ఆదివారం@అబిడ్స్ – నా అనుభవం
ఏప్రిల్ నెలలో ఓ ఆదివారం, మిట్టమధ్యాహ్నం. అబిడ్స్ సండే మార్కెట్లో ఇంటర్వ్యూలు చేయాలన్నది మా ఆలోచన. నాకా ఇదే మొదటిసారి ఇలా ఇంకోర్ని ఇంటర్వ్యూ చేయడం. ఎలా చేయాలో తెలీదు (అంటే, ఇప్పటికీ తెలీదనుకోండి, కానీ, అప్పటి మీద బెరుకు తగ్గింది). పైగా, హిందీలో! మనదా అంతంతమాత్రం హిందీ! 🙂 సరే, వెళ్ళిన నలుగురం తలో దిక్కూ వెళ్ళాము. ఈ వ్యాసం నా దిక్కులో తగిలిన మనుషులతో నేను నడిపిన సంభాషణల సంకలనం.
మొదటగా తారసపడ్డ వ్యక్తి యూనిస్. ఈ కొట్టులో ప్రధానంగా నాకు పక్కా ఆంగ్ల సాహిత్యం విద్యార్థులు చదివే తరహా పుస్తకాలు కనిపించాయి. అన్నీ పాతవే. మా సంభాషణ ఇలా సాగింది.
నేను: తెలుగు మాలూం హై ఆప్కో?
అతను: నై. హిందీ.
నేను: (మనసులో: ఖర్మ! మన హిందీ ఇతనికి అర్థం కావొద్దూ?.. పైకి మాత్రం) హిందీ…ఓకే.
– అనేసి, ఎందుకొచ్చానో పరిచయం చేసుకుని మొదలుపెట్టాను. సంభాషణ హిందీదే అయినా, సారాంశం తెలుగులో
ప్ర: మీరు ఈ వ్యాపారంలో ఎన్నాళ్ళుగా ఉన్నారు?
జ: దాదాపు 25 ఏళ్ళుగా ఉన్నాను. మా నాన్న నుండీ చిన్నపిల్లవాడిగా ఇక్కడికి వచ్చేవాడిని. ఇప్పుడు నేనే చూసుకుంటున్నాను.
ప్ర: వారాంతాల్లో సరె, మిగితా రోజుల్లో ఏం చేస్తూ ఉంటారు?
జ: మిగితా రోజుల్లో వేరే పనులు ఉంటాయి.
ప్ర: ఇక్కడ పుస్తకాల ధరలు ఎలా ఉంటాయి?
జ: 135/- అని మొదలుపెట్టి 75/- దాకా బేరాలౌతాయి. ఒక్కోసారి 40/- అంతకంటే తక్కువకు కూడా అడుగుతారు జనాలు!
ప్ర: ఎక్కువగా మీ కొట్టుకు ఎలాంటివారు వస్తారు
జ: కాలేజీ విద్యార్థులు – ఇంగ్లీష్ లిటరేచర్ చదివేవాళ్ళు వస్తారు.
ప్ర: ఎలాంటి పుస్తకాలకి మీ వద్ద అమ్మకాలు ఎక్కువ?
జ: షేక్స్పియర్. (తడుముకోకుండా)
ప్ర: లాభాలొస్తాయా?
జ: మంచి బేరాలొస్తే, కొంత డబ్బులు మిగుల్తాయి.
ప్ర: మీరు ఎలా ఎంపిక చేస్తారు ఏ పుస్తకాలు పెట్టాలో?
జ: మా నాన్న సాయం తీస్కుంటాను. అలాగే, నా అనుభవం కూడా ఉపయోగిస్తాను.
ప్ర: ఎక్కడ్నుంచి వస్తాయి ఈ పుస్తకాలన్నీ?
జ: మేము ఇక్కడే అబిడ్స్ నుండే తెచ్చుకుంటాము.
ప్ర: కొత్త పుస్తకాలు ఏవన్నా అడిగితే తెప్పించగలరా?
జ: నా దగ్గర కొత్త పుస్తకాలు ఉండవు…
********************************************************************************************
రెండో వ్యక్తి: ముస్తాక్. ఇతని వద్ద పిల్లల బొమ్మల పుస్తకాలు, నవలలు ఎక్కువగా కనిపించాయి.
ప్ర: ఎన్నాళ్ళుగా ఉన్నారు ఈ వ్యాపారంలో?
జ: నా చిన్నప్పట్నుంచి ఉన్నాను. దాదాపు 20 ఏళ్ళ అనుభవం ఉంది.
ప్ర: ఇరవై ఏళ్ళలో పుస్తకాల కొనుగోలు ట్రెండ్ ఎలా ఉంది?
