Anandi Gopal – S.M.Joshi

నేను స్కూల్లో చదువుతున్న రోజులవి. అప్పటికే కేబుల్ టివిలు పుట్టగొడుగుల్లా పుట్టేస్తున్నా, మేమింకా దూర్‍దర్శన్ దగ్గరే ఉన్నాం. ఒక సాయంత్రం పూట, ఢిల్లీ నెటవర్క్ వాళ్ళ కార్యక్రమాల్లో భాగంగా ఏదో సీరియల్ మొదలవ్వబోతోంది. ఒక పలకలాంటి దాని మీద చాలా అందమైన మెలికల ముగ్గు గీయబడుతూ ఉంది. నేపథ్యంలో ఆశా భోన్సలే “ఆనంది గో..పా..ల్… ఆనందీఈఈ.. గో..పా..ల్” అంటూ పాట పాడుతోంది. ఆ ఎపిసోడ్ చివరిదాకా చూశాను, మళ్ళీ ముగ్గు వస్తుందేమోనని. అలా ప్రతివారం ఆ సీరియల్ కోసం ఓ పెన్నూ, కాగితం పట్టుకొని టివి ముందు కూర్చునేదాన్ని. ఆ ముగ్గును కాగితంపై పెట్టటం నా వల్ల కాలేదుగానీ, మెల్లిమెల్లిగా ముగ్గు వెనక్కి తగ్గి, ఆ సీరియల్ కథ నన్ను ఆకట్టుకోవటం మొదలెట్టింది. నేను చూస్తున్నది భారత తొలి మహిళా డాక్టర్ జీవిత చరిత్ర అన్నదాని కన్నా, ఆ కాలంలో ఆడపిల్లల జీవితాలెలా ఉండేవో అన్నదే నన్ను ఎక్కువ ఆకర్షించింది. భార్యాభర్తలు కల్సి సాగరతీరం దాకా నడిచివెళ్ళటం అనేది ఆ కాలంలో “టాబూ” (అప్పటికీ పదం నాకు తెలీదు) అని తెల్సి ఆశ్చర్యపోయాను. ఆ సీను నా కళ్ళల్లో ఇంకా మెదులుతూనే ఉంటుంది. ఎప్పుడో సీరియల్ అయిపోయింది. నేను మాత్రం దాన్ని మర్చిపోలేకపోయాను.

ఆ తర్వాత చాలా ఏళ్ళు గడిచాయి. ’ఇష్టపడినదాన్ని భద్రంగా దాచుకోవచ్చునూ’అన్నది తెల్సుకున్నాక “ఆనంది గోపాల్” సీరియల్ కోసం వెతికాను. సీరియల్ దొరకలేదుగానీ, అది ఎస్.జె. జోషి రాసిన మరాఠి ినవల అధారంగా ి తీశారన్న సంగతి తెల్సాక, దాని గురించి వేట మొదలెట్టాను. ఈ పుస్తకం ప్రఖ్యాతిగాంచిన పుస్తకమే! పేరు అడగ్గానే అందరూ గుర్తుపట్టేవాళ్ళూ, కానీ ఒక్కళ్ళూ పుస్తకం అందుబాటులో ఉందని చెప్పేవారు కాదు. ఎట్టకేలకు, మొన్నే ఓ స్నేహితురాలు, వాళ్ళ యూనివర్సిటి లైబ్రరినుండి అరువు తెచ్చి ఈ పుస్తకం నాకిచ్చింది.

ఈ రచన ఆనంది గోపాల్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని రాయబడ్డ కల్పిత గాధ – ఫిక్షనల్ బయోగ్రఫీ. ఆవిడ జీవితంలోని అనేక ఘట్టాలను, కలసిన మనుషులను, రాసుకున్న ఉత్తరాలను బాగా పరిశోధించిన తర్వాత ఈ నవల రాశారని అనువాదకురాలి ముందుమాట. ఆయన దగ్గర ముడిసరుకు ఎంత పుష్కలంగా ఉందో మనకు తెలీదుగానీ, ఆయన రచనాపాటవం మాత్రం కట్టిపడేస్తుంది. ప్రతి దృశ్యం మన కళ్ళ ముందు కదలాడుతున్నంత స్పష్టంగా కనిపిస్తుంది. నవల ఆరంభంలో ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో “యమున” అనే తొమ్మిదేళ్ళ చిన్నారికి పెళ్ళిసంబంధాల కోసం తర్జనభర్జన పడుతున్న కుటుంబంతోనే కాదు, వాళ్ళుంటున్న పాడుబడ్డ బంగళాతోనూ, వాళ్ళ వాసరాతోనూ, బావితోనూ, ఆ బంగళా మధ్యలో ఊగే ఉయ్యాలతో కూడా మనకి అంతే సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కథ జరుగుతున్న పరిస్థితులను, పరిసరాలను మనకి పరిచయం చేయడమే కాకుండా అందులో మనల్ని భాగం చేయడంలో ఈ రచయిత సఫలీకృతమయ్యారు. అందుకనేనేమో, అప్పటి ఆచారవ్యవహారాలు ఇప్పటికాలంలోని పాఠకులకు విడ్డూరాలే అయినా, పాత్రలతో empathize అవ్వడానికి అట్టే ఇబ్బందులు కలుగవు.

