రజనీ భావతరంగాలు
గత ఏడాది అక్టోబర్-నవంబర్ ప్రాంతంలో “రజనీ భావతరంగాలు” అన్న పుస్తకం నా చేతికందింది. అప్పటికి రజనీ గారి గురించి నాకు తెలిసిందల్లా ఈమాటలో వచ్చిన ఇంటర్వ్యూ, ఇతరత్రా కొన్ని పాటలు మాత్రమే. ఈమాట ఇంటర్వ్యూ చదివాక కుతూహలం కొద్దీ ఈ పుస్తకం కొనిపించాను తెలిసినవారి చేత (నేను నేరుగా కొనే వీలు లేక). చదవడం మొదలుపెట్టడం కాస్త ఆలస్యం అయ్యిందే కానీ, ఆపబుద్ధి కాలేదు పుస్తకం అయిపోయేదాకా. మళ్ళీ ఇన్నాళ్ళకి, ఇప్పుడు రీవిజిట్ చేయడం సంభవించి, పరిచయం చేయాలనిపించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వ్యక్తిగత అనుభవాల మొదలుకుని అనేక ఇతర విషయాలపై రజనీ గారు రాసిన వ్యాసాల సంకలనం ఇది. ఇవన్నీ 2007-08 ప్రాంతాల్లో ఆంధ్రప్రభ పత్రికలో వచ్చిన వ్యాసాలట. పుస్తకం వెనుక అట్టపై రాసినట్లు – “కాళిదాసు, అన్నమయ్య నుండి రవీంద్రుడి వరకు, ఆంధ్రి రాగం నుండి జ్యోతిషం వరకు” రకరకాల అంశాలపై రజనీకాంతరావు గారు రచించిన వ్యాసాలివి.
మొత్తం 59 వ్యాసాలున్నాయి. ఇప్పుడు ఇది అసమగ్రంగా అనిపించినా, అపరిపక్వంగా అనిపించినా, ఏమనిపించినా, అన్ని వ్యాసాలని గురించీ ప్రస్తావించి వివరించడం (నాకు) సాధ్యపడని పని. కనుక, నాకు నచ్చిన కొన్నింటి గురించి పరిచయం చేస్తాను. ఆపై పుస్తకం చదవాలా, వద్దా అన్న నిర్ణయం మీరే తీసుకోండి.
“జంతునేస్తాలు”, అంటూ తమ చిన్నప్పుడు తాతగారి పెరడులోని ఆవు మొదలుకుని తమ ఇంట్లో ఉన్న “పాటలు పాడే” కుక్క సీజర్ దాకా ఆయన చెప్పిన కబుర్లు భలే ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా “వాళ్ళు నీ పాట వింటారు, పాడమ్మా మెల్లిగా” అనగానే రాగాలాపన చేసే ఈ సీజర్ గురించి చదివి తీరాల్సిందే. “పక్షి నేస్తాలూ” అన్న మరొక వ్యాసంలో ఒక చోట వీళ్ళు క్రౌంచ పక్షుల ధ్వనిని వాద్యగోష్ఠిపై పలికించాక వెంటనే అసలు పక్షుల కలకలరావాల్తో ప్రత్యుత్తరం ఇచ్చాయని చదువుతూ ఉంటే అబ్బురంగా అనిపించింది. “సమాన భావ సౌరభాలు” లో ఠాగూరు, అన్నమయ్య ల గేయధోరణ్లుల్లో సామ్యాలు, వ్యత్యాసాలూ చెబుతూ ఇచ్చిన ఉదాహరణలు; “ముందు వెనుకలు” వ్యాసం లో ముందు, వెనుక పదాల వాడకంలో ఉన్న తమాషా అర్థమూ (ముందు తరం అంటే వెనకటి తరం అని కదా…అలాంటివి) – ఆసక్తికరంగా అనిపించాయి.
“అలనాటి మద్రాసు రేడియో డైరెక్టర్లు”, “పిఠాపురం సంగీత సంప్రదాయం”, “అలనాటి పిఠాపురం – మరికొండరు కవి పండితులు” – ఇలాంటివన్నీ చదువుతూ ఉంటే, రజనీకాంతరావు గారి గతం వీథుల్లో నేనూ ఆయనతో కలిసి నడిచినట్లు అనిపించింది. బోలెడు సంగతులు తెలిసాయి.
ఎందరో ప్రముఖులతో దగ్గరగా పని చేశారు ఈయన. విశ్వనాథ, పింగళి లక్ష్మీకాంతం, అబ్బూరి రామకృష్ణారావు, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి – వంటి వారితో వృత్తి-ప్రవృత్తి పరంగా ఆయన అనుభవాలు ఆపకుండా చదివించాయి.