జ: ఒకప్పటితో పోలిస్తే అమ్మకాలు బాగా తగ్గాయి. ఇప్పుడు జనానికి కాలక్షేపానికి వ్యాపకాలు చాలా ఉన్నాయి కదా – టీవీలు, వీడియో గేంలు వగైరా…పుస్తకాలు ఎవరు చదువుతారు?
ప్ర: అయితే, మీకు పాత రోజులే నచ్చాయా?
జ: అవును.
ప్ర: అన్నట్లు, ఈ పుస్తకానికి ఇంత ధర అని ఎలా నిర్ణయిస్తారు?
జ: అనుభవం పెరిగే కొద్దీ అదంతా తెలుస్తూ ఉంటుంది.
ప్ర: మీవద్దకు వచ్చే కొనుగోలుదారులు సాధారణంగా ఏ కోవకు చెందిన వారు?
జ: మా వద్దకు పిల్లలు, పెద్దలు, విద్యార్థులు – అన్ని రకాల వారూ వస్తారు. చూస్తూనే ఉన్నారు కదా, అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి మా వద్ద.
(నిజమే, స్టాల్ చిన్నది కానీ, ప్రతి కేటగిరీ పుస్తకాలు ఒకటో అరో, ఉన్నట్లే అనిపించాయి)
ప్ర: మీకు ఈ పుస్తకాలు ఎక్కడ్నుంచి వస్తాయి?
జ: ముంబై మరియు ఇతర ప్రంతాల నుండి.
ప్ర: ఇక్కడ, మరి, ఇలా ఫుట్‌పాత్ పై షాపు పెడుతూ ఉంటే సమస్యలేమీ రాలేదా పోలీసుల నుంచి?
జ: లేదు (పరమ ముక్తసరిగా)
**********************************************************************************************
వీళ్ళిద్దరితోనూ మాట్లాడాక ఎవరినన్నా కస్టమర్ ని పలకరించి నేను సుఖమర్ ను అవుదాం అనుకున్నా (“సుఖమర్” పద ప్రయోగం బృందావనం సినిమాలో విన్నాను). ఇంటీరియర్ డిజైన్ మేగజీన్లు బేరమాడుతూ ఒకాయన కనిపిస్తే ఆయన్ని పలకరించాను. పుస్తకం గురించి పరిచయం అయ్యాక:
ప్ర: మీ పేరు?
జ: రాజ్ కుమార్.
ప్ర: ఎన్నాళ్ళుగా వస్తున్నారు ఇక్కడికి?
జ: దాదాపు పదేళ్ళుగా వస్తున్నాను. నెలకోసారి అలా వచ్చి, సాధారణంగా పాత పత్రికల్నీ కొంటూ ఉంటాను.
ప్ర: ఎలాంటి పత్రికల్ని?
జ: ప్రస్తుతం ఇల్లు కట్టే ప్రయత్నంలో ఉన్నాను. అందుకని ఇంటీరియర్ డిజైన్ పత్రికలను చూస్తున్నాను. ఇలాగే, ఎప్పుడేరకం పత్రికలు కొనాలనిపిస్తే అవి.
ప్ర: ఇక్కడికే ఎందుకొస్తారు? వేరే చోట్లకి వెళ్ళరా?
జ: నిజం చెప్పాలంటే, పెద్ద పెద్ద దుకాణాల్లో పుస్తకాల ధరలు ఎక్కువగా ఉంటాయి. అందుకని నేను వెళ్ళను.
ప్ర: మీతో పాటు మీ పిల్లలు కూడా వస్తారా?
జ: లేదు, వాళ్ళ అభిరుచులు వేరు.
*********************************************************************************************************
ఆ తరువాత అటుగా పోతూ ఉంటే, ఓ కుటుంబం కనిపించింది. అమ్మా, నాన్నా, ఇద్దరు పిల్లలూ – అంతా యమ ఆసక్తిగా పుస్తకాలు కొంటున్నారు. భలే ముచ్చటేసింది నిజానికి. సరే, వీళ్ళతో మాట్లాడదాం అని వెళ్తే, మాకు టైం లేదు పొమ్మని పంపేసారు. నిరాశతో సరేనన్నానా… వెళ్తూ వెళ్తూ నన్ను అనుమానంతో చూస్తూ వెళ్ళారు!!! – సరేలే, ఇలాంటివి ఎన్ని చూడాలో అనుకుని.. జయమ్ము నిశ్చయమ్మురా… అనుకుంటూ ముందుకెళ్ళిపోయా 😉
ఈ అనుభవాలు ముగిసాక నాకు అర్థమైంది ఏమిటీ అంటే, ఇక్కడో గోల్డ్ మైన్ ఉందీ అని. 🙂 ఇక్కడి పుస్తకాల విక్రేతలనూ, వచ్చే కస్టమర్లనూ పట్టుకుని, ఓపిగ్గా (అదే లెండి, వారి ఓపిక నశించేవరకూ) సంభాషిస్తే, పుస్తకాలకి సంబందించిన ఏ విషయం గురించైనా చాలా వివరాలు, భిన్న దృక్పథాలు తెలుసుకోవచ్చు అని.