ఇహ కథ విషయానికొస్తే, మహారాష్ట్రలో ఉండే ఒక సనాతన కుటుంబం, ఆడపిల్లకు పెళ్ళీడు దాటిపోతున్నా, ఇంకా కాళ్ళు కడగలేకపోయామే అని విచారిస్తూ ఉంటారు. ఆ పిల్ల పేరు “యమున”. ఇంట్లో అంతా “యము” అని పిల్చుకుంటారు. పిల్లా అందంగా ఉండదు. డబిచ్చి పెళ్ళి చేద్దామంటే పేరుకి భూస్వామే అయినా ఆర్థికంగా దయనీయ పరిస్థితి. ఇంతలో ఒక సంబంధం వస్తుంది. పెళ్ళికొడుక్కిది రెండో పెళ్ళి. చూస్తూ చూస్తూ పిల్లను రెండోపెళ్ళివాడికిచ్చి చేయటమే! అని విచారిస్తూనే వచ్చిన సంబంధాన్ని కాళ్ళదన్నుకోలేక ఒప్పుకుంటారు. ఆ పెళ్ళికొడుకే గోపాల్. అతడు కాస్త తిక్క మనిషని, ఎవరితోనూ కల్సుండడని, మొదటి భార్యను చదువుకోమంటూ కొట్టి కొట్టి చంపేశాడనీ అంతా అనుకుంటూ అంటూ ఉండేవారు. అసలు అతగాడు ఒక విధవను పెళ్ళాడని ఉబలాటపడతాడు. స్త్రీ జనోద్దారణ లక్ష్యంగా పెట్టుకున్న అతడికి ఆ కోరిక నెరవేరకపోగా అవమానాలు ఎదురవుతాయి. గత్యంతరం లేక తొమ్మిదేళ్ళ పిల్లనే పెళ్ళాడ్డానికి స్వీకరిస్తాడు, అయితే ఒక షరతు మీద – “పెళ్ళయ్యాక నా భార్యకు నేను చదువు చెప్పుకుంటాను. ఎవరూ అడ్డురాకూడదు.” ఏవో పిచ్చి వాగడులే, అన్ని రకాల పిచ్చికి విరుగుడు పెళ్ళి కదా అని ఆ మూడు ముళ్ళ తతంగం కానిస్తారు. అలా “యమున” అంకం సమాప్తమై “ఆనంది గోపాల్” ఆవిర్భవిస్తుంది.

అదో సంధికాలం. భారతీయ సనాతన జీవనవిధివిధానాన్ని పాలకుల పాశ్చాత్య సంస్కృతి ఎద్దేవా చేస్తున్న కాలం. సంఘసంస్కరణలు జరుగుతున్నాయి, భారతీయ ఆచారవ్యవహారాల్లో మార్పులు రావటానికి కొందరు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదే మరో పక్క మరికొందరు తమకు అలవాటైన జీవితాన్ని వదులుకోలేకపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో, గోపాల్ స్త్రీ విద్య వల్ల సమాజం మెరుగుపడుతుందని బలంగా నమ్మినవాడు. అందుకు ఎంతదూరమైనా వెళ్ళడానికి సాహసించినవాడు. పెళ్ళిమాటలు అనుకుంటున్నప్పుడు అతడు పెట్టిన షరతు, పెళ్ళైన కొత్తల్లోనే అమలుపరిచాడు. పగటిపూట భర్త దరిదాపుల్లో భార్య కనిపించకూడదు. అతడు మాత్రం ఆమెను దగ్గర కూర్చోబెట్టుకొని చేయి పట్టుకొని అక్షరాలు దిద్దించేవాడు. ఇంకా పుట్టింటే ఉంటున్న ఆ జంట వ్యవహారం చూసి ఇరుగుపొరుగు నోళ్ళు నొక్కుకునేవాళ్ళు. ఆనంది తల్లి ఆమెను చితకబాదేది. వాళ్ళ అమ్మమ్మ గోపాల్ ను ఆడిపోసుకునేది. కన్నబిడ్డ నిస్సహాయ స్థితికి, అల్లుడి పట్టరాని పట్టుకి, భార్య నోటి దురుసుతనానికి మధ్యన ఆనంది తండ్రి కూరుకుపోయి, కుమిలిపోయేవాడు. అయినా గోపాల్ తన పట్టు వదల్లేదు.