సినిమాల్లో ఆయన పనిచేసిన రోజుల అనుభవాలు, ఆల్ ఇండియా రేడియో ఉద్యోగిగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల వివరాలు, రూపొందిస్తున్న అనుభవాలు – వీటి గురించి కొన్ని వ్యాసాలు ఉన్నాయి. నా మట్టుకు నాకు అలాంటి కబుర్లు మామూలుగా ఇష్టం కనుక, ఇవన్నీ చాలా ఉత్సాహంగా చదివాను. అలాగే, వెంకట-పార్వతీశ్వర కవులను దగ్గరగా చూశారు కనుక వారి ప్రస్తావనా, వారి గురించిన వ్యాసాలూ చాలానే ఉన్నాయీ పుస్తకంలో. అన్నిసార్లు వాళ్ళ ప్రస్తావన వచ్చినందుకో ఏమో వాళ్ళ రచనలు, ముఖ్యంగా “మాతృమందిరం” చదవాలి అనిపించింది.
అయితే, నన్ను ఇబ్బంది పెట్టిన అంశాలు కొన్ని ఉన్నాయి పుస్తకంలో. పుస్తకానికి ముందో, వెనకో అసలీ వ్యాసాలకి నేపథ్యం ఏమిటి? ఎప్పుడు రాశారు? ఎందుకు రాశారు? పుస్తకంగా వచ్చేలోపు ఏమైంది? ఇలాంటి విషయాలు స్పృశిస్తూ, ఒక పరిచయం ఉండి ఉంటే బాగుండేది అనిపించింది. అన్నీ తెలిసిన వారికి ఈ పరిచయాలక్కర్లేకపోవచ్చు కానీ, అన్నీ తెలిసినవారొచ్చి పుస్తకం చదవాల్సిన అవసరం ఏముంది మరి? ఆయన విపరీతంగా కోతికొమ్మచ్చి ఆడారు పైగా. ఈ క్రమంలో ఒక్కోసారి ఒకే వ్యాసంలోనే ఏం చెబుతున్నారో తెల్సుకోవాలంటే మనకి కొంచెం నేపథ్య జ్ఞానమైనా ఉండాలి లేదంటే వివరాలు చెప్పి ఖాళీలు పూరించేవారైనా పక్కనుండాలి అనిపించింది. కొంచెం కష్టపడ్డా ఈ విషయంలో (ముఖ్యంగా ఆఖరు వ్యాసంలో) – రెండూ లేకపోవడంతో. వీటి మధ్య భాషతో కూడా కొంచెం కష్టపడాల్సి వచ్చింది – అయితే, ఈ ఇబ్బందులు ఉన్నా కూడా “భలే ఉన్నాయి కబుర్లు. ఆయన ఇంకేం కబుర్లు చెబుతారో విందాం!” అన్న తాపత్రేయంలో చాలామట్టుకు అధిగమించగలిగాను.
మా తాతయ్య, ఒక్కొక్కరోజు నేను వద్దన్నా వినకుండా రెండో ప్రపంచ యుద్ధం కాలంలో వాళ్ళ మద్రాసులో ఏవైందో చెబుతారు. నేను వింటున్నానా? లేదా? అన్నది పట్టించుకోకుండా సాగిపోతూ ఉంటారు. ఒకరోజు వినకపోయినా, పదిరోజులు నాకు అవన్నీ వినాలనే అనిపిస్తూ ఉంటూంది. ఈ పుస్తకం చదువుతూ ఉంటే, నాకదే అనుభూతి కలిగింది. పుస్తకం ఆద్యంతం తాతగారు పడక్కుర్చీలో కూర్చుని తన చిన్ననాటి ముచ్చట్ల మొదలుకుని, భూమ్మీద ఉన్న బోలెడు విషయాలపై తన అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నట్లు ఉంటుంది. ఈ తరహాలో సాగే ధోరణి అందరికోసమూ కాదు. బోలెడు జీవితాన్ని, ఎన్నో ఆసక్తికరమైన అనుభవాల్నీ మూటగట్టుకున్న వాళ్ళు ఒకదానికొకటి సంబంధం లేకుండా కోతికొమ్మచ్చులాడుకుంటూ మనం అందుకోలేనంత వేగంతో వెళ్ళిపోతూ ఉంటే – మధ్యమధ్యలో కలిగే విసుగూ, అయోమయం వీటన్నింటి కంటే “అరే, ఈయన భలే మాట్లాడుతున్నారు గా; బోలెడు ఆసక్తికరమైన కబుర్లు కూడా చెప్తారు.” అనుకుంటూ ఇంకా వినాలి… అనిపించే బాపతు మనుషులు మీరైతే, పుస్తకం తప్పకుండా నచ్చుతుంది మీకు. నాకు అందుకే నచ్చిందని నేను అనుకుంటున్నా.
