Kasab: The Face of 26/11

కసబ్ జీవితగాథను ఆధారంగా చేసుకొన్న ఈ పుస్తకాన్ని రెండేళ్ళ బట్టీ పుస్తకాల షాపుల అరలలో చూస్తూ కూడా, “కళ్ళముందు జరిగినదానికి కామెంటరీ ఎందుకు?” అని అనుకొని పుస్తకం చేతుల్లోకి కూడా తీసుకోలేదు. మొన్నే కసబ్‍ను ఉరి తీశాక, ది హిందులో వచ్చిన ఒకానొక వ్యాసంలో, వ్యాసకర్త “అలా అనుకొని పొరబడ్డానుగానీ ఈ పుస్తకం చదవాల్సిందే!” అన్న వాక్యం చదివి, పుస్తకం చదవాలని నిర్ణయించుకున్నాను. అనుకోకుండా పుస్తకం దొరకటం, నేను చదవటం – రెండూ అయ్యాయి.

26/11/2008 తేదిన ముంబైలో జరిగిన దాడుల్లో వందల వంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో క్షతగాత్రులైయ్యారు. తీవ్రవాద దాడులు కొత్తకాకపోయినా, ఒకరకంగా అలవాటుపడిపోయినా, ఈ దాడులు మాత్రం అందర్నీ నిశ్చేష్టులను చేశాయి. మూడు రోజుల పాటు జరిగిన హోరాహోరీ పోరులో తీవ్రవాదులందరూ హతమయ్యారు. కానీ ఒక్కడు మాత్రం పట్టుబడ్డాడు. అతగాడి పేరు ఆ తర్వాత అందరి నోట్లో నానింది. నానుతోంది. ఛత్రపతి శివాజి టర్మినల్ వద్ద ఎ.కె.47 పట్టుకొని నించున్న అతగాడి ఫోటో ఆ దాడులకు ముఖచిత్రంగా మారింది. అందుకే ఈ పుస్తకం పేరు కూడా “Kasab: The Face of 26/11” అని పెట్టారు. పేరుకు తగ్గట్టుగానే పుస్తకం అద్యంతం కసబ్ జీవనయానం గురించే.

పుస్తకం మొదలవటం కసబ్ పూర్వీకుల నుండి మొదలవుతుంది. కసబ్ అనే ఇంటిపేరు, వారి వృత్తి “కసాయి” నుంచి పుట్టింది. కసబ్ తండ్రి మాత్రం కసాయి పనిచేయకుండా, తోపుడుబండి మీద చిల్లరతిండ్లు అమ్ముకునే వ్యాపారం చేసేవాడు. ఎప్పుడూ చాలీచాలని సంపాదన. దానికి తోడు అనారోగ్యం. అట్లాంటి ఇంట్లో పుట్టిన అజ్మల్ కసబ్ కు, ముందు నుండీ దూకుడెక్కువ. ఊరికే నోరుపారేసుకునేవాడు. ఆ నోటిదురుసుతనానికి అశ్చర్యపోయిన తల్లి ఒకసారి “వీడు పెద్దైతే ఏ బందిపోటో అవుతాడేమో!” అని వాపోయింది. దానికి అజ్మల్ “నేనలా చిల్లరి దొంగను కాను. పెద్ద తుపాకి కాలుస్తాను. నేనంటేనే అందరూ భయపడతారు.” అని ప్రకటించాడు. ఏ తథాస్తు దేవతలు ఖాళీగా ఉన్నారే ఏంటో, పట్టుమని ఇరవై ఏళ్ళు వచ్చాయో లేదో అజ్మల్ చిన్ననాటి నోటిమాట నిజమైయ్యాయి.

అలా అతడి బాల్యం గురించిన కొన్ని కబుర్లు చెప్పాక, అతడు అన్నగారితో పాటు లాహోర్ వచ్చి రోజుకూలి పనికి వెళ్ళటం, అక్కడది నచ్చక వెళ్ళిపోవటం, చెడు సావాసాలు పట్టటం, ఇంట్లో గొడవపడి బయటకొచ్చేసి ఏవో చిల్లర దొంగతనాలకి మొదటి ప్రయత్నించి, చివరకు లష్కర్ సభ్యులకు పరిచయం అవ్వటం, అక్కడ నుండి కఠిన శిక్షణలో ఆరితేరటం – ఇవ్వన్నీ చకచకా అయిపోతాయి. ఆ తర్వాత నుండి అసలు కథ మొదలవుతుంది. అజ్మల్ తో పాటు ఓ పది మంది తీవ్రవాదులని పాకిస్థాను నుండి నౌకాయానం ద్వారా భారత్ కు ఎలా తరలించిందీ, ముంబైను ఎప్పుడూ చూడని ఆ పదిమందికి వీధివీధిని గుర్తుపట్టేలా శిక్షణ ఇచ్చినదీ, ఆ పై ఆ పది మంది ముంబైలో చేసిన మృత్యుతాండవం, దానికి గడగడ వణికిన జనం, ప్రాణాలకు తెగించి వారిని హతమార్చిన పోలీసు సిబ్బంది – ఇవీ ఈ పుస్తకానికి కీలకం. ఛత్రపతి శివాజి టర్మినల్ లో కసబ్, అతడి సహచరుడూ తూటాల వర్షం కురిపిస్తూ ఉంటే నేలరాలిన వారి నేపథ్యం, అర్థాంతరంగా ముగిసిన వాళ్ళ జీవితాల గురించి, తర్వాత కామా హాస్పటల్ సిబ్బంది తమ రోగులను కాపాడుకున్న తీరును గురించి రచయిత రాయడం వల్ల ఈ పుస్తకం కేవలం ఒక bunch of eventsగా కాకుండా, ఒక emotional entity అన్న భావన కలిగిస్తుంది. అదొక్కటే ఈ పుస్తకానికి ప్లస్ అని నా ఉద్దేశ్యం.