ఆనంది కాపురానికి వచ్చాక ఆమెకు వంటావార్పూ, ఇల్లు చక్కబెట్టుకోవటం లాంటివేం చెప్పలేదు. వీలైనంత చదువుకోమన్నాడు, గోపాల్. ఆమె రోజురోజుకీ పురోగతి సాధించింది. అతడింకా ఇంకా ప్రోత్సహించాడు. ఆమె ఇంకా ఇంకా ఆరితేరింది. ఇంతలో వాళ్ళకో మగసంతానం కలిగింది. గోపాల్ ఒక్క నిముషం “అయ్యో ఆడపిల్లైతే చదివించుకునేవాడిని కదా!” అని వాపోతాడు. కానీ ఆ పసివాడు కొన్ని వారాలకే కన్నుమూస్తాడు. బిడ్డను కోల్పోవటమంటే ఏంటో ఆ పదమూడేళ్ళ ప్రాయానికి ఇంకా అర్థం కాదు. అతడు, పోయిన బిడ్డ ఎటూ పోయాడు కాబట్టి, మళ్ళీ చదువు మీద దృష్టి పెట్టమంటాడు. ఆ సందర్భాన్ని వివరిస్తూ రాసిన కొన్ని వాక్యాలు, మచ్చుకు ఇక్కడ:

They looked at each other. His shirtless thin body, showing all the ribs, a single lock of hair on his tonsured head ruffling in the wind, his glistening eyes outshining the oil lamp and Anandi, just thirteen, her body plumpish after childbirth, her skin paler. They were in an ecstatic trance. She was hypnotized. She was not herself. There was a strange glow in her husband’s eyes, like a flame of the holy torch. She was like a firefly drawn by that flame.
– Chapter 11, page no.107

ఆనంది మళ్ళీ చదువుకోవటం మొదలెడుతుంది. తాను చెప్పగలిగిందంతా చెప్పాక, ఆమెను మిషినరీలు నడిపిస్తున్న బడికి పంపాలని అనుకుంటాడు. కానీ అంత తేలికైన పని కాదు. అప్పటి పరిస్థితుల్లో అసలు ఆడపిల్ల గడప దాటడమే కూడని పని. ఇహ, క్రిస్టియన్సు చూసినా, తాకినా స్నానం చేస్తేగానీ ఇంట్లోకి వెళ్ళని ఆచారాలు. అటు బ్రిటిషు ప్రభుత్వం కోసం పనిచేసే ఆంగ్లేయులు నిమ్నవర్గాలకు చెందిన హిందువులను క్రైస్తవ మతానికి మార్చడానికి వాళ్ళు చేసే ప్రయత్నించినా, స్థానికులను హీనంగా, నీచంగా చూసేవారు. గోపాల్ తన చుట్టుపక్కలుండే మనుషులను, వాళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారో అన్నీ బేఖాతరు చేయడంలో దిట్ట. కానీ క్రైస్తవ మతానికి మారకుండా భార్యను ఆ బడిలో చదివించడానికి, ఆమె విదేశాలకు వెళ్ళే మార్గం సుగమం చేయడానికి పన్నిన ఎత్తుగడలు చదివి తెల్సుకోవాల్సిందే! భార్యనో, కూతుర్నో చదివించేసుకొని ఏదో పేరు గడించేయాలన్న అత్యాశ కాదు గోపాల్ ది, అతడు నిజంగానే తన భార్య చదువు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడని అతడు ఇక్కడ వ్యవహరించిన తీరును బట్టి ఊహించచ్చు.