****
పుస్తకం వివరాలు:
“ఆధునిక వాగ్గేయ కారుని ఏడు దశాబ్దాల జ్ఞాపకాల పందిరి. సినిమా, రేడియో రంగాలపై మనసు పులకించే ముచ్చట్లు .. సంగీత వారసత్వంపై, తెలుగు నాట్య రీతులపై వెలుగుచూపే పరిశోధనా దీపాలు.. కాళిదాసు, అన్నమయ్య నుండి రవీంద్రుడి వరకు, ఆంధ్రి రాగం నుండి జ్యోతిషం వరకు ఎగిరే విశ్లేషణా విహంగాలు … కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత బాలాంత్రపు రజనీకాంతరావు రచించిన వ్యాసాలు”
రజనీ భావతరంగాలు
బాలాంత్రపు రజనీకాంతరావు
నవోదయ పబ్లిషర్స్, 2011
వెల: 100 రూపాయలు
పేజీలు: 184
రజనీ గారి గురించి, పుస్తకం గురించి కొన్ని ఆన్లైన్ లంకెలు:
* “లోకాభిరామం” బ్లాగులో ఒక పరిచయ వ్యాసం
* రజనీ గారు రాసిన కొన్ని వ్యాసాలు, ఆయన చలంతో చేసిన ఇంటర్వ్యూ ఈమాట పత్రికలో ఇక్కడ చూడవచ్చు.
* “తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం” – పరుచూరి శ్రీనివాస్ గారి వ్యాసం ఈమాట 2001 జనవరి సంచికలో ఇక్కడ చూడవచ్చు. (అన్నట్లు పుస్తకం మొదట్లోనే – “నా పాటల్నీ, నా సంగీతాన్నీ ఎంతో ఆదరించే చిరంజీవులు పరుచూరి శ్రీనివాస్, చేబియ్యం గోపీక్రిష్ణలకు నా ఆశీస్సులు” అని వ్రాసారు రజనీకాంతరావుగారు)
* “88ఏళ్ళ యువకులు” అంటూ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు రజనికాంతరావు గారు, పట్రాయని సంగీతరావు గార్లతో తమ సమావేశం గురించి రాసిన అనుభవాలను కూడా ఈమాట జులై 2008 సంచికలో ఇక్కడ చదవవచ్చు.
ఇక రజనీ గారి పాటలూ గట్రా – మాగంటి.ఆర్గ్ సైటులో వెదికితే కనిపిస్తాయి.
Sreenivas Paruchuri
> మా నాన్నగారి వద్దనున్న వాటిని ఇటీవలే హైదరాబాద్ రేడియో ఆర్కైవ్స్ వాళ్ళు సీడీ
సీడీ వివరాలు చెప్పగలరా! Did something come out in the past 12 months? నాకు తెలిసినంతలో AIR హైదరాబాద్ వాళ్లు రజని పాటలతో ఒక్క సిడీనే బయటకు తెచ్చారు. అందులో నునుమంచు సోనలో తళుకుమను తొలిసంజ, మెరపో వెలుగో చూడు, మరు నిముసమే (ఓలేటి), ఆశా నా ప్రాణసఖి (ఓలేటి), మ్రోయింపు జయభేరి (కోరస్, సూర్యకుమారి పాట కాదు), మరుగుపడిందొక మహీధరం (చిత్తరంజన్), నివాతశూన్య స్తంభం (సూరిబాబు) మొదలైన పాటలుంటాయి. ఆ సిడీలో ఉన్న ఒకే ఒక్క రవీంద్ర గీతం: ఎవరూ కేక విని రాకపోయినా … In fact I attended the felicitation and CD releasing function in December 2005, and have very fond memories meeting many AIR personalities including your father. Here is a news item on that function:
http://www.hindu.com/2005/12/24/stories/2005122405410200.htm
Regards, Sreenivas
P.S. Rajani did translate (and compose music) more of Ravindra Sangeet. Off-hand I recall a 30 min programme “రవీంద్ర సంగీతం – సోదాహరణ ప్రసంగం” from AIR-Vijayawada in which he talks about it in detail.
