తెలుగు భాష – తానా సేవ
(ఈ వ్యాసం కొన్ని మార్పులతో డిసెంబర్ 2012 తెలుగువెలుగు సంచికలో ప్రచురించబడింది.)
************
అమెరికాలో తెలుగువారు తగుసంఖ్యలో స్థిరపడటం మొదలు బెడుతున్న రోజుల్లో, అంటే 1970లలో, చాలా నగరాల్లో తెలుగు సంఘాలను ఏర్పరచుకోవటం మొదలుబెట్టారు. అమెరికా అంతటా చెదురుమదురుగా ఉన్న తెలుగువారినీ, తెలుగు సంఘాల్నీ ఒక చోట చేర్చటానికి 1977లో న్యూయార్క్ నగరంలో డా. గుత్తికొండ రవీంద్రనాథ్, డా. కాకర్ల సుబ్బారావుల నాయకత్వంలో ఉత్తర అమెరికా తెలుగు మహాసభలు జరిగాయి. ఆ మహాసభలకు వచ్చిన తెలుగువారంతా అమెరికాలో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షించుకోవటం, వ్యాప్తి చేయటం ఆశయాలుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘాన్ని (ఆంగ్లంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, సంక్షిప్తంగా TANA – తానా) తమకోసం ఏర్పాటు చేసుకున్నారు.
మొదటనుంచీ తానా ఆశయాలు భాష, సాహిత్యం, సంస్కృతులతో ముడిపడి ఉన్నాయి. అమెరికాలో తెలుగు భాష నేర్చుకోవటానికి వీలు కల్పించడం, తెలుగు సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం, తెలుగు సాహిత్య వ్యాప్తికి సహకరించడం సంస్థకు ముఖ్యమైన ఆశయాలుగా తానా సంస్థాపక సూత్రాల్లోనూ, రాజ్యాంగంలోనూ స్పష్టంగా నిర్వచించబడ్డాయి. సంస్థ ప్రారంభంనుంచి తానా ఈ ఆశయాలను సాధించడానికి నిరంతరంగా, బహుముఖాలుగా కృషి చేస్తూనే ఉంది. ఆ కృషిలో కొన్ని ముఖ్యాంశాల్ని కొన్నిటిని ఇక్కడ పరిచయం చేస్తాను.
తెలుగు భాషా బోధన
అమెరికాలో విశ్వవిద్యాలయ స్థాయిలో తెలుగు నేర్పటానికీ, తెలుగుభాషలో పరిశోధనలు జరగటానికీ, అనువైన వాతావరణం కల్పించటానికి తానా కృషి చేస్తుంది. పూర్వం విస్కాన్సిన్ (మాడిసన్) విశ్వవిద్యాలయంలో తెలుగు క్లాసులు నడుస్తున్న రోజుల్లో, తెలుగు నేర్చుకుందామని ముందుకు వచ్చిన విద్యార్థులకు తానా ఫౌండేషన్ ఉపకారవేతనాలు ఇచ్చేది. తర్వాత మిచిగన్ (యాన్ ఆర్బర్) విశ్వవిద్యాలయంలో ఐదేళ్ళపాటు తెలుగు నేర్పే అధ్యాపకులకు వేతనం ఇవ్వడానికి తానా నిధులు సమకూర్చింది. గత ఆరేళ్ళుగా ఆస్టిన్ నగరంలో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయంలో తెలుగు తరగతులు నిర్వహించటానికీ, అధ్యాపకుల వేతనాలకీ తానా నిధులు సమకూరుస్తూ ఉంది. ఏటా చాలామంది విద్యార్థులు ఇక్కడ తెలుగు నేర్చుకుంటున్నారు. వీరిలో భారతసంతతివారే కాక, విభిన్న నేపథ్యాలనుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు.
ప్రాథమిక స్థాయిలో తెలుగు నేర్చుకునేవారి కోసం బాపు-రమణలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం తయారు చేసిన వీడియో పాఠాలను, తానా 1990-93 మధ్యలో సభ్యులకు సరఫరా చేసింది. తానాపత్రికలో తెలుగు పాఠాలు ప్రచురించటమే కాక, తెలుగు నేర్చుకోవడానికి బొమ్మల అక్షరాల పుస్తకాలను కూడా సభ్యులకు అందజేసింది. పిల్లల తెలుగు జ్ఞానాన్ని పెంపొందించటం కోసం 2003నుంచి తెలుగు పద విజ్ఞాన పోటీలను వివిధ నగరాలలోనూ, ద్వైవార్షిక సమావేశాలలోనూ తానా నిర్వహిస్తుంది. ఇప్పుడు తెలుగు పాఠాలు నేర్చుకోవడానికి వీలయ్యే వర్క్‌బుక్స్‌ను ప్రచురించటానికి, బాలలలో తెలుగుపై ఆసక్తి పెంచటానికి ప్రత్యేకంగా నాణ్యతగల పిల్లల తెలుగు పుస్తకాలు ప్రచురించటానికి తానా సన్నాహాలు చేస్తూంది.