గోపాల్ ప్రణాళికలు, ఆనంది శ్రద్ధాభక్తులు పండి ఆనందికి అమెరికాలో చదువుకునే అవకాశం వస్తుంది. కానీ తోడుగా గోపాల్ వెళ్ళడానికి కుదరదు. గడపే దాటకూడని పిల్ల సప్తసముద్రాలు దాటుతుందంటే ఊరు ఊరంతా గగ్గోలు పెడుతుంది. గోపాల్ ని పురుగును చూసినట్టు చూస్తారు. అయినా ఆనందిని ఒంటరిగా అంత దూరం పంపిస్తాడు. ఆమె అమెరికా చేరుకొని మెడిసిన్ చదువు పూర్తిచేస్తుంది. ఆ దేశంలో ఉండే వాతవరణానికి కూడా మన దేశ ఆచార ప్రకారమే బట్టలు వేసుకోవటం, తిండి కూడా కేవలం శాకాహారమే అవ్వటం వల్ల ఆమె ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటుంది. డిగ్రీ తీసుకున్న వెంటనే భారతానికి తిరిగివస్తుంది. కానీ అప్పటికే ఆమె మృత్యువు దాదాపుగా ఖరారవుతుంది. అది డాక్టర్ అయిన ఆనందికే అందరికన్నా బాగా తెలుస్తుంది. బయటకు వెళ్ళొచ్చిన మనిషి కాబట్టి ఆమెకు వైద్యం చేయడానికి ఇక్కడి మూలికా వైద్యులు నిరాకరించటంతో ఆమె కన్ను మూస్తుంది. తిరిగొచ్చాక ఆమె ఇక్కడ వైద్యసేవలు ప్రారంభించాలన్న కల అలానే మిగిలిపోతుంది. “మేమిద్దరం ఇంత తపస్సు చేశాక, మధ్యలో మృత్యువెలా వచ్చి చెడుపుతుంది?” అని జబ్బు మొదట్లో వాపోయిన ఆనంది, మృత్యువును దగ్గరగా చూసినప్పుడు అన్న మాటలు:

“When I see these twinkling lights I always think that Death entices you in the same manner. The realm of Death from a distance must look like this. Mysterious! Dark! And still beautiful.”

“If you stand in the realm of Death, the realm of Life would look the same. From there, Life would be so mysterious, dark and beautiful. Death would be scared of Life’s enticing eyes, just the same as we fear Death. But neither Death nor Life is awesome or put another way: Life is awesome and so is Death.”

ఆనంది తుది శ్వాస విడవడంతో పుస్తకం ముగుస్తుంది. ఆ తర్వాత గోపాల్ ఏమైపోయాడో ఊహించుకోవడమే కష్టంగా ఉంది. ఇది ఆనంది కథ మాత్రమే కాదు, గోపాల్ కథ కూడా! ఇద్దరి మధ్యనున్న సంబంధం ఎలాంటిదైనా, ఒకరి కోసం మరొకరు తమ సర్వస్వం అర్పించటం అనేది అపురూప ఘట్టం. ఈ ఈక్వేషన్ లో పుచ్చుకునేవాళ్ళదే అదృష్టం అనుకున్నాను ఇన్నాళ్ళు, కానీ ఓ జీవితానికి దిశ, దశ కలిగించే అవకాశంలోనూ గొప్ప అదృష్టం ఉంది. గోపాల్ మహితాత్ముడు, మహాపురుషుడు అని నేనటం లేదు. విదేశాల్లో ఒంటరిగా ఉన్న ఆనందిని అనుమానించాడు, అవమానించాడు. అసలు అతగాడిని అర్థం చేసుకోవటమే ఒక మహా ప్రహేళిక. ఇహ, అతడితో సహజీవనం ఏ క్షణం స్వర్గమో, ఏ క్షణం నరకమో తెలియని ఊగిసలాట. అయినా కూడా, నా దృష్టిలో గోపాల్ ఒక విశిష్ట వ్యక్తిత్వం కలవాడు. ఈ రచనకు ముందుమాటగా రాసిన ఒకానొక వ్యాసంలో ఆనంది అంత దూరం వెళ్ళి, అంత చదువులు చదివి కూడా భర్త చెప్పుచేతల్లో ఉంది – దీన్ని మగాధిపత్యం అనుకోవాలా? ప్రాతివత్ర్యం అనుకోవాలా? అని వాపోయారు వ్యాసకర్త. నన్నడిగితే ఆ రెండూ కాదు. “I’ve made the most important discovery of my life. It’s only in the mysterious equation of love that any logic or reasons can be found.” అన్న జాన్ నాష్‍కే నా ఓటు ఇక్కడ.

