మండే మే లో సండే మార్కెట్ లో..
ఆబిడ్స్ సండే మార్కట్ ఓ సారి తిరిగి మా అనుభవాలు పంచుకోవాలన్న మెగా ప్లాన్‍ను అమలుపరచటానికి మేం మే నెలను ఎంచుకున్నాం. మండే సూర్యుణ్ణి లక్ష్యచేయక సండే మార్కెట్‍ను విశ్లేషిద్దాం అని నడుముకీ, చేతికీ కంకణాలు ఏమీ కట్టుకోకుండానే ఓ పెన్నూ, పుస్తకమూ పట్టుకుని వీధులెంబడి నడవడం మొదలెట్టాం. అప్పుడప్పుడే పుస్తకాలు బయటపెడుతూ ఉన్నారంతా, నెమ్మిదిగా ఒక్కో పుస్తకాన్నీ పేరుస్తూ! నడుచుకుంటూ పోతుంటే బోలెడన్ని షాపులు వెళ్ళిపోతున్నాయే కానీ ఎక్కడో చోట ఆగి వచ్చిన పనిని మొదలెట్టే ధైర్యం మాత్రం రావటం లేదు. “ఇహ.. ఇక్కడికొచ్చి “నాకు అడగాలంటే ఏదోలా ఉంది” అనటం టూ మచ్. ఈ భయం ఇంట్లో ఉన్నప్పుడు ఉండాలి.” అని మా చెల్లి పెట్టాల్సింది పెడితే, పౌరుషం కొద్దీ ఓ మనిషి దగ్గర ఆగి, “మీకు తెలుగొచ్చా?” అని అడిగాను. “నహీ” అని చెప్పగానే, “నా పేరు ఫలాన. ఒక సైటుంది, దాని పేరు “పుస్తకం.నెట్”, అందులో మీ గురించి రాయాలని మిమల్ని అడుగుతున్నా కొన్ని ప్రశ్నలు” అని ఆపకుండా ఉపోద్ఘాతం హిందిలోనే వాయించేశాను. సైటంటే ఏంటో, పుస్తకం.నెట్ అంటే ఏంటో, నా చేతిలో పుస్తకం ఏంటో, అసలు నేనేంటో తెలీక, తెల్సుకోలేక ఆ మనిషి బిత్తర చూపులు చూస్తూ ఉండి పోయారు. ఆ చూపుల సారాంశాన్ని గ్రహించ(లే)క, “పేరు చెప్పండి.. రాసుకుంటాను” అనడిగాను. “ఎందుకు? ఎందుకు?” అని ఆయన ఇబ్బంది పడి నన్నూ పెట్టాక, ఏం చెయ్యాలో తోచక నేను నేలకేసి చూడాల్సొచ్చింది. నేల మీద వరుసగా పరిచున్న పుస్తకాలు చూస్తూ,
“మీ దగ్గర మ్యాగజైన్లు బా ఉన్నట్టు ఉన్నాయే!” అన్నాను.
“అవును.. నేను ఎక్కువ అవే పెడుతుంటాను.”
“ఓహ్.. ఎక్కడి నుండి వస్తాయి మీకీ పుస్తకాలు?”
“చాలా చోట్ల నుండే.. ఒక్కోసారి చిత్తు కాగితాల షాపులు (రద్దీ కె దుకాన్ సె) నుండి కూడా!”
“జనాలు వస్తున్నారా అసలు?”
“ఇంతకు మునుపులా లేరు కానీ, వస్తుంటారు.”
“మీరు ఎన్నేళ్ళ బట్టీ ఉన్నారేంటీ?”
“దాదాపు ఇరవై ఏళ్ళుగా?”
“ఇది ఆదివారం మాత్రమే కదా.. మరి మిగితా రోజులు ఏం చేస్తుంటారు?”
“నాకు వేరే ఉద్యోగం ఉంది. ఆదివారాలు మాత్రం ఇక్కడ చేస్తుంటాను.”
“ఇదే స్థలమా అప్పటి నుండి?” (ఈయన పెట్టుకున్నది బహుశా హాలివుడ్ షాపుకి వంద అడుగుల దూరంలో ఉండచ్చు)
“అవును, ఇక్కడే!”
“లాభం వస్తుందా బాగానే?”
“ఇంతకు మునుపులా లేదు. ఓ రోజున ఐదువందలు వస్తే అదే చాలు!”
