక్తీ అత్మౌన్నత్యాన్ని పొందితే సమాజం దానంతట అదే ఉన్నతమవుతుంది అని చెప్పి ఊరుకోలేదు. సమాజం మొత్తం ఉన్నతిని సాధించడానికి దాని నిర్మాణం, నియమాలు వగైరా ఎలా ఉండాలన్న అంశాల గురించి కూడా చెపుతుంది. వ్యక్తిగా ఉన్నతిని సాధించాలన్నా, సమాజంతో ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం ఉండాలన్నది కూడా చెపుతుంది.
>>”’బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాऽపరః’ – స్పష్టంగా కనిపించేదేది, సమానత్వమే కదా?”
ఇదీ, మీరు ఉట్టంకించిన ఇంకో శ్లోకమూ, చెపుతున్నది బ్రహ్మ/ఆత్మ జ్ఞానం పొందిన స్థితి కదా. జగత్తంతా ఒకటే అనే స్థితికి చేరుకున్న తర్వాత అలా చేరుకున్నవాని దృష్టిలో అసమానతలు ఉండవు. అయితే ఆ స్థితికి ఎలా చేరడం? ఎవరు చేరగలరు? అనే ప్రశ్నలు వేసుకున్నప్పుడు, మనుషుల్లో తారతమ్యాలు కనిపిస్తాయి. హిందూ మతం ప్రకారం కొంతమంది ఆ స్థితిని వేగరం చేరుకోగలుగుతారు. చాలామంది చేరుకోనే లేరు (ఆ జన్మలో). ఈ స్థితిని చేరుకోడానికి వివిధ మార్గాలున్నాయి. కొంతమంది కొన్ని మార్గాలకే అర్హులు/తగినవారు. ఇలా ఎన్నో తేడాలు చెపుతోంది. ఇవన్నీ చాలావరకూ పుట్టుక చేత నిర్ణయింపబడేవే. ఎందుకంటే వీటికి మూలం కర్మ సిద్ధాంతం. పూర్వజన్మ కర్మ బట్టి పుట్టుక ఉంటుంది. ఆ పుట్టుక బట్టి వారికి కొన్ని ధర్మాలుంటాయి. ఇవి వ్యక్తిగత ధర్మాలే కాక కుటుంబంతో, సంఘంతో సంబంధం ఉన్నవే. కాబట్టి వీటన్నిటినీ మతం నుంచీ, మతం వెనకనున్న తత్త్వం నుంచీ వేరు చేయలేం. మూల తత్త్వంలోనే ఇవన్నీ ఉన్నాయి. సారం (goal) మీరు చెప్పిన సమానత్వమే. మీరే అన్నట్టు ఏ మతమైనా తాత్త్విక సిద్ధాంతమైనా బహుశా అదే చెపుతుంది. కాని దాన్ని సాధించే మార్గాలలోనూ, దాని కోసం తయారు చేసే సిద్ధాంతాలలోనే కదా తేడాలు. అంచేత ఏ మతాన్ని గురించైనా చర్చించేటప్పుడు ఆ తేడాల గురించే కదా చర్చించేది. సంఘాన్ని గురించీ, సంఘంలో అసమానతల గురించీ మాట్లాడేటప్పుడు బాహ్యదృష్టి తప్పనిసరి కదా!
రవి
>>మీ ఆవేశమ్మీద నా వ్యాఖ్య నీళ్ళు చల్లలేదు కదా?! 🙂
లేదు. 🙂
>>హిందూ మతం యిలా uni-directional కాదని నా అభిప్రాయం
అవును. మీరన్నది నిజమే. అయితే నా ఉద్దేశ్యంలో అంతిమ స్ఫూర్తి ఇదే, వ్యవహారం కొంచెం కాంప్లెక్స్ గా ఉన్నప్పటికీ. మీరన్న సమాజ నిర్మాణం, వ్యక్తికి సమాజానికి మధ్య అనుబంధం ఇవన్నీ అంతిమ
స్ఫూర్తికి దోహదకారులే తప్ప, వాటికి స్వతంత్ర ప్రతిపత్తి అన్నది లేదనుకుంటున్నాను. ఉదాహరణకు వర్ణవ్యవస్థ – వర్ణవ్యవస్థ కు utilitarian significance మాత్రమే ఉన్నది. ఇది అంతిమసత్యం ఎన్నటికీ
కాదు, దీనికి Self -Realization/Finding Truth/Knowing God ఏదైనా అనండి దానికి ప్రత్యక్ష (జన్య-జనక) సంబంధం లేదు అని నా విశ్వాసం. వర్ణవ్యవస్థను utilitarian perspetive తోనే చూడాలి
తప్ప, దానిని సత్యంగా స్వీకరించి, అంతిమ ప్రస్థానమైన self realization కు అనుసంధానించి ఉద్యోతించే వ్యాఖ్యానాలు అసమంజసం కావని ఎలా అనుకోవాలి?