తానా సమావేశాల్లో సాహిత్యసభలు
తొలిరోజులనుంచి తానా సమావేశాల్లో సాహిత్యాభిమానులకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయటం జరుగుతూంది. 1980లో చికాగోలో జరిగిన మూడవ సమావేశానికి మహాకవి శ్రీశ్రీ, దాశరథి, సి.నారాయణ రెడ్డి, మల్లెమాల (ఎం.ఎస్. రెడ్డి), త్రిపురనేని మహారథి వంటి కవులు, రచయితలు ప్రత్యేక అతిథులుగా రావటంతో సమావేశ ప్రారంభోత్సవం కవిసమ్మేళనంలా అనిపించింది. అప్పటినుంచి ఇప్పటివరకు వందలాది రచయితలు తానా కార్యక్రమాలకు అతిథులుగా వచ్చారు. ఆరుద్ర, కాళీపట్నం రామారావు, మధురాంతకం రాజారాం, పి.కృష్ణారెడ్డి, స్మైల్, జగ్గయ్య, ఓల్గా, జయప్రభ, కాత్యాయనీ విద్మహే, మృణాళిని, గొల్లపూడి మారుతీరావు, కె. శివారెడ్డి, నవీన్, పాపినేని శివశంకర్, చంద్రలత, సూర్యదేవర రామ్మోహనరావు, ముదిగొండ శివప్రసాద్, నవోదయా రామ్మోహనరావు, కడియాల రామ్మోహనరాయ్, నాగభైరవ కోటేశ్వరరావు, యార్లగడ్డ బాలగంగాధర్రావు, వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్‌తేజ, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అక్కిరాజు సుందరరామకృష్ణ, ప్రసాదరాయ కులపతి, యేలూరిపాటి అనంతరామయ్య , ఐ. వెంకట్రావు, ఆర్. ఉమామహేశ్వరరావు, సోమరాజు సుశీల వంటి ప్రసిద్ధ రచయితలు, కవులు, పండితులు, విమర్శకులు, ప్రచురణకర్తలు, సాహితీవేత్తలు, పాత్రికేయులు తానా మహాసభల సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రముఖ రచయిత, పరిశోధకుడు, విమర్శకుడు, అనువాదకుడు, తెలుగు బోధకుడు ఆచార్య వెల్చేరు నారాయణరావును 2007లో తానా జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. 2011లో బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ గొల్లపూడి మారుతీరావును తానా ప్రత్యేక పురస్కారంతో గౌరవించింది.
అవధాన హేల
1989లో తానా సమావేశాలకు ప్రత్యేక అతిథిగా వచ్చిన శ్రీ మేడసాని మోహన్ అష్టావధానాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల మెప్పును పొందారు. అప్పటినుంచి ప్రతి తానా సమావేశంలోనూ సాహితీప్రియులనుంచి అత్యాదరణ పొందే ప్రక్రియ అవధానమే. సమావేశ స్థలంలో అన్నిటికన్నా పెద్ద బాల్ రూమ్ లో వేయికిపైగా ప్రేక్షకులు అవధానాన్ని అవధరించటానికి ఏర్పాట్లు చేస్తుంటారు. మోహన్‌గారే కాక మాడుగుల నాగఫణిశర్మ, గరికపాటి నరసింహారావు, రాళ్ళబండి కవితాప్రసాద్, ఇతర అవధానులు విడివిడిగానూ, కలివిడిగానూ తమ విద్యను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అవధానాలతో పాటు, భువనవిజయం, ఆగతానికి స్వాగతం వంటి సాహిత్య రూపకాలు కూడా తానా సమావేశాలలో మంచి ప్రేక్షకాదరణ పొందాయి.