“పుస్తకం వెల ఎలా నిర్ణయిస్తారు?”
“అదీ.. పుస్తకం నేను కొన్న ధరను బట్టీ, పుస్తకం కండిషను బట్టి, ఆ పుస్తకానికి ఉన్న హవా బట్టీ నిర్ణయిస్తాను.”
“పుస్తకాలు ఇలా ఓపెన్‍గా ఉంటాయి కదా, ఎవరైనా ఎత్తుకుపోతుంటారా?”
“ఓ.. ఇటు చూసి, అటు చూసే లోపు పుస్తకాలు చోరీ అయ్యిపోతుంటాయి. అలా చాలా సార్లు జరుగుతూ ఉంటుంది.”
“మీరిలా ఒక షాపు ముందున్న ఫుట్ పాతుల మీద పెట్టుకుని అమ్ముకుంటున్నందుకు డబ్బులు ఇస్తారా?”
“అదేం లేదు. కాకపోతే పోలిసులకి మామూళ్ళు బా చెల్లించాల్సి వస్తుంటుంది.” (ఆయన ఇచ్చిన సమాధానాల్లోకెళ్ళా ఇదే అత్యంత నిస్సంకోచమైనది.)
అంతకన్నా ఆ మనిషిని ఇబ్బంది పెడితే బాగోదని ముందుకు నడిచాము. మళ్ళీ ఓ పుస్తకం కొట్టు దగ్గర ఆగి, “నాకు అడగాలంటే ఏదోలా ఉంది.” – “ఉంటే.. ఇంటికి నడు” అన్న ఎపిసోడ్ రిపీట్ చేశాం ఇద్దరం. ధైర్యం చేసి అక్కడి ముఖ్య వ్యక్తిని “రెండు నిముషాలు మాట్లాడాలి.” అంటే “చెయ్యి ఖాళీ లేదు” స్టైల్లో సమాధానం వచ్చింది. చేసేది ఏమీ లేక, హాలీవుడ్ కాంప్లెక్స్ లోకి వెళ్ళాం. అక్కడా అప్పుడప్పుడే పుస్తకాలు పెడుతున్నారు. నీడకు చేరుకునేసరికి మేమూ కాస్త స్వార్థంతో అక్కడి మనుషులనే అడగాలని నిర్ణయించుకున్నాం. ఒకరిద్దరి దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకొని విషయం చెపితే, “మాకు పెద్దగా ఏం తెలీదు, మా బాస్ ఆయన, ఆయణ్ణి అడగండి” అని అరవై పడిలో ఉన్న వ్యక్తిని చూపించారు. “మాకలా బాస్- నాన్ బాస్ అని తేడాలేవీ లేవు, మీరైనా చెప్పచ్చు” అని ఎంత అడిగినా వాళ్ళు “బాస్” పాఠం వదల్లేదు. చేసేది లేక ఆయన కొంచెం ఫ్రీ అయ్యే వరకూ వేచి ఉండి, “సర్.. నా పేరు ఫలనా.. మాకూ..” (అవును.. అచ్చు “మీకు నా గురించి తెలీదా? అయితే నా ఆటోబయోగ్రఫీ చెప్పాల్సిందే..” స్టైల్!) అని మొదలెట్టా..
చక్కని చిర్నవ్వుతో సలాం చెప్పి, తనను తాను “కరీముద్దీన్”గా పరిచయం చేసుకున్నారు. ఓ పక్క నాతో మాట్లాడుతూనే ఓ కంట అక్కడ పుస్తకాలను చూస్తున్న వారిని పరికిస్తూనే ఉన్నారు.
“ఎన్నేళ్ళ బట్టీ ఉన్నారీ వ్యాపారంలో?”
“ఇరవై ఏళ్ళకు పైగా”
“ఎక్కడ నుండి తెస్తారీ పుస్తకాలు?”
” పాత పేపర్లూ, పుస్తకాలూ కొని అమ్మే షాపుల (రద్దీ కె దుకాన్) నుండి తెప్పిస్తాం మాగ్‍జైన్లూ అవీ..”
“ఏ రకం పుస్తకాలు ఎక్కువగా అమ్ముడుపోతాయి?”
“కంప్యూటర్‍కి సంబంధించినవి, ఇంకా ఇంగ్లీషు నావెల్స్”
“తెలుగు పుస్తకాలు పెట్టారా?”