మీరు వ్రాసిన చివరి పేరాగ్రాఫ్ – ముక్కలుగా విడగొట్టగలిగితే మరింత చక్కగా పరిశీలించవచ్చు.
ఆత్మజ్ఞాన స్థితి – అర్హత – సమాజం
౧. ఆత్మ జ్ఞానస్థితి – ఇది మతం కాకపోయినా వ్యక్తి తాలూకు అంతిమ ప్రస్థానం అని ఒప్పుకోవడంలో మీకు విప్రతిపత్తి లేదని అనుకుంటున్నాను. Also, Self Realization is a suprarational stuff
something that can be comprehendable with the mind. If self realization happens, then man can get rid of all existential dilemmas and can ever live with sat-chit-
aananda. విభేదించరనుకుంటాను.
౩. సమాజం – వ్యవస్థ అనేది survival కోసం కాక ఎందుకు ఏర్పడుతుందండి? ఒక ఆటవికుడు ఒంటరిగా తిరిగితే ఏ పులో వచ్చి తింటుంది కాబట్టి మరొకడితో కలిసి బతకటం అన్న ’అవసరం’
వచ్చిపడింది. అదే సూత్రం వేల రెట్లు multiply అయి – వ్యవస్థ అయింది. దీన్నే సమాజం అంటున్నాం. This is something shearly meant for survival in several dimentions. ఇక్కడ
moral code of conducts (పితృవాక్య పరిపాలన, ఎదుటి వ్యక్తులను గౌరవించటం, స్త్రీని గౌరవించటం, ఏక పత్నీవ్రతం వగైరా) ఏవైతే ఉన్నాయో అవి సమాజం సరిగ్గా మనగలగడానికి ఏర్పడిన
requirements. వీటివలన కాస్తో కూస్తో చిత్తశుద్ధి, మంచి నడవడిక, శీలం అనే enablers ఏర్పడతాయి, అయితే కేవలం సమాజనియమాలు sincere గా పాటించినంత మాత్రాన ఆత్మజ్ఞానస్థితి
కలుగుతుందని రూఢిగా చెప్పరు. జ్ఞాని (Self realized man) కాని వాడు సదా కర్మలను ఆచరించుచునే ఉండవలయును. అందుకే ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్టానం చేయమని – భగవద్గీత.
పై రెండూ వేరు. ఆ తేడానే జిడ్డు కృష్ణమూర్తి – A citizen is different from a human అని అంటున్నాడు.
(ఇంకా ఉంది)
రవి
౨. అర్హత
ఆ రెంటినీ ముడెట్టడానికి కర్మ సిద్ధాంతాన్ని తెచ్చిపెట్టారు. చాలా ఇబ్బందికరమైన situation. పబ్లిక్ ఫోరమ్ లో చర్చ. 🙂 పుస్తకాల ద్వారా కాక స్వయంగా ఆలోచించండి. ’కర్మ’ అంటే ఏమిటి? చేసే పనులా? కాదు. వాటి వెనుక ప్రేరణ. ఆ ప్రేరణ – అంటే desire – which will manifest in another form (పునర్జన్మ), అంతవరకూ కర్మసిద్ధాంతం అనేది బుద్ధికి అందుతూనే ఉంది.
ఇంకాస్త ముందుకు వెళితే …
నాలాంటి ఒకడికి తీవ్రమైన కోపం. వాడి desire ను తర్వాతి జన్మలో తీర్చుకోవడాన్ని ఒక program enable చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ ను మీరు కర్మ సిద్ధాంతం అంటున్నారు Any program deals with basic variables. ఇక్కడ ఆ variables ఏవి? – కామం, క్రోధం,
లోభం వగైరా. అంతే. అలాంటివి తీరకపోతే మరో జన్మను కర్మసిద్ధాంతం అనే program ఆ ఆత్మకు సంధానించి పంపుతుంది. ఆ ప్రోగ్రాం కు ఫలానా ఆత్మ indiaకు సంబంధించిందా, ఆఫ్రికాకు సంబంధించిందా, ఫలానా ఆత్మ ఏ మతం పాటిస్తుంది, దాని కులం ఏది, భాష ఏది, వంటివాటితో సంబంధమెందుకు ఉండాలి? (అసలు ఆత్మ అంటేనే అచ్ఛేద్యోయమచింత్యోయం… కదా?) రేప్పొద్దున ఏ కారణం చేతనైనా india అనేదే లేకపోతే కర్మసిద్ధాంతం ఉండదా? అంటే ఒక అలౌకిక, ఆధ్యాత్మిక సిద్ధాంతం మనగలగడానికి లౌకికమైన సమాజ మనుగడ కావాలా? This is something beyond the rational, and not comprehended with mind, and cannot simply one can believe or assume as correct.