తానా సభల్లో తెలుగు పుస్తకాలు
తానా మహాసభల సందర్భంగా ప్రత్యేకంగా తెలుగు పుస్తకాలు ప్రచురించి, ఆవిష్కరించటం ఒక ఆనవాయితీ. 1991 అట్లాంటా సమావేశం సందర్భంగా ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర రెండో ప్రచురణ ఆవిష్కరించారు. 1993లో న్యూయార్క్ సభల సందర్భంగా తానా ప్రచురించిన, తానా తెలుగు కథ (సంపాదకుడు – ఏ.ఎస్.మూర్తి), మంచుతునకలు (సంపాదకుడు – పెమ్మరాజు వేణుగోపాలరావు) కవితాసంకలనాలు చాలా ప్రశంసలు పొందాయి. అప్పుడే తానా ప్రత్యేకంగా ప్రచురించిన కాళీపట్నం రామారావుగారి యజ్ఞంతో తొమ్మిది కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు రావడం తానాకు గర్వకారణం.
1995 చికాగో సమావేశంలో తానా బాపు-రమణల స్వర్ణోత్సవం జరిపిన సందర్భంలో వారిద్దరి మొదటి ప్రచురణల గుర్తుగా బొమ్మా-బొరుసు అనే పుస్తకాన్ని ప్రత్యేకంగా ప్రచురించారు. ఆ సమావేశానికి కీలకోపాన్యాసకుడుగా వచ్చిన శ్రీ కొంగర జగ్గయ్య తన గీతాంజలి అనువాదాన్ని ఆవిష్కరిస్తే, ఇంకో గౌరవ అతిథి శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తన ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇదే సందర్భంలో భమిడిపాటి రామగోపాలం బాపురమణలకు నూటపదహార్లు అంటూ ప్రచురించిన సరదా కథలు, స్మైల్ ఖాళీ సీసాలు కథాసంకలనం, కె. సదాశివరావు క్రాస్ రోడ్స్ కథాసంకలనం ప్రచురించబడ్డాయి. ఇలా తానా సమావేశాల సందర్భంగా ప్రత్యేకంగా ప్రచురించి ఆవిష్కరించిన పుస్తకాల జాబితా చాలా పెద్దదే.
2001 తానా సమావేశాలో ప్రదర్శన కోసమే ప్రత్యేకంగా ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఆగతానికి స్వాగతం అనే ప్రత్యేక సాహితీ చరిత్రాత్మక రూపకాన్ని రచించారు. 2009 సమావేశ ఆరంభ నృత్యం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన సాంకేతిక వికాసం, సాంస్కృతిక విన్యాసం గేయరూపకం అపూర్వమైన ప్రశంసలు పొందింది.
తెలుగు పలుకు: తానా సామావేశాల జ్ఞాపికలు (సావెనీర్లు)
1977 నుంచీ ప్రతి తానా సమావేశానికి, తెలుగు పలుకు అన్న పేరుతో ఒక సావనీరును ప్రచురించటం సంప్రదాయం. సమావేశం వివరాలు, అమెరికా అంధ్రుల రచనలు, సావెనీరుకోసం ఇండియా నుంచి తెప్పించుకున్న ప్రత్యేకరచనలతో సర్వాంగసుందరంగా తయారయ్యే ఈ ప్రత్యేక సంచికలు నిజంగా దాచుకోదగ్గవి. మొదట్లో ఈ సావెనీర్లను ఇండియాలో అచ్చు వేయించేవారు. తర్వాత ఇండియాలో కంపోజ్ చేయించి అమెరికాలోనే ప్రింట్ చేయించటం మొదలైంది. 1991లో రవి శర్మ సంపాదకత్వంలో తొలిసారిగా సావనీర్లో కొంత భాగాన్ని కొత్తగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఉపయోగించి అమెరికాలోనే కంపోజ్ చేశారు. 1995లో నా సంపాదకత్వంలో వచ్చిన సావెనీరు మొత్తం చికాగోలోనే కంపోజ్ చేసి ముద్రించాము. ఈ ఒరవడి కొన్నాళ్ళు సాగింది కానీ, ఇప్పుడు ఇండియాలో డిటిపి, పేజ్ మేకప్ చేయించుకుని, ఇంటర్నెట్లో ఫైళ్ళు తెప్పించుకుని అమెరికాలో ముద్రించడం జరుగుతుంది. కొన్ని తానా సావెనీర్లు ప్రత్యేకాంశాల మీద దృష్టి పెట్టి తగిన వ్యాసాలు వ్రాయించి, సేకరించి, సమీకరించటం వల్ల (ఉదాహరణకు 1995, 2009 సావెనీర్లలో ఆంధ్రుల చిత్రకళపై వ్యాసాలు, చిత్రాలు) ఆ విషయాలపై ఆసక్తి ఉన్నవారు సేకరించి దాచుకొనే స్థాయిలో ఉంటాయి.
