ఆపరేషన్ విశాలాంధ్ర

ఆపరేషన్ విశాలాంధ్ర – అని దీనికి నేను పెట్టుకున్న కోడ్‌నేం. అంతకుముందోసారి వెళ్దామనుకుని, ఫోను చేస్తే, వారు బిజీగా ఉన్నామన్నారు. ఈసారి డైరెక్ట్ అటాక్ చేశాము నేనూ, పూర్ణిమా. మరీ వెళ్ళగానే అటాక్! అంటే బాగోదని, కాసేపు షాపులో అటూ ఇటూ తిరిగి (నిజం చెప్పొద్దూ…అన్నీ చూసిన టైటిళ్ళే. నాకైతే కాస్త దిగులుగా అనిపించింది…ఏంటి కొత్త పుస్తకాలెవరూ రాయట్లేదా తెలుగులో…అని) తరువాత బిల్ కౌంటర్ లో ఉన్న అమ్మాయిని అడిగాము ఇక్కడ విశాలాంధ్ర గురించి వివరంగా మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలి అని. ఆమె మేనేజర్ గారిని చూపింది. ఆయనేదో పనిలో ఉండి కొంత వ్యవధి అడిగారు. ద్వారపాలకుల్లాగా (అదేలెండి..పాలకురాళ్ళలాగా…) కాసేపు అక్కడ బెంచి మీద కూర్చుని ఎదురుచూసాక, ఆఖరుకి ఆయన మమ్మల్ని రమ్మన్నారు.

“విశాలాంధ్ర” – అన్న పేరు కి పరిచయం అక్కర్లేదు, తెలుగు పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారెవరికైనా. 1953 లో మొదలై నేటివరకూ అప్రతిహతంగా సాగిపోతూ, తెలుగు సాహిత్యాన్ని ప్రస్తుత తరానికి అందించడం లో విశాలాంధ్ర పాత్రని ఎవరూ కాదనలేరు. విశాలాంధ్ర బ్యాంక్ స్ట్రీట్ శాఖ లో ఉన్న వారి మేనేజర్ ఎస్.రాజు గారితో జరిపిన సంభాషణ సారాంశమే ఈ వ్యాసం.

ప్ర: విశాలాంధ్ర ఎప్పుడు పెట్టారండీ?
జ: 1953 లో. ఈ ఆఫీసు 1983లో పెట్టారు.

ప్ర: మీకు ఉన్న శాఖలు వగైరా..
జ: మాకు ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 12 బ్రాంచీలున్నాయి. ఇవి కాక మా మొబైల్ వాన్లు పుస్తకాలతో రాష్ట్రమంతటా ఎల్లప్పుడూ పర్యటిస్తూనే ఉంటాయి. ఈ పన్నెండు శాఖలతోనూ ఈ వ్యాన్లు ఓ టైంటేబుల్ ప్రకారం అనుసంధానింపబడి ఉంటాయి. విశాలాంధ్ర ఆఫీసులు లేని ఊళ్ళలో మా పుస్తకాలను ప్రజల మధ్యకు తీసుకెళ్ళడానికి మేము చేసిన ఏర్పాటిది.
(అవును, చిన్నప్పుడు ఇలాంటి మొబైల్ వ్యాన్లే మా ఊళ్ళో వస్తూ ఉంటే పదేళ్ళ వయసులో వెళ్తూ ఉండే రోజులు గుర్తొచ్చాయి.)

ప్ర: మరి ఇతర రాష్ట్రాల్లో మీ శాఖలు లేవా?
జ: విశాలాంధ్ర అన్న పేరుపై లేవు కానీ, మద్రాసులో న్యూ సెంతురీ వారితోనూ, కర్ణాటకలో నవ కర్నాటక వారితోనూ మాకు సోదర సంబంధాలు ఉన్నాయి.

ప్ర: మరి విదేశాల్లో?
జ: లేవు!