ఇక్కడ విశ్వనాథ అభిప్రాయాలు చూద్దాం. ’ఆత్మలన్నీ ఒకటయినా ఉపాధులు వేరు. అందువల్లనే … …. వర్ణములు పుడుతున్నవి’. – దేవాలయ ప్రవేశార్హత గురించి చర్చిస్తూ వేయిపడగలు నవలలో. (గిరిక పాత్ర కూడా మంచి ఉదాహరణ) కర్మసిద్ధాంతం variables ను carry చేసే enabler కానీ, దానికి వర్ణాలతో సంబంధం ఎందుకు ఉండాలి? కామక్రోధాదులనే చిత్తవికల్పాలకు ఈ వర్ణాలతో సంబంధమేముంది? అసలు చిత్తవికల్పాలకు హిందూమతం, ఆ మాటకొస్తే మతంతోనే పనేముంది?
పోనీ విశ్వనాథ వాదం కరెక్ట్ అనుకుంటే దానికి సాక్ష్యం/ఆధారాలు ఎక్కడ? ఉపనిషత్తుల్లో చెప్పారా? ఆదిశంకరులు చెప్పారా అలాగని? పోనీ స్వీయ విశ్లేషణ అనుకుంటే – how that can be comprehended with mind? ఊరికే చెబితే ఆయన పండితుడు కాబట్టి నమ్మాలనేమున్నది? ద్రష్ట వేరు, పండితుడు వేఱు. 🙂
>> ఈ మనోనిర్మితమైన భేదము మత సంబంధమన్నచో ద్వేష్యమా?
ద్వేష్యము కాదు. అర్థరహితం, ఛాందసం. ఈ మనోనిర్మిత భేదము కేవలం అవసరమునకై ఏర్పడినది. దీనికినీ, అష్టావక్ర గీత, భగవద్గీతాదులు చెప్పిన మతము యొక్క అంతిమ ప్రస్థానము అయిన ఆత్మ జ్ఞానమునకునూ ఏ విధమైన సంబంధమున్నది? ఒకవేళ సంబంధమున్న, ఆ సంబంధమెట్టిదో చెప్పవలె, లేదా ఉపనిషదాది గ్రంథములలో ఋజువులు చూపవలె.
విశ్వనాథ పెళ్ళిని కూడా ఆత్మజ్ఞానానికి నేరుగా ముడిపెట్టి ప్రౌఢంగా వ్యాఖ్యానించాడు. ఇంకా అలానే అనేక విషయాలు. చాలా నవ్వు తెప్పించే విషయాలు ఉన్నాయి. ఒకచోట చెబుతాడు – చాకలి బట్టలుతికితే ’భావ’గత మాలిన్యం తొలగిపోతుందిట!!! ఇదేం చోద్యమండి? దీన్నే, ఈ ప్రౌఢత్వాన్ని, స్థూలంగా, ఆచారం, వర్ణం, ఈ ధోరణిలోనే మాట్లాడడాన్ని బాహ్య దృష్టి అంటున్నానండి. ఇది మతం తాలూకు ’తత్-త్వం’ కాదని నా ఉద్దేశ్యం.
ఇక చివరిగా మీరు చెప్పిన మెథడ్ కూ వద్దాం.
>>కొంతమంది కొన్ని మార్గాలకే అర్హులు/తగినవారు.
ఎలానో అనుసంధానించుకోలేకుండా ఉన్నాను.
Self realization is not a function of wit, intellect – ప్రత్యక్ష ఉదాహరణ – రామకృష్ణపరమహంస అనే అక్షరమ్ముక్క రాని పల్లెటూరి వ్యక్తి, పదవ తరగతి ఫెయిల్ అయిన జిడ్డు కృష్ణమూర్తి.
Self realization is not a function of varNa or the so called religion – ఉదాహరణ – ఓషో, ఇంకా వెతికితే చాలామంది.
భక్తి అంటారా? ఆ సాంప్రదాయం అన్ని కులాల్లో ఉంది. ఆముక్తమాల్యద – మాలదాసరి ఉన్నాడు. అతనొక ఆళ్వారు!
scriptures చాలా ఎక్కువై ఏది నిజం, ఏది ఎలా అన్వయించుకోవాలో తెలియకుండాపోవడం వల్ల వస్తున్న ఇబ్బందులు వల్ల దూరాన్వయాలను, ప్రౌఢత్వాన్ని, మహత్వంగా ఎంచటం పొఱబాటేమో.
