పుస్తకం
All about booksపుస్తకభాష

May 22, 2012

A Mighty Heart – Mariane Pearl

More articles by »
Written by: Purnima
Tags:

ఓ పదేళ్ళ కిందట, ఈనాడు ఆదివారంలో “ఇది కథ కాదు” శీర్షికన, పాకిస్థాన్ లో ఉద్యోగనిర్వహణలో ఉండగా అపహరించబడి దారుణంగా హత్యచేయబడ్డ అమెరికా జర్నలిస్ట్ కు సంబంధించిన వ్యాసం చదివినప్పుడు నాకు మొట్టమొదటిసారిగా డానియల్ పర్ల్ గురించి తెలిసింది. నాకు గుర్తున్నంతలో ఆ వ్యాసం కూడా ఆయన భార్య మెరియన్ పర్ల్ స్వగతంగా సాగుతుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆవిడే ఆయన హత్యోందంతం గురించి పుస్తకం రాశారని, దాని పేరు “A Mighty Heart” అని తెలిసింది. మరి కొన్నాళ్ళకు అంజనీలా జోలీ ప్రధానపాత్ర ఈ పుస్తకం ఆధారంగా, అదే పేరుతో సినిమా విడుదలయ్యింది. నిరుడు, ఏదో సేల్, మరీ చవగ్గా వస్తుంటే పుస్తకం కొన్నా, గడిచిన వారాంతం వరకూ తెరవలేదు. తెరిచాక ఆగలేదు.

డానియల్ పర్ల్ “వాల్ స్టిట్ జర్నల్” విలేఖరి. 2001-2002 ప్రాంతంలో ఉద్యోగనిర్వహణలో భాగంగా దక్షిణాసియాకు వచ్చారు. కొన్నాళ్ళు ముంబాయిలో ఉన్నారు. ఆయన భార్య మెరియన్ కూడా జర్నలిస్ట్. ఇద్దరూ చేసే వృత్తి ఒకటే కావటం వల్ల, ఒకరిపై ఒకరికి పేమాభిమానాలు కలగటం చేత, వారిద్దరి మధ్య బంధం వికసించింది. వేరువేరు పత్రికలకు పనిచేస్తున్నా, వీలైనంతగా కల్సి ప్రయాణించేవారు. అలానే డిసెంబరు 2001లో పాకిస్థాన్ లోని కరాచికి ప్రయాణించారు. అప్పటికి మరియన్ ఆరునెలల గర్భవతి. అక్కడ చిట్టచివరి పని (గిలానీ అనే పాకిస్థాన్ నాయకుడిని ఇంటర్వ్యూ చేయటం) పూర్తిచేయడానికి వెళ్ళిన డానియల్ ఇంటికి తిరిగిరాడు. ఐదు వారాల పాటు, ఆయన కుటుంబం, పాకిస్థాన్ ఇంటలెజెన్స్, అమెరికా చేసినా ప్రయత్నాలు ఏవీ ఫలించక, అపహరించిన దుండగుల ఆయనను దారుణాతి దారుణంగా చంపి, ఆ వీడియోను విడుదల చేయటంతో ఆయన మరణవార్త ప్రపంచానికి అందింది. ఏ తీవ్రవాద చర్య తరువాతైనా జరిగే తంతే ఇక్కడా జరిగింది – ప్రపంచం ఉలిక్కిపడింది. డానీ ఆప్తులు శోకసంద్రంలో మునిగారు. ఆయన తప్పిపోయాక మాత్రమే ఆయన గురించి తెల్సిన వాళ్ళు సంతాపం, సానుభూతి వెలిబుచ్చారు. నాయకులు శాయశక్తులా ఖండించారు. న్యాయం కావాలి అని అమెరికా వత్తిడి చేసింది. పాకిస్థాన్ ఓ ఇద్దరు, ముగ్గురిని జైల్లో బంధించింది.

