భాష తెలియని సాహితీ నగరిలో ఒక పుస్తక ప్రదర్శన
వ్యాసం రాసిపంపినవారు: చంద్రమోహన్
మైసూరులో ఫిబ్రవరి 11 నుండి 14 వరకు కన్నడ పుస్తక ప్రాధికార వారు చాలా భారీ ఎత్తున కన్నడ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారని, వందకు పైగా ప్రచురణ కర్తలు పాల్గొంటున్నారని విని ఎలాఉందో చూద్దామని వెళ్ళాను. కన్నడ భాషలో వందమంది ప్రచురణకర్తలా! అన్న కుతూహలం కూడా. వెళ్ళి చూస్తే కళ్ళు చెదిరేన్ని పుస్తకాలు! పైన కప్పు, క్రింద తివాచీలతో పొందికగా ఏర్పాటు చేశారు ప్రదర్శన. కన్నడ పుస్తకాల ముద్రణా నాణ్యత చాలా బాగుంటుందన్న విషయం ముందే తెలుసు. ఐనా ఇంత చక్కగా కనిపించే పుస్తకాలు తెలుగులో ఎందుకు అచ్చు వేయరు? అనిపించింది (నిజానికి, తెలుగు పుస్తకాలు కూడా కొన్ని ఈ మధ్య మంచి నాణ్యతతో వస్తున్నాయి).
కన్నడ పుస్తక ప్రాధికార, కన్నడ విశ్వవిద్యా నిలయ, మైసూరు విశ్వవిద్యా నిలయ – ప్రసారాంగ, కన్నడ సాహిత్య పరిషత్త … ప్రభుత్వ ప్రచురణ సంస్థలే బోలెడున్నాయి. మనకు విశాలాంధ్రలాగా ఇక్కడ నవకర్ణాటక బుక్ హౌస్. ఇంకా స్వప్నా బుక్ హౌస్ వారి స్టాలు కూడా చాలా పెద్దదే. వంద స్టాళ్ళనిండుగా పుస్తకాలు, అన్నీ కన్నడ భాషలోనివే. ఇతర భాషల పుస్తకాలు మచ్చుకైనా లేవు, నిఘంటువులు తప్ప. నాకా కన్నడ సాహిత్యం చదివేంత భాష రాదాయె. కన్నడ కవి కువెంపుకు జ్ఞానపీఠం తెచ్చిపెట్టిన ’రామాయణ దర్శనం’, కన్నడ వచన సాహిత్యం- బసవేశ్వరుని వచనాలు, సర్వజ్ఞుని వచనాలు ఉన్నాయి. వచనాలు సులభంగా అర్థమయ్యే జనుల భాషలోనే ఉంటాయి. కొంత కష్టపడితే అర్థం చేసుకోవచ్చు. కానీ అవి నీతి సాహిత్యమే కాని, కావ్య విలువలు ఉన్నవి కావు. ’కగ్గ’ అన్నది ఒక కన్నడ సాహిత్య ప్రక్రియ. మన వేమన ఆటవెలదులలాగా ఉంటాయి. అందులో ’మంకుతిమ్మన కగ్గ’ అన్నది చాలా ప్రసిద్ధమైనది. ’కగ్గక్కె ఒందు కైపిడి’ (A guide to Kagga) అన్న పుస్తకం తిరగవేశాను. ఒక్కో కగ్గ కూ వివరంగా సరళమైన కన్నడ భాషలో వివరణ ఇచ్చారు. ఆ సరళమైన కన్నడం కూడా నాకు గహనమే కదా!