VARAPRASAD
viswanadhavarni evaru gurthinckkarledu,nati nundi netivaraku prajale ayannu gurtincharu,dayachesi randranweshanamani ayana rachanalu andariki cherettu cheyandi,telugu bashaku manamchese upakaram ade.
manjari lakshmi
కామేశ్వర రవు గారు సమానత్వం గురించి చెప్పింది ఎవరైనా అంగీకరించవలసిన విషయం. విశ్వనాధ సత్యన్నారయన గారు సనాతన ధర్మాలను ఆచరించాలని చెప్పారు. ఆ ప్రకారం తక్కువ కులాల కన్న ఎక్కువ కులాలు, స్త్రీల కన్నా పురుషులూ ఎక్కువనీ, వాళ్ళకి ఈ సమాజంలో ఎక్కువ స్థానం ఇవ్వాలని ఒప్పుకోవాలి. కానీ వీటిని మారుస్తూ ఇప్పటికే ప్రభుత్వాలు సంస్కరణ వాదాన్ని చేపట్టాయి(చట్టాలు సరిగా అమలైనా కాక పోయినా). దీన్ని గూడా వెనక్కి తీసుకెళ్ళే విశ్వనాధ సత్యన్నారయన గారి భావాలను ప్రచారం చేయటం ఎందుకటా?
Halley
“ఆ ప్రకారం తక్కువ కులాల కన్న ఎక్కువ కులాలు, స్త్రీల కన్నా పురుషులూ ఎక్కువనీ, వాళ్ళకి ఈ సమాజంలో ఎక్కువ స్థానం ఇవ్వాలని ఒప్పుకోవాలి.”
మంజరి గారు ఈ విషయం మీద ఈ మధ్యన ఒక ఆర్టికల్ చదివాను మీకేమైనా పనికొస్తుందేమో చూడండి.
http://www.manushi.in/blog_content.php?blogid=49
“Those who insist on attributing our social ills to the shastras repeat the mistake of our colonial rulers. Just as a doctor can kill a patient through wrong diagnosis and treatment of the disease – no matter how benign the intention – in the same manner social reformers can wreak havoc on the people if their understanding of social ills is flawed “
Srinivas Vuruputuri
కామేశ్వరరావుగారు చెప్పిందే మళ్ళీ చెబుతున్నానేమో…
సమానత్వం గురించి విశ్వనాథ మాటలు చదవగానే – సందర్భ నిరపేక్షమైన కేవల సమానత్వం ఉంటుందా అనే అనుమానం కలిగింది. సంస్కర్తలు చెప్పే సమానత్వానికి చట్టం అందరికీ సమానంగా వర్తించడం, సమానావకాశాలు అందరికీ లభించేలా ప్రయత్నించడం, వివక్షను తొలగించడం – అలాంటిదేదో ఓ లక్ష్యముంటుంది కదా… శుద్ధ సమానత్వాన్ని సాధించడం అసాధ్యమనుకున్నా, పరిమిత లక్ష్యాలకు విలువ లేకుండా పోదు కదా.
అదలా ఉంచితే – మీరు రాసే పోస్టులు ఆలోచింప చేస్తాయి. ప్రత్యామ్నాయ జీవిత విధానాన్ని వెదుక్కుంటున్నట్లు, ఇంకా స్థిరాభిప్రాయాలను ఏర్పరచుకోనట్లూ ఉంటాయి. నిజాయితీగా, సరళంగా రాస్తారు మీరు.
కామేశ్వరరావు
>>ఈ విషయంలో నాతో ఏకీభవించని వాళ్ళు “post for post’s sake” అనుకోని వదిలేయండి.
మీ ఆలోచనలను మీరు చెప్పేసి వదిలేయమంటే ఎలా? 🙂 ఇది నిజంగా కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయమే. “పంచ్ డైలాగులు” కొట్టే సంస్కర్తల మాట పక్కన పడేసి, ఆయా సిద్ధాంతాల వెనకనున్న తర్కాన్నీ తత్త్వాన్నీ అర్థంచేసుకునే ప్రయత్నం చేస్తే కానీ యిది అంతు చిక్కదు. “సర్వ మానవ సమానత్వం” అన్నప్పుడు “సమానత్వం” అంటే ఏమిటన్నది స్పష్టంగా ముందు తెలియాలి. ప్రధానంగా, సంఘసంస్కరణ ప్రబోధించే మతమైనా సిద్ధాంతమైనా చెప్పేది “సాంఘిక సమానత్వం”. సాంఘిక సమానత్వం అంటే, కేవలం పుట్టుకని బట్టి సమాజమిచ్చే గౌరవంలో కాని, కట్టుబాట్లలో కాని ఎక్కువతక్కువలు ఉండకూడదు అనీ, సామర్థ్యం ఉన్నవాళ్ళందరికీ సమాన అవకాశాలు ఉండాలి అనీ. ఆర్థిక సమానత్వం (అంటే సమాజంలో అసలు ధనవంతులు పేదలు అనే వర్గాలే ఉండకూడన్నది) యీ పరిధిలోకి రాదు. కమ్యూనిస్టులు కోరుకొనేది సాంఘిక ఆర్థిక సమానత్వాలు రెండూను. “ఫ్రీ మార్కెట్టు” సిద్ధాంతం బోధించే “సమానత్వం” వేరు. అంచాత అందరినీ ఒకే గాటకి కట్టేసి, అందరూ చెప్పేది “సర్వమానవ సమానత్వం” అనుకుంటే మిగిలేది అయోమయమే.
