వల్లభ మంత్రి- విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: Halley
*****
ఈ పరిచయం విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన “వల్లభ మంత్రి” గురించి. ఎప్పటి లాగానే విశ్వనాథ వారి పుస్తకం అనగానే ఏవేవో లోతైన విషయాలు ఉంటై కాబట్టి ఆట్టే వాటి గురించి యెడా పెడా విమర్శలు చేసేయలేను నేను. పుస్తకం చదువుతున్నపుడు నన్ను కాసేపు అలా ఆలోచనలో పడేసిన కొన్ని అంశాల గురించే మాత్రమే ఈ పరిచయం లో ప్రస్తావిస్తాను. గత కొద్ది కాలంగా నేను ప్రధానంగా విశ్వనాథ వారి రచనలే చదువుతున్నందున ఇదేదో “fanboy” పరిచయం అనుకొంటారో యేమో.

పుస్తకం విషయానికి వస్తే, మత ప్రాతిపదికన ఒక దేశం(మాంధాతృ దేశం) ఎలా విడిపోయింది, విడిపోయాక రెండు దేశాలు ఏమయ్యాయి, ఇదంతా వల్లభ మంత్రి అనెడి మంత్రి ఎలా సంభాళించారు వగైరా వగైరాల గురించి ఈ పుస్తకం. 1958లో ప్రథమ ముద్రణ. ఇదంతా అప్పటి మన భారత దేశ పరిస్థితులని ప్రతిబింబించినట్టు, వల్లభ మంత్రి వల్లభాయి పటేలు లాగాను అనిపించచ్చును మనకి. తప్పు లేదు!

పుస్తకం “డిజిటల్ లైబ్రరీ అఫ్ ఇండియా” లో లభ్యం.

పుస్తకం మొదట్లో “కార్య కారణ భావం” అనే విషయం పైన రాసిన కొన్ని వాక్యాలు నాకు ఎంతగానో నచ్చాయి.
ఈ వాక్యాలు యథాతథంగా ఇక్కడ :
“ఇతరుల మేలు కోసం హింస చేసినను, మేలు చేసిన దానికి సత్ఫలము కలిగినట్లు హింస చేసినదానికి నసత్ఫలము కలుగవలెను. ఈ సదసత్ఫలములు ప్రత్యక్షములా? అప్రత్యక్షములా? ఫలము సద్యః ఫలము దూరఫలము ద్విధా కనిపించుచున్నది. సద్యః ఫలమే ఫలము దూరఫలితమైనది సమన్వయం చేత చెప్పపడుచున్నది కాని విశ్వసించుటకు వీలు లేదన్నచో సర్వకార్యములకు సద్యః ఫలము కన్పించుటలేదు. అప్పుడు కార్యకారణ భావమునందు వైయర్థము భాసించు చున్నది. దూర ఫలితము సమన్వయము చేతనే భాసించును. ఈ సమన్వయము చేత భాసించిన దూర ఫలితమునకు దద్దూర భూతకాలకృత కార్యమునకు సంబంధము లేదనుట నాస్తిక మతమునకు తొలి మెట్టు”

మరొక చోట ‘పరమతస్తులని తన మతము లోనికి తిప్పుకొనుటకు చేసే ప్రయత్నము’ అనే విషయం పై కొన్ని ఘాటైన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ విషయమే చెబుతూ “తాత్కాలిక లాభం కొరకు సార్వకాలికముగా నుండి పోవు నొక అవినీతి కార్యమును చేయుట” అని ఒక మాట అన్నారు. అది నాకెంతో నచ్చింది.

ఇంకో చోట జీవిక, జీవన విధానం, ఆహార వ్యవహారాలు, ఆచారాలు , సంఘ వ్యవస్థ , మతాభిప్రాయములు, విశ్వాసమూ వీటన్నిటికి మధ్య గల లంకెను చాలా చక్కగా విశదీకరించారు.

విగ్రహారాధన గురించి ఆ దేశమునందలి (మాంధాతృ దేశం) రెండు మతాల వారికి పరస్పర విరుద్ధ భావనలు ఉన్న విషయం గురించి చర్చిస్తూ, “విశ్వాసము విశ్వాసముగా మాత్రమే ఉన్నచో నెవ్వరికిని బాధ లేదు. ఆ విశ్వాసము వెనుక నహంకరమున్నది. క్రౌర్యమున్నది. లోభమున్నది. దురాశ ఉన్నది. అందుచేత వచ్చిన నష్టం” అని అన్నారు .