తానాపత్రిక
తానా సంస్థాగత విషయాలను సభ్యులకు చేర్చటంకోసం ఏర్పాటు చేసుకున్న పత్రిక తానాపత్రిక. ఈ పేరు పెట్టింది అప్పటి సంపాదకులు స్వర్గీయ కిడాంబి రఘునాథ్. 1989 వరకు పత్రిక అప్పుడప్పుడూ వచ్చేది. నల్లమోతు సత్యనారాయణ గారు తానా అధ్యక్షులుగా ఉన్నప్పుడు పత్రికను శ్రీ చెరుకుపల్లి నెహ్రూ సంపాదకత్వంలో ప్రతి నెలా ప్రచురించటం మొదలుబెట్టి సంస్థను సభ్యులకు దగ్గరగా తెచ్చారు. 1993లో యలవర్తి రామరాజభూషణుడు, నేను సంపాదకులుగా ఉన్నప్పుడు పత్రికలో సంస్థాగత విషయాలతోపాటు, సాహిత్య సాంస్కృతిక విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి, పత్రికను అందంగా తయారుచేయడంతో పత్రికకు ఆదరణ బాగా పెరిగింది. 1993 నుంచి 2004 వరకూ (కొద్ది విరామంతో) పత్రికకు సంపాదకునిగా పనిచేసే అవకాశం నాకు కలిగింది. ఇప్పటి సాంకేతిక వనరులు ఆరోజుల్లో లేకపోయినా, అందంగా, ఆకర్షణీయంగా పత్రికను తీర్చిదిద్దటంలో, పాఠకులకు ఆసక్తి కలిగించడంలో కృతకృత్యులయ్యామనే భావిస్తాను. వంగూరి చిట్టెన్‌రాజు, కన్నెగంటి చంద్రశేఖర్ వివిధ దశలలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. గత అయిదేళ్ళుగా శ్రీ కిరణ్‌ప్రభ సంపాదకులుగా ఉంటున్నారు. ప్రస్తుతం తానాపత్రిక అచ్చుపత్రిక నుంచి ఎలక్ట్రానిక్ పత్రికగా మారుతుంది.
తానా నవలల, కథల పోటీలు
ఇండియాలో పత్రికలతో కలసి తానా కథలపోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వటం ఎప్పటినుంచో ఉంది. తెలుగు సాహితీరంగంలో పెనుమార్పులు వచ్చి, సరైన ప్రోత్సాహం, ప్రచురించే మార్గాలు లేక నాణ్యత గల నవలలు మృగ్యమైపోతున్న సమయంలో నవలా రచనను ప్రోత్సహించే ఉద్దేశంతో, 1997 లాస్ ఏంజెల్స్ తానా సమావేశం సందర్భంగా మూడువేల డాలర్లు (అప్పట్లో లక్షా ఇరవై వేల రూపాయలు) బహుమతితో నవలల పోటీ నిర్వహించటానికి శ్రీ మురళి చందూరి తలపెట్టారు. ఆహ్వానం పత్రిక సహకారంతో నడిపిన ఈ పోటీకి మురళిగారితోపాటు, నేను, కనకప్రసాద్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాము. శ్రీమతి చంద్రలత వ్రాసిన నవల రేగడివిత్తులు ఆ సంవత్సరం బహుమతిని గెల్చుకొంది. ఆ నవల, బహుమతి మొత్తం రెండూ పెద్ద సంచలనమే సృష్టించాయి.
మొదటి నవలలపోటీ జయప్రదం కావడంతో 1999, 2001, 2003, 2005 సమావేశాల వరకు నా ఆధ్వర్యంలో తానా ప్రచురణ కమిటీ తరపున నవలలు, కథల పోటీలు నిర్వహించాము. స్వాతి పత్రిక, కథాసాహితి సంస్థ ఈ పోటీలు నిర్వహించటంలో సహాయం చేశాయి. తెలుగునాట ప్రసిద్ధ రచయితల్లో చాలామంది ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీ కాశీభట్ల వేణుగోపాల్ వ్రాసిన తపన నవలకు 1999లో లక్షరూపాయల బహుమతి లభించింది. కాలక్రమేణా ఇండియాలోనూ పెద్ద ప్రైజు మొత్తాలతో పోటీలు నిర్వహింపబడటం, తానా నిర్ణయించుకొన్న ప్రమాణాల స్థాయి రచనలు రాకపోవడం వంటి కారణాల వల్ల ఈ పోటీలను ప్రస్తుతానికి నిలపివేసి, ఆ స్థానంలో ఇతర సాహిత్య కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నాము.