ఫెమినిస్ట్ ఉద్యమాల గురించి గానీ, వాళ్ళు సాధించిన విజయాలు గానీ నాకు తెలీవు. మగవాళ్ళతో సమానం పోటీపడే అవకాశాలు మా తరం వచ్చేటప్పటికి “నార్మల్” అవ్వటానికి ముందు ఎన్ని తరాలు ఎన్ని విధాల పోరాటాలు చేశారో నాకు తెలీదు. ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఒకటే అనిపించింది – మనుషులు తమ చుటూ తామే గీసుకున్న గిరిని, ఆ మనుషుల్లోనే కొందరు చెరపగలరు. అలా చెరపడానికి వాళ్ళు నానా యతనా పడతారు. పిచ్చివాళ్ళుగా  పరిగణించబడతారు. కానీ వాళ్ళ వల్లే ప్రపంచం మెరుగుపడుతూ ఉంది అనుకుంట.

నేను చదివింది అనువాదమే అయినందుకు కొంత బాధ కలిగింది. భారతీయ సమాజంలో జరిగిన కథ భారతీయ భాషల్లో ఉంటే ఆ అందమే వేరు. అనువాదం ఆశా దామ్లే ఎంత అందంగా చేసినా, పెళ్ళిమంటపం, ముగ్గులాంటి పదాలకు ఇంగ్లీషులో కొన్ని పదాలు చదువుకోవాల్సి రావటం నాకు ఇబ్బందిగా అనిపించింది. ఇది abridged version పైగా, అసలు మూలంలో ఇంకెంతుందో మరి.

ఈ పుస్తకం కోసం గత నాలుగైదేళ్ళుగా వెతుకుతున్నప్పుడు ఒక nostalgic feel ని శాంతపర్చటం కోసమే వెతికాను. పుస్తకం చదివాగ్గానీ అసలిదెంత priceless work  అన్నది అర్థం కాలేదు. తొట్టతొలి భారతీయ మహిళా డాక్టర్ జీవిత చరిత్ర మాత్రమే కాదు. అన్యోన్యత సంగతేమో గానీ ఇద్దరూ ఒకే తపస్సులో ఏకమైన అరుదైన దంపతుల కథ మాత్రమే కాదు. ఆ తపస్సుకు తమ వాళ్ళే భంగం కలిగిస్తుంటే బెదరక, జడవక వాళ్ళు ముందుకు సాగిన తీరు. అప్పటికింకా “కుచ్ తొ లోగ్ కహెంగె” అన్న పాట విడుదల కాలేదు కాబట్టి, ఆ జంట ఈ కింద పద్యాన్ని గుర్తుచేసుకుంటూ ఉండేవారు.

Everyone in this world is your slave
I salute thee, O Tradition!
None else has such powerful sway!

O Tradition! You have such
Unparalleled hold on society
No science can ever trade
In your territory.

ఇందులో కొన్ని ఆచార వ్యవహారాలు, మనుషుల ప్రవర్తన ఇప్పటి కాలంలో కొద్దిగా విడ్డూరంగా ఉండచ్చేమోగానీ, కారణాంతరాల వల్ల ఆడపిల్ల ఒంటరిగా ఇంటికి దూరంగా ఉంటుందని తెల్సీతెలియగానే అర్జెంటుగా జాలిపడిపోయేవాళ్ళు, పాతికేళ్లు దాటుతున్న పెళ్ళికాని అబ్బాయిలకు, అమ్మాయిలకు (వాళ్ళ జీవితాల గురించి గానీ, వాళ్ళ సమస్యల గురించి గానీ ఏ మాత్రం అవగాహన లేకపోయినా) ఉచిత సలహాలతో సిద్ధంగా ఉండేవాళ్ళు, పెళ్ళైన రెండుమూడేళ్ళలోగా బారసాల పిలుపులు రాకపోతే గగ్గోలు పెట్టేవాళ్ళు, ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా పుష్కలంగా ఉన్నారు కాబట్టి, ఇది out-of-place బుక్ కాదు. శతాబ్దాలు మారినా, మన సమస్యల స్వరూపాలు మారుతున్నా, ఇలాంటి రచనల్లో నుండి కలిగే ప్రేరణ కొండంత బలం.

(గమనిక: నేను దీన్ని ఒక నవలగా మాత్రమే చదివాను. ఇక్కడి నా వ్యాఖ్యానాలు ఆ కల్పిత పాత్రల గురించేగానీ, చరిత్రలో జరిగిన విషయాల గురించి కాదు.)

 కొన్ని లంకెలు:

1. ఆనంది గోపాల్ గురించి వికి పేజి.