R D PRASAD
I was spend in book shop in road-side in Abids and Secunderabad.This ariticle is good.
పుస్తకం » Blog Archive » Sunday @Abids - Version 3
[…] అబిడ్స్ ఇంటర్వ్యూలు – సౌమ్య, పూర్ణిమ లవి ఇదివరకే పుస్తకంలో […]
ఆకాశరామన్న
అమ్మాయెల్లి ఇంటెర్వ్యూ చేస్తేనే ఇలా వుందంటే ఇక అబ్బాయిలు వెల్లి చేస్తే జోబు దొంగను చూసినట్లు చూస్తారేమో?
sujata
అలానే ఢిల్లీ లో దర్యాగంజ్ ! ఫుట్ పాత్ మీద షాపుల్లో – వెతుక్కోవాలే గానీ మంచి పుస్తకాలు దొరుకుతాయి. దర్యాగంజ్ లో ముఖ్యంగా సైన్స్, మెడిసిన్ పుస్తకాలు పరమ విపరీతంగా కనిపిస్తాయి. ఎందుకో ?! కానీ ఈ ఇంటర్వ్యూల వల్ల ఏమి ఫాయిదా ? పుస్తకాలు ఫుట్ పాత్ మీద అమ్మడం కొనడం – పుస్తకాల విక్రయదారుల తో పరిచయాలూ – వ్యాపారమే లెండి. ఇది చాలా పెద్ద వ్యాపారమే ! ఓ కే ! కానీ, ఏమో – పత్రికల్లో రెస్టారెంట్లని పరిచయం చేసినట్టు మీరు పుస్తకశాలల పరిచయాన్నీ, వాటి స్పెషాలిటీల్నీ హైలైట్ చేసి, పాఠకులకు సహాయపడాలనా ? ఏమి కిఫాయత్? ఊరికే, ఇది సచ్చీ – నాకొచ్చిన చిన్న డౌట్ !
satyam
ఆదివారం అబిడ్స్ లో పుస్తకాల విక్రయం చాలా జ్ఞాపకాలని రేపింది.గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఆ పుస్తకాల వెతుకులాట ఒక అందమైన అనుభవం.చదివినా, చదవక పోయినా, కొన్నా , కొనకపోయినా ఎండలోనో వానలోనో దుమ్ముకొట్టిన ఆ పుస్తకా ల వాసన మరచిపోను.
టైం వెనక్కి వెళ్ళిపోతుంది ,యువకుడినయి పోతాను ,అన్ని కొనాలని ,అంత స్థోమత లేక , కాని వదలలేక ,చివరికి కొన్ని తీసుకుని ..ఎదురుగా టీ తాగి .మళ్లీ మళ్లీ తిరిగి చూసుకుంటూ చీకటి పడుతుంటే గుబులుగా ఇంటికి ప్రయాణం.
తిరిగి చూసుకుంటే తీయటి జ్ఞాపకాలు.జీవితం నెట్టుకుపోయిన సంవత్సరాలు .ఇంకా చదవని పుస్తకాలు ..చదవలేమన్న బాధ .ఒక్క రంగనాయకమ్మ గారి పుస్తకాలే చదవలేదే ,,మిగతా వి ఎప్పుడు ?
హిమజ్వాల చండీదాస్ అన్నట్లు ‘ లివింగ్ ఫర్ నతింగ్ ‘ అనిపిస్తింది .
satyam.
మాలతి
ఇక్కడో గోల్డ్ మైన్ ఉందీ అని :)- బాగుంది మీగనులు తవ్వకం!
అరుణ పప్పు
ఇంటర్వ్యూలు చెయ్యడమంటే అల్లాటప్పా పనేం కాదని తెలుసుకున్నారన్నమాట!! 😛
మిగిలిన మూడు దిక్కులకూ వెళ్లినవారి అనుభవాలు ఎప్పుడు వేస్తున్నారు?
కె.మహేష్ కుమార్
ఆదివారం అబిడ్స్ దర్శనం పుస్తక ప్రేమికులకు అతిముఖ్యమైన పుణ్యతీర్థం. మొత్తానికి ఒక రౌండ్ వేసారన్నమాట. అప్పుడప్పుడూ బహువిలువైన పుస్తకాలు అలవోకగా దొరికేస్తుంటాయి. ఒకొక్కప్పుడు ఎంత వెతికినా ఆణిముత్యాలు దొరకవు. అదే ఈ సముద్రంలో ఉన్న మతలబు. వెళ్తూవెళ్తూ క్యాష్ తో పాటూ కూసింత కుద్రత్ (అదృష్టాన్ని) తీసుకెళ్ళాల్సిందే.