మరో చోట భాష గురించి ఒక మాటన్నారు. మాతృ భాష ఎందుకు చదవాలి అని అనుకొనే వాళ్ళు తప్పక చదవాల్సిన వాక్యాలు ఇవి. “ఈ రమ్యమంతయు నా భాషలో నున్నది. ఆ భాష యనగా నా జాతి యొక్క మనుగడ యొక్క, యా జాతి యొక్క వాంఛలయొక్క, యా జాతి యొక్క లక్షణముల యొక్క యావిష్కృతి స్వరూపము”

ఆ దేశమునందలి రెండు మతములను పోలుస్తూ చెప్పిన విషయాలు నాకు ఎంతో నచ్చాయి. నాకు విశ్వనాథ వారి రచనలు నచ్చటానికి ప్రధానమైన కారణం ఇదే. మనది అని మనం మర్చిపోతున్న ఇటువంటి విషయాలు గురించి ఆయన చెప్పినట్టుగా బహుశ మరెవరు చెప్పలేదేమో. ప్రధానంగా ఇందులో గ్రహగతులు, కర్మకాండలు, తదనుగుణమైన ప్రవృత్తులు వగైరాల గురించి ప్రస్తావించారు. బాహ్య పరిస్థితులూ సర్వ ప్రవృత్తి మార్గాలూ పరమాతానుకులంగా ఉన్ననూ ఆ దేశ ప్రజలలో అంతరమైన అభిమానము స్వమతము మీద ఉండటానికి గల కారణం విశ్లేషించిన విధానం కూడా చాలా బాగుంది.

ఒక దేశములో పాలకలు లేదా పరదేశీయులు తమ భాషను ఆ దేశపు ప్రజల స్వభాష స్థానే వలగా వేయటం వలన, ఆ పర భాష అనే వలలో చిక్కుకు పోయిన ప్రజలు పడే కష్ట నష్టాల గురించి ఈ పుస్తకంలో రాసిన విషయాలు నేటికి మన భారత దేశములో మనం చూస్తున్నాం. స్వభాషలోని శబ్దజాలంలో సంఘజీవనం గురించి, నీతి నియమాదుల గురించిన విషయాలు ఉండటం గురించి చెప్పారు. ఇలా భాష గురించి చెబుతూ జాతి గురించి నాగరకత గురించి కొన్ని మాటలన్నారు. “ఇహపరములు రెండు భావించిన జాతే నాగరక జాతి కదా. ఆధునిక కాలము నందు ప్రగతి శీలమై తాము పరమ నాగరకమైన స్థితిని బొందితిమని చెప్పు నాగరక జాతి ఎట్టి దైననూ అనాది నుంచి వచ్చుచున్న నాగరక జాతులు మాత్రము నిహపరాలను రెంటిని జోడించి జాతి నిర్మాణము చెసుకున్నవే”. మన ప్రస్తుత ప్రపంచంలోని “civilization” “progress” “standards of living” అని మనం చెప్పుకొనే పదాల అర్థాల విషయమై మరో సారి ఆలోచింపచేసే విధంగా ఉండింది ఈ పుస్తకంలోని ఈ భాగం.

ఇది కాక భాషారాశిలో “సంగీతము, సాహిత్యమూ, శిల్పము, నాట్యము” ప్రధానమైనవి అని చెప్పుకొస్తూ , వీటన్నిటిలో స్వజాతి మతాది సంప్రదాయములలోని విషయములు ఏ విధముగా వస్తాయో చెప్పిన విధానం చాలా బాగుంది. పరభాషా వ్యామోహంలో పడిన జాతి ఎన్ని పరిణామాలను చవిచూడవలసి వస్తుందో చెపుతూ ఈ భాషా రాశి గురించి ప్రస్తావించారు.

పర జాతి వ్యామోహం లో పడిన ప్రజల ఆలోచన తీరు గురించి చెబుతూ, గాలి వెలుతురులేని నీటిలో ఎక్కువ కాలం జీవించటం కంటే నేల పైన నిముష కాలం జీవిస్తే చాలును అని నిమేష సుఖం కొరకు ప్రాణాన్ని పణంగా పెట్టుకొనే చేప కథ ఒకటి చెప్పారు.