అక్కడితో కథ ముగిసి కాలం మాటున మరుగున పడిపోయుండాల్సిందేకానీ, పడలేదు. అందుకు ఓ ముఖ్యకారణం మరియన్. విపత్కర పరిస్థితుల్లో కూడా ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. భర్తను అన్వేషించటానికి అరకొర సదుపాయాలతోనే పనిచేసింది. నిస్పృహ నిరాశాల్లో పడికొట్టుకుపోకుండా, ఆశే ఊపిరిగా ఆయన విడుదల కోసం శ్రమించింది. భర్తను దారుణంగా చంపారని తెల్సి కూడా, ఆ దుండగుల దేశాన్నో, మతాన్నో అసహ్యించుకోలేదు. నేరం చేసినవారిని తప్పుబట్టిందేకానీ, ప్రపంచాన్ని దుయ్యబట్టలేదు. భర్త మరణం ఖరారయ్యాక, కరాచి వదిలివెళ్ళి, నాలుగు నెలలలో ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తండ్రికి దగ్గ తనయుడిగా ఆ బిడ్డను తీర్చిదిద్దాలని, బాధను దిగమింగుతూ జీవిస్తోంది. కరాచి అనుభవాలను పుస్తకరూపేణ తీసుకొచ్చింది. డానియల్ పర్ల్ పేరిట ఓ సంస్థను స్థాపించింది.

అదీ ఈ పుస్తకం సారాంశం. మరియన్ ఫ్రాన్స్ దేశస్థురాలు కావటంతో, ఆవిడకు ఈ పుస్తక రచనలో “సారా క్రిచ్టన్” సాయపడ్డారు. డానీ అపహరణకు గురైన రోజు మొదలుకొని బాబు పుట్టే వరకూ జరిగిన ముఖ్య ఘటనలన్నీ పొందుపరచటానికి ప్రయత్నించారు. “ఎపిలాగ్”లో డానీ హత్యతో సంబంధం ఉన్నవాళ్ళు, డానీని విడుదల చేయించడానికి విపరీతంగా కృషి సల్పినవారందరూ ఆ తర్వాత ఏమేం ఎదుర్కున్నారో చెప్పుకొచ్చారు. డానీ విడుదలకు నిజాయితీగా పనిచేసిన పాక్ అధికారులందరూ ఆ తర్వాత తమతమ ఉద్యోగాలను వదులుకోవాల్సి వచ్చింది. అమెరికా వత్తిడి వల్ల డానీని కిడ్నాప్ చేసిన ఒమర్ సయీద్ షేక్ (ఇండియన్ ఎయిర్‍లైన్స్ 814ను హైజాక్ ఘటనలో, భారత ప్రభుత్వం ఇతడిని అప్పగించింది, ప్రయాణికులను విడిపించేందుకు) పాకిస్థాన్ కోర్టులు ఉరి శిక్ష వేసినా, ఇంకా అమలు పరిచినట్టులేరు. డానీని చంపింది ఖాలీద్ షేక్ మొహమ్మద్ అని అక్టోబర్ 2003 వరకూ తెలీలేదు.

పుస్తకంలో నచ్చిన విషయాలు:

౧. అవటానికి ఇదో జర్నలిస్ట్ జీవితం అర్థాంతరంగా, అన్యాయంగా ముగిసిపోయిన ఉదంతమే అయినా, నాకు ప్రగాఢంగా నచ్చిన విషయం, నన్ను విస్మయానికి

Daniel Pearl

Daniel Pearl

గురిచేసిన విషయం – విపరీత సమయాల్లో కూడా ఆయన భార్య చూబెట్టిన సంయమనం, సహనం. అంతా జరిగిపోయాక, ఆమె ఓ బాధితురాలు అయ్యుండచ్చుగానీ, she didn’t turn bitter!