“లేదు.. తెలుగు ఉండదు మా దగ్గర!”
“కస్టమర్లు ఎలా ఉన్నారు?”
“బానే ఉన్నారు. మరీ ఎక్కువని చెప్పలేం కానీ, వస్తున్నారు.”
“రెగ్యులర్ కస్టమర్లు అంటూ ఉండే అవకాశం ఉందా?”
“వస్తుంటారు, కొంత మంది అలా! అంతకు మునుపు పుస్తక పఠనాభిలాష మెండుగా ఉండి కొన్ని పుస్తకాలను దొరకబుచ్చుకోడానికి పాఠకులు మళ్ళీ మళ్ళీ వచ్చవారు. ఇప్పుడంత ఆసక్తి ఎవరికీ ఉన్నట్టు కనిపించటం లేదు.”
“మీరు తక్కిన రోజుల్లో ఏం చేస్తుంటారు?”
“నాకు ఎల్.బి స్టేడియంలో ఉద్యోగం ఉంది. ఆదివారాలు మాత్రం ఈ వ్యాపారం పెట్టుకుంటాను.”
“లాభాలు ఎలా ఉన్నాయి?”
“గత రెండేళ్ళుగా నష్టాలే నడుస్తున్నాయి. అలా అని ఇది మానేయలేను.”
నేనింకేదో అడిగేలోపే ఆయనే “ఈ కాలంలో కస్టమర్లలో టైంపాస్ కి వచ్చేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇంట్లో కూర్చోలేక, వీధులెంబడి తిరుగుతూ పుస్తకాలవైపు చూసే వారే కానీ, నిజ్జంగా పుస్తకం మీద మమకారంతో కాద”ని వాపోయారు.
వీరితో మాట్లాడాక, కాసేపు ఆ కాంప్లెక్స్ లో ఉన్న పుస్తకాలను శ్రద్ధగా చూశాము, కావాల్సినవి ఏవైనా దొరుకుతాయేమోనని. కుష్వంత్ సింగ్, పి.జి. వుఢ్ హౌజ్ లను ఓ చోట తీసుకుని ఇంకో షాపు దగ్గరకి వచ్చాము. అక్కడ ఒక ఆయన పుస్తకాలను ముందేసుకొని సర్దుతూ ఏదో సుదీర్ఘ చర్చలో ఉన్నారు. ఎంత సేపు ఎదురుచూసినా ఆ చర్చ పూర్తి కావటం లేదు. పక్కకున్న షాపుల్లో ఆర్ట్, హిస్టరీ, ఇంటీరియర్ డెకోరేషన్, ఆర్కిటెక్చర్ కి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. కుతూహులం కొద్దీ ఒకటి రెండు పుస్తకాలు తీసుకొని పేజీలు తిరగేశాం. ఓ ఆర్కటెక్చర్ పుస్తకం మొదటి పేజీ మీద, “To the gal who is best at her art and work” అని ఫ్రెండ్స్ అంతా కలిసి ఇచ్చిన పుస్తకం తాలుకూ చిహ్నాలు ఉన్నాయి. ఆనందం, నిటూర్పు కల్సి బయటకు వచ్చాయి. మేము ఎదురుచూస్తున్న ఆయన ఈ లోపు ఎటో వెళ్ళారు. ఇహ చేసేది లేక పక్క వీధిలోకి నింపాదిగా నడుచుకుంటూ పోయాం. పుస్తకంలో తల పెట్టేసి తెగ చదివేస్తున్న కుర్రాడి దగ్గర ఆగి “నా పేరు..” కాసెట్ వేశాను. ఆ అబ్బి దీనంగా నాకేసి చూసి, “నా ఫ్రెండ్ రమ్మంటే వచ్చాను. వాడేదో పనిలో ఉంటే నేను పుస్తకం తిరగేస్తున్నా” అన్నాడు. “ఓహ్” అనుకుని, ఇంకో మనిషి కనిపించగానే మళ్ళీ మొదలెట్టాను.
“సర్.. వీళ్ళెవరో మన గురించి ప్రశ్నలు అడుగుతారట!” అని ఒకాయనకి నిందాపూర్వకంగా చెప్పాడు.