ఇక ఆ మాంధాతృ దేశము లోని మతము లో వర్ణ వ్యవస్థ అనేది ఉండేదని చెప్తూ అది తక్కిన దేశముల వారికీ ఆశ్చర్యజనకముగా ఉండేదని చెప్పారు. ఇక్కడి నుంచి వర్ణ వ్యవస్థా నిర్మూలన కోసం ఇతర దేశాలు పడిన పాట్ల గురించి కొన్ని పేజీలు ఉన్నాయి. సర్వమానవ సమానత్వం అనే సిద్ధాంతం గురించి ఇక్కడ చాలా లోతైన విమర్శలు చేసారు. ఇంతకు ముందు విశ్వనాథ వారి పుస్తకాలలో (ధర్మచక్రం, అశ్వమేధం, ఆరు నదులు,చందవోలు రాణి వగైరా) చాలా వాటిలో ఇటువంటివి చదివినప్పటికీ ఈ నవల కథ వస్తువు దృష్ట్యా ఇక్కడ చేసిన విమర్శ మరియు విశ్లేషణ నాకు ఎంతగానో నచ్చాయి. పరదేశీయుల “Divide and rule” అనే సిద్ధాంతము గురించి కుడా ప్రస్తావించారు. సర్వమానవ సమానత్వం గురించి విశ్వనాథవారు సంధించిన కొన్ని ప్రశ్నలను ఇక్కడ యథాతథంగా ప్రస్తావిస్తున్నాను. విశ్వనాధవారి వాదనలు ఎలా ఉంటాయి అని తెలుసుకొనగోరు వారికోసం:

“(మాంధాతృ మతం) నిర్మూలమైపోయిన తర్వాత నేమి జరుగును. అందరూ సమానులగుదురు. వారి దేశములో వారి మతములో అందరూ సమానులేనా? ధనవంతులు బేదవాళ్ళు లేరా? పాలించెడివారును పాలింపబడెడి వారును లేరా? బలిష్టులును బలహీనులు లేరా? పొడుగైన వారును పొట్టివారును లేరా? స్థూలకాయులు బక్కపలుచని వారును లేరా? వివేకవంతులు నజ్ఞానులు లేరా? కుత్సితులును ముక్కుకు సూటిగా బోవువారును లేరా? ఈ లోకములోని సుఖములను తవ్వి తలకెత్తుకొనుదమనుకొను వారు లోకము తుచ్చమని నిరాకరించు వారును లేరా? గాయకులు ఖరస్వనులు, కవులు నంగిమాటల వారు, సుందరులు వికారస్వరూపులు లేరా? దేశమే ఒక్కొక్క చోట నెక్కువగా బండును. మరియొక చోట తక్కువగా పండును. ఒక చోట వానలు కురియును ఒక చోట కురియవు. ఒక చోట నదులు ప్రవహించి, నేల రేగడి మట్టియై కుంచెడు గ్రుమ్మరించినచో రెండు పుట్లు రాలును. మరియొక చోట నిసుక ఎడారి. ఒక చోట పర్వతము. మరియొక చోట సమప్రదేశము” .. అని రకరకాల అసమానతల గురించి చెప్పాక .. “ ఈ సర్వ ప్రజలొక్కటేయనువారు, సర్వమానవ సమానత పాలించువారు దీనిలోని వేని యసమానత వారింతురో తెలియదు. సమానత యనగా జనన మరణములు సమానములు. సుఖః దుఖః ములు సమానములు” అంటూ సమానత్వం గురించి కొన్ని పసందైన వ్యాఖ్యలు చేసారు. ఇది కాక ప్రత్యేకంగా ఆర్ధిక సమానత్వం గురించి కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసారు.

ఈ మాంధాతృ మతం గురించే చెబుతూ “ఏ వర్ణ వ్యవస్థ ఈ మతమునకు పెద్ద దోషమని వారనుకొనిరో యదియ ఈ మతభిప్రాయములను నిలువద్రొక్కికోనుటకు పెట్టని కోట. సృష్టి యంతయు దేశము కాలము మానవుడు విశ్వాసములు భిన్నతతో కూడుకొని యున్నది. ఆ భిన్నత్వమును బరిగ్రహించి అంగీకరించి, భిన్నములైన చోట్ల భిన్నతను పాటించి, భిన్నత లేని చోట్ల సమానత్వం నాచరింపజేసి వ్యవస్థ ఏర్పరచిన సంఘము నిరుపద్రవమైనది అట్టి పరిజ్ఞానము లేక నిర్మించిన సంఘము సోపద్రవమైనది” అని ఆ వ్యవస్థ యొక్క ప్రాశస్త్యము వివరించారు.