౨. పుస్తకం చివర్లో ఎక్కడెక్కడినుండో డానీ కుటుంబానికి సంతాపం తెలుపుతూ వచ్చిన ఉత్తరాలను పొందుపరిచారు. జాతి, మతం, దేశం అనే అడ్డులు లేకుండా ఎందరెందరో తమకు తోచిన రీతిలో డానీ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. జరిగిన అన్యాయాన్ని ప్రపంచం ముక్తకంఠంతో ఖండించింది. పుస్తకం మొత్తం ఒక ఎత్తు, ఈ ఉత్తరాలు ఒక ఎత్తు.

౩. మెరియన్ అమెరికాకు తిరిగి వెళ్ళాక, ఆమె కల్సుకోవడానికి లారా బుష్ (అప్పటి ఫస్ట్ లేడీ ఆఫ్ అమెరికా) స్వయంగా వెళ్ళారని చదువుతుంటే కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. అదీ ఏ మీడియా ఆర్భాటం లేకుండా, కేవలం ఓ బాధితురాలిని పరామర్శించటం కోసం ఆమెని వెతుక్కుంటూ ఆమె ఇంటికి చేరుకోవటం, ఆమెని ఓదార్చటం అనేవి నాకు మామూలు విషయాలుగా తోచ(టం)లేదు. అలానే బుష్, క్లింటన్‍ల నుండి ఉత్తరాలు, డానీ హత్య కేసుని ఎప్పటికప్పుడు ఆమెకు అప్-డేట్ చేస్తూ ఉండడం, అదీ కీలక పదవుల్లో ఉన్నవాళ్ళు – నమ్మటానికి సమయం పట్టింది. తీవ్రంగా ఖండించి, ఎక్స్-గ్రేషియా ప్రకటించటంతో ముగిసిపోయే తంతు మాత్రమే తెల్సున్న చోట, దేశాధ్యక్షుడే స్వయంగా పరామర్శించటం అనేది నిజంగా గొప్ప విషయమే! అది ఓ దేశం తన పౌరునికి ఇచ్చే నమ్మకం అని అనిపిస్తోంది.

౪. డానియల్ జర్నలిస్ట్ ల సంక్షేమంగా కోసం, ముఖ్యం యుద్ధసమయాల్లో రిపోర్టింగ్ చేసేవారికోసం తయారు చేసిన ప్రణాళిక చాలా బాగుంది. ఇప్పుడు ఆయన పేరిట అమెరికాలో ఓ కొత్త ఆక్టు అమలులో ఉంది.

నచ్చని విషయాలు:

౧. ఇందులో ఎన్నెన్నో తారీఖులు, మరెందరివో పేర్లు పేజి పేజికి వస్తుంటాయి. ముఖ్యంగా కిడ్నాప్ ఎవరు చేశారో కనిపెట్టటానికి చాలా లేయర్స్ దాటాల్సి వచ్చింది. కొన్ని పేజీల తర్వాత ఏది ఎప్పుడు ఎవరి వల్ల జరిగిందో అన్న తికమక మొదలవుతుంది. అందుకని Chronology of Events అని ముందో, వెనుకో వేసుంటే, పాఠకుడికి వీలుగా ఉండేది.

౨. అలానే, ఇందులోని కీలక వ్యక్తులు, ప్రముఖుల గురించి వీలైనంత క్లుప్తంగా ముఖ్యవిషయాలు పంచుకొని ఉంటే బాగుండేది. కారణాంతరాల వల్ల ఇందులో కొందరి అసలు పేర్లను వాడలేదు. ఆ ముక్క, పాఠకుడికి కొట్టొచ్చినట్టుగా కనిపించేట్టు నోట్ పెట్టలేదు.

౩. ఇందులో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ అంత సరుకున్నా, డానీ కథ ఎలా ముగిసిందో ప్రపంచానికి ఎటూ తెల్సు. అందుకని ఈ కథను past-tenseలో చెప్పుంటే సరిపోయేదేమో. Present-tenseలో చెప్పటం వల్ల కొంత గందరగోళం ఏర్పడింది.