ఆ తర్వాత కసబ్ దొరికిపోవడం, అతడి వాంగ్మూలం, అతడు కేస్ నడిచిన తీరు ఇవ్వన్నీ వార్తలను ఫాలో అవుతున్న అందరికీ తెల్సిన కథే! ఈ పుస్తక రచయిత న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికవిలేఖరి. వీలైనంత సమాచారాన్ని ఇస్తూనే పఠనం దెబ్బతినకుండా రాసుకొచ్చారు. చాలా శ్రమకోర్చి ఒక దగ్గర చేర్చిన – ముఖ్యంగా పాక్ లో లష్కర్ పాతుకుపోయిన తీరు గురించి – విషయాలు ఆసక్తికరంగా అనిపించాయి. పుస్తకం మాత్రం అర్థాంతరంగా ఆగిపోయినట్టు అనిపించింది. అప్పటికి కసబ్ ను ఉరితీయకున్నా, ముగింపు వాక్యాలు కొన్ని ఉండి ఉంటే బాగుండేది.

ఈ పుస్తకం కొని బిల్లింగ్ చేయిస్తున్నప్పుడు, షాపులో ఓ కుర్రవాడు “కసబ్ ను ఉరితీసేశారుగా, ఇంకెందుకు చదవటం?” అని అడిగాడు నన్ను. “అందుకే!” అని చెప్పాను. పుస్తకం చదువుతూ, చదువుతూ ఆఫీసుకు పట్టికెళ్తే, కొలీగ్ కూడా “ఇహ వీడిక్కూడా బయోగ్రఫీ ఆ?” అని అన్నప్పుడు, “వాడి గురించి మాత్రమే కాదులే! మొత్తంగా ఒక క్లియర్ పిక్చర్ వస్తుందనీ..” అంటూ సమర్థించుకున్నాను. సి.ఎస్.టిలో జరిగిన మారణహోమం మళ్ళీ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటే ఉక్కిరిబిక్కిరయ్యాను. “కసబ్” అన్న పేరే ఆ కొద్ది గంటలు నన్ను బయపెట్టింది. ఆ పై చదవకూడదనుకున్నాను గానీ మళ్ళీ కొన్ని గంటల తర్వాత పుస్తకం పూర్తిచేశాను. అంతా అయ్యాక మాత్రం ఈ పుస్తకం నన్ను నిరాశకు గురిచేసింది. అసలు ఈ పుస్తకం కసబ్ చుట్టూనే ఎందుకు తిరగాలి? మిగిలిన తీవ్రవాదులవీ ఇలాంటి జీవితాలే కదా, ఎంచుమించు? కేవలం కసబ్ చంపిన వాళ్ళ గురించి, కసబ్ ను ఎదుర్కున్న వాళ్ళ గురించే తెల్సుకోవటం వల్ల వచ్చేది ఏంటి? తాజ్ హోటల్ లోనూ, నారిమన్ హౌస్ లోనూ జరిగిన ఘోరాలను ఎలా పక్కకుపెట్టేయగలం? కసబ్ దొరికేసరికే జరగాల్సినదంతా జరిగిపోయింది కూడాను. వచ్చిన పదిమంది దుండగుల్లో కసబ్ మాత్రమే ఎలా ప్రత్యేకమో నాకు అర్థం కాలేదు. కసబ్ ఏ విధంగా the face of 26/11? అన్న ప్రశ్న కూడా కలిగింది. ఈ పుస్తకాన్ని రెండేళ్ళ బట్టి దూరంగా ఉంచినందుకు నాకేం రిగ్రెట్స్ లేవు. ఇప్పుడు చదివినందుకు మాత్రం కొద్దో గొప్పో “లైట్ తీసుకొని ఉండాల్సింది.” అని అర్థమయ్యింది.

నన్ను పుస్తకం చదివేలా ప్రేరేపించిన సమీక్ష ఇక్కడ.

తీవ్రవాదుల నేపధ్యంగా వచ్చిన పుస్తకం,  A Mighty Heart  పరిచయం ఇక్కడ.

 

You Might Also Like

2 Comments

  1. pavan santhosh surampudi

    డిసెంబర్ 26 తర్వాత ఓ మూణ్ణాలుగు రోజులు నాకు సరైన నిద్ర లేదు. నేను ఆ మారణహోమంలో చిక్కుకుపోయినట్టు, కావాల్సినవాళ్లంతా నాతోనే ఉన్నట్టు భయంకరమైన కలలు. అన్నింటికన్నా ముఖ్యంగా నారిమన్ హౌస్, తాజ్ హోటల్ ఘటనలు దారుణంగా కలచివేశాయి నన్ను.
    ఆపై ముంబైకి వెళ్లినప్పుడు ఎంత తేలిగ్గా సముద్రంపై బోట్ మీంచి గోడ దూకినట్టు దూకి రోడ్డు మీదకు వచ్చే వీలుందో చూసి మహాబాధపడిపోయాం. ఛత్రపతి శివాజీ టెర్మినల్లోని రెండవ ఫ్లోరులో పెద్ద వ్యాపారం లేని పాత హోటల్ యజమాని ఆనాటి దుస్సంఘటన వర్ణిస్తూంటే వణికిపోయాం.
    ఇంకా ఈ పుస్తకం చదివి బాధపడాలా? ఇంకో వారం రోజులు నిద్ర లేకుండా కూచోవాలా? మనసు కలత చెందుతుందని భయంతో లజ్జ మళ్లీ పట్టుకోనివాణ్ణి ఈ పుస్తకం కొని మరీ బాధపడాలా? నా వల్ల కాదు.

Leave a Reply