నా మిత్రుడు మొన్నామధ్యన బాంబు దాడి జరిగిన రోజున “Religion and Caste … Will these do any good for our country?” అని వాపోయాడు. అలాంటి భావన ఉన్న వారు తప్పక చదవాల్సిన పేజీలు ఇవి. ప్రధానంగా గతమంతా ఒక చీకటి అధ్యాయం, గతం మాకు అక్కర్లేదు, పదండి మరో నవనూతన ప్రపంచాన్ని నిర్మిద్దాం అని అనుకొనే వాళ్ళు కూడా తప్పక చదవాల్సిన అధ్యాయం ఇది.

పరదేశము తన దేశమును ఆక్రమించినపుడు ఆ దేశపు ప్రజలు కోల్పోయే స్వరాజ్యము గురించి చెపుతూ అది ఆర్థిక విషయములో పరరాజ్యము ఉండుట మరియు విద్యా సారస్వత విశ్వాస ఆచార విషయమున పరరాజ్యం ఉండుట అని రెండు రకాలని చెప్పారు. అసలు ఒక దేశానికి మరో దేశానికి విశ్వాస ఆచార వ్యవహారాలలో తేడాలు ఎందుకు ఉంటాయి అని చెబుతూ దానికి రెండు కారణాలు ఉన్నవని చెప్పారు. ఒకటి అంతః కారణము అయితే రెండవది బహి: కారణమని అన్నారు. బహి: కారణములు అనగా తద్దేశ శీతోష్ణ పరిస్థిత్యదుల వలన ఆచార వ్యవహారములలో తేడాలు రావచ్చుననీ అన్నారు. ఇది కాక అంతః కారణములకి చిత్త వృత్యాదులలో భేదాలు కారణమని చెబుతూ ఆ చిత్త వృత్యాదులు ఎటువంటివో చెప్పారు. ఇది చెప్పటానికి చేసిన పద ప్రయోగం మొదట క్లిష్టం గా అనిపించినా తర్వాత తర్వాత ఎందుకనో అందులో ఒక రమ్యత కనిపించింది. నాకు తెలుగు బాగా వచ్చునని చెప్పుకొనే మీ మిత్రులకి ఎవరికైనా ఈ వాక్యము ఇచ్చి అర్థం చెప్పమని మీరు అడగచ్చు!

“ఈ చిత్త వృత్త్యాదులు బహుకాలతద్దేశనివాసజనితాచారాదినిత్యక్రియాహేతుకరక్తగతగుణజనితమయినవి కావచ్చును”

పరరాజ్య పాలన వలన విజాతీయములైన భావనలు జనులయందు ప్రవేశించుట వలన స్వజాతీయాచర సంప్రదాయ విశ్వాసాదుల యందు వైముఖ్యం కలుగుననీ, సర్వ మానవులు ఒక్కటే అనీ, అన్ని ఆచారములు ఒక్కటే అనీ , ఒక జాతి ఒక ఆచారము ఒక సంప్రదాయం అనేవి సంకుచితమైన అభిప్రాయాలనీ, అది జగత్ క్షేమకర విషయం కాదనీ , సర్వ మానవత ప్రధాన లక్ష్యం అని కొందరు వాదిస్తారనీ అన్నారు. “ఈ సర్వమానవత దయాదుల యందు నితరులను జూచి యోర్చుట యందు, నితరుల రాజ్యములను మనము సంపాదింతమను దురభిప్రాయము లేకపోవుట యందు పాటించవలసినది” అని ఒక మాట అన్నారు. పుస్తకంలో ఈ భాగం చదివి అర్థం చేసుకోటానికి చాలా సేపు పట్టింది నాకు. ఒకప్పుడు నాలో కూడా ఇవే భావనలు (సర్వ మానవత – అంతా ఒక్కటే వంటివి) ఉన్నందున ఈ భాగం అక్షరం కూడా వదలకుండా చదివాను నేను.

