మొగిలి – కథాసంకలనం

వాసాప్రభావతి గారి కథా సంకలనం – “మొగిలి”. ఇందులో వివిధ పత్రికల్లో ప్రచురితమైన 22 కథలు ఉన్నాయి. దాదాపు ప్రతి కథా – పల్లె ప్రజలూ, వారి జీవితాలూ – వీటి చుట్టూనే తిరిగింది. కొన్ని కథలు పట్టణ నేపథ్యంలో ఉన్నా కూడా, చాలావరకు ఆ కథల్లోని పాత్రలు గ్రామీణులే. “ఈ కథల్లోని మాండలికాలు, జాతీయాలూ కాలగర్భంలో మరుగునపడ్డ తెలుగుతనాన్ని మళ్ళీ మళ్ళీ పలకరిస్తాయి” అని పుస్తకం గురించి మాలతీ చందుర్ గారన్న మాటలు అక్షర సత్యాలే. అందునా, నాలాంటి పట్టణాల్లోనే పుట్టిపెరిగిన మనిషికి ఈ కథలు చదువుతూ ఉంటే, నేనెరుగని ప్రపంచంలోని కబుర్లు వింటున్నట్లు ఉండింది.

“అచ్చమ్మ కల” – దంపులాళ్ళ జీవితాల కథ. “దువ్వెనల సాయేబు” ఓ కొమ్ము దువ్వెనలు అమ్మే వాడి కథ. “చుక్క” – తనకు పుట్టిన బిడ్డను తీసుకెళ్ళిపోయిన ఆయాను కనిపెట్టి, అక్కడ్నుంచి పాపను తెచ్చేసుకున్నాక మళ్ళీ తాము పెంచలేమేమో అన్న భయంతో అక్కడే వదిలేసి వచ్చిన నిస్సహాయురాలి కథ. “గెద్ద” ఓ పాతకాలపు సోదెమ్మ, మంత్రసాని జీవితం, “హరిలో రంగహరి” కథలోని హరిదాసు కథ, “రైల్లో సుందరి” లోని ఓ దీనురాలి జీవితం – ఇలా ఈ కథలన్నీ గ్రామీణ జీవితంలో తారసపడే వివిధ రకాల మనుష్యుల జీవితాలను స్పృశించాయి. “గుడిసెలు కూలిపోతున్నాయి”, “బలిపశువు” ఈ కథలు రెండూ సామాజికంగా జరుగుతున్న ఆన్యాయాలను, దురాచారలనూ చూపాయి. “పడగ విప్పిన నేల తల్లి” కథ నా మటుకు నాకు ఈ కథలన్నింటిలోకీ కాస్త ప్రగతివాదంతో ఉన్నట్లు అనిపించింది. “బడిగంటలు” కథ – మీ పక్కింట్లోనో ఎదిరింట్లోనో ఎవరన్నా రిటైర్డ్ మనిషి ఉంటే, వారి నుండి కబుర్లు వింటున్న అనుభూతి కలిగిస్తుంది. “అంగడి వినోదం” – పెద్ద పెద్ద షోరూముల బైట వేషాలు వేసుకుని నిలబడే వారి కష్టాలలోని ఓ కోణాన్ని చూపింది.

“మొగిలి” కథ కూడా నాకు చాలావరకు నచ్చింది కానీ, ఎందుకో పూర్తిగా నేను కన్విన్స్ కాలేకపోయాను ఈ కథతో. “అప్పుడే తెల్లవారుతోంది. చీకటి సంద్రంలా ఉన్న లోకం పాల సంద్రంలా మారుతోంది”, “మొగిలి ముంజేతి మీద గాజులు కదులుతూ సూర్య కిరణాలకే నగిషీలు చెక్కుతున్నాయి” – వంటి వాక్యాలు నాకు చాలా నచ్చాయి. ఇంతకీ, ఈ పుస్తకం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను. వాటితో పాటు – “మూసీ”, “ప్రపంచపటంలో మనదేశం”, “నేటినిజం”, “పత్రిక”, “చేతన” “ఆంధ్రప్రదేశ్” – ఈ పత్రికల పేర్లు కూడా తెలుసుకున్నాను.

“చందమామకో మచ్చ” కథ వికలాంగ దినోత్సవానికోసం ప్రత్యేకంగా రాసినదని చెప్పకనే తెలిసిపోయింది, చివర్లో ఆ విషయం చదివే ముందే. సినిమా కథలా ఉంది. “పట్టుదల ఉంటే” కథ నాకు మరీ నాటకీయంగా అనిపించింది. నీటి సమస్యే చర్చించాలనుకుంటే, ఇంతకంటే ఆర్ద్రంగా, ఇంతకంటే వాస్తవికంగా చర్చించి ఉండవచ్చు అనిపించింది. పోనీ, నీటి సమస్య కాదు, అక్కడ మనోభావాలనే చిత్రించాలి అనుకున్నా కూడా, కథ ఇంకా బాగా రాసి ఉండవచ్చు అనిపించింది. “కోటయ్య కొబ్బరి చెట్టు”, “ఎర్రగులాబి”, “స్వాతి చినుకులు”, “ప్రేమ పరిమళించిన వేళ”-ఈ నాలుగు కథలూ నాకు చాలా artificial గా అనిపించాయి. రాసిన శైలి కూడా నన్ను అంత convince చేయలేకపోయింది ఎందుకో గానీ.

అచ్చుతప్పులు, కామాలు, చుక్కలు పెట్టడంలో ప్రింట్ లోపాలు – ఇవన్నీ లేకుండా ఉంటే, చదివేవారికి కాస్త చిరాకు తగ్గేది. అలాగే “జాగరణ” కథలో పాప పేరు కాసేపు దివ్య అంటారు, కాసేపు పద్మ అంటారు. ఇలాంటివి ఓ సారి సరిచూసుకుని ఉంటే బాగుండేది. కవర్ పేజ్ డిజైన్ – శీలా వీర్రాజు గారిది – నాకు చాలా చాలా నచ్చింది.

పుస్తకం వివరాలు:
మొగిలి
రచన: వాసా ప్రభావతి
వెల: 125/-
ముద్రణ: 2008
ప్రచురణ: వాసా ప్రచురణలు
‘వాసా నిలయం’, 11/2RT Municipal Colony
Malakpet
Hyderabad-500036
Ph: 040-24549178

ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ ప్రజాశక్తి శాఖలు.

You Might Also Like

2 Comments

  1. మాలతి

    సమీక్ష బాగుంది. నాక్కూడా ప్రభావతిగారి నుడికారం చాలా ఇష్టం.

  2. కె.మహేష్ కుమార్

    మంచి పరిచయం. కొని చదవాలనిపించేలా ఉంది. ముఖ్యంగా “అంగడి వినోదాలు” గురించి మీరు చెప్పిన తీరు నన్ను ఖచ్చితంగా ఈ పుస్తకం కొనిపించేలా ఉంది. “నాకు ఈ కథలన్నింటిలోకీ కాస్త ప్రగతివాదంతో ఉన్నట్లు అనిపించింది.” అన్నారు. ఈ వాదన గురించి కొంత వివరణ ఇస్తూ ఈ పుస్తకానికి దాన్ని ఎలా అపాదించుకున్నారో చెప్పగలిగితే మరింత ఆసక్తికరంగా ఉండేదేమో!

Leave a Reply