ఇక రెండు, “సమానత్వాన్ని” బలంగా కోరుకొనే యే సిద్ధాంతమైనా, అది నూటికి నూరుపాళ్ళూ సమాజంలో సిద్ధిస్తుందని హామీ యివ్వలేదు. అలా సర్వ మానవ సమానత్వాన్ని సాధించలేనంత మాత్రాన, అసలు అది అవసరమే లేదనీ, దాని గురించి ప్రయత్నించాల్సిన అవసరమే లేదని నీళ్ళు వదిలేయడం తప్పని చెపుతుంది. తనకి తోచిన రీతిలో తనకు తోచిన అసమానతలను తొలగించేందుకు మార్గాలను చెపుతుంది.
మరి యీ విషయంలో హైందవ/సనాతన/వేద/… ధర్మం ఏమంటుంది?
మీ ఆలోచనలు చదివితే నాకనిపించింది – మీరు విశ్వనాథవారి వాదనకూ, సిద్ధాంతాలకూ “benefit of doubt” యిస్తున్నారని. అయితే దీనికి ముఖ్య కారణం మీకీనాటి వ్యవస్థపై ఉన్న అసంతృప్తే అనిపిస్తోంది. ఇందులో తప్పు లేదు. అయితే, వేరే సిద్ధాంతాలలోనూ వ్యవస్థల్లోనూ లోపాలను ఎవరైనా సరిగ్గా ఎత్తిచూపించినంత మాత్రాన, వాళ్ళు ప్రతిపాదించే/నమ్మే సిద్ధాంతం, వ్యవస్థా సరైనవి అయిపోవన్న విషయం మాత్రం గుర్తుంచుకుంటే మంచిది.
ఒకవైపు కొందరికి, భవిష్యత్తుపైన విపరీతమైన నమ్మకం. మరొకవైపు మరికొందరికి గతం మీద విపరీతమైన నమ్మకం. చిక్కల్లా యీ రెండూ కూడా వర్తమానానికి చాలా దూరం! నేనంటున్న ఆ రెండు వైపులూ ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పకరలేదనుకుంటాను.
Halley
“మీ ఆలోచనలను మీరు చెప్పేసి వదిలేయమంటే ఎలా?”
మీ లాగా శాంతంగా అభిప్రాయం పంచుకోగలిగిన వాళ్ళు ఎలాగూ పంచుకుంటారన్న నమ్మకంతోనే అలా రాసాను. ఇది చాలా సున్నితమైన విషయం, ఈ విషయాల పైన Militant భావాలూ ఉన్న వ్యక్తులని నేను ఎరుగుదును. ఆ Militant చర్చలు ఒకసారి మొదలయ్యాయి అంటే “సీమ సందుల్లోకి రారా చూసుకుందాం” అనే దాక వెళ్తాయి. అంత ఓపిక లేక అలా రాసాను అంతే .
లోపాలు వ్యవస్థాగతమైనవా కాదా అన్న విషయంలోనే చిక్కంతా వచ్చేది. దేన్నీ ప్రమాణంగా ఒప్పుకోను , దీనిలోని మంచి ఇది దానిలోని చెడు ఇది అంతకు మించి నన్నేమి అడక్కండి అని అంటూ పోతే అసలు ప్రమాణమే ఉండదు. అదొకరకం Agnosticism.
ఎప్పటికప్పుడు ఏది మంచిదనిపిస్తే అది చేయాలి అన్న వాదనతోనే సమస్యల్లా. మార్పు కావాలి మార్పు కావాలి అనుకుంటూ అన్నీ మారుతూనే ఉండాలి అంటే నేను ఏమి అనలేను. మారనివి కొన్ని ఉండాలి. ఆ పునాది రాళ్ళపై ఎన్ని కట్టడాలన్నా కట్టుకోవాలి. పూటకోసారి పునాది రాళ్ళని పెకిలించి కొత్త పునాదులు వేసి సరికొత్త కట్టడాలు కడతా అనుకోటం బోలెడు టైము వేస్టు ఎనర్జీ వేస్టు అని నా భావన. వంట చేయలేక recipeని తిట్టుకునట్టు ఉంది నాకైతే.