కుమారవ్యాసుడు రచించిన భారతం ప్రదర్శనలో ఉంది. ఈ గ్రంథం గొప్పతనం గురించి వినివున్నాను. భామినీ షట్పది అనే ఛందస్సులో పాడుకోవడానికి వీలుగా ఉన్న పద్యాలలో వ్రాసిన ఈ పదిహేనవ శతాబ్దపు భారతం కన్నడ మహా కావ్యాలలో ఒకటి. తెలుగులో శ్రీనాధునికి సాటిరాగల శైలి కుమారవ్యాసునిది. అది ’హళె గన్నడ’ – అంటే ప్రస్తుతం కన్నడిగులకే అర్థం కాని భాషన్నమాట. ఎలా చదవగలం! ఇక ఈ ప్రాచీన సాహిత్యం వదలి కువెంపు సమగ్ర సాహిత్యాన్ని దాటుకుంటూ ఎస్.ఎల్. భైరప్ప పుస్తకాలదగ్గరకు వచ్చాను. ’పర్వ’, ’ఆవరణ’, ’వంశవృక్ష’ ఇంకా బోలెడు పుస్తకాలు. పర్వ తెలుగు అనువాదం ఉందని తెలుసు. మిగిలినవి ఉన్నాయో లేవో! కె.ఎస్. నారాయణాచార్య గారి పుస్తకాలు – ’ఆ 18 దినగళు’ (ఆ 18 రోజులు) మహాభారత యుద్ధం జరిగిన పద్ధెనిమిది రోజులూ ఏం జరిగిందో డైరీ లాగ వ్రాసిన పుస్తకం. ఆయన పుస్తకాలు ఇంకా ’రాజసూయ రాజకీయ’, ’భారత పాత్రగళ దర్శన’… ఇంకా చాలా. ఇవన్నీ తెలుగులోనికో , ఆంగ్లంలోనికో అనువదింపబడితే బాగుండును.
మరో స్టాల్లో తమిళ-కన్నడ నిఘంటువు, తిరుక్కురళ్ కన్నడ అనువాదం కనిపించాయి. తిరుక్కురళ్ మూలాన్ని కన్నడలిపిలో ఇచ్చి, అర్థ వివరణ చేశారు. చక్కగా ముద్రింపబడింది. తిరుక్కురళ్ కు మంచి అనువాదం తెలుగులో ఇంతవరకూ వచ్చినట్లు లేదు (నేను చూడలేదు!). పోనీ, నేనే ఎందుకు చేయకూడదు?! అబ్బే, అంత పాండిత్యం ఎక్కడేడ్చింది!
ఇక పాపులర్ పుస్తకాల వైపు వచ్చాను. ఆహా యండమూరి ఫోటోలు! అవన్నీ కన్నడంలోకి అనువదింప బడిన యండమూరి పుస్తకాలు. ’దుడ్డు – దుడ్డు’, ’కరు కంబళియల్లి మిడి నాగ’, ’విజయక్కె ఐదు మెట్టిలుగళు’, ’విజయక్కె ఆరునె మెట్టిలు’… పెద్ప్పెద్ద లిస్టే ఉంది. చలం గురించి కూడా ఒక పుస్తకం ఉంది.
హంపిలోని కన్నడ విశ్వవిద్యాలయం వారి ప్రచురణలు… మన తెలుగు విశ్వవిద్యాలయం వారి పుస్తకాలు అంత నాసిరకంగా ఎందుకుంటాయో !! మైసూరు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన ’ఎపిగ్రాఫియా కర్ణాటక’ ప్రాచీన శాసనాల సంకలనం. కేంద్రీయ సాహిత్య అకాడెమీ వారు ’పర్వ’ , ’రామాయణ దర్శనం’ ఆంగ్లానువాదాల్ని అమ్ముతున్నారు. ’పర్వ’ తెలుగులోనే చదువుదామని నిర్ణయించుకొన్నాను. ఇక రామాయణ దర్శనం- ఇంగ్లీషులో ఎవడిక్కావాలి? మనకు లేని రామాయణాలా!