౪. ఈ పుస్తకం అక్కడక్కడా భావోద్వేగంగా, ఒక వ్యక్తిగత అనుభవాన్ని చెప్తున్నట్టు సాగుతుంది. అక్కడక్కడా వార్తాపత్రికల కథనంలా ఉంటుంది. ఈ మార్పుల వల్ల చదవటం అంత సాఫీగా సాగదు. అంతేకాక, మారియన్ పర్ల్ తో “కనెక్ట్” కావడంతో కూడా నాకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఎవరు ఏ రోజున ఏం వేసుకున్నారో, ఏం తిన్నారో, ఆపై ఎవరి రూపురేఖలు ఎలా ఉన్నాయో – ఇవ్వన్నీ వివరిస్తుంటే, “Let’s get to business, please.” అని అనాలి అనిపించింది.

౫. ఇందులో డానీ హత్యోదంతానికి సంబంధించని చాలా సంఘటనల ప్రస్తావన తీసుకొచ్చారు. అందులో ముఖ్యంగా సెప్టంబర్ 11, 2001న అమెరికాపై జరిగిన తీవ్రవాద దాడులు. దాని గురించి అవసరానికి మించిన ప్రసంగం చేశారనిపించింది నాకు. ఆ పై, మరియన్ భారత్-పాక్ విభజనను, భారత్-పాక్‍లు సియాచిన్ పై సైన్యాన్ని నిలబెట్టటాన్ని గురించి ప్రస్తావించినప్పుడు ఆవిడ గొంతులో అసహనం స్పష్టంగా కనిపించింది. ఆ వ్యాఖ్యల వెనుక ఆవిడ ఆవగాహనపై అనుమానాలు తలెత్తాయి నాకు. ఇహ, భారత్ విమానం హైజాక్ ఘటన గురించి రాస్తున్నప్పుడు, తీవ్రవాదులు ఒక ప్రయాణికుని చంపిన విషయం ప్రస్తావిస్తూ,

“Using horrifying intimidation techniques similar to those that would be used in the planes on 9/11, the hijackers slit the throat of a passenger – a young man on his honeymoon — and made his fellow passengers — including his bride — watch as he bled to death.

చదువుతున్నప్పుడే అనుమానం వచ్చింది, నాకు గుర్తున్నంతవరకూ రుపిన్ కత్యాల్ ను చంపారన్న సంగతి, భార్యకు ఇంటికి తిరిగి వచ్చేంతవరకూ తెలీదని. ఇంటర్నెట్ లో ఓ ఇంటర్వ్యూ కూడా అదే అంటుంది. I do doubt if this book is that thoroughly researched.

6. అంతర్జాతీయ ఘటనలపైన, వ్యక్తుల గురించి రాసిన వేటికీ ఎలాంటి రిఫరెన్సులూ లేవు.

౭. ఎందుకో చెప్పలేను గానీ, ఈ పుస్తకం నన్ను కదిలిస్తున్నంతగా కదిలించలేకపోయింది. చాలా చోట్ల dryగా అనిపించింది.

౮. ఇట్లాంటి రచనల్లో literary merits వెతకటం ఎంత వరకూ సబబో తోచటం లేదుగానీ, ఈ పుస్తకాన్ని ఇంకా బాగా రాసుండచ్చని మాత్రం చెప్పగలను.

తీవ్రవాదం, అందులో పాకిస్థాన్ భూమికను అర్థం చేసుకోడానికి ఈ పుస్తకం కొంతవరకూ ఉపయోగపడవచ్చు. డానియల్ పర్ల్ కు తన వృత్తిపై ఉన్న గౌరవం, బాధ్యత స్పష్టంగా తెలుస్తాయి. మెరియన్ జీవితంకేసి చూపిన ఆశావాహ దృక్పథం అభినందనీయం.About the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..One Comment


  1. […] తీవ్రవాదుల నేపధ్యంగా వచ్చిన పుస్తకం,  A Mighty Heart  పరిచయం ఇక్కడ. […]  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (యాకూబ్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ పుస్తకానికి ముందుమాట) హ...
by అతిథి
0

 
 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 

 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 
 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1