“మరి యీ విషయంలో హైందవ/సనాతన/వేద/… ధర్మం ఏమంటుంది?”
– ఏమోనండి నాకు తెలియదు. నాకు అంత పాండిత్యము లేదు.
ఇక “Benefit of doubt” విషయానికి వస్తే. ఒక వస్తువుని ‘ఇది పాతది, కాలం చెల్లినది, పనికి రానిది’ అనుకోని ఎవరైనా చెత్తబుట్టలో పడేసి చాలా రోజుల తర్వాత ఆ వస్తువు యొక్క విశిష్టత తెల్సుకుంటే ఒక పశ్చాతాప భావన ఉంటుంది . నా విషయంలో ఉన్నది అది . కాబట్టి “benefit of doubt” కంటే “benefit of guilt” అనుకోండి.
ఇంక సంఘ సంస్కర్తలని అందరిని ఒకే గాటున ఎందుకు కట్టానో మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తోస్తే తప్పక తిరిగి వచ్చి కామెంటు చేస్తాను. మీరు చెప్పినవి పై పైన తేడాలే అని నా భావన. మన దేశానికి సంబంధించి నంత వరకు ఆ సంస్కర్తలందరికీ ఒకటే శత్రువు అన్నది నా అభిప్రాయం.
Kamakshi
ఒకవైపు కొందరికి, భవిష్యత్తుపైన విపరీతమైన నమ్మకం. మరొకవైపు మరికొందరికి గతం మీద విపరీతమైన నమ్మకం. చిక్కల్లా యీ రెండూ కూడా వర్తమానానికి చాలా దూరం! నేనంటున్న ఆ రెండు వైపులూ ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పకరలేదనుకుంటాను.
-> అంటే ఒకదాని నుండీ దూరాముగా వచ్చాము. ఇంకొక దానికి దూరముగా వున్నాము. రెండూ సమానమయిన దూరములేనా అన్నది ఒక ప్రశ్న. సమానమే అయినా వచ్చిన చోటు పై నమ్మకం అసలు వెళ్ళని చోటుపై నమ్మకం కన్నా తెలివైనదేమోనన్నది మరో ఆలోచన.
రవి
హాలీ గారు చెబుతున్న militant బహుశా నేనే కావచ్చు. 🙂
నేను నిన్ననే నా వ్యాఖ్య పెడదామనుకున్నాను. దాన్ని కుదించి, కామేశ్వరరావు గారి ప్రశ్న కు నా అభిప్రాయం చెబుతున్నాను.
>>మహారాజు బౌద్ధుడు. వాని గుర్రపు వాడు బౌద్ధుడు..
పై వాక్యం ద్వారా – బౌద్ధం సమానత్వాన్ని గురించి చెబుతుంది కాబట్టి, మహారాజు బౌద్ధం పాటిస్తూ, సమానత్వాన్ని పాటించడు కాబట్టి, బౌద్ధం తప్పు, హిందూ మతం బౌద్ధంకన్నా ఉన్నతమైనది అని విశ్వనాథ సత్యనారాయణ అభిప్రాయమని నాకనిపించింది. నిజంగా ఆయన అభిప్రాయం ఇదే అయితే – అందులో లొసుగులు చాలా ఉన్నాయి. అది స్పష్టంగా తెలియాలంటే బుద్ధబోధ తాలూకు సమానత్వం (ఈ విషయమై పృథక్ జనత్వం అనే శబ్దం బౌద్ధంలో కనిపిస్తుంది) వెనుక ఉద్దేశ్యాలని, వాటి వెనుక ఉన్న ధ్యానప్రేరణను, ఇంకా స్థూలంగా కనిపించే మతాన్ని, దాని మూలకందమైన బోధసారాంశాన్ని సూక్ష్మంగా వివేచించాల్సి ఉంటుంది. ఎలానూ అది నిరుపయోగం కాబట్టి దాని జోలికి నేను వెళ్ళదల్చుకోలేదు.
ఇక ఇక్కడ వ్యాఖ్యానించడానికి సాకు ఇది.
>>మరి యీ విషయంలో హైందవ/సనాతన/వేద/… ధర్మం ఏమంటుంది?
మతం – అనేది – అది ఏ మతమైనా సరే – దాని మూల ఉద్దేశ్యం ఆత్మ ఔన్నత్యం, ఆత్మావిష్కరణ అని నా ఉద్దేశ్యం. తత్త్వమసి అన్నా, ఆత్మదీపోభవ అన్నా, అన అల్ హఖ్ అన్నా, I am the Gate అన్నా ఏ మతం తాలూకు మూల సారాంశాన్ని తీసుకున్నా అది Self-Realization కు ఉద్దేశించబడిందనే తోస్తుంది. విభిన్నత ఎక్కడంటే ఆ Realization కు దోహదపడే పద్ధతుల దగ్గర. ఆ పద్ధతులే ఆయా మతాల ద్వారా ప్రపంచానికి అందజేయబడిన అమూల్యమైన విషయాలు. హిందూమతం ద్వారా యోగా, బౌద్ధం, తావో ద్వారా విపశ్యన (Passive awareness), సూఫీల ద్వారా ఆత్మార్పణం, క్రీస్తు ద్వారా Compassion ఇలా.