తానా ప్రచురణల కమిటీ
1997లో నేను తానా ప్రచురణల కమిటీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి, తెలుగు సాహిత్య విస్తరణకు ప్రోత్సాహం ఇచ్చే అనేక కార్యక్రమాలను కమిటీ తరపున చేపట్టాము.
కథ వార్షిక సంపుటాలు: తెలుగులో ప్రతి సంవత్సరం వచ్చే ఉత్తమకథలను ఎంపిక చేసి వార్షిక సంపుటాలుగా ప్రచురిస్తున్న కథాసాహితీ సంస్థకు గత పదమూడేళ్ళుగా ప్రతి సంవత్సరం తానా ప్రచురణల కమిటీ ఆర్థిక సహకారాన్నందిస్తుంది. ఈ సహాయంతో తెలుగులో మంచి కథలను ప్రతి సంవత్సరమూ గుర్తించి భద్రపరచటమే కాక ఈ కథాసంపుటాలను తక్కువ ధరలో ఎక్కువమంది పాఠకులు అందుకోగలుగుతున్నారు. 1999-2009 సంవత్సరాల మధ్య తెలుగులో వచ్చిన 30 ఉత్తమ కథలను ఎంపిక చేసిన రెండు దశాబ్దాలు కథాసంకలనం ప్రచురణకు కూడా తానా ప్రచురణల కమిటీ సహాయమందించింది.
తానా ప్రచురణలు: వ్యాపార ప్రచురణకర్తలు ప్రచురించలేని ముఖ్యమైన తెలుగు పుస్తకాలు మరుగున పడిపోకుండా పాఠకులకు అందుబాటులో ఉంచడంకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తానా ప్రచురణలు – వేంకటాధ్వరి వ్రాసిన “విశ్వగుణాదర్శం” చంపూకావ్యం (ఇంద్రగంటి శ్రీకాంతశర్మ వ్యాఖ్యానం), వెల్చేరు నారాయణరావుగారి సిద్ధాంత గ్రంథం “తెలుగులోకవితా విప్లవాల స్వరూపం” పుస్తకాలను ప్రచురించింది. ప్రతి సంవత్సరమూ,కనీసం ఒక అరుదైన పుస్తకాన్ని ప్రచురించాలని మా ఆశయం.
అనువాదాలు: తెలుగు సాహిత్యానికి ప్రపంచసాహిత్యంలో గుర్తింపు రావాలంటే, నాణ్యత గల అనువాదాలు, ఆ అనువాదాలను అందరికీ అందించగల ప్రసిద్ద ప్రచురణకర్తలు చాలా ముఖ్యం. ఈ ఉద్దేశంతో విస్కాన్సిన్ యూనివర్సిటీ వారు అంతర్జాతీయ పాఠకులు మొదటిసారిగా ఆధునిక తెలుగు కవిత్వాన్ని ఆస్వాదించటంకోసం Hibiscus On The Lake, An Anthology of Modern Telugu Poetry ప్రచురించటంలో తానా ప్రముఖపాత్ర వహించింది. అలాగే తెలుగులో ఆధునికోద్యమానికి తెరదీసిన శ్రీ గురజాడ అప్పారావుగారి కన్యాశుల్కం తెలుగు నాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేయటానికి Girls For Sale పేర ఇండియానా యూనివర్సిటీ ప్రచురించటానికీ తానా సహాయపడింది. ఈ రెండు పుస్తకాలనూ ఆచార్య వెల్చేరు నారాయణరావు అనువదించారు.
కథానిలయం: తెలుగు కథను భద్రపరచి శాశ్వతత్వాన్ని కలుగచేయాలన్న ఉద్దేశంతో ప్రముఖ రచయిత శ్రీ కాళీపట్నం రామారావు శ్రీకాకుళంలో ఏర్పరచిన కథానిలయానికి చేయటానికి తానా ప్రచురణల కమిటీ ఐదు లక్షల రూపాయల మూలధనం ఏర్పాటు చేసింది.
శతాబ్దిలో శతపుస్తకాలు : 21వ దశాబ్దంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, వెల్చేరు నారాయణరావు, చేకూరి రామారావు, జంపాల చౌదరి, కె.వి.ఎస్. రామారావు, కన్నెగంటి చంద్రశేఖర్‌ల ఆధ్వర్యంలో ఇంటర్నెట్లో సర్వేలు, అనేక చర్చల అనంతరం గత శతాబ్దిలో వచ్చిన తెలుగు పుస్తకాలలో ఉత్తమమైన 100 పుస్తకాల జాబితాను తానా ప్రచురించింది
విద్యార్థుల పర్యటనలు: అమెరికాలో ఉన్న తెలుగు సంతతివారికి తెలుగు జీవితం, సంస్కృతి, భాషలు పరిచయం చేయటానికి రెండేళ్ళకొకసారి విద్యార్థి బృందాలను ఎంపిక చేసి, ఉపకారవేతనాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ యాత్రలు నిర్వహిస్తుంది.