అన్నీ తిరిగాక నేను ఒక్క పుస్తకం కూడా కొనలేదని గుర్తొచ్చింది. అలా ఎప్పుడూ ఏ పుస్తక ప్రదర్శనలోనూ జరగలేదు. మళ్ళీ లోపలికి వెళ్ళాను. కన్నడ-ఇంగ్లీషు నిఘంటువొకటి కొన్నాను.’కన్నడ సాహిత్య చరిత్రె’, ’కన్నడ ఛందో ప్రవేశిక’ అన్న పుస్తకాలు తీసుకొన్నాను. షట్పది, రగడలు తెలుగులో మాయపైపోయి కన్నడలో స్థిర పడిపోయాయి. వాటి గురించి వివరంగా ఉంది పుస్తకంలో. సముద్ర తీరంలో నిలబడి దాహార్తితో నిస్సహాయంగా ఉన్నవాడిలా అయింది నా పరిస్థితి. ఎటు చూసినా పుస్తకాలు… ఏవీ చదవలేను. ఒక స్టాలులో కన్నడ సంగీతం సీడీలు అమ్ముతున్నారు. సి. అశ్వథ్ భావగీతాల సంకలనం కొన్నాను. లలిత సంగీతానికి తెలుగులో పెద్ద ప్రాచుర్యంలేదు కానీ కన్నడనాట చాలా ప్రశస్తి. అశ్వథ్ కు ఏ సినీ గాయకునికీ తీసిపోని పాపులారిటీ ఉంది. కన్నడ ప్రజల్లో. ’ఎల్లాదరూ ఇరు, ఎంథాదరూ ఇరు, ఎందెందిగు నీ కన్నడవాగిరు…’ అని ఆయన పాడితే ప్రజలు పారవశ్యంతో ఊగిపోయారు. ఈ మధ్యనే ఆయన మరణించారు. నా మైసూరు రోజుల గుర్తుగా ఆయన పాటల కంటే మంచిది ఏముంటుంది!
అలా రోజంతా తిరిగి, రెండు పుస్తకాలు, ఒక సీడీల సంకలనంతో బయటకు వచ్చాను.
Sarat
Sujata garu,
You can buy ‘Marala Sedyaniki’ telugu translation from Sahithya Academy. It was one of academy award winning novels. Sahithya academy has outlets in all major cities, or you can order this online or by phone. By the way, I read this book a number of times, and it brings back memories of a life style that exists only remotely in the current Indian society. If you buy it and read it again, remember me, if you turn into tears when Sarasothi dies after a very long life of inspiring and reassuring personality, in spite of all the hardships and absence of pleasures of all forms.
Sarat
ramanarsimha
After reading “UNTO THIS LAST” (JOHN RUSKIN) or SARVODAYA
(Gujarathi,translated by M.K.GANDHI,) Mahathma Gandhi dicides to take
AGRICULTURE as a professin instead of Lawyer professin in SOUTH
AFRICA (around 1900 A.D.). His farm house was named as PHOENIX of nearly
1000 acres near Durban.
Is “MARALA SEDYANIKI” about the greatness of the AGRICLURE PROFESSION?
Telugu translation is also available for Sarvodaya.
రవి
@సుజాత గారు: మీరు వ్రాసిన పరిచయం ఇదివరకే చూశాను. ఈ మధ్య కాలంలో కాంట్రోవర్షియల్ రచనలు ఎక్కువవుతున్నవి కాబట్టి opinions create చేసే ఇటువంటి రచనలు చదవడానికి కాస్త తటపటాయించాల్సి వస్తున్నది. ’పర్వ’ కూడా ఇదివరకెవరో సజెస్ట్ చేశారు. చూడాలి.
సుజాత
శివరామ కారంత్ రాసిన మరళి మణ్ణిగె పుస్తకాన్ని తెలుగులోకి అనువదించింది శ్రీ తిరుమల రామచంద్ర గారుట..మిత్రుల వల్ల తెల్సింది. తెలుగులో దాని పేరు “మరల సేద్యానికి”! ఇహ పుస్తకం ఆచూకీ మాత్రం తెలియాలి! ఎనీ బడీ..?
సుజాత
అన్నట్లు రవి గారూ, “సంస్కార” చదివారా? అనంతమూర్తి గారిది! ఇదిగో పరిచయం లింకు…
http://manishi-manasulomaata.blogspot.com/2009/11/blog-post_30.html
సుజాత
ఇక్కడ రెండో ఫొటోలో కిందుగా “మరళి మణ్ణిగె”(Return to earch)అనే పుస్తకం కనపడుతోంది. ఈ పుస్తకానికి తెలుగు అనువాదం చాలా చాలా ఏళ్ళ క్రితం మా వూరి లైబ్రరీలో చదివాను. మొత్తం పేజీలు లేవు. తెలుగు అనువాదపు పేరు కూడా “మరలా పదండి మన్ను నేలకు”అనేలాగానే ఉంటుంది. అది ఈ పుస్తకానికి అనువాదమేనా కాదా ఎవరికైనా తెలుసా?కన్నడ నవల శివరామ కారంత్ రాశారు.