ఆత్మ ఔన్నత్యం ద్వారా సమాజ సంస్కరణ (inner to outer) కాక, సమాజం ద్వారా వ్యక్తి ఉద్ధరణ (outer to inner) ను ‘ఇజం’ అంటున్నాం. Capitalism, Communism, Confucianism 🙂 etc..
ఇప్పుడు మీరడిగిన ప్రశ్న – వేద/హైందవ/సనాతన మతం అసమానత విషయంలో ఏమంటుంది.
మూలకందమైన మతం ’అసమానత’ ను పరిగణనలోకే తీసుకోదని నా ఉద్దేశ్యం. ఎందుకంటే సూక్ష్మస్థాయిలో మతం తాలూకు ఉద్దేశ్యం ఆత్మౌన్నత్యమే తప్ప ఒక moral code of conduct ను నిర్వచించటం కాదు కాబట్టి. ఉన్నదంతా సమానత్వమే. ’బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాऽపరః’ – స్పష్టంగా కనిపించేదేది, సమానత్వమే కదా?
న త్వం విప్రాదికో వర్ణో నా శ్రమీ నాక్షగోచరః |
అసంగోऽసి నిరాకారో విశ్వసాక్షీ సుఖీ భవ ||
(నువ్వు బ్రాహ్మడివి కావు, శూద్రుడివి కావు, స్థూలంగా కంటికి కనిపించే వాడివి కావు, నిరాకారుడివి, నిస్సంగుడివి, విశ్వ సాక్షివి అయి సుఖించు) – అష్టావక్రుడు జనకునికి ఆత్మ స్వరూపం చెబుతూ అంటాడు. ఉపనిషత్తులలోనూ ఇలాంటి బోధలు కనిపిస్తాయి.
మతం విషయంలో విశ్వనాథ దృక్కోణం స్థూలము, బాహ్యమూ కూడా. ఆచారాలను, వర్ణవ్యవస్థను, కర్మకాండను, పెళ్ళి ఇత్యాది తంతులను విశ్వనాథ ’మతం’ తాలూకు సారాంశంగా ఎంచి అవి ఎలా గొప్ప విషయాలో వివేచించడం ఆయన విశ్లేషణల్లో చాలాచోట్ల నాకు కనిపించింది. ఇది ’తప్పు’ కాకపోవచ్చు కానీ, ఇదే ’మతం’, దాని మూలసూత్రాల సారాంశం అని అనుకోమంటే మాత్రం విభేదించాలనిపిస్తుంది. కొండొకచో నా లాంటి ఆవేశపరులకు కోపమూ వచ్చి తగులుకుంటుంది. 🙂
nagamurali
రవి:
>>మతం – అనేది – అది ఏ మతమైనా సరే – దాని మూల ఉద్దేశ్యం ఆత్మ ఔన్నత్యం, ఆత్మావిష్కరణ అని నా ఉద్దేశ్యం.
మీరన్న ఈ పైమాట వేదాంతానికి వర్తిస్తుంది కానీ, మతానికి కాదు. మనిషి ఏదో ఒక అధిభౌతిక ప్రపంచానికి అనుగుణంగా జీవించడానికో, దాన్ని చేరుకోడానికో కావలసిన మార్గాన్ని మాత్రమే మతం చెప్తుంది ప్రధానంగా. వేదాంతానికి ఆధునిక కాలంలో ప్రచారం ఎక్కువై అదే మతం అని మనలాంటి వాళ్ళం పొరపడుతున్నాం.
సనాతనత్వం మీద గట్టి అభిమానం కలవాళ్ళకి ప్రధానమైనది వేదాంతమొక్కటే కాదు, సనాతనమైనదని వాళ్ళకి అనిపించే సంస్కృతి యావత్తూను.
(ఈమధ్య ఒక గొప్ప వేదాంతితో సంభాషించే అవకాశం కలిగింది లెండి. త్రైగుణ్య విషయాః వేదాః అని గీతలో ఎందుకన్నారని అడిగేను.)
రవి
నాగమురళి గారు:
>>మార్గాన్ని మాత్రమే మతం చెప్తుంది ప్రధానంగా
నాకు అనేక నిర్వచనాల మీద, పాండిత్యాల మీదకన్నా మౌలికభావాల మీదనే మోజండి. 🙂
నా ఆలోచనలివి.