తెలుగు కంప్యూటరీకరణలో తానా
తెలుగు ఫాంట్లు: కంప్యూటర్ల వాడకం, ఇంటర్నెట్ విస్తరిస్తున్న తొలిరోజులలో, 1995 చికాగో తానా సమావేశాల సందర్భంగా, తెలుగులో కంప్యూటరీకరణపై తానా ఒక ప్రత్యేక వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఆ రోజుల్లో ఇంటర్నెట్లో, పర్సనల్ కంప్యూటర్లలో తెలుగు వాడకం కోసం కృషి చేస్తున్న తిరుమల దేశికాచారి, ముక్కవల్లి లక్ష్మణరావు, కన్నెగంటి రామారావు తదితరులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఆ సంవత్సరమే, శ్రీ దేశికాచార్యులు తయారు చేసిన పోతన తెలుగు ఫాంటును తానా ఖరీదు చేసి ఇంటర్నెట్లో తెలుగువారికి ఉచితంగా అందుబాటులో ఉంచింది. ఒక దశాబ్దంపాటు, వ్యాపార ఫాంట్లు వ్యాప్తిలోకి వచ్చేవరకూ, ఔత్సాహికులందరూ ఇంటర్నెట్లో, వెబ్ సైట్లలో, పర్సనల్ కంప్యూటర్లలో ఈ పోతన ఫాంటునే వాడుతుండేవారు. 1995 తానా సావనీరు తెలుగు విభాగం మొత్తం ఈ పోతన ఫాంటుతోనే ముద్రించబడింది.
ఇంటర్నెట్లో తెలుగు డిక్షనరీలు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తెలుగువారు ప్రముఖపాత్రలు పోషిస్తున్నా ఇంటర్నెట్‌లో తెలుగు మాత్రం ఉండవలసిన స్థాయికి ఇంకా చేరుకోలేదు. కొన్నాళ్ళ క్రితం వరకూ తెలుగు పదానికి అర్థం కావాలంటే, ఇంటర్నెట్ తెలుగు వేదికల మీద తెలిసినవారిని సంప్రదించవలసిందే కాని స్వయంగా వెంటనే వెతుక్కునే అవకాశం ఉండేది కాదు. తెలుగుకు సంబంధించిన అన్ని నిఘంటువులనూ ఒక్క చోటకు తీసుకొనివచ్చి ఒక్క మౌస్‌క్లిక్కుతో అందరికీ అందుబాటులో ఉంచాలనే ప్రయత్నం మొదలుబెట్టిన ఆంధ్రభారతి సంస్థకు తానా ప్రచురణల కమిటీ చేయూతనిచ్చింది.
ఈరోజు తెలుగుమాటలకు అర్థాల్ని ఇంటర్నెట్‌లో వెదుక్కోవడం సులభ సాధ్యమయ్యింది.
http://andhrabharati.com/dictionary/index.php సైటుకు వెళ్తే (లేకపోతే http://andhrabharati.com/ సైటులో నిఘంటు శోధన పై క్లిక్ చేస్తే) తెలుగు మాటకు తెలుగు అర్థం, తెలుగు మాటకు ఇంగ్లీషులో అర్థం, ఇంగ్లీషు మాటకు తెలుగు అర్థం, ఉర్దూ మాటకు తెలుగు అర్థం ఇప్పుడు సులభంగా తెలుసుకోవచ్చు. మీ వీలుని బట్టి మీకు కావలసిన మాటను ఇంగ్లీషులో కాని తెలుగులో కాని టైపు చేస్తే చాలు. ఇప్పటికి 17 నిఘంటువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
వచ్చే సంవత్సరంలో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి కనీసం 71 నిఘంటువులు (53,898 పేజీలు) ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ నిఘంటువుల్లో ప్రామాణిక సాంప్రదాయ నిఘంటువులతో పాటు, మాండలిక పదకోశాలు, వివిధ వృత్తుల పారిభాషిక పదాల, పర్యాయ పదాల నిఘంటువులు కూడా ఉంటాయి. వీటికితోడు, ఇంగ్లీషు, సంస్కృత, ఉర్దూ పదాలు, పురాణాల్లో వచ్చే పేర్లు, సంగీతం, ఆయుర్వేదం వంటి వివిధ శాస్త్రాల్లో వచ్చే పదాలు, సాంకేతిక పదాల అర్థాలు కూడా ఇక్కడ లభ్యమౌతాయి.