ప్ర: ఇతర రాష్ట్రాల నుండి ఎవరన్నా మిమ్మల్ని సంప్రదిస్తే, మీరు పోస్టల్ ఆర్డర్లు/ ఆన్లైన్ ఆర్డర్లు పంపుతారా?
జ: పోస్టల్ ఆర్డర్లు పంపుతాము. మేము ఆన్లైన్ ఆర్డర్లు స్వీకరించము. అయితే, మా వెబ్సైటులో మా కేటలాగ్ చూడవచ్చు. (గమనిక: వారిచ్చిన వెబ్సైట్ అడ్రస్ పనిచేయట్లేదు మరి!) (అమెరికాలోని తెలుగువారు ఇక్కడకి వచ్చినప్పుడు కొనుక్కెళ్తారు. కొందరు అక్కడ నుండీ ఆర్డర్ చేస్తుంటారు)

ప్ర: మీ వద్ద ఆంగ్ల పుస్తకాలు కూడా ఉంటాయి కదా..
జ: మేము ఆంగ్ల పుస్తకాలను కూడా అమ్ముతాము. అయితే, ప్రధానంగా తెలుగుపుస్తకాల పైనే దృష్టి. తెలుగులో ప్రచురితమయ్యే పుస్తకాల్లో తొంభై శాతంపైనే మీకు ఇక్కడ దొరుకుతాయి. అవి మా ప్రచురణలైనా, ఇతరుల ప్రచురణలైనా, లేక రచయితలు సొంతంగా ప్రచురించుకున్నా, దాదాపు ప్రతీ తెలుగు పుస్తకం మా దగ్గర ఉంటుంది.

ప్ర: పుస్తకాలను జనం మధ్యకు తీసుకెళ్ళడానికి మీరు ఏమి చేస్తూ ఉంటారు?
జ: మేము తరుచుగా పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉంటాము. అలాగే, గుంటూర్ బుక్ ఫెస్టివల్ నవంబర్ లో జరుగుతుంది. అక్కడ మేము కూడా పాల్గొంటాము. నవంబర్ లో జాతీయ పుస్తక వారోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో మా ప్రతి శాఖా దాదాపు మూడు, నాలుగు పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తుంది.  అలాగే, హైదరాబాద్ బుక్ ఫైర్, విజయవాడ బుక్ ఫెయిర్, వైజాగ్ బుక్ ఫెయిర్ ఇలా రాష్ట్రంలో జరిగే ప్రధాన పుస్తక ప్రదర్శనలన్నింటిలోనూ మేము పాల్గొంటాము. అంతేకాక, పుస్తకాల మీద తరుచుగా రాయితీలను ఇస్తూ ఉంటాము. మొత్తంగా మేము దాదాపు ఒక సంవత్సరంలో ఓ 50-60 పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తాము.

ప్ర: పాఠశాలలతో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? విద్యార్థుల్లో తెలుగు సాహిత్య పఠనాభిలాష పెంపొందించే దిశగా మీరు ఏమి చేస్తారు?
జ: మా మొబైల్ వ్యాన్లు, పుస్తక ప్రదర్శనలు – పాఠశాలల వద్ద కూడా నిర్వహిస్తూ ఉంటాము.

ప్ర: పాత సాహిత్యాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్ళే దిశలో మీరు చేసే ప్రయత్నాలు ఏమిటి?
జ: జనం మరిచిపోయిన రచయితలను మళ్ళీ వారి వద్దకు తీసుకువచ్చే దిశగా కృషి చేస్తున్నాము. ఉదాహరణకి కొన్ని దశాబ్దాల క్రితం “కొవ్వలి” వెయ్యి నవలలు రాసారన్న విషయం ఎంత మందికి తెలుసు? ప్రస్తుత తరానికి ఆయనా తెలీదు, ఆయన రచనలూ తెలీదు. అందుకని ఇటీవలే ఆయన రచనలను పునర్ముద్రించడం మొదలుపెట్టాము. ఇప్పటికి అలా చాలా మంది రచయితలను పరిచయం చేశాము. ఈ ప్రయత్నంలో మేం అమ్మకాలు – లాభాల గురించి ఆలోచించము. ఒకరి రచనల్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నమే కానీ, అవి అమ్ముడుపోతాయా? అన్న ఆలోచన ఉండదు. నష్టం వచ్చినా సరే, ప్రచురిస్తాము.