ఇది కాక “జీవుడే లేదు భగవంతుడే లేదు” అనే వాదనల గురించి కూడా కొన్ని మాటలన్నారు. జీవుడే లేక పోతే మనిషి దోమల వలె నల్లుల వలె పురుగుల వలె పుడుతున్నాడు చస్తున్నాడు అంటే సర్వమానవ శ్రేయస్సు కోసం చేసేది ప్రయత్నాలన్నీ వృథాయే కదా అని అంటూ ఈ విషయం పై మరిన్ని వ్యాఖ్యలు చేసారు. సిద్ధాంతవాదుల గురించి చెబుతూ వారి సిద్ధాంతములే పరమ సిద్ధాంతములని నమ్మి వారు నెఱిపెడి దార్ష్ట్యము మానవ శ్రేయస్సు కొరకా అని ఆక్రోశం వ్యక్తం చేసారు. ఆఖరి అధ్యాయం నిండా ఇలాంటి వాదనలు ఎన్నో ఉన్నాయి. విశ్వనాథ వారి నవలలో చాలా వరకు చివరి అధ్యాయాలలో ఇలాంటి గాఢమైన విషయాలు చాలా ఉంటాయి. అయితే ఈ నవలలో ఉన్న విషయాలు మాత్రము నవలని మరొక స్థాయికి తీసుకొని వెళ్ళిపోయాయి.

అయితే అన్నిటికంటే పుస్తకం ముగించిన విధానం నాకు చాలా నచ్చింది. వల్లభ మంత్రి పైకి గెలిచినట్టే కనిపించిన నిజానికి గెలవలేదు అని చెబుతూ మృత్యుశయ్య పై వల్లభ మంత్రి అనిన చివరి మాటలు ఇలా రాసారు .
“వివస్వంతుడు శశికన్నగారు. శశి మతము పుచ్చుకున్నాడు. యితడు పుచ్చుకోలేదు. ఇంతే భేదము. ఇతడు నా సంప్రదాయములోననే పెరిగినాడు. ఇతడీ దేశమున నాంతరామైన స్వరాజ్యము తీసుకొని రానీయడు. భగవంతున్నచో వాడు చేయవలసిన పని కాని రాజనీతిదక్షుడైన ఒక మంత్రి చేయదగిన పని కాదిది . భగవంతుడనగా కాల స్వరూపుడు. ఆ కాల స్వరూపుడైన భగవంతుడికి ఇదే అభిమతమేమో”
(వివస్వంతుడు మాంధాతృ మతస్తుడు, మాంధాత రాజు పెద్ద కొడుకు. శశి రెండవ కొడుకు, మతం మార్చుకున్న వాడు. ఇద్దరు ముక్కలైన రెండు దేశములకు రాజులు. అయితే ఈ మాటలు ఏ దేశాలని ఉద్దేశించి అన్నారో ఏ రాజులని ఏ మతాలని ఉద్దేశించి అన్నారో!)

ఈ పుస్తకం శ్రద్ధగా చదివితే తప్పకుండా పాఠకుడి మదిలో ఒక అంతర్మథనం మొదలవ్వక మానదు. విశ్వనాథ వారి రచనల మీద ఉన్న అభిమానము మరియు గౌరవము ఈ నవల తర్వాత మరికొంత పెరిగింది. నా తరం వారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. ఎప్పటి లాగానే ఈ భావజాలం అంత పక్కన పెట్టి కేవలం ఒక political fiction నవలగా కూడా చదవచ్చు. కథలో కావలసినన్ని plots and subplots ఉన్నవి అవి పాఠకుడిని తప్పకుండా కట్టి పడేస్తాయి. కానీ ఇది chetan bhagat నవల వంటి పుస్తకమైతే కాదు. అలా కేవలం కథా కథనం కోసం మాత్రమే చదవలేము దీనిని. స్వజాతి మత విశ్వాస ఆచారాల గురించి చేసిన వాదనలు తప్పకుండా ఎక్కడో గుచ్చుకుంటాయి . అవి మనలోని “స్వ” అనే భావనని తట్టి లేపుతాయి.

You Might Also Like

2 Comments

  1. S. Narayanaswamy

    బాగుంది. విశ్వనాథని చదవడంలో నాకంటే ముందు దూస్కుపోతున్నారే. నేను చాలా వెనకబడిపోయాను!

  2. శివరామప్రసాదు కప్పగంతు

    1) ప్రధానంగా గతమంతా ఒక చీకటి అధ్యాయం, గతం మాకు అక్కర్లేదు, పదండి మరో నవనూతన ప్రపంచాన్ని నిర్మిద్దాం అని అనుకొనే వాళ్ళు కూడా తప్పక చదవాల్సిన అధ్యాయం ఇది

    2) స్వజాతి మత విశ్వాస ఆచారాల గురించి చేసిన వాదనలు తప్పకుండా ఎక్కడో గుచ్చుకుంటాయి . అవి మనలోని “స్వ” అనే భావనని తట్టి లేపుతాయి.

    బహుబాగా చెప్పారు

    బహుబాగా చెప్పారు.

Leave a Reply