౨. ఆనంది రాసిన ఒక ఉత్తరానికి స్కాన్ కాపీ ఇక్కడ చూడొచ్చు.

౩. ఆనంది జీవితం గురించి క్లుప్తంగా..

౪. లీలావతిస్ డాటర్స్ పుస్తకంలో ఆనంది గురించి ఉన్న కొన్ని పేజీలు ఇక్కడ. ఈ పుస్తకంపై పరిచయ వ్యాసం పుస్తకం.నెట్ లో ఇక్కడ.

5. ఆనంది గోపాల్ జీవిత సంఘర్షణను వివరించే ఓ డాక్యుమెంటరిపై పరిచయ వ్యాసం ఇక్కడ.

౬. ఉపోద్ఘాతంలో ప్రస్తావించిన దూరదర్శన్ సీరియల్ టైటిల్ ట్రాక్ ఇక్కడ. (క్వాలిటి బాలేదు.)

You Might Also Like

9 Comments

  1. Nagini

    చాలా మంచి పరిచయం పూర్ణిమ గారు..చదవాలనే ఆసక్తి కలిగించారు.

  2. పుస్తకం.నెట్

    Koumudi magazine’s audio talk show about Anandi’s life can be found here:

    http://www.youtube.com/watch?v=pnaZQcsBEfQ

  3. rv

    మరో బయాగ్రఫీ (1888) : http://archive.org/details/lifeofdrananabai00dalliala

    మెరుగైన ఆడియో ట్రాక్ : http://www.mediafire.com/?vcyvhlm1q2q0qa1

  4. కొత్తపాళీ

    “అలా చెరపడానికి వాళ్ళు నానా యతనా పడతారు. పిచ్చివాళ్ళుగా పరిగణించబడతారు. కానీ వాళ్ళ వల్లే ప్రపంచం మెరుగుపడుతూ ఉంది అనుకుంట.”
    Absolutely.

  5. Srinivas Vuruputuri

    మనసులో మోగే టైటిల్ సాంగ్ ఆలాపన, చప్పున గుర్తుకు వచ్చిన సినిమా పాట, గెస్టప్పియరెన్సు సానుభూతి పరులు, ఉచిత సలహాదారులు, అసందర్భ వ్యాఖ్యాతలు…

    మీ పరిచయం లైవ్లీగా ఉంది.

    సంప్రదాయం గురించి మీరు కోట్ చేసిన పద్యం మరాఠీలోనో సంస్కృతంలోనో ఉండి ఉండాలనుకుంటున్నాను. గూగుల్ వేటలో మూలం దొరకలేదు.

    పుస్తకం (అనువాదం) మార్కెట్టులో లేదేమో…

    1. సౌమ్య

      ఆ పుస్తకంలో పద్యం నాకు గుర్తున్నంతవరకూ ఆంగ్ల పద్యమేనండీ. కానీ, ఇందులో ఆ పద్యం రాసినదెవరో చెప్పారా? అన్నది పూర్ణిమే చెప్పాలి. నాకైతే గుర్తులేదు సోర్స్ చెప్పినట్లు.
      ఈ ఆంగ్లానువాదం మార్కెట్లో లేదట. దీని గురించిన సమాచారం కోసమని రెండు నెలల క్రిందట పబ్లిషర్లకి ఈమెయిల్ చేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇంగ్లీషు లో ముద్రించే ఉద్దేశ్యం లేదన్నారు. కావాలంటే మరాఠీలో చదువుకొమ్మని ఉచిత సలహా కూడా చెప్పారు నాకు 🙂

    2. Purnima

      అవును, ఆ పద్యానికి మూలం అయితే మరాఠిలోనో లేక సంస్కృతంలోనో ఉంటుందని నాకూ అనిపించింది. నేను శ్రద్దగానే చదివాను, నాకెక్కడా సోర్సు ఇచ్చిన గుర్తులేదు. మరాఠి రచనను చూస్తే ఏమైనా తెలియవచ్చును.

      పుస్తకం మార్కెట్టులో లేదు. వచ్చే అవకాశాలు కూడా కనపడ్డం లేదు. పాత పుస్తకాల కొట్లు, లైబ్రరిలే శరణ్యం.

  6. Krishna

    Aa serial, aa muggu, aa pata inka naku kuda gurtu unnay…..Naku kuda aa pata, muggu baga nachayi…serial artham kaaledanukunta kaani…

    Manchi parichayam

Leave a Reply