ప్ర: అవును.. శ్రీపాద, కొ.కు, శరత్ – ఇలా ఎందరివో మీరు రచనా సంకలనాలను తరుచుగా వెలువరిస్తున్నారు కదా – ఇప్పటి తరానికి పాతతరం రచయితల్ని పరిచయం చేయడం కాక ఇంకేదన్నా ఉద్దేశ్యం ఉందా దీని వెనుక?
జ: వీరంతా అభ్యుదయ భావాలున్న రచయితలు. ఇలాంటి వారి రచనలన్నీ నేటి తరానికి అందిస్తూ అభ్యుదయ సాహిత్యానికి వీలైనంత ప్రచారం కల్పించడం మా ఆశయం.

ప్ర: ఇన్నాళ్ళుగా పుస్తకాల విక్రయంలో కూడా ఉన్నారు కదా – ఇప్పటి తరం పుస్తకాల గురించి ఎంత మేరకు ఆసక్తి చూపుతోందంటారు?
జ: ఇప్పటి తరంలో పుస్తకాలు చదవడం పై ఆసక్తి సంగతెలా ఉన్నా కుడా, సాహిత్యం మీద మాత్రం అంత ఆసక్తి ఉన్నట్లు కనబడదు.

ప్ర: ఎందుకలా అయిందంటారు?
జ: ప్రస్తుత విద్యా వ్యవస్థ లో అందుకు చోటులేదనిపిస్తుంది. ఇప్పుడు కాంపిటీషన్ కూడా ఎక్కువైపోయింది కనుక, పిల్లల దృష్టి సాహిత్యం పైకి వెళ్ళట్లేదు. అలాగే, విద్యార్థుల్లో పఠనాసక్తి కనిపించట్లేదు. తల్లిదండ్రుల్లోనూ పిల్లల చేత తెలుగు సాహిత్యం చదివించాలి అన్న తపన లేదనిపిస్తుంది.

ప్ర: ఎప్పుడొచ్చినా ఇవే పుస్తకాలు కనిపిస్తూ ఉన్నాయి చాలా వరకు. ఇప్పటి కాలంలో రచయితలు రాయట్లేదా? రాసినా కూడా అవి ఎక్కువ కనబడట్లేదా? కథలన్నా అప్పుడప్పుడూ కనిపిస్తున్నాయి. నవలలు అసలు కనబడ్డం లేదు.
జ: చదివేవారుంటేనే కదండీ రాసేవారు! ఇప్పుడు రచయితలు కూడా కథలే ఎక్కువగా రాస్తున్నారు. నవలలు చాలా తక్కువగా పుస్తకాలుగా ప్రచురితమౌతున్నాయి.

ప్ర: ఒకప్పుడు యండమూరి, యద్దనపూడి సులోచనారాణి, మల్లాది, సూర్యదేవర రామ్మోహనరావు – ఇలా విరివిగా నవలలు రాసే వారు ఉండేవారు కదా, ఇప్పుడలా ఎవరూ కనిపించట్లేదే.. పైగా వారి పుస్తకాలే మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నాయి…
జ: ఒకప్పుడు వీటికంతా ప్రధాన పాఠకులు గృహిణులు. అప్పట్లో రెంటల్ లైబ్రరీల్ అ ద్వారా ఈ నవలలన్నీ విరివిగా చదివేవారు. ఇప్పుడు వాళ్ళకి టీవీలున్నాయి. కనుక ఒకప్పడున్నంత ఆదరణ ఈ నవలలకి ఇప్పుడు లేదు. అందుకే, ఇప్పుడెవరూ ఇలా రాయట్లేదు.

ప్ర: ఒకప్పటితో పోలిస్తే మీ వద్ద అమ్మకాలు ఎలా ఉన్నాయి?
జ: అమ్మకాలు బాగున్నాయండీ. కానీ, పోలిస్తే ఇప్పుడు జనం వేరే రకాల పుస్తకాలు కొంటున్నారు అంతే. సీరియస్ సాహిత్యాన్ని ఇప్పుడు ఎవరూ అంతగా కొనట్లేదు. సాంకేతిక పుస్తకాలు, వ్యక్తిత్వ వికాసం, భక్తి సాహిత్యం – ఇలాంటి పుస్తకాల అమ్మకాలు ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, పుస్తకాలు జీవితంలో నిత్యావసరాల తర్వాత వస్తాయి. అన్నీ అమర్చుకున్నాక చేతిలో ఇంకా డబ్బుండీ, కాస్తంత సాహిత్యాభిలాష ఉన్నవారే ఇక్కడికి వచ్చి పుస్తకాలు కొంటారు.