వ్యవసాయం చేసే ఒక బ్రాహ్మణుడి కథ అది. మొదటి భార్యకు పిల్లలు లేకపోతే రెండో వివాహం చేస్తారు. వాన రాగానే కట్టెలు వసారలో చేర్చుకోవడం, ఒరుగులు సర్దుకోవడమూ,పిడకలు గోనెల్లో దాచడమూ ఆవును కొట్టంలో కట్టేయడమూ ఇటువంటి వర్ణనలతో మొదలవుతుంది ఆ నవల.
ఈ నవలకు తెలుగు అనువాదం ఎక్కడ దొరుకుతుందో ఎవరైనా తెలియజేస్తే వారికి బోలెడు పుణ్యం దక్కుతుంది.
ఆ నవల ఆచూకీ తిరిగి పట్టుకోవాలని ఎంతగా ప్రయత్నించినా దొరకలేదు.
సముద్ర తీరంలో నిలబడి దాహార్తితో నిస్సహాయంగా ఉన్నవాడిలా అయింది నా పరిస్థితి. ఎటు చూసినా పుస్తకాలు… ఏవీ చదవలేను….చంద్ర మోహన్ గారూ, I feel your pain!
రవి
మీలానే కన్నడ సాహిత్యం గురించి తెలుసుకోవాలన్న తపన నాది. అయితే పుస్తకాలు చదివేంత సీను రావడం లేదు! కన్నడ సాహిత్యపు తెలుగు అనువాదాలైనా దొరికితే చదవాలనుంది. చిక్కవీరరాజేంద్ర అన్న ఒక్క పుస్తకం (తెలుగు అనువాదం) చిన్నప్పుడెప్పుడో చదివాను అంతే.
సౌమ్య
’త్రివేణి’ నవలలు – కన్నడ నుండి వచ్చినవే కదా? వీటి తెలుగు అనువాదాలు – ఎమెస్కో పుస్తకాలనుకుంటా ఎంసెట్ అయి, ఇంజినీరింగ్ చేరడానికి మధ్య కాలంలో తెగ చదివా 🙂
’దాటు’,’పర్వ’ – వీటిని తెలుగు అనువాదాల్లో, యూ ఆర్ అనంతమూర్తి నవలలు రెండింటిని ఆంగ్లంలోనూ చదివాను.
కనుక, కన్నడ సాహిత్యం అనువాదాలు బాగానే దొరుకుతాయని మనం అనుకోవచ్చు (ఆవగింజంత ప్రయత్నమైనా చేయకుండానే నాకు దొరికాయి కనుక) 🙂
రాకేశ్వర రావు
బెంగుళూరి పుస్తక ప్రదర్శనలో నేను చాలా తెలుఁగు పుస్తకాలే కొన్నాను। మైసూరు వచ్చేసరికి అది అచ్చమైన కన్నడదేశం అయిపోతుంది। కన్నడవారికి పుస్తకాభిమానం కూడా ఎక్కువే।
కొత్తపాళీ
కన్నుల పండువుగా ఉంది
Srinivas
తిరుక్కురళ్‌ని దక్షిణవేదం అనే పేరుతో ఆరుద్ర అనువదించారు తెలుగులోకి (తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రచురణ) అంతకు మునుపు చల్లా రాధాకృష్ణ శర్మ గారు చేసారు.
సౌమ్య
అవును – యండమూరి, చలం పుస్తకాలు నేను కూడా కన్నడ అనువాదాలు చూశాను, బెంగలూరు బుక్ ఫెస్ట్ లో. మైసూరు పుస్తక ప్రదర్శన గురించి తెలుసుకోడం ఇదే మొదటిసారి. చదువుతూ ఉంటే, చూడాలనిపిస్తోంది, భాష రాకున్నా 🙂 ఈ పుస్తక ప్రదర్శన పుట్టుక గురించి కూడా ఎవరికన్నా తెలిస్తే ఇక్కడ పంచుకోండి…
ఈ పుస్తక ప్రదర్శన గురించి హిందూ పత్రిక తొలి వ్యాసం ఇక్కడ మరియు, ముగింపు గురించిన వ్యాసం ఇక్కడ.