నేను బయట కోఠీకెళ్ళాలి. స్టాండులో నిలబడ్డాను. ’బస్సు’ వచ్చింది. బస్సు అంటే – కోఠీకి నన్ను తీసికెళ్ళే ఒక ఉపకరణం. అంతే. దాన్ని ’ఏరోప్లేన్’ అన్నా నాకు అభ్యంతరం ఉండదు. It does not matter about the components like power brakes, engine, seating capacity, runs with diesel/petrol etc etc ….
So, an ‘Object’ is defined by ‘Objective’. period.
ఒకడున్నాడు. వాడు చచ్చేవరకూ ఏదో చెబుతూ ఉన్నాడు. చచ్చే ముందు వాణ్ణి అడిగారు, ’ఒరే, నీ బోధలన్నీ కలిపి ఒక్కమాటలో చెప్పరా’. అని. వాడన్నాడు – ’ఆత్మదీపో భవ!’. నిన్ను నువ్వు వెలిగించుకో. period. That is the objective from which a huge volume of flux has emanated. This flux is not the matter, though it appears to be. కాషాయం కట్టుకుంటాడా, పెళ్ళాంతో కాపురం చేస్తాడా, సమానత్వం, అహింస, జందెం వేసుకుంటాడా, వేసుకోడా, ఇవన్నీ తర్వాత. The ultimate objective is ‘ఆత్మ దీపో భవ’. అదే మతమని నా మతం. Flux is just enabler. An enabler is meant for the survival of the original objective. That is not the objective itself. Flux తాలూకు విషయాలు మాట్లాడినా కూడా అది ultimate objective కు coherent గానే ఉండాలి. ఉండి తీరాలి.
ఇది ’వేదాంతం’ అంటే ఏమో మరి తెలీదండి.:))
SIVARAMAPRASAD KAPPAGANTU
(వ్యాసానికి జతచేసిన చిత్రం విశ్వనాథ వారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రభ దినపత్రికలో 2011లో వచ్చిన వ్యాసంలోనిది. వ్యాసం లంకె ఇక్కడ. ఒకవేళ ఇది కాపీహక్కుల క్రిందకి వచ్చే చిత్రం అయిన పక్షంలో editor@pustakam.net కు ఈమెయిల్ చేయగలరు. – పుస్తకం.నెట్)
I feel that when you are writing review, you can quote parts from the content being reviewed. Further, the picture posted by Andhra Prabha may not be their property unless their staff aftist as part of his Official duty drawn it. The original source of the picture has to be informed by those who first published it.
SIVARAMAPRASAD KAPPAGANTU
“…అందరూ సమానులని చెప్పెడి ఏ సంఘమునందయిన నేదేశమునందైనను బరిస్థితి ఇదియే”. ఇదే విషయం గురించి “ఈ మనోనిర్మితమైన భేదము మత సంబంధమన్నచో ద్వేషమా? లౌకికములయిన ధనాధికారముల విషయమయినపుడు స్వీకార్యమా?….”
విశ్వనాథ వారు అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు పాత కులాలు పోయి కొత్త కులాలు వచ్చాయి అంతే. కలెక్టరాఫీసులో పనిచేసే గుమాస్తా కొడుకుకి, కలెక్టరు తన కూతురుని ఇచ్చి పెళ్ళిచేస్తాడా. చేస్తాడేమో బహుశా ఆ కుర్రాడు ఐ ఎ ఎస్ పాసయ్యి అప్పటికే కలెక్టరయ్యి ఉంటే. లేని పక్షంలో ఏమి చేస్తాడు అందరికీ తెలిసినదేదే. సినిమాల్లో జరిగినట్టు నిజ జీవితం లో జరగదు కదా. ఎవరు ఏమనుకున్నా సరే, వెర్రిగా విరుచుకుపడినా సరే, విశ్వనాథ వారిని విమర్శించాలనుకునే వారు, వాదనకు కాకుండా ఆయన చెప్పే విషయం శాంతంగా చదివి ముఖ్యంగా అర్ధం చేసుకుని ఆ విమర్శ చేసే ప్రయత్నం చెయ్యగలిగితే విమర్శ చెయ్యాల్సిన అవసరమే ఉండదని నా అభిప్రాయం.
VARAPRASAD
viswanatha satyanarayana,,veyipadagalu,, a” brand name” for telugu basha,edo kalakshepaniki chese vimarsalu ilanti goppavari rachanalaku apadinchakandi,samakaleena rachanalapina cheyandi,gatinchina vybhavam,marala dorakani madura smrutulu ,vari rachanalu,, janajeevana sravanthilo mamekamina vari rachanalanu vakreekarinchakandi,,,manasu badhagaundi………prasad