తెలుగుకు ప్రాచీన భాష హోదా ఉద్యమం : కొన్నేళ్ళక్రితం తెలుగుకు ప్రాచీన భాష హోదా తీసుకురావటానికి చేసిన ఉద్యమంలో కూడా తానా ప్రముఖ పాత్ర వహించింది. 2006 డిశంబరులో తానా ఆధ్వర్యంలో తెలుగుకు ప్రాచీనభాషా హోదాకోసం వివిధసంస్థలతొ కలసి ఒక పెద్ద ప్రదర్శనను నిర్వహించింది. తానా ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్ళి కేంద్రమంత్రులనూ, అధికారులనూ కలుసుకొని తెలుగుకు ప్రాచీనభాష హోదా ఇవ్వటం విషయంపై చర్చలు జరిపి ఆధారపత్రాలను అందజేసింది.
తానా చైతన్య స్రవంతి: రెండేళ్ళకొకసారి తెలుగు జానపద కళారూపాల పరిరక్షణకోసం ఆంధ్రప్రదేశ్‌లో తానా చైతన్య స్రవంతి పేర ప్రదర్శనలు, సెమినార్లు, సభలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా జానపద కళారూపాలపై పరిచయ, పరిశోధక వ్యాసాలతో చైతన్యస్రవంతి అనే సావెనీరును కూడా ప్రచురిస్తుంది.
తెలుగు రచయితల మహాసభలు: చైతన్యస్రవంతిలో భాగంగా తానా ఆంధ్రప్రదేశ్‌లో వివిధ నగరాల్లో రచయితల మహాసభలను కూడా నిర్వహిస్తుంది. తెలుగు సాహిత్యంపై రసవత్తరమైన గోష్టులూ, చర్చాకార్యక్రమాలూ ఈ సభలలో జరుగుతాయి. రెండేళ్ళ క్రితం విజయవాడలో జరిగిన తానా రచయితల మహాసభలో వందలాది రచయితలు, ప్రేక్షకులు పాల్గొన్నారు. అప్పటి చర్చలనూ, ప్రసంగ వ్యాసాలనూ తానా ఒక సావెనీరుగా ప్రచురించింది.
గిడుగు రామ్మూర్తి అవార్డు: తెలుగు భాష అధ్యయనం, అభ్యుదయం కోసం నిరంతరం కృషి చేస్తున్నవారిని గుర్తించి ప్రోత్సహించటం, ఇతరులకు స్ఫూర్తి కలిగించటం లక్ష్యాలుగా తానా గిడుగు రామ్మూర్తి అవార్డుని నెలకొల్పింది. 2002 నుంచి ప్రతి రెండేళ్ళకూ, తెలుగు భాష ప్రగతికి అంకితమైన ఒక వ్యక్తిని గిడుగు రామ్మూర్తి అవార్డు, 50వేల రూపాయల నగదులతో తానా సత్కరిస్తుంది. ఇప్పటివరకు ఈ అవార్డును ఆచార్య చేకూరి రామారావు, భద్రిరాజు కృష్ణమూర్తి, సి. ధర్మారావు, స.వెం.రమేష్, ఎ.బి.కె. ప్రసాద్‌లు అందుకున్నారు.
భవిష్యత్కార్యక్రమాలు, ప్రణాళికలు
గత పదిహేనేళ్ళలో సాంకేతిక విప్లవంలో పాలుహంచుకుంటూ తెలుగు వారు పెద్ద ఎత్తున అమెరికాకు వచ్చి స్థిరపడటంతో ఇక్కడ తెలుగువారి అవసరాలు బాగా మారిపోయాయి. అమెరికాలో ప్రస్తుతం పదేళ్ళ లోపు వయసు తెలుగు పిల్లలు లక్షకు మించి ఉంటారని ఒక అంచనా. ఈ పిల్లలకు తెలుగుపై మక్కువ కలిగించి ఆసక్తి పెంచటం ఇప్పుడు తానా చేయవలసిన ముఖ్యమైన పనుల్లో ఒకటి. ఈ విషయం గుర్తించిన తానా వచ్చే సంవత్సరం (2013) మే 24,25,26 తేదీలలో డల్లాస్ నగరంలో జరగబోతున్న 19వ తానా మహాసభల మకుటంలో ముందు మాటగా భాషను ఎన్నుకొంది (భాష, సేవ, సంప్రదాయం, అభ్యుదయం).