ప్ర: ఎవరన్నా పుస్తకాలు రాస్తే వాటిని మీరు ప్రచురిస్తారా? అలా చేయాలంటే మీ పద్ధతులు ఏమిటి?
జ: మాకో ఎడిటోరియల్ బోర్డు ఉంటుంది. ఎవరన్నా తమ పుస్తకం మా వద్దకు ప్రచురణార్థం పంపుతే, మా బోర్డు పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. రచనని పరిశీలించాక, అది మేం ప్రచురిస్తామా? లేక రచయితనే ప్రచురించుకోమంటామా? అన్న విషయం తెలియజేస్తాం.
(ఈ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడే ఒకరిద్దరు బోర్డు మెంబర్లు ఏదో పనిపై అక్కడికి వచ్చి వెళ్ళారు.)

ప్ర: అలాగే, సొంతంగా పుస్తకాలు ప్రచురించుకునేవారి పుస్తకాలను మీ షాపుల్లో అమ్ముతారా?
జ: అమ్ముతాము.

You Might Also Like

10 Comments

  1. krishna

    naku baga nachede me enturu malee ealea anakuam rayale.naku rayatam ravatomladu.thapulu youta iam sorry.

  2. budugoy

    కొత్తపాళీ గారు, స్వయంగా ప్రచురిస్తే గానీ తెలవలేదన్నమాట 🙂 దాదాపు అన్ని సంస్థలదీ ఇదే పద్ధతి. కొంతమంది రచయితలు ఈ నలభై శాతం పన్ను సహించలేక స్వంతగా అమ్ముతున్నారు (సౌదా, రాణీ శివశంకర్ మొ||). నాకూ ఈ నలభై శాతం విషయం రంగనాయకమ్మ గారు ఒక పుస్తకంలో ముందుమాటలో రాసుకొనేవరకూ తెలియదు. చదివి ఔరా అనుకున్నాను.

    పిల్లల పుస్తకాలు ప్రచురించే “మంచిపుస్తకం” వారిని మీ పుస్తకాలు బయట ఎందుకు అమ్మట్లేదు అని అడిగినప్పుడు కారణం ఇదే అని చెప్పారు. వాళ్ళ పుస్తకాల వెల 20 నుండి నలభై వరకు ఉంటుంది. బయట అమ్మాల్సి వస్తే ఒక నలభై శాతం పెంచాల్సి వస్తుంది. అందుకని కేవలం పుస్తక ప్రదర్శనశాలల్లో, లేదా తార్నాకలో వారు కొట్టు నడుపుతున్న చిన్న ఇంట్లో లేదా ఆన్‌లైన్ కొనుక్కోవచ్చని చెప్పారు. సంస్థలకు కూడా ఇదే పాలసీ వర్తిస్తుంది.

    ఇక విశాలాంధ్రతో ఉన్న చికాకులు ఇవీ అవీ అని కాదు. బొలెడు మంచి పాతపుస్తకాలకు హక్కులు వాళ్ళ దగ్గరున్నాయి. చెత్తక్వాలిటీ ప్రచురణలు చేస్తారు. వాళ్ళ పుస్తకాలు ప్రధానంగా వాళ్ళే అమ్ముకుంటారు. ఈ నలభై శాతం పన్ను బాధ వాళ్ళకు ఉండదు ఐనా ధరలు మాత్రం అన్ని పుస్తకాల్లాగే పెట్టుకుంటారు.

    ఇక ఆదివారం విశాలాంధ్ర తెరవలేదని కంప్లైంటు చేసిన వారికోసం.
    1) వీళ్ళే హైదరాబాదు కోఠీలో గాంధీ జ్ఞానమందిర్ పక్కన ఆదివారం కూడా టెంపరరీ స్టాల్లో ఇంచుమించు అన్ని పుస్తకాలు అమ్ముతారు. అక్కడ కొనుక్కోవచ్చు.
    2) నవోదయలో ఐతే నాకు ఎప్పుడూ చాలా పర్సనల్ షాపింగ్ ఎక్స్పీరియెన్స్ ఉంటుందనిపిస్తుంది. చిన్న కొట్టే ఐనా వాళ్ళూ అన్ని పుస్తకాలు అమ్ముతారు. కాస్త పరిచయం పెంచుకుంటే ఫోన్ చేస్తే పోస్టుద్వారా కూడా డెలివరీ చేస్తారు.