ఆశ్చర్యం! మేం అనుకుంటున్న వ్యక్తి ఇక్కడే ఉన్నారు. మళ్ళీ డబ్బాడు పుస్తకాలేసుకుని మళ్ళీ ఏదో చర్చలో. నా పరిచయం అయ్యాక, ఆయన పేరు అమిద్ అలీ అని. పాతికేళ్ల (1984) నుండీ ఈ వ్యాపారంలో ఉన్నారనీ చెప్పారు. పుస్తకం.నెట్ సైటు ఉద్దేశ్యం ఏమిటో అని ఆరా తీశారు. పుస్తకప్రియులకి ఒక వేదిక అని చెప్పాను.
“ఈ కాలంలో పుస్తకాల ఎందుకింత తక్కువగా అమ్ముడుపోతున్నాయి? అసలు సందడే లేదు?” అనడిగా.
“పుస్తకాలు చదవాలంటే, జనాలకి పుస్తకాల గురించి తెలియాలి. జనాలకి పుస్తకాల గురించి తెలియాలంటే పుస్తకానికి సంబంధించిన సమాచారం వాళ్ళకి చేరువగా ఉండాలి. అలా ఉండాలంటే ఏం పుస్తకాలు వస్తున్నాయి, ఎవరు రాస్తున్నారు, పాత పుస్తకాలు ఏమిటి? ఎలా ఉండేవి? అని జనాలకి తెలియాలి. అందుకోసం ఆసక్తికరమైన సమీక్షలు రావాలి. పుస్తకాల గురించి జనాలు మాట్లాడుకుంటున్నప్పుడే పుస్తకాలు అమ్ముడుపోతాయి. ఇప్పటికి కూడా చేతన్ భగత్ కానీ, సిడ్నీ షెల్డ్ న్ గానీ, జెఫ్రీ ఆర్చర్ లేక హారీ పాటర్ – ఇవి చాలా అమ్ముడు పోతున్నాయి. ఎందుకు? వీటి గురించి మాట్లాడేవాళ్ళు ఎక్కువ కాబట్టి. పుస్తకం కొనక మునుపే ఈ పుస్తకాలపై ఒక అవగాహన వస్తుంది కాబట్టి. అలా మనం ఎన్ని పుస్తకాలకి తెప్పించగలిగితే అన్ని పుస్తకాలు అమ్ముడుపోతాయి.”
“మీరు పుస్తకాలు బాగా చదువుతారా?”
చదువుతాను. చిన్నప్పటి నుండీ మా ఇంట్లో ఆ వాతావరణం ఉండ బట్టి బా చదివే వాణ్ని.
“మీ పిల్లల్లో పుస్తక పఠనం పై ఆసక్తి ఎలా ఉంది?”
మా అబ్బాయి చాలా చిన్నవాడు. ఆ వయసు పుస్తకాలే చదివిస్తూ ఉంటాం.
మాటల మధ్యలో తెల్సింది. ఈయన “బెస్ట్ బుక్ సెంటర్” అధినేత అనీ! హైదరాబాదులో పేరుగాంచిన పుస్తకాలయాల్లో ఒక్కటి అయ్యుండి, రెండు చోట్ల బ్రాంచీలు నుండి, ఆ పుస్తక కొట్టు అధినేత మాత్రం మిట్ట మధ్యాహ్నం ఎండలో ఫుట్ పాత్ పై కూర్చుని పుస్తకాలు ఎక్కడ ఎలా ఉండాలో దగ్గరుండి చూసుకుంటుంటే హాశ్చర్యమేసింది.
“మీరెందుకు ఫుట్ పాత్ మీద? షాపులున్నాయి కదా?” అని అడిగాను ఉండబట్టలేక.
“కస్టమర్లు ఎక్కడ ఉంటే అక్కడికే మనం వెళ్ళాలన్నది వ్యాపార సూత్రం. మా షాపుకొచ్చి కొనుక్కు వెళ్ళేవారు ఒక రకం కస్టమర్లు. ఇక్కడకి వచ్చేవారూ వేరే కాటగిరీ! ఎవ్వరినీ వదులుకోలేం. అందుకే ఇక్కడ పెడుతుంటాం.”
“ఎక్కడి నుండి వస్తాయి ఇన్ని పుస్తకాలు?”