ఈ డిశంబరులో ఆంధ్రప్రదేశ్‌లో జరపబోయే ఏడవ తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలలోనూ ఒకరోజు పదకవితా పితామహుడు అన్నమాచార్యుని జన్మస్థలమైన తాళ్ళపాకలో జరపటానికి, ఇంకో రోజు హైదరాబాద్ లో సాహితీసదస్సు జరపడానికి తానా నిశ్చయించింది.
ఇప్పటివరకు ప్రతి సంవత్సరం తెలుగు భాషా సాహిత్యాలకోసం చేస్తున్న కార్యక్రమాలు కొనసాగిస్తూనే, ఇక ముందు ప్రత్యేకంగా పిల్లలకోసం బొమ్మల అక్షరాల పుస్తకాల దగ్గర్నుంచి పెద్ద పిల్లలు తేలిగ్గా చదువుకోగల సాహిత్యం వరకు వివిధ స్థాయిలలో బాలసాహిత్యానికి చేయూత నివ్వడం, పిల్లలకు తెలుగు విడియోలు, కంప్యూటర్లద్వారా ఆటలు, పాటలు, పాఠాలు, ప్రోగ్రాములు, పాఠ్యపుస్తకాలు అందుబాటులో వచ్చేలా చేయడం తానా ఎంచుకొన్న కార్యక్రమాలలో ముఖ్యమైనవి.
తెలుగు భాష, సాహిత్యాల సేవలలో తానా చేసిన, చేస్తున్న అనేక కార్యక్రమాలలో ఇవి కొన్ని మాత్రమే. భాషను కాపాడుకొని, పరిపుష్టం చేసి, వ్యాప్తి పొందించటానికి జరిగే అన్ని ప్రయత్నాలలోనూ తానా ఉత్సాహంగా పాలు పంచుకొంటుంది. అవసరమైనప్పుడు తానే ముందడుగు వేసి ఇతర సంస్థలకు, ప్రభుత్వానికి ఉత్ప్రేరకంగానూ, ఉత్తేజకరంగానూ పని చేస్తుంది.
తానా కార్యక్రమాలు భాషా సాహిత్య సేవలకే పరిమితం కాదు. తెలుగువారికి అవసరమైన సాంస్కృతిక, విద్యా, సామాజిక విషయాలన్నిటిలోనూ చాలా రంగాలలో తానా కృషి చేస్తుంది. తెలుగునాట విద్య, వైద్య, సామాజిక రంగాలలో సేవలకు తానా ఫౌండేషన్ ప్రతి సంవత్సరం మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు పెడుతుంది. అమెరికాలో విపత్తులకు గురైన తెలుగువారికి సహాయం అందచేయటానికి తానా టీమ్ స్క్వేర్ కార్యకర్తలు అహర్నిశలు సిద్ధంగా ఉంటారు.
తెలుగు భాష, సాహిత్యాల కోసం తానా ఇంతగా కృషి చేస్తుందంటే, ఈ కార్యక్రమాలకు తానా సభ్యులు ఏకాభిప్రాయంతో ఇస్తున్న మద్దతు ముఖ్యకారణం. ఎటువంటి వనరులు అవసరమైనా, వాటిని సమకూర్చుకోవటానికి తానా సభ్యులు వెనుకంజవేయకుండా సహాయం చేయటమే తానా ముఖ్యబలం. తానాకు బాసటగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు కుటుంబానికి మా కృతజ్ఞతలు.
తెలుగు మన భాష. దానిని రక్షించుకోవలసిన బాధ్య మనదేనని తానా సభ్యులందరి భావన. ఈ ఆశయసాధనకు తానా వ్యయప్రయాసలకు వెరవకుండా అంకితభావంతో నిరంతరంగా, బహుముఖంగా కృషి చేస్తూనే ఉంటుంది.
ram akula
1116 free telugu e books
granthanidhi dotcom
mohan
672 FREE TELUGU E BOOKS
PLS VISIT
http://WWW.MOHANPUBLICATIONS.COM
Dr.Rayadurgam Vijayalakshmi
అమెరికాలో తెలుగువారు తమ భాషపట్ల చూపుతున్న మక్కువను చూస్తే చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో తమ పిల్లలకు తెలుగు భాషను ఇంకా దగ్గర చేయాలని వారు పడే తాపత్రయం మన దేశంలో తల్లిదండ్రులు కూడా గుర్తించాల్సిన అంశం.