  3. కొత్తపాళీ

    good show.

    నా కథల పుస్తకం నేనే ప్రచురించుకున్న తరవాత నాకు తెలిసిన విషయమిది. మనం వేసిన పుస్తకాన్ని వాళ్ళు స్టాకు చేసి అమ్మినందుకు పుస్తకం అమ్మకపు ధరలో 40% విశాలాంధ్రకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పద్ధతి ఇతర ప్రచురణసంస్థలతో కూడా ఉందో, ఇది సొంతగా ప్రచురించుకునే వారికేనో తెలియదు.

    మరుగు బడిపోయిన అనేక గొప్ప రచనల్ని పునర్ముద్రిస్తున్నందుకు విశాలాంధ్రని ఎంతైనా అభినందించాలి. కానీ రాష్ట్రంలో తెలుగు సాహిత్యపు విక్రయకేంద్రంగా తమకున్న అతి బలమైన ప్రెజెన్సుని వాళ్ళు ఏవిధంగానూ ఉపయోగించుకోవడం లేదు. వీళ్ళు చెయ్యగలిగిన పనులు నవోదయ లాగా ఒక్క కుటుంబం నడిపే చిన్న సంస్థలు చెయ్యలేవు.

  4. madhu

    if they provide online sale of books so many book lovers will be happy

  5. రాజశేఖర్

    ముందు సండే ఓపెన్ చేయమని చావా కిరణ్ గారు సలహా ఇచ్చారు. కానీ వాళ్లు ఎంత చెడ్డా ఇంకా కమ్యూనిస్టులుగానే ఉన్నారు కదా. మిన్ను విరిగి మీద పడినా వాళ్లు ఆదివారం షాపు పెట్టరు. ఇంకా చెప్పాలంటే డెబిట్, క్రెడిట్ కార్డు చెల్లింపుల పద్ధతిని చస్తే అనుమతించరు. పనిదినాల్లో సెలవులు దొరక్కపోవడం, సమయం ఉండకపోవడం, కాగితపు ధనం కరువై, ప్లాస్టిక్ మనీ పెరిగి పోవడం ఇవన్నీ కార్పొరేట్ సంస్కృతిలో భాగం కదా. ససేమిరా ఇలాంటి మార్పులకు వాళ్లు ఒప్పుకోరు.కాలంతో పాటు మనం మారిపోయి ఉండవచ్చు కాని మనకోసం మన అవసరాల కోసం మారమంటే వాళ్లు మారరు. నేను కూడా ఇదే విషయం మీద తిరుపతి విశాలాంధ్ర వారితో కొట్లాడి కొట్లాడి ఊరుకుండిపోయా.

  6. రానారె

    “ఆపరేషన్ సక్సెస్ – యూఆరెల్ డెడ్” అంటే ఇదేనేమో 🙂

    ఇది విశాలాంధ్ర వాళ్ల ఆన్లైన్ కేటలాగు అయుండొచ్చు. ఆన్లైన్ ఆర్డర్లు స్వీకరించము అని వాళ్లంటున్న మాటకు తగినట్టుగానే ఇందులో రెండొందలకన్నా ఎక్కువ పుస్తకాలు లేవు.

    తెలుగు పుస్తకాల్లో వర్చువల్ విహారానికి అజోవిభొకందాళమొక్కటే నాకు తెలిసిన చోటు. ఇంకేమైనా ఉన్నాయా?

    1. Raorvadrevu

      మీరు కినిగె సైట్ చూసే ఉంటారని భావిస్తున్నాను..

  7. రవి

    నిన్నే మా వూరు విశాలాంధ్రకు వెళ్ళి మాట్లాడదామనుకున్నాను. మొహమాటంతో వెళ్ళలేదు. అంతలో ఈ వ్యాసం ఈ రోజు. నేను గత 10 యేళ్ళుగా విశాలాంధ్ర కస్టమరును. నిన్నా ఓ రెండు పుస్తకాలు కొన్నాను.

  8. chavakiran

    muMdu Sunday open cheyyamani cheppaMDi 🙂

  9. Marthanda

    I am also customer of Visalandhra, Srikakulam branch.

Leave a Reply