“మేం ముంబయి, ఢిల్లీ నుండి పుస్తకాలు తెప్పిస్తాం. అంతే కాక, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేవారు, రిటైర్ అయ్యిపోయిన వాళ్ళు, కలెక్షన్లు అమ్మేవారి దగ్గర నుండి కూడా వస్తుంటాయి.”
అక్కడే కూర్చొని పుస్తకాలని అమ్మే అబ్బాయి ఈ సంభాషణని అంతా ఆసక్తికరంగా వింటుంటే అతడినీ కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది.
“మీ పేరు?”
“చాంద్ పాషా!”
“ఎప్పటి నుండి సండే మార్కెట్ లో పని చేస్తున్నారు?”
“పదేళ్ళ బట్టీ.. నేను ఏడో తరగతిలో ఉండగా మొదలెట్టాను.”
“మీరేం చేస్తుంటారు?”
“నేను మార్కెట్ అనలిస్ట్ గా పని చేస్తుంటాను.”
“ఉద్యోగం ఉండి కూడా ఇది ఎందుకు?”
“అలవాటయ్యిపోయింది. పైగా నెలకి ఎంత లేదన్నా పదిహేనొందల రూపాయలు వస్తాయి. ఎందుకు వదులుకోవటం?”
“పుస్తకాలు బా చదువుతుంటారా?”
“లేదు. కానీ ఏ పుస్తకం దేని గురించో, ఎవరు రాశారో, అలాంటివి మరేవి ఉంటాయో – అవ్వన్నీ తెల్సును”
“మీ దగ్గర ఏవి ఎక్కువగా అమ్ముడుపోతాయి?”
“తెలుగు నవలలు”
ఆబిడ్స్ సండే మార్కెట్ లో నేను గడిపిన క్షణాల చిట్టా!
sk
పుస్తకం.నెత్ వారికి చిన్న సూచన
హైద్ లొ ఉన్న లైబ్రరీల గురించి కూడా ఒక టపా వేస్తే బావుంటుంది
కొత్తగా పుస్తకాలు చదవాలి అనుకున్నె వారికి కొంచం సాయంగా ఉంతుంది కదా
for both telugu as well as english books
పుస్తకం » Blog Archive » Sunday @Abids - Version 3
[…] అబిడ్స్ ఇంటర్వ్యూలు – సౌమ్య, పూర్ణిమ లవి ఇదివరకే పుస్తకంలో వచ్చాయి. ఇవి […]
Prabhakar Mandaara
ఈ కాలంలో కస్టమర్లలో టైంపాస్ కి వచ్చేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు.>>>
నిజమే. పుస్తకాల మీద కొద్దో గొప్పో మమకారం వున్నవాళ్ళు కూడా పుస్తకం మీద ఓ పదో పాతికో ఖర్చు పెట్టాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు.
అందుకే పుస్తకాల షాపుల్లో మరీ ముఖ్యంగా సెకండ్ హాండ్ షాపుల్లో పుస్తకాలని కొనే వాళ్ళ కంటే ఓ తిరగేసే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు.
ప్రయాణాలప్పుడు దిన పత్రికల విషయంలోనూ ఇది గమనిస్తుంటాం. ఈ అలవాటు ఒక్క తెలుగు వాళ్ళకే సొంతమేమో.
మాలతి
మండే మేలో సండే మార్కెట్ – 🙂
rAsEgA
Hmm… good old Hollywood book market !
One of the things I miss by not being in Hyd 🙁
Chetana
చాలా మంచి ప్రయత్నం. అవును, ఫొటోలు పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది.
అనన్
““ఎక్కడ నుండి తెస్తారీ పుస్తకాలు?”
“రద్దీ అమ్మే షాపుల..”
రద్దీ షాపులంటే?
ప్రవీణ్ గార్లపాటి
భలే బాగున్నాయి ఈ అనుభవాలు…
మీ ధైర్యానికి జోహార్లే, నేనయితే అడగాలా వద్దా దగ్గరే ఆగిపోదును 🙂
tappanisari
This is also one of the few markets .. where ppl flaunt buying pirated books openly .. guess a word or two .. on book piracy .. and asking ppl not to encourage buy such books … would have added some more weight to this post 🙂
meher
🙂
బాగుంది. షాపుల ఫొటోలు కూడా ఇచ్చుంటే చితగ్గొట్టేది.
“తెలుగు నవలలు” ఆశ్చర్యకరమైన సమాధానమే!