Sreenivas Paruchuri
>పుస్తకానికి ముందో, వెనకో అసలీ వ్యాసాలకి నేపథ్యం ఏమిటి? ఎప్పుడు రాశారు? ఎందుకు రాశారు? పుస్తకంగా వచ్చేలోపు ఏమైంది? ఇలాంటి విషయాలు స్పృశిస్తూ…>
మీ ప్రశ్నలు ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా పుస్తకాలకి వర్తిస్తాయి. ఉదాహరణకి దిగవల్లి శివరావుగారి “కథలు గాథలు” (reviewed here: http://pustakam.net/?p=7578 ; BTW the recent reprint does not contain all the essays published in 1940s), అంతకంటే ముఖ్యంగా చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి “కథలు గాథలు” (reprinted by Emesco, 2012) పుస్తకాలకి ఎవరైనా విపులమైన వివరణలు, కనీసం footnotes, రాసి ప్రచురించి ఉంటే బాగుండేది. నిజానికి చెళ్ళపిళ్ళ పుస్తకానికి అలాంటి ప్రయత్నంలో నేనుప్పుడే ఎమెస్కో వాళ్ళు మరల ముద్రించారన్న వార్త విన్నాను.
“భావతరంగాలు” మొదటిగా సుమారు 20-25 ఏళ్ళ క్రితం రాయబడ్డవి. రజని గారు అవి వారంవారం ఒక column గా రాసారు. అందువల్ల ఒక continuity కనిపించకపోవచ్చు. ఆ వ్యాసాలను పుస్తకంగా ప్రచురించాలని తరువాత DTP కూడా చేయించుకున్నారు. కారణాంతరాలవల్ల పుస్తక ముద్రణ ఆలస్యమయ్యింది. ఈ మధ్యలో DTP ప్రతి ఉన్న CD పోయింది. దానితో పాత వ్యాసాల ప్రతులు (అందుబాటులో ఉన్నంతవరకు) ముందు పెట్టుకుని 2007-08ల్లో ఆంధ్రప్రభ ఆదివారం పత్రికకు మరల రాసారు. రెండో ప్రచురణలో కొన్ని కొత్త వ్యాసాలు జోడయ్యాయి.
> “పాటలు పాడే” కుక్క సీజర్ … “వాళ్ళు నీ పాట వింటారు, పాడమ్మా మెల్లిగా” అనగానే
Oh, Yes, he used to sing. One day I will upload an audio of Caesar’s singing skills :). My Tamil friends tell me that Sri S.R. Janakiraman, the renowned musicologist, who worked for long years in Tirupati, fondly recalls Ceasar’s singing as well.
Regards,
Sreenivas
M.V.Ramanarao
రజని(రజనీకాంతరావుగారు)తో నాకు ఎలాటి పరిచయం లేకపోయినా ఆయనగురించి మా పిఠాపురం మిత్రుడొకరు చెప్పుతూఉండేవాడు.ఆయన పాటలు ఎన్నో రేడియోలో వింటూఉండేవాళ్ళం.ఆయనపాటల్లో ‘శతపత్రసుందరి ‘( సూర్యకుమారి),ఓహో విభావరి ‘ (రాజేశ్వరరావు) ,ఓహో హో పావురమా’ (భానుమతి) నాకిష్టమైన ,ప్రసిద్ధమైన పాటలు.ఎన్నో పాటలకు దేవులపల్లి రచన,ఆయన స్వరకల్పన చేసేవారు.90 సం; దాటిన ఆయన శతాయుష్కులౌతారని ఆశిద్దాము.
తృష్ణ
వ్యాసం బావుదండి.
రజని గారి ఆత్మకథ “రజని ఆత్మకథ విభావరి” పేరుతో విడుదలైంది. ఆ పుస్తకావిష్కరణ సభ వివరాలు,
సభలో ప్రసంగించిన శ్రీ గొల్లపూడి గారివీ, పన్నాల సుబ్రహ్మణ్యభట్టుగారి ప్రసంగాలు ఈ టపాలో :
http://trishnaventa.blogspot.com/2012/05/blog-post_24.html
రజని గారు కొన్ని రవీంద్రగీతాలను అనువదించి స్వరపరిచారు. మా నాన్నగారి వద్దనున్న వాటిని ఇటీవలే హైదరాబాద్ రేడియో ఆర్కైవ్స్ వాళ్ళు సీడీ రూపంలో అందుబాటులోనికి తెచ్చారు. వాటిల్లో “ఎక్లా చలో..” పాటను ఇక్కడ వినవచ్చు:
http://samgeetapriyaa.blogspot.com/2012